ఆమె ఎవరో… ఖరీదయిన దుస్తుల్లో, విలువయిన ఆభరణాలతో, అరుదయిన పెర్ప్యూమ్ పూసుకుని
ఎదురుగా నిలబడింది. పట్టించుకోలేదు. నేనే కాదు. నా మిత్రులు కూడా. చిన్నగా నవ్వింది.
అందరమూ చూశాం. అవును నవ్వే చిన్నది. ఆ నవ్వు పూసిన పెదవులు మరీ చిన్నవి. నిలువెత్తు
అందగత్తెకు ఉనికి ఆ చిన్న నవ్వే. నేను రోజూ వెళ్ళే పార్కుకు ఉనికి చెరువుకు ఓ మూలగా వున్న
చిన్న సిమెంటు సోఫా కావచ్చు. అక్కడ కూర్చున్నప్పుడే పల్చటి గాలి వచ్చి పలకరించి పోతుంది.
చిరు అనుభూతే పెద్ద జీవితానికి ఉనికి.
ఎంతో చీకటి
కొంతే వెలుతురు
అతి పెద్ద నల్లని కాన్వాసు పై
పిసరంత తెల్ల రంగు చిమ్మినట్లు.
చుట్టూ వున్న మహాసముద్రాన్ని వదలి
నాటు పడవనే చూసినట్టు,
ఆవరించిన రాత్రిని విస్మరించి
వెలిగిన అగ్గిపుల్లకు ముగ్థులమవుతాం.
పగలూ అంతే.
అంత పెద్ద సూర్యకాంతిని వదలి
చిన్న మబ్బు నీడకు పరవశిస్తాం.
విశాలమైన నుదుటిని చూడకుండా
చిన్న బొట్టుకు చిక్కుకుంటాం.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 8-15 నవంబరు 2012 సంచికలో ప్రచురితం)
ENDUVALANA. CHIKKULLO PADAKUNDA UNDALI KOODA. ……
అవును నవ్వే చిన్నది. ఆ నవ్వు పూసిన పెదవులు మరీ చిన్నవి.
so…… romantic