‘ఆరోగ్యమే’ అధికార భాగ్యం!

కూర్చుంటే బాబా.

నడిస్తే నేత.

పరుగెడితే పోలీసు.

తేలిపోయాయి. ఎవరికెలాంటి అర్హతలుండాలో మనప్రజాస్వామ్యం తేల్చేసింది.

అన్నీ శారీరకమైనవే. మానసికమైన, బౌధ్ధిక మైన అర్హతలతో పెద్ద పనే లేకుండా పోయింది. ఈ పోస్టుల్లో, ఏ పోస్టు కావాలన్నా, పెద్దగా చదవాల్సిన పనిలేదని నిర్ధారణ అయిపోయింది.

బాబా కావాలంటే, భగవద్గీతనో, అష్టాదశ పురాణాల్నో, వేదాల్నో చదివి అనర్గళంగా ఉపన్యసించగలగాలన్న రూలు ఎగిరిపోయింది. ఏదో ఒక ఆసనసం వేసుకుని ఎక్కువ సేపు కూర్చోగలిగితే జనం బాబాగా గుర్తిస్తారు. పూర్వం బాబాలనుంచి మోక్షం, మనశ్శాంతి- లాంటి పారమార్థికప్రయోజనాలను భక్తులు ఆశించే వారు. ఇప్పుడు వారి అవసరాలు మారిపోయాయి. మరణానంతరం ఎక్కడికి వెళ్తామన్న చింత కన్నా, బతికున్నంత కాలం చేవ దేరి గట్టిగా ఎలా వుండాలన్నదే తపన. దీని పేరే ఆరోగ్యం. కాబట్టి యోగాసనాలతో, వివిధ వ్యాయమ పధ్దతులతో ఎక్కువ సేపు కూర్చుండ గలిగే శక్తిని బాబాలు ప్రసాదిస్తే చాలు. రాను భక్తుల అత్యాశ మితి మీరి పోయి ‘సిక్స్‌ ప్యాక్‌’లు ప్రసాదించు స్వామీ- అని అడిగినా అడగ్గలరు. అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పటికయితే బాబా కాదలిచినవారు ఎక్కువ సేపు కూర్చోవటం ప్రాక్టీసు చేస్తే సరిపోతుంది.

నడవని వాడు నేత కాదు.అవును. ఎంతదూరమైనా నడవగలిగిన అర్హత వుంటే, నేతయి పోవచ్చు. అందుకు కారణం వారి క్లయింట్లు.. అంటే వోటర్లు. పూర్వం నేతల్ని చూడటానికీ, వారి ఉపన్యాసాలు వినటానికి, ఎక్కడి బడితే అక్కడికి తండోప తండాలుగా వచ్చే వారు. ఇప్పుడు అలా లేదు. వోటరుని చూడటానికే నేతలు తరలి రావాలి. పూర్వం కేవలం పోలింగుకు ముందు రోజుల్లో వచ్చి దండం పెట్టి పోతే, సంతోష పడేవారు.(ఆ సంతోషం పోలింగు తేదీ వరకూ నిలవాలంటే పచ్చనోటు చేతిలో పెట్టాలనుకోండి. అది వేరే విషయం. కానీ ఇప్పుడు అలా కాదు. వోటరు ఇంటి చుట్టూ కాకపోయినా, ఊరు చుట్టూ తిరుగుతూ వుండాలి. లేక పోతే నేతను మరచిపోయే ప్రమాదం వుంది. రోజూ చానెళ్ళలోనూ, పత్రికలలోనూ నేతలు కనిపిస్తున్నారు కదా? అవును కనిపిస్తున్నారంటే, కనిపిస్తున్నారనే చెప్పాలి. ఎవరి చానెళ్ళలో వాళ్ళు కనిపిస్తున్నారు. వోటరుకి వేరే పనిలేదేమిటి? ఒకే చానెల్‌ పెట్టుకు కూర్చుని, అదే నేతను పదే పదే తిలకించటానికి? ఇవీ చూస్తూ కూర్చుంటే, గేమ్‌షోలూ, సీరియల్సూ, సినిమాలూ, క్రికెట్‌ మ్యాచ్‌లూ మిస్సవడేమిటి? అందుచేత, ఈ మాధ్యమాలను నమ్ముకోవటం కానీ, నేరుగా వోటరు దగ్గరకు వెళ్ళి భౌతిక దర్శనం ఇచ్చుకుంటే మెరుగనుకుని ఇలా నేతలు ‘రోడ్డు’ పడుతన్నారు. అందుకోసం ఎక్కువ దూరమే కాదు, ఎక్కువ కాలం నడవటం ప్రాక్టీసు చెయ్యాలి. ఇందుకోసం పెద్ద ఉపన్యాసాలు దంచనవసరంలేదు, ‘పంచ్‌’ డైలాగులు విసరనవసరం లేదు. ఆ మాట కొస్తే, మాట్లాడే పనే లేదు. ‘అవును. కాదు’ సమాధానం మాత్రమే ప్రశ్నలు వేయగలిగితే సరిపోతుంది.

ప్రతిపక్ష నేత పాద యాత్రలోనూ, అధికార పక్షనేత యాత్రలోనూ ఇవే ప్రశ్నలుంటాయి. కానీ వాటిని అడిగే తీరు మాత్రం వేరుగా వుంటుంది.

‘మీదొడ్లో దోమలు మందు తరచుగా కొడుతున్నారా?’

‘మీ ఇంట్లో బల్బులు వెలుగుతున్నాయా?’

‘మీరు ఫోను కొడితే 108 వాహనం వస్తుందా?’

‘కాదు’ అని సమాధానం వచ్చే విధంగానే మొత్తం ప్రతిపక్ష నేత ప్రశ్నలుంటాయి.

ఇన్ని ‘కాదు’ లు అనిపించేసుకున్నాక, ‘కాదు’ అన్న సమాధానాలు అలవాటయి పోయాక అప్పుడు ఆఖరి ప్రశ్న వేస్తారు:

‘అంటే, ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం వున్నట్లా?’

‘కాదు’ అని అలవాటుగా బదులచ్చేస్తారు. నడక కొనసాగుతుంది.

ఇక అధికార నేత ప్రశ్నలు కొంచెం ఇటూ, అటూ తేడాలో ఇలాగే వుంటాయి.

‘కిలో బియ్యాన్ని రెండు రూపాయిలకు కాకుండా రూపాయికే ఇవ్వటం మంచిదా? కాదా?’

‘రైతుకిచ్చే విద్యుత్తును ఉచితంగా ఇవ్వటం మంచిదా? కాదా?’

‘మహిళకిచ్చే రుణాల మీద వడ్డీ తీసివేయటం మంచిదా? కాదా?’

‘మంచిదే’ ‘మంచిదే’ అని అలవాటుపడిపోయిన జనానికి ‘ఇలాంటి ప్రభుత్వమే మళ్ళీ గెలవటం మంచిదా? కాదా?’ అని అంతిమ ప్రశ్న వేసి ‘మంచిదే’ అని చెప్పించుకుని అధికార పక్షనేత ఆనందంతో వెళ్ళిపోతారు.

చూశారా? అన్నీ ప్రజాభిప్రాయాలే!

ఈ మాత్రం ప్రశ్నలు అడగటానికి పెద్ద విద్వత్తు అవసరం లేదు.

కాబట్టి నేతకు వక్తృత్వం వుండాలనీ, విషయ పరిజ్ఞానం వుండాలనీ లేదు. శారీరక దారుఢ్యం, రోగనిరోధక శక్తీ పెంచుకోవటం అవసరరం.

నేతనడిచి వెళ్ళేటప్పుడు వోటరు గమనిస్తాడు. అంటీ ముట్టనట్టు వెళ్తున్నాడా? అంటుకుంటూ వెళ్తున్నాడా?

పేద ప్రజలు ఔషధాలకూ, చికిత్సలకూ నోచుకోకుండా, అనారోగ్య పీడితులయి కూడా కాయ కష్టం చేసుకుంటూ వుంటారు. కానీ నేతలు అలా కాదు కదా! ‘వెండి చెంచాలు’ నోట్లో పెట్టుకుని మరీ పుడతారు. ‘తుమ్మితే’ వైద్యుడు ముందుంటాడు.

అలాంటి నేతలు రోగపీడితుల్ని అక్కున చేర్చుకోవాలి. పేదల వాడల్లో బసలు చేయాలి. సహపంక్తి భోజనాలు చేయాలి. ఇవన్నీ రోజుల పాటు చేయాలి. త్యాగగుణంతో ఎప్పుడూ ప్రజల మధ్యే జీవించే నేతలయితే ఈ పనుల్ని అలవోకగా చేస్తారు. ఎందుకంటే వారిలో ఒకరిగా మారతారు.

కానీ వీరు అలాకాదు. హఠాత్తుగా కొన్ని వారాలో, కొన్ని నెలలో ఈ పాద యాత్రలు చేస్తారు. ఇందుకో చక్కటి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యమే అధికార భాగ్యం!!

-సతీష్‌ చందర్‌

(28 అక్టోబరు 2012 నాడు ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితమయినది.)

 

Leave a Reply