‘ఉత్తర'(ఆంధ్ర) కుమారుడు!

కేరికేచర్: బలరాం

పేరు బొత్స సత్యనారాయణ

దరఖాస్తు చేయు ఉద్యోగం: మార్పులేదు. ముఖ్యమంత్రి ఉద్యోగమే( కలిసి వుంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, విడిపోతే సీమాంధ్ర ముఖ్యమంత్రి. మరోమారు విడిపోతే ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి.) ముఖ్యమంత్రి పదవిని ఆశించటంలో తప్పులేదని ఎన్నోసార్లు చెప్పాను.

ముద్దు పేర్లు : ‘ఉత్తర’ కుమారుడు(ప్రగల్బాలు పలుకుతానని కాదు సుమా! ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాడిని. ఉత్తరాంధ్ర ప్రజలకు రాకుమారుడిని కూడా. నేనంటే అంతటి అభిమానం చూపిస్తారు.) చదివింది మహారాజా కాలేజిలో కదా- ఆమాత్రం రాజసం ఉట్టిపడుతుంది లెండి.

విద్యార్హతలు : బిఎఫ్‌ఎ( అంటే బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ కాదు… బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యామిలీ ఎఫైర్స్‌). కుటుంబ వ్యవహారాలను భాధ్యతగా చక్కపెడతాను. నేనొక్కణ్ణే పదవిననుభవిస్తే స్వార్థమవుతుంది. అందుకే భార్యకీ, సోదరుడికీ, బంధువులకీ అవకాశం కల్పిస్తాను. (స్త్రీలకు సమానహోదా కల్పించే దాంట్లో భాగంగా నా సతీమణికి కేంద్ర మంత్రి ప్రయత్నించాను. కానీ హైకమాండ్‌ ‘కృప’ వేరే రాణికి దక్కింది.) ఇలా చేయటం ‘సామాజిక న్యాయం’ కాదా? అని ప్రశ్నిస్తున్నాను.

హోదాలు : అవును. హోదాయే గౌరవం. అందుకే పార్టీలో ఒక హోదా(పీసీసీ నేత) ప్రభుత్వంలో ఒక హోదా(మంత్రి)ను స్వీకరించాను. ‘జోడు గుర్రాల’ స్వారీ అని కొందరు ఆడిపోసుకుంటారు. కానీ ‘స్పీడు’ వెళ్ళాలంటే తప్పదు.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: ఇవాళ ఎవరి భుజం మీద చేయి వేస్తానో, రేపు వారితోనే గొడవ పడతాను.(చిరంజీవినీ, కిరణ్‌కుమార్‌ రెడ్డినీ అలాగే భుజం తట్టాను లెండి!)

రెండు: వ్యాపారం వ్యాపారమే. సిధ్ధాంతం సిధ్ధాంతమే.( మద్యం వ్యాపారం చేసినంత మాత్రాన, అందర్నీ తాగమనీ కోరతామా? ఏమిటి? దేనికదే. రెంటీనీ కలపకూడదు. కలపటానికి అవేమయినా విస్కీ, సోడాలా?)

అనుభవం : ఒకటి కావాలంటే ఒకటి వదలు కోవాలి. రాజకీయాల్లో రాణించాలంటే, వ్యాపారంలో కొంత నష్టం తప్పదు. (టెండర్లు పిలిచిన వాళ్లనడిగితే ఎంత నష్టపోయానో తెలుస్తుంది.)

సిధ్ధాంతం : ముందు కుటుంబం, తర్వాత కులం, ఆ తర్వాత…పార్టీ అనుకుంటున్నారా? కావచ్చు కానీ, పార్టీలో నా గ్రూపు ముఖ్యం.

వృత్తి : కదలేదీ, కదిలేదీ.. (లోపల వేస్తే) ఊగేదీ.. ఊగించేదీ.. దానిని పంచటమే. అదే నా వృత్తీ, నా అనుయాయుల వృత్తీనూ. (అనుయాయుల్ని బినామీలంటే మాత్రం ఊరుకునేది లేదు.)

హాబీలు :1. ఆంధ్రాను ప్రేమింటం, తెలంగాణను సమర్థించటం.( రెండూ మనవే కదా!)

2. ఇంతలోనే కలహించటం, అంతలోనే కౌగలించటం (ఒపీనియన్స్‌ మాత్రమే కాదు, ఎక్స్‌ప్రెషన్స్‌ చేంజ్‌ చేస్తే కానీ పాలిటిష్యన్‌ కాలేరు.)

మిత్రులు : నిజం చెప్పమంటారా? ఏ నేతకైనా అసలైన మిత్రులు అవతల పార్టీలో వుంటారు. ( అంతే కానీ, సొంత పార్టీలో చేరిపోయి మనకి ఎసరు పెట్టరు.)

శత్రువులు : అదేంటదీ… మనకి శత్రువులేంటీ…!

మిత్రశత్రువులు : రెయిడ్‌( వ్యాపారాల మీద లెండి) చేయించిన వాడెల్లా ‘రెనగేడ్‌’ కాడు. ఈ వ్యాఖ్య ఎవరినీ ఉద్దేశించినది కాదు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించింది అసలు కాదు.

వేదాంతం : ఆశించండి. కానీ పైకిచెప్పకండి. ఇది నా స్వీయానుభవం ద్వారా నేర్చుకున్న పాఠం. (మీకు తెలుసా? నిన్న కాక మొన్న ఎన్నికయి. ఇంకా బొడ్డూడని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేక్కూడా సిఎం కావాలని వుంటుంది. కానీ వాళ్ళు చెప్పరు.)

జీవిత ధ్యేయం : ఒక్క టర్మయినా. ఒక్క ఏడయినా, ఒక్క నెలయినా ముఖ్యమంత్రి గా చేస్తాను. అదీకాక పోతో ఒకేఒక్క రోజయినా సరే( ‘ఏక్‌ దిన్‌ సుల్తాన్‌’ గా) ముఖ్యమంత్రిగా వుండి నేనేమిటో నిరూపించాలని.

-సతీష్ చందర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *