ఉన్నత ‘ప్రమాదాలు’!

a photograph by kishen chandar

కంటి ముందు కడలి

మరచిపోయేది పాఠం; గుర్తుండి పోయేది గుణపాఠం.
కేజీ నుంచి పీజీ వరకూ చాలా పాఠాలు చదువుతాం. కానీ అవి పరీక్ష హాలు వరకే గుర్తుంటాయి. పరీక్ష పూర్తయి సినిమా హాలుకు వచ్చేశాక. పాఠం కంచికే వెళ్తుంది. సినిమా కథే మన ఇంటి వరకూ వస్తుంది.
బాగున్న ప్రతీ పిల్లకీ ‘ఐ లవ్యూ| చెప్పుకుంటూ పోతున్నప్పుడు, ఎవరో ఒక అమ్మాయి చెప్పుతీసే చెప్పే గుణపాఠం వుందే- అది జీవితాంతం గుర్తుండి పోతుంది.
కానీ, ఎందరెందరి గుణపాఠాలో పుస్తకాల్లో పాఠాలు గా వస్తుంటాయి. కానీ అవి చాలా వరకూ, వెన్న తీసిన పాలలాగా వుంటాయి కాబట్టి ఎవరికీ రుచించవు.
ఎందరో నాయకుల జీవిత విశేషాలను పాఠ్యపుస్తకాలలో మనం చదివే వుంటాం.
గాంధీ, లెనిన్‌, అంబేద్కర్‌, మండేలా- ఇలా గొప్పగొప్ప నాయకుల గురించి చదివే వుంటాం.
ఇంత మందిగురించి చదివినా, నాయకుడు అవ్వాలంటే ఏమి చెయ్యాలో స్పష్టంగా తెలియదు.
వేరుశనక్కాయలూ, మేకపాలూ తాగితేనో లేక రాట్నం వడికితేనో గాంధీ నాయకుడయ్యాడు కాబోలు – అని చదువుకునేటప్పుడు ఒక్కోసారి అనిపించేది.
డిగ్రీ తర్వాత డిగ్రీ.. వరుసగా మన పేరుకంటే పొడుగు వుండేటంతగా చదువులు చదివేస్తే, అంబేద్కర్‌ కావచ్చునేమోనని అనుమానంగా వుండేది.( నాకు తెలిసిన ఒకాయన వరుసగా డెబ్బయి రకాల డిగ్రీలు, డిప్లామాలు చేసేశాడు. ఈ మధ్య మళ్ళీ ఆయన్ని చూశాను. సూటూ, బూటూలోనే వున్నాడు కానీ, బొడ్డు వరకూ దిగేలా గెడ్డం మీసాలూ పెంచుకున్నాడు. అదేమని అడిగితే నాయకుడు కావాలని ఇప్పటికి రెండు ఫార్ములాలు ప్రయోగించానని చెప్పాడు. చదువుల ఫార్ములా అంబేద్కర్‌ది. గెడ్డం ఫార్ములా మార్క్స్‌ది. అయినా అతడు ఇప్పటికీ నాయకుడు కాలేదనుకోండి. అది వేరే విషయం.)
ఎంతమంది నాయకుల గురించి పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నా, నాయకుడు కాగలిగే రహస్యం బోధపడేది కాదు. వ్యక్తిత్వ వికాసం లో భాగంగా, ఇటీవల నాయకత్వ లక్షణాల గురించి ఈ మధ్య పుస్తకాలు కూడా ఇబ్బడి ముబ్బడి గా వచ్చేస్తున్నాయి. ఈ పుస్తకాలు రాసిన వారు సైతం నాయకులు కాలేక పోతున్నారు.
కొందరయితే తమలో నాయకుడున్నాడనుకుని, ఏకంగా రాజకీయ పార్టీలే స్థాపించేశారు. వారిలో కొందరు ఎన్నికలయ్యాక దుకాణాలు మూసేశారు. ఇంకొందరు, మూసేయడానికి కూడా శక్తి లేక కొనసాగిస్తున్నారు.
కానీ నాయకులు అలా అలవోకగా పుట్టుకొస్తూనే వున్నారు.
ఎలా పుట్టుకొస్తున్నారన్నది కాస్సేపు పక్కన పెడితే, ఎప్పుడెప్పుడు పుట్టుకొస్తున్నారో గమనించాలి.
ప్రమాదాలు సంభవించినప్పుడే నాయకులొస్తారు. ప్రమాదాలనే కొందరు- ఉద్యమాలు- అని కూడా అంటారు.
ఇప్పుడు దేశానికో ప్రమాదం వచ్చింది- అదే అవినీతి!
ఇలా అంటే నవ్వుగా లేదూ? చెవిలో పువ్వు పెట్టినట్టు లేదూ?
అవినీతి ఎప్పుడూ వుంది. స్వరాజ్యం రాముందూ వుంది. స్వరాజ్యం వచ్చాకా వుంది. మరి హఠాత్తుగా ఇప్పుడు ప్రమాదం అయ్యింది.
కారణం చిన్నది. ఈ అవినీతి పల్ల నిరుపేదలకు మాత్రమే కాకుండా, సంపన్నులకు కూడా తల బొప్పి కడుతోంది. వేల కోట్ల ప్రాజెక్టు ఒకటి నిలువుగా ఎదిగిన ఒక బడా వ్యాపారికి బదులు, ‘అడ్డంగా’ ఎదిగిన ఓ అడ్డగోలు వ్యాపారికి వస్తే..?
వస్తే.. ఏమిటి? అలా రావటమే ఇవాళ ‘అవినీతి’. ఇదే పెను ప్రమాదం.
ఈ ప్రమాదంలోంచి నాయకులు రావచ్చు.
ఇద్దరు వచ్చారు. ఒకరు: అన్నా హజారే. మరొకరు: బాబా రామ్‌దేవ్‌.
కానీ ఇద్దరిలో ఒక్కరే నేడు నిజమైన నాయకుడిగా నిలిచిపోయారు. కారణం? ప్రమాదాన్ని ఎదుర్కొనే తీరులో వున్న వ్యత్యాసం.
ప్రమాదం వచ్చినప్పుడు నాయకుడి ముందు రెండు మార్గాలుంటాయి. ఒకటి: ప్రమాదాన్నుంచి బయిట పడటం. రెండు: ప్రమాదాన్ని వాడుకోవటం.
వెనకటి సినిమాల్లో వెయ్యినొక్క ఫైట్లు చేసిన హీరోగారు విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ విమానాన్ని అత్యవసరంగా మార్గ మధ్యంలో ‘లాండింగ్‌| చేశారు. ప్రమాదం తృటిలో తప్పిందని పైలట్‌ ప్రకటించటంతో, ప్రమాదం జరిగివుంటే తను ఏమయి వుండే వాడినో అని ఊహించుకొని, అందరూ చూస్తుండా భోరున విలపించాడట. ఈ హీరో ఎప్పటికీ నిజజీవితంలో నాయకుడు కాలేకపోయాడు.
ఒకాయన ప్రయాణిస్తున్న కారును తీవ్రవాదులు మందుపాతర తో పేల్చబోయారు. కొన్ని క్షణాలు ఆలస్యంగా పేలడంతో ఆయన బతికి పోయారు. ఆయన స్వల్పగాయాలతో బయిట పడిన వెంటనే, మీడియా చూస్తుండగా తన అనుచరులను కాపాడే పని మొదలు పెట్టేశారు. ‘ నా ప్రాణం కన్నా నా కార్యకర్తల ప్రాణాలు’ ముఖ్యమన్నాడు. ఇదే ప్రమాదాన్ని వాడటమంటే.
ఈ తేడాయే బాబా రామ్‌ దేవ్‌కీ, అన్నా హజారే మధ్య కూడా కనిపిస్తుంది.
ఇద్దరి దీక్షా శిబిరాల మీద కూడా పోలీసులు ఘోరంగా విరుచుకుపడ్డారు.
బాబా రామ్‌ దేవ్‌ మారు వేషంతో, మాయోపాయంతో దాడినుంచి తప్పించుకున్నారు.
అన్నాహజారే చెరగని చిరునవ్వుతో అరెస్టయి, జైలుకు వెళ్ళి, ‘నాకు యువకులు ముఖ్యం’ అన్నారు.
ఒకే ప్రమాదం: బయిటపడింది రామ్‌ దేవ్‌, ఎదుర్కొన్నది అన్నాహజారే.
ఏ నాయకుడికయినా, ప్రమాదమే వరం.

– సతీష్‌ చందర్‌
(ఆంధ్రభూమి దినపత్రిక 21 ఆగస్టు 2011 సంచిక లో ప్రచురితం)

1 comment for “ఉన్నత ‘ప్రమాదాలు’!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *