ఆట మొదలు!

 రాయకుండా వుండ లేక రాయాలి.

రాయాలి కాబట్టి రాయాలి.

రెండూ రాతలే.

 

ఇలాగే బతకాలి.

ఎలాగోలాగ బతకాలి.

రెండూ బతుకులే.

 

రాతే బతుకు కొందరికి. బతుకు తెరువుకే రాత ఇంకొందరికి.

రెండు వర్గాలూ రచయితోల్లోనూ, పత్రికా రచయితల్లోనూ వుంటారు.

 

ఈ రెండు మార్గాలూ, పక్క పక్కనే, రెండు రైలు పట్టాల్లా వెళ్లి పోతాయని ఒకప్పుడు భ్రమపడే వాడిని. కానీ ఆ పోలిక తప్పని తెలియటానికి ఎంతో కాలం పట్టలేదు. రెండూ రెండు పట్టాలు కాదు, రెండు తాళ్ళు. కలిపేస్తే.. పోనీ, పెనవేస్తే.. గట్టిపడతాయి. అందంగా కూడా వుంటాయి. ఈ జమిలి రచన పత్రికల్లోకి వచ్చాకే బోధ పడింది.

కాలమ్‌ రాయాలి. సంపాదకీయం రాయాలి. వ్యాసం రాయాలి.

సమయం లేదు. డెడ్‌ లైన్‌ మీద కొచ్చేసింది. గంటే వుంది. పీక మీద కాలం పెట్టిన కత్తి.

ఏం రాస్తావ్‌? ఎలా రాస్తావ్‌?

విషయమేది? శైలి యేది?

ఇప్పుడు చెప్పాలి. డాబులకూ, బడాయిలకూ పోకుండా నిజం కక్కాలి.

‘రాయకుండా వుండ లేక రాస్తావా? రాయాలి కాబట్టి రాస్తావా?’

నాతో నేను అబధ్ధమాడకూడదు కదా! అక్కడకీ మనసు ఆరాటపడుతుంది. నాకు సంబంధంలేనిదీ, నాది కానిదీ రాసేసి, నెపం ఎవరి మీదన్నా తోసేయ్యాలని. ప్రచురణకర్తలూ, పెట్టుబడులూ, వాళ్ళ తక్షణావసరాలూ- వీటి వల్లే అలా రాసానని- బుకాయించ వచ్చు. (పాపం! వాళ్ళకి అన్ని గొడవలుండవు. పితృస్వామ్యాన్నో, గ్లోబలైజేషన్నో,మతోన్మాదాన్నో- చితగ్గొట్టేస్తే వాళ్ళకి పట్టనే పట్టదు. వాళ్ళ వాళ్ల సొంత నియోజకవర్గాల్లో వేలు పెట్టినప్పుడో, వాళ్ళ పార్టీ అధినేతల్ని ఎండగట్టినప్పుడో- మహా అయితే ఉలిక్కి పడతారు.)

‘గంటే కదా సమయం వున్నదీ’.. అన్న భయం లోంచే, ‘అవును. ఈ గంట నాది.’ అన్న ధైర్యం కూడా వస్తుంది.

భయం బతుకు తెరువుది. ధైర్యం బతుకుది.

ఆ గంట బతికెయ్యాలన్న తెగింపు వస్తుంది. అంతే..! పీక మీద కత్తి, చేతికి వస్తుంది. కాస్సేపు శత్రునామ స్మరణ చేస్తాను.

నచ్చని వ్యవస్థలూ, విధానాలూ, ఒక్కొక్కసారి, వ్యక్తులూ ముందుకొస్తారు. ఒక్కపోటు పొడవాలనిపిస్తుంది.

వాళ్ళ చేతుల్లో చిక్కి విలవిల్లాడుతున్న పేరూ, ఊరూలేని ప్రాణాలు గుర్తుకొస్తాయి. భోరున ఏడ్వాలనిపిస్తుంది.

అవును. ఈ గంట నాది. బతుకుతున్నాను నేను. రాయాల్సిందేదో రాసెయ్యటానికి ఈ గంట చాలు. ఆ తర్వాత వెచ్చటి కాఫీ తాగి, నా కంప్యూటర్‌ వైపూ, కేబిన్‌ వైపూ ఒక్క సారి చూసి వెళ్ళిపోగలను. మళ్ళీ ఆఫీసుకు రాక పోయినా దిగులుండదు.

ఇలా అని ఏ రోజుకా రోజు అనుకుంటూనే, అనుకున్నవి రాసుకుంటూనే యేళ్ళు గడిచాయి. గడుస్తుంటాయి కూడా.

రాయాలి కాబట్టి రాసే రచనలోనే, రాయకుండా వుండలేనిదీ రాస్తున్నాను.

బతుకు తెరువుని యిచ్చే రచననే, బతుకుగా కూడా భావిస్తున్నాను.

నాలాగా నా గురువులు చేశారు. నా సహచరులు చేస్తున్నారు. నా అనుచరులూ చేస్తారు.

అలా చేసిన రచనల్లో కొన్ని ఈ ‘పాచిక’లు.

ఆంధ్రప్రభ దినపత్రిక చీఫ్‌ ఎడిటర్‌ గా అనుదిన సంపాదకీయాలు రాస్తున్నప్పుడు -ఆదివారం కూడా అదే సంపాదకీయం ఎందుకని- ‘పాచిక’ పేరు మీద ఈ వ్యాసాలను (2004- 2006 మధ్యకాలంలో) రాశాను. ఆ సందర్భం గొప్పది. ఒక ప్రయాణం ముగిశాక, అంతవరకూ లాక్కొచ్చిన బోగీలను వదిలేసి, రైలు ఇంజను వెనుతిరగటానికి ముఖం మార్చుకుంటుంది. సరిగ్గా అలాగే, కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో తెలుగుదేశం – ముఖాలు మార్చుకున్నాయి. పాలక పక్షాలుగా ప్రయాణం ముగించి, ప్రతిపక్షాలుగా యాత్రను మొదలు పెట్టాయి. అక్కడ ‘యూపీయే’, ఇక్కడ ‘కాంగ్రెస్‌’లూ వాటి పాత్రల్ని పోషించటం మొదలు పెట్టాయి. తడబాట్లూ, తత్తరపాట్లూ, ఆరోపణలూ, ప్రత్యారోపణలతో- చట్టసభల్లో ఈ పార్టీల నేతలు నవరసపోషణ చేశారు.

ఆలివ్‌గ్రీన్‌ దుస్తుల్లో వుండే ‘అన్న’లు అందరీ మధ్యకూ వచ్చేసి, ప్రభుత్వ అతిథి గృహాల్లో విడిదిచేసి, చర్చలను ప్రారంభించేసి, సర్కారు అభిమతాన్ని బహిర్గతం చేసి అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోయారు.

బుధ్ధుడు పుట్టిన జాడల్ని వెతుక్కుంటూ, దలైలామా మన దేశానికీ, రాష్ట్రానికి వచ్చేశాడు. అవును కదా! బుధ్ధుడు ఇక్కడ పుడితే బౌధ్ధమూ, భౌధ్ధ ప్రవక్తలూ వేరే దేశంలో వుండటం ఏమిటి?

మరో మారు స్త్రీ (సోనియా గాంధీ) భారత ప్రధాన పదవిని అలంకరించే అవకాశం వచ్చినప్పుడు, ‘స్వదేశీయత’ చర్చకొచ్చింది. అలా జరిగితే ‘గుండు గీయించుకుంటా’నని వేరే పార్టీలో ప్రముఖ మహిళా నేత(సుష్మా స్వరాజ్‌) శపథం కూడా చేశారు.

దళితుల మీద అగ్రవర్ణాలు దాడి చేయటం ఎప్పుడూ జరిగేదే..! కానీ దళితులే సాటి దళితుల్ని నరికేస్తే..? నీరు కొండ, కారంచేడు, చుండూరులకు భిన్నంగా జరిగిన వేంపెంట విషాదం కొత్త ప్రశ్నలు వేసింది.

ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా పుట్టిన పార్టీ (టీఆర్‌ఎస్‌) నేతలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని(సమైక్య) ‘ఆంధ్రప్రదేశ్‌’ మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేశారు. (తర్వాత కాపురం పొసగలేదనుకోండి!)

తండ్రిని కోల్పోయిన అంబానీ సోదరులు తగవులాడుకుని వేరు పడితే, భారత్‌ కార్పోరేట్‌ సామ్రాజ్యం రెండు ముక్కలుగా చీలినట్లు భావించింది ప్రపంచం. కానీ తల్లి కోకిలమ్మ తగవు తీర్చారు. ఇంతకీ ఇద్దరూ రెండుగా చీలారా? రెండితలయ్యారా?

మతాన్నీ, రాజకీయాన్నీ కలిపేస్తే మారణాయుధం పుట్టింది. అది గుజరాత్‌ను దహించింది. మైనారిటీ మీద విద్వేషం పెంచే మెజారిటీయే ప్రజస్వామ్యమా?

అన్ని వ్యవస్థలూ సరే. మరి నేను కూర్చున్న మీడియా మాటేమిటి? అదీ మారింది.

ఇన్ని మార్పులు జరుగుతూంటే, రాయకుండా వుండటానికి చెయ్యెలా ఊరుకుంటుంది చెప్పండి!

రాశాను, దాదాపు రోజూ రాశాను. వంకరగా రాశాను. నిదానంగా రాశాను. ఏవేవో శీర్షికలతో, ఎన్నెన్నో పేర్లతోరాశాను . అవికాక అనుదిన సంపాదకీయాలూ రాశాను.

వీటన్నిటికీ భిన్నంగా ఈ ‘పాచిక’ల్ని రాయటానికి ప్రయత్నించాను. ఫలించింది.

చదివించుకున్నదే రచన.

నాడు చదివించుకున్నాయి. నేడూ చదివించుకున్నాయన్న నమ్మకంతోనే వాటికి ఈ గ్రంథరూపం.

 

-సతీష్‌ చందర్‌

23 అక్టోబరు 2012

(గమనిక: కాపీ  కోసం Director, A.P.College Of Journalism, 1st floor, Chabda Towers, SRT-42, Jawahar Nagar, Near Ashok Nagar Signals, Hyderabad-500 020 అనే చిరునామాకు రు.200లు (రెండు వంద రూపాయిలు మాత్రమే) డిమాండ్ డ్రాప్ట్ ద్వారా కానీ, మని యార్డరు ద్వారా కానీ  పంపి, పొందవచ్చు.

1 comment for “ఆట మొదలు!

  1. రాయాలి కాబట్టి రాసే రచనలోనే, రాయకుండా వుండలేనిదీ రాస్తున్నాను…అయినా మి రాతలు మా బొటి ఎందరికో గీత సార్!ధన్యవాదాలు

Leave a Reply