‘ఈ ఏడుపు మాది’

టాపు(లేని) స్టోరీ:

ఏడుపు ఏడుపే. దానికేదీ సాటి రాదు. ఏడుపుకున్న మార్కెట్టు నవ్వుకు వుండదు. ఎవరన్నా ఏడుపుగొట్టు సినిమా తీయటం- పాపం, ఎదురు డబ్బిచ్చి, టిక్కెట్టు కొని ఏడ్చి వస్తాం. సినిమావాళ్ళకు అనవసరమయిన విషయాల్లో సిగ్గెక్కువ. ఏడుపును ఏడుపని అనరు. సెంటిమెంటు- అంటారు. త్రీడీ సినిమాలు చూడటానికి కళ్ళజోళ్ళు పంచినట్లు, సెంటిమెంటు సినిమాలు చూడటానికి చేతిరుమాళ్ళు పంచిన సందర్భాలు కూడా వున్నాయి.

మరీ ఫిలాసఫీ అనుకోకపోతే- ఏడుపులేకుండా, పుట్టుకా లేదు, చావులేదు. కాకపోతే మనిషి పుట్టినప్పుడు తానేడుస్తాడు, చచ్చినప్పుడు ఇతరులు ఏడుస్తారు. నడమంతరపు సిరి నవ్వు. మధ్యలో వచ్చి మధ్యలోనే పోతుంది.

ఎంత కాదన్నా, ఈ మధ్య ఏడుపు సినిమాలు తగ్గిపోయాయి. టీవీ సీరియల్స్‌ చూసే గృహిణులు ఏడిచినట్లు కనిపిస్తారు కానీ, ఏడ్వరు. కానీ కన్నీరు కారుస్తారు. గొప్పతనం-సీరియల్లోనిది కాదు. టీవీ చూస్తూ తరిగే ఉల్లిగడ్డల్లోనిది. మరి ఈ ఏడుపు ఏడుపంతా ఎక్కడికి వెళ్ళి పోయిందీ- అని ఆరాతీస్తే, రాజకీయాల్లో సెటిలయ్యింది. రాజకీయాల్లో ఏడుపుకు ఎడాపెడా మార్కెట్టుంది. నేత ఏడ్చినా మార్కెట్టే. వోటరు ఏడ్చినా మార్కెట్టే. సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా, ఏడుపు రావాలంటే, అందుకు తగ్గ సీను వుండాలి. అదే కాటి సీను. సత్య హరిశ్చంద్ర నాటకానికయినా, సినిమా కయినా ఈ సీనులోనే చప్పట్లు మోగుతాయి. రాజకీయాల్లో ఈ సీనుకే వోట్లు రాలతాయి. నేతలు చనిపోతూ వుంటారు. రహస్యమేమిటంటే, రాజకీయాల్లో బతికున్న నేత కన్నా, చనిపోయిన నేతకే విలువ ఎక్కువ. ఇందిరమ్మను హత్య చేసిన తర్వాత, ఇందిరమ్మ ప్రభావం, ఆమె బతికున్నప్పటికన్నా ఎక్కువ పడింది. రాజీవ్‌ గాంధీకీ అంతే. ఇక రాష్ట్రంలో వై.యస్‌, రాజశేఖరరెడ్డి విషయంలో రుజువయ్యింది. నేత చనిపోతే అమితంగా దు:ఖించేది, నేత కుటుంబ వారసులు. కాబట్టి వోటర్లొచ్చి వారసుల్ని ఓదార్చాలి. కానీ వైయస్‌ తనయుడు కానీ, ఆయన భార్య, కూతురు కానీ, వోటర్లనే ఏళ్ళ తరబడి నిరవధికంగా ఓదారుస్తున్నారు. మరి ఒక వేళ వోటరే చనిపోతే, అప్పుడు కూడా నేతే వెళ్ళి ఓదారుస్తాడు. ఓవార్పు అంటే, ఏడ్చే వాడిని ‘ఊరుకోబెట్టి రావటం’ అనుకునేరు. ఒక్కొక్క సారి ఏడుపు కన్నా, ఓదార్పు హింసాత్మకంగా వుంటుంది. ఇది సాధారణ జన జీవనంలో కూడా కనిపిస్తుంది. భర్త చనిపోయిన భార్య దగ్గరకు వెళ్ళి ‘చెట్టంత మనిషి చని పోతే తట్టుకోవటం కష్టమే. మగ దిక్కులేని ఆడ మనిషి అందరికీ లోకువే కదమ్మా!’ అంటూ ఆమె దిక్కుమాలిన స్థితిని భూతద్దంలో చూపించి అదనంగా ఏడిపిస్తారు. చనిపోయిన వారి కుటుంబాల దగ్గరకు వెళ్ళి, రాజకీయ నాయకులు ఓదార్చే పేరు మీద చేసే గాయమూ ఇంతకన్నా పెద్దగా వుంటుంది. భూతద్దం కన్నా పెద్ద అద్దం మరొకటి వుంది. దాని పేరే మీడియా. కెమెరా ముందు ఒక్క సారి ఏడిస్తే వంద సార్లు ఏడ్చినట్టు. అన్ని బులెటిన్లలో అన్నేసి సార్లు ప్రసార మవుతుంది.

అందుకే, చావు వుంటే చాలు. వెళ్ళి వాలిపోతారు రాజకీయ నేతలు. ఆంధ్రప్రదేశ్‌లో చావులకు కొరత లేదు. చావును సులభతరం చేసే ఎన్నో పథకాలుంటాయి. ఆకలితోనూ చావ వచ్చు. ఆత్మహత్యా చేసుకోవచ్చు. ఇలా జనం స్వఛ్చందంగా చావటానికి సిధ్దంగా లేక పోతే, పోలీసు కాల్పుల్లోనూ చావవచ్చు. అగ్రవర్ణ దాడుల్లోనూ చావ వచ్చు.

ఇలాంటి అన్ని చోట్లా, రాజకీయ నేతలు వెళ్లి, ఓదార్చ వచ్చు. అనగా ఏడ్పులో ఏడ్పును కలప వచ్చు. తొమ్మిదేళ్ళ చంద్రబాబు పాలన తర్వాత, అయిదేళ్లు పైబడి వైయస్‌ పాలన తర్వాత కూడా సిరిసిల్లలో చేనేత కార్మికుడు ఉరేసుకుంటున్నాడు. అయినా సరే, వైయస్‌ సతీమణి విజయమ్మ నిరశన పేరు మీద వారిని ఓదార్చటానికి వచ్చారు.

అప్పటి వరకూ తెలియదు. ఏడుపు క్కూడా ‘పేటెంటు’ వుంటుందని. ‘ఇది మా( కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌) ఇలాకా. మీరు ఇక్కడకొచ్చి ఏడ్వడమేమిటి? అక్కడ చావుల్లేవా?’ అని టీఆర్‌ఎస్‌ నేతలు విరుచుకు పడ్డారు. నిజమే కదా! పాపం కేటీఆర్‌ స్వంత నియోజకవర్గం(సిరిసిల్ల) లో, కష్టపడి సాధించుకున్న చావులు. వాటిలో పేటెంట్‌ అడిగితే ఎలా?

సెంటిమెంటుకు ఇంత మంచి మార్కెట్టు వున్నప్పుడు, దానిని కూడా తమను(టీఆర్‌ఎస్‌) మార్కెట్టు చేసుకోనివ్వరా- అన్నది అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న.

న్యూస్‌ బ్రేకులు:

నిన్న పరకాల- నేడు ఉరకాల!

చేనేత దీక్ష పేరిట విజయమ్మ చేస్తున్న తెలంగాణ యాత్ర రాజకీయ యాత్ర. తెలంగాణ కోసం చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను ఆమె పరామర్శించారా?

-జూపల్లి కృష్ణారావు. కొల్హాపూర్‌ శాసన సభ్యులు

ఇలాంటి ఐడియాలే మీ కొంపలు ముంచుతాయి. ఇప్పుడామె ఈ పేరు మీద తెలంగాణ మొత్తం తిరిగేశారనుకోండి. ప్రతి నియోజకవర్గం ఒక పరకాల అవుతుంది.

పెట్టుబడులు పెరిగి పరిశ్రమలు ఏర్పాటయితేనే ఏ ప్రాంతమైనా అభివృధ్ది చెందుతుంది.

-కొణిజేటి రోశయ్య, తమిళ నాడు గవర్నర్.

పెట్టుబడులు పెరిగితే అభివృద్ధి అయ్యేది, ముఖ్యమంత్రులూ, మంత్రులూ, వారి తనయులూ కదా! మీరేమిటి? ప్రాంతాలు అభివృధ్ధి చెందుతాయంటున్నారు.

ట్విట్టోరియల్‌

‘ప్రణబ్బర్‌’ స్టాంపు!

రాష్ట్రపతికి రెండు పర్యాయ పదాలు వున్నాయి. ఒకటి: ప్రథమ పౌరుడు రెండు: రబ్బరు స్టాంపు. గౌెరవంలో మొదటి వ్యక్తి. అధికారంలో రెండవ వ్యక్తి. అందుకే చాలా కాలం వరకూ రాష్ట్రపతిని చూస్తే రామ చిలుకను చూసినట్టూ, ప్రధానిని చూస్తే కోకిలను చూసినట్టూ వుండేది. అందంగా వుంది కదా- అని రామ చిలుకను పాడమన్నారనుకోండి – పాడదు. ‘అందాని నేను. రాగానికి మా అక్క’ అని తప్పించుకుంటుంది. అబ్దుల్‌ కలామూలూ, ప్రతిభా పాటిళ్ళూ- ఇలా రామచిలుకలుగానే మిగిలి పోయారు. వారి తరపున ప్రధానులు పాడాలి కానీ, వారు కూడా పాడలేదు. సంకీర్ణ సర్కారులో రాష్ట్రపతే కాదు ప్రధానమంత్రి కూడా రబ్బరు స్టాంపే. ఆయనను ‘అప్రధాని’ అని పిలిచినా ‘టైమ్‌ పత్రిక మెచ్చుతుంది. ఆ లెక్కన రాష్ట్రపతీ, ప్రధానీ వెరసి-రెండు రబ్బరు స్టాంపులయ్యాయి. ఈ స్టాంపుల్ని వేసేది మాత్రం ‘యుపీయే ఛైర్‌ పర్సన్‌’. ప్రణబ్‌ విషయంలో అలా జరిగేటట్లు కనిపించటం లేదు. స్టాంపూ తానే, వేసేదీ తానే.

‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

ప్రథమ ‘దాదా’!

పలు ట్వీట్స్‌ :కంగ్రాట్స్‌ ‘దాదా'(ప్రణబ్‌)!

కౌంటర్‌ ట్వీట్‌: దేశ ప్రజల ప్రాణ రక్షణకు ఢోకాలేదు. రాష్ట్ర పతే పెద్ద ‘దాదా’!

ఈ- తవిక

వానొస్తే..!?

 

వోడలు బళ్ళవుతాయి.

బళ్లు వోడలవుతాయి.

కానీ,

హైదరాబాద్‌లో మాత్రం

కార్లు పడవలే అవుతాయి.

 

బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘రాజేష్‌ ఖన్నా కారులో వెళ్తుంటే, ఆడపిల్లలు కారు అద్దాలకు ముద్దు పెట్టేవారట?’

‘ఇప్పటికే అంతే. కారులే ముద్దొస్తాయి!’

కొట్టేశాన్‌( (కొటేషన్‌)):

బుర్రలు మూడు: నిండయినవీ, సగం ఖాళీవి, మొత్తం ఖాళీవి. వీటినే వరుసగా మనం- శాసన, కార్యనిర్వాహక, న్యాయ శాఖలుగా భావిస్తాం. మరి నాలుగోస్తంభం అయిన మీడియావి? లేని బుర్రలు!!

-సతీష్ చందర్
(సూర్య దినపత్రిక 24 జులై 2012 సంచికలో ప్రచురితం)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *