ఇలాంటి మాటలు ఎప్పుడో, ఎక్కడో వినే వుంటారు. ఎక్కువ మంది అంతే. హింసతో అహింసను గెలిపిస్తుంటారు.
నెత్తుటి మరకలతోనే అహింసను ప్రతిష్టిస్తుంటారు.
హింస లేకుండా, అహింసను నిలబెట్టలేమా? తప్పకుండా నిలబెట్ట వచ్చు.
అవసరం గొప్ప ఆయుధం. ఒకరి అవసరం ఒకరికి వుంటే హింస దానంతటదే తగ్గిపోతుంది. ఒకే మొత్తంలో కట్నమిచ్చిన భార్యను చితగ్గొట్టినంతగా, నెలసరి కట్నమిచ్చే భార్యను హింసించరు.
ఇచ్చేదేదో పెళ్ళినాడో ఇచ్చేసాడు. ఇంక ఈడ్చి తన్నినా, మామ దగ్గరనుంచి పైసా రాలదు- అని తేలిపోయాక, అల్లుడు గాస్ స్టౌను పేల్చేసి, హింసను పతాక స్థాయికి తీసుకు పోతాడు.
కానీ భార్యను జీవిత భాగస్వామిగా కాకుండా ‘జీత’ భాగ స్వామిగా గుర్తించిన కొందరు పుణ్య పురుషులు వుంటారు. వీరు నెలలో మిగతా వారాలు ఎలా వున్నా మొదటి వారం లో తెల్లజెండా ఎగరవేస్తారు. పూర్తి అహింసా వాదిగా మారిపోతారు. ఆ వారం పోయాక తన్నినా మరీ ప్రాణం పోయేంతగా తన్నరు. తన్నలేరు.
అయితే భార్యలు మాత్రం హింస చెయ్యరా? ఈటెల్లాంటి మాటలు చాలవూ, తల్లడిల్లి పోయి, బారుకు పోయి బీరు బిర్యానీతో దు:ఖించటానికి..! ఇది అతి గొప్ప హింస కాదూ అని, మగమహారాజుల హక్కుల సంఘాల వారు కూడా అప్పుడవ్పుడూ వాపోతుంటారు. తమ అవసరాలేమిటో తమకు తెలియన వాళ్ళే ఇలాంటి గయ్యాళి భార్యలు గా మారతారు.
వినిమయ సంస్కృతి పుణ్యమా- అని తమ అవసరాలేమిటో తామెరిగిన భార్యలు వుంటారు. పండక్కో పట్టుచీర, ఫంక్షన్‌కో నెక్లెస్, సరదాకో సినిమా, ఏటా ఓ టూరిస్ట్ స్పాట్, బ్యూటీ కో పార్లర్, జిహ్వ కో రెస్టారెంట్, ఒంటి బిగువకో జిమ్, కబుర్లకో క్లబ్- ఇలాంటి అవసరాలకు ‘అర్థాన్ని’ ఆశించే అర్థాంగులు మాత్రం, పూర్తి అహింసా వాదులుగా వుంటారు. ఫలితంగా భర్తలు వీరి కొంగును విడవమన్నా విడవరు. ఒక వేళ భర్త బాగా విసిగిస్తే తగిన ‘శిస్తు'(అదనంగా రెండు పట్టు చీరలు) విధిస్తారు కానీ, నోరు చేసుకుని హింసించరు.
చూశారా? అవసరం వున్న చోట హింస దానంతటదే తగ్గిపోతుంది.
అయితే అవసరం ఒక వైపే వుంటే కుదరదు. రెండు వైపులా వుండాలి.
‘రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలుండవ’ని ఎక్కువ మంది అలవాటుగా చేసే ఉటంకింపు ఇప్పుడు గుర్తు కొస్తున్నది.
ఇంత వరకూ ఈ సామెత అధికార రాజకీయాలకే వర్తిస్తూ వచ్చింది. ఏ రాజకీయ నాయకుడయినా తన పతనానికి తానే బాట వేసుకుంటాడు. వేరే వాళ్ళెవరూ వేయరు.
కానీ ఆత్మహత్య అంటే పతనం – అనే అర్థంలో కాకుండా, ప్రాణం తీసుకోవటం అనే నిజమైన అర్థంలో చూస్తే, అవి నేటి ఉద్యమ రాజకీయాల్లో జరిగిపోతున్నాయి.
ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో ఆరువందలకు పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సంఖ్య విని అద్వానీ కూడా నోరు వెళ్ళబెట్టారు. ఇప్పటి ఉద్యమ ఉధ్ధృతితో చూసినప్పుడు , హింస తక్కువనే చెప్పాలి. చెదురు మదురుజరుగుతూనే వుంటాయి, సంఘటనలు ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి.
అంటే తెలంగాణ రాదేమోనన్న నిస్పహాయతకు గురయిన వాళ్ళు కూడా తమకు తాము హాని తలపెట్టుకుంటున్నారు. కానీ, ఇతరులకు హాని కలిగించటం లేదు. నిజానికి నాయకులు ఇచ్చే ఉద్రేక పూర్వక ప్రసంగాలకు ఎప్పుడో హింస చెలరేగాలి. కానీ, ఇంత వరకూ ఆ ప్రమాదం జరగక పోవటం ఆశ్చర్యంగానూ, కొందరికి నిరాశాజనకంగానూ వుంటుంది.
కారణం ఏమయి వుంటుంది? అరవయ్యవ దశకంలోనూ, డెభ్బయ్యవ దశకం తొలి అంకంలోనూ జరిగిన తెలంగాణ నిరసనలలో ఈ ధోరణి తక్కువే ఉంది. మరి ఇప్పుడేమయింది? హఠాత్తుగా అందరూ అహింసావాదులయి పోయారా?
లేదు. దాదాపు ఆరుదశాబ్దాల కాలంలో, కులాంతర వివాహాలు పెద్దగా జరగలేదు. ప్రాంతాంతర వివాహాలు ఎక్కువగా జరిగాయి. మరీ ముఖ్యంగా చదువుకున్న మధ్యతరగతి వర్గంలో ఇవి బాగా పెరిగాయి. ఒకే కులంలోనే రెండు ప్రాంతాల మధ్య ఇచ్చిపుచ్చుకోవటాలు ఇబ్బడి ముబ్బడిగా జరిగిపోయాయి.
దాంతో తెలంగాణ కుటుంబాల్లో సీమాంధ్రులూ, సీమాంధ్రుల కుటుంబాల్లో తెలంగాణ వారూ సభ్యులయ్యారు. దాంతో వ్యక్తులుగా ఒకరి అవసరాలు ఒకరికి ఏర్పడ్డాయి. ఈ ప్రాంత వనరులు ఈ ప్రాంతంలో వుండాలనీ, ఈ ప్రాంత ఉద్యోగాలు, ఈ ప్రాంతం వారికే ఇవ్వాలనే దాని మీద దృష్టి పెరిగింది కానీ, మనుషుల మీద లేదు. అందుకే హింస లేదు. ఎంత రెచ్చగొట్టినా రావటం లేదు.
కాబట్టి సారాంశమేమిటంటే, అహింసను హింసతో కాకుండా పరస్పావనరంతోనే సాధించగలం.
– సతీష్ చందర్
(ఆంధ్రభూమి దినపత్రిక 23-10-11వ తేదీ సంచికలో ప్రచురితం.)
ఒకసారి నేనే అన్నాను.నేను హింసావాదినన్నవాడిని నరికిపొగులేయ్యాలని
ఎవరేమీ చెప్పినా ఇంక తెలంగాణాని నిరాకరించడం తగదు.