పేరు : కెవిపి రామచంద్రరావు
దరఖాస్తు చేయు ఉద్యోగం: రెండు ఉద్యోగాలు: కాంగ్రెస్‌లో వైయస్ వాది, వైయస్సార్ కాంగ్రెస్‌లో కాంగ్రెస్ వాది.
ముద్దు పేర్లు : ‘ఆత్మ’రాముడు.(వైయస్ నన్ను తన ‘ఆత్మ’ గా పిలిచేవారు)
విద్యార్హతలు : బ్యాచిలర్ ఆఫ్ సీక్రెట్స్( రహస్యాలు మింగెయ్యటంలో పట్టా)
హోదాలు : ఒకప్పుడు ‘రాజన్న సభ’లో సభ్యుడు, ఇప్పడు రాజ్యసభలో మాత్రమే సభ్యుణ్ణి
గుర్తింపు చిహ్నాలు : కాంగ్రెస్ కళ్ళతో చూస్తే జగన్‌కు కోవర్టు లాగా, జగన్ కళ్ళతో చూస్తే కాంగ్రెస్‌కు కోవర్టు లాగా కనిపిస్తాను.
సిధ్ధాంతం : శరీరంలేనిదే ‘ఆత్మ’ లేదు. ఒకప్పుడు వైయస్సే నా శరీరం. ఆయన వెళ్ళిపోయాక, కాంగ్రెస్సే నా శరీరమయ్యింది. నాకు నేనుగా మనలేను.’ఆత్మ’ను కదా!
వృత్తి : వైయస్‌కు వెన్నంటి వుండటమే. (ఆయనకు పక్కన నేనూ, నెత్తి మీద సూరీడు ఎప్పుడూ వుండేవాళ్ళం). ఒక్క హెలికాప్టర్ ఎక్కినప్పుడే లేను.(భద్రతా సలహా దారుని కదా, నేల మీద వుండి పోయి, నింగిలో భద్రత గురించి జాగ్రత్తలు తీసుకున్నాను. కానీ ఏం చెయ్యను. విధి అలా చేసేసింది. హెలికాప్టర్ నా మిత్రుణ్ణి తీసుకు పోయింది.)
హబీలు :1. సంతకం పెట్టకుండా, సలహాలతోనే అన్ని పనులూ చెయ్యగలను.( అందుకనే నేను చేసిన పనులకు ఆనవాళ్ళుండవు)
2. మిత్రులకు ఇష్ట కాలం లో దగ్గరగానూ, కష్టకాలంలో (వారిని మరింత కష్ట పెట్టకుండా) దూరంగానూ వుండటం.)
అనుభవం : ఒక్క సంతకం ఒక జీవితాన్నే మార్చేస్తుంది, 150 సంతకాలు ముఖ్యమంత్రి పదవినే రాకుండా చేస్తాయి.( ఆ విషయం ముందే తెలిసి, దగ్గర వుండి చేయించానని ఆరోపిస్తారు. నేను ఒప్పుకుంటానా?)
మిత్రులు : ‘ఆత్మ’ ఎవరిలో ప్రవేశిస్తే, వారే నా ‘ఆత్మీయ మిత్రులు’. అనుకోకుండా వైయస్ శత్రువులే నాకలాంటి మిత్రులయ్యారు.
శత్రువులు : అదే సమస్య. నన్ను జగన్ శిబిరమూ, కాంగ్రెస్ శిబిరమూ- ‘కోవర్టు’గా చూస్తున్నాయి.
మిత్రశత్రువులు : తెలుగుదేశం వారు. జగన్‌కు వ్యతిరేకంగా వున్నానని వదిలేయ వచ్చుకదా! జగన్ లోపల వుంటే, నేనింకా బయిట వుండిపోయానేమిటని ఆడి పోసుకుంటారు
జీవిత ధ్యేయం : ‘వెన్ను పోటు’ పొడిచిన చంద్రబాబే మామ (ఎన్టీఆర్‌ఫోటో) పెట్టుకు తిరగడం లేదా? నేను అంతే, ఎప్పటికయినా ‘వైయస్’ బొమ్మను పట్టుకు తిరుగుతాను. (నాకు తెలుస్తోంది. వైయస్ పేరు బతికుండగానే కాదు, చనిపోయాక కూడా జనంలో మోగుతోంది.)
-సతీష్ చందర్