ఆవేశంలో ఆమె సగం!

సమస్య అంటేనే స్త్రీ. స్త్రీ అంటేనే సమస్య. ఇది ఇంటి భాగోతం.

సమరం అంటేనే స్త్రీ. స్త్రీ అంటేనే సమరం. ఇది వీధి భారతం.

కేవలం రెండే రెండు దశాబ్దాలలో దేశ పోరాట చిత్రపటాన్ని మార్చేశారు స్త్రీలు. ఇలా అనగానే కేవలం స్త్రీలుగా తమ సమస్యలపైనే తాము పోరాటం చేశారనే నిర్థారణకు రావచ్చు. పురుషులు సైతం ఎదుర్కొనే ఇబ్బందుల మీద కూడా పిడికిళ్లు బిగించారు.

కాకుంటే, తమ పోరాటాలను వెను వెంటనే రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని మాత్రం వీరు భావించలేదు. అదే జరిగితే, పాలన మొత్తాన్ని తలక్రిందులు చేయగలుగుతారు.

మేథాపాట్కర్‌, అరుణా రాయ్‌, సునీతా కృష్ణన్‌, శాంతా సిన్హా, కిరణ్‌ బేడీ, అరుంధతీ రాయ్‌, ఐరోమ్‌ షర్మిల, రోశమ్మ- ఇలా ఒక్కొక్కరూ ఒక్కొక్క ఉద్యమానికి చిరునామాగా మారిపోయారు.

‘యోధా’ పాట్కర్‌

ముంపు అంటే గుర్తు కొచ్చే పేరు మేథా పాట్కర్‌. ప్రాజెక్టుల పేరు మీద గ్రామాలను గ్రామాలనే ముంచేసి లక్షలాది మంది గిరిజనులనీ, పేదలనీ నిర్వాసితుల్ని చేయటాన్నీ, పర్యావరణాన్ని అతలా కుతలం చేయటాన్నీ నిరసిస్తూ గొంతెత్తారు. సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలువరిస్తూ చేపట్టిన నర్మదా బచావ్‌ అందోళనకు ఆమె నిలువెత్తు సంతకం.

సమాచార ‘అరుణో’దయం

‘ఈ ఫైల్లో ఏముందో నీకెందుకు చెప్పాలి?’ అనే ప్రభుత్వాధికారుల గోప్య విధానాలకు చెల్లు చీటీ ఇచ్చిన మహిళ అరుణా రాయ్‌. సమాచారం తెలుసుకోవటాన్ని పౌరుడి హక్కుగా చేయాలని ఉద్యమించి, చట్టం రావటానికి కారకులయ్యారు. భారతదేశ ప్రజాస్వామ్యంలో నేడు ఇసుమంతయినా పారదర్శకత కనిపిస్తుందంటే అందుకు ప్రధాన కారకురాలు అరుణా రాయ్‌. ఐయ్యేఎస్‌ హోదాను తృణప్రాయంగా వదలి సామాజిక ఉద్యమాల బాట పట్టారు.

‘నవనీతా’ కృష్ణన్‌

‘తాను పుండయి, ఇతరులకు పండయి’ తనువులను అంగడిలో పరచుకున్న అనేకానేక స్త్రీలకూ, హైచ్‌ ఐ విసోకి శిధిలమయిపోతున్న వారి పిల్లలకూ ఆసరాగా నిలిచి, గూండాలను, బ్రోకర్లనూ ఎదరించి ప్రజ్వల సంస్థను స్తాపించిన సునీతా కృష్ణన్‌ మహిళే. అత్యున్నతమైన చదువు చదివి వంచకులకు నిలువరించే పనిలో నిమగ్నమయ్యారు.

‘కాంతా’ సింహం!

లేత చేతులపై కాలిన ఇనుప చువ్వల చారికలను చూసి చలించి పోయి, పాలబుగ్గల పసివాళ్ళను విముక్తం చేసే పనికే అంకితమయిపోయిన శాంతా సిన్హా బాలకార్మిక వ్యవస్థను కూకటి వేళ్ళతో పెకలించటానికి ప్రయత్నిస్తూనే వున్నారు.

‘సంస్కరణ’ కిరణం!

కత్తి పట్టి జైలుకు వెళ్ళినవాడికి మళ్ళీ కత్తిని ఇచ్చి పంపటం శిక్ష కాదనీ, పరివర్తన తేవటమే శిక్ష పరమార్థమనీ గ్రహించి జైళ్ళలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కిరణ్‌ బేడీ మహిళే. ఆమె తొట్టతొలి మహిళా ఐపిఎస్‌ అధికారి. ఇప్పుడు అవినీతి నిర్మూలనపై ధ్వజమెత్తుతున్నారు.

అదిగదిగో ‘అరుంధతి’

‘గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌’ అనే నవలకు ప్రతిష్టాత్మకమైన బుకర్స్‌ బహుమానం పొంది కూడా ఆదివాసుల్లో కలిసి పోయి, మేధా పాట్కర్‌ తో భుజం కలిపి, పౌరహక్కుల కొరకు అవిశ్రాంత పోరాటం చేస్తున్న అరుంధతీ రాయ్‌ కూడా మహిళే.

దీక్షా ‘షర్మిల’

మణిపూర్‌ లో తన కళ్ళముందే 18 మంది పౌరుల్ని అక్కడి సాయుధ దళాలు నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తే, చలించి పోయి ‘సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని’ ఎత్తి వేయాలంటూ పన్నెండేళ్ళుగా అన్నం ముట్టకుండా, ట్యూబుల ద్వారా ఇచ్చే ద్రవాలతో ప్రాణాలు నిలుపుకుంటున్న పత్రికా రచయిత ఐరోమ్‌ షర్మిల మహిళే.

అంతెందుకు ఆంధ్రప్రదేశ్‌లో సారాను బంద్‌ చేయమంటూ ఉద్యమానికి నడుము బిగించిన రోశమ్మ మహిళ కాదా?

అందరూ సామాజిక కార్యకర్తలే.

స్త్రీ నిజంగా ఒక సమస్యపై ఉద్యమించటం మొదలు పెట్టినప్పుడు వచ్చే స్పందనే మారిపోతుంది.

‘ఆకాశంలో సగం’ అని మావో స్త్రీని అభివర్ణించాడు. చూస్తూ వుంటే ‘ఆవేశంలో సగం’ అని అనాల్సి వస్తోంది. నాయకత్వం వైపు ఆమె ఆడుగులు వేస్తున్నది. జనం ఆ మేరకు స్వాగతం పలుకుతున్నారు. ఇలాంటి నిస్వార్థ మహిళలు రాజకీయాల్లోకి వస్తే, అక్కడకూడా పెను మార్పు తప్పదు.

-సర్‌

(గ్రేట్ ఆంధ్ర వార పత్రికలో  ప్రచురితం)

 

 

2 comments for “ఆవేశంలో ఆమె సగం!

  1. సమస్య అంటేనే స్త్రీ. స్త్రీ అంటేనే సమస్య. ఇది ఇంటి భాగోతం.

    సమరం అంటేనే స్త్రీ. స్త్రీ అంటేనే సమరం. ఇది వీధి భారతం….They are so nice quotes, Sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *