ప్రేమ వున్న చోటే అలకా వుంటుంది.
ప్రజాస్వామ్యం వున్న చోటా నిరసనా వుంటుంది.
అలకలే లేవంటే ఆప్యాయతలే లేవని అర్థం. ఈ మధ్య కొన్ని కాపురాల్లో అలకల జాడలే కనిపించటం లేదు. ఎవరి వాటా ప్రకారం వారి లాభాలు తీసుకుపోయే భాగస్వామ్య వ్యాపారాల లాగా ఈ సంసారాలు సాగిపోతున్నాయి.
ఆయన అర్థరాత్రి దాటి ఇంటికి వచ్చినా, ‘ఎందుకూ?’ అని ఒక్క మాట కూడా అడగదు.
ఆమె ఏమి వండిపెట్టినా, ‘ఇది బాగుంది. బాగాలేదు.’ అని ఒక్క వ్యాఖ్యా ఆయన చేయడు.
ఇంటి ఖర్చులకు ఎవరి జీతాల్లో ఎంతెంత ఇవ్వాలో అంతంత ఇచ్చేస్తారు.
ఇలా సాగిపోతున్న దాంపత్యంలో కేరింతలూ వుండవు; కన్నీళ్ళూ వుండవు.
ఎప్పుడన్నా తన మిత్రుడొచ్చి, ‘రాత్రి ఓ అర్థగంట ఆలస్యంగా వెళ్ళినందుకు, మా ఆవిడ గంటసేపు నాన్‌స్టాప్ గా తిట్టింది తెలుసా..! అయితే నేం? తన చేత్లో ముద్దలు చేసి అన్నం తినిపించింది.’ అని ఫిర్యాదు చేసినప్పుడు, ‘అలకల తర్వాత ఈ సౌకర్యాలు కూడా వుంటాయా?’ అని అతడికి అనిపిస్తుంది. తనమిత్రుడి భార్య తన మిత్రుడి మీద అలిగినట్లు, తన భార్య కూడా తన మీద అలిగితే బాగుండునని అనిపిస్తుంది.
ఐడియా! తాను కూడా కుడి చెయ్యి చూపుడు వేలు తెగ్గోసుకని, ఓ గంట ఆలస్యంగా ఇంటికి వెళ్ళితే..? ‘అవును. ఒక ఐడియా జీవితాన్ని కాక పోయినా, జీవిత భాగస్వామిని మార్చేయ వచ్చు.’ అలాగే ఇంటికి వెళ్ళాడు. తన భార్య చూసి పెద్దగా అవాక్కవ్వలేదు. బ్యాండ్ ఎయిడ్ తీసుకువచ్చి ఇచ్చింది. తనంతటతానే వేలికి బ్యాండ్ ఎయిడ్ అతికించుకున్నాడు. భోజనం వడ్డించినప్పుడు ఆమె వైపు ఆశగా చూశాడు- తినిపిస్తుందేమోనని. పక్కనే ‘స్పూన్’ ఒకటి వుంచి, యధావిధిగా వెళ్ళి, టీవీ దగ్గర కూర్చుండి పోయింది.
ప్లేట్లో అమృతం వడ్డించినా, ఆముదం గ్లాసులో స్ట్రా వేసి ఇచ్చినా, ఒకేలా ముఖం పెట్టటం ఎలా సాధ్యం? ఈ విషయంపై సుదీర్ఘంగా ఆలోచిస్తున్న సదరు భార్యామణిని పొరుగింటావిడ ‘డిస్టర్బ్’ చేసింది.
‘రెండు గుడ్లు వుంటే ఇస్తారా వదినా? నేను చేసిన పప్పుతో మాఆయనకు ముద్ద దిగటం లేదు. ఒక్కటే ఆరుపలనుకో.’ అని చెప్పింది. ‘రెండేమిటి? నాలుగు తీసుకు వెళ్ళు’ అని ఇచ్చింది. మరుసటి రోజు నాలుగు గుడ్లూ బాకీ తీర్చటానికి వచ్చినప్పుడు అడిగింది: ‘మీ ఆయన శాంతించాడా?’ ‘ఎందుకు శాంతించడూ? ఆయనే స్వయంగా ఆమ్లెట్లు వేశారు. నిజం చెప్పనా? ఆయన తిన్నది తక్కువే. నేనే మొత్తంగా లాగించేశాను. అంత రుచిగా చేశారు.’ అని పొరుగింటావిడ చెప్పినప్పుడు ‘అలక ముదిరితే ఆమ్లెట్టు కూడా అవుతుందన్న మాట’ అని అనుకుంది. వెంటనే తన భర్తకు ఫోన్ చేసి, ‘మీరు పెళ్ళికాక ముందు వంట చేసుకునే వారా? అప్పుడు ఆమ్లెట్లు కూడా వేసుకునే వారా? ఏం లేదు. నాకు ఆమ్లెట్లంటే ఇష్టం లెండి.’ అని ఫోన్ పెట్టేసింది. ఆ రోజు సాయింత్రం తన భర్త ఊహించినట్టుగానే, రోజూ కన్నా ముందు వచ్చాడు. ఆమె చేతిలో ఒక పార్శిల్ పెట్టాడు. ‘నీకు ఆమ్లెట్లంటే ఇష్టమన్నావ్ కదా! దారిలో వచ్చేటప్పుడు దాబా దగ్గర ఆగి ప్యాక్ చేయించుకు వచ్చాను’ అని చెప్పి, వాష్ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు.
అలకలే అన్యోన్యతకు చిహ్నాలు. అవి లేక పోతే అన్నీ మరకాపురాలే.
ఆందోళనలూ, నిరసనలూ లేకుంటే, ప్రజాస్వామ్యం కూడా మర ప్రజాస్వామ్యం అవుతుంది.
అయిదేళ్ళ కోసారి ‘అరేంజ్డ్ మేరేజ్’ లాగా ఎన్నికలు జరిగిపోతే, ఎవరు నచ్చితే వారిని కాకుండా, ఎవరు వస్తే వారిని వరించేసి, ప్రజాప్రతినిథిని చేసేస్తే, అలాంటి ప్రజాప్రతినిథులతో చట్టసభలూ, ప్రభుత్వాలూ ఏర్పాటు చేసేస్తే, ఏముంటుంది? జనం మెచ్చే రీతిలో కాకుండా, తమకు నచ్చే రీతిలో పాలించేసుకుంటారు. జనం మెచ్చారో లేదో తెలుసుకోవటానికి, మరో అయదేళ్ళాగాల్సి వస్తుంది. ఈ లోగా మునిగే కొంపలు మునుగుతాయి. తేలే ప్రాణాలు తేలతాయి.
జనానికి ఎప్పుడు ఏది నచ్చలేదో అప్పుడే చెప్పే పధ్ధతి ‘అలకల్లో’… ఐమీన్.. ‘ఆందోళనల్లో’ వుంటుంది.
గత నాలుగేళ్ళలో రాష్ట్రంలో అలకలే అలకలు. ఒకేసారి కొంత కాలం, ఒకరి తర్వాత కొంత కాలం తెలంగాణ, సీమాంధ్రలలో ఈ ఆందోళనలు జరిగాయి. తెలంగాణ వారి అలకలకు దిగి వచ్చి కేంద్రం ‘విభజన’కు ఒప్పుకుంది. సీమాంధ్ర ఆందోళనలు అంతే తీవ్రంగా జరిగాయి. ‘హైదరాబాద్‌లో మేమెలా వుండాలి’ అనడిగారు. కాస్సేపు దిగిరానట్లే ప్రభుత్వం కనిపిస్తుంది. ఇది ప్రభుత్వం అలక. అయిదేళ్ళ పుణ్యకాలం కూడా ముగుస్తోంది. అలకల్ని పట్టించుకోకుండా వుంటే, ప్రభుత్వం అసలుకే చెడుతుంది. కొని పెడుతుందా, వేసి పెడుతుందా అన్నది తర్వాత.. ఆమ్లెట్ మాత్రం సిధ్ధం చెయ్యాల్సిందే.
-సతీష్ చందర్
(ఆంధ్రభూమి దినపత్రిక 20 అక్టోబరు 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)