‘ఉప’ సమరంలో చంద్ర బాంబులు!

మొన్న అవినీతి!

నిన్న మతం!

నేడు నేరం!

అన్నీ బాంబులే! ‘చంద్ర బాంబులే’! జగన్‌ మీద విసిరిన ‘దీపావళి’ బాంబులే!

ఒక్కటీ పేలలేదు. అన్నీ తుస్సుమన్నాయి.

ఇంకేం చేస్తారు?

పాత పాటే. ‘ఆల్‌ ఫ్రీ’! బియ్యం ఉచితం! నిరుద్యోగులకు నెలకు వెయ్యి. ఇలాంటి హామీలు ఇచ్చేస్తానంటున్నారు. ఇదేదో ఉపకార వేతనం అనుకునేరు! ‘ఉప’ ఎన్నికల వేతనం.

అందుకే ధీమాగా ఇచ్చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచినా వోడినా, అసెంబ్లీలో ఆయన స్థానం మారదు. 2014 లో జరిగే అసలు ఎన్నికలలో గెలిచి, సర్కారును స్థాపించినప్పుడు కదా- హామీల అమలు గురించి ఆలోచించేది?

‘ఆల్‌ ఫ్రీ’ నినాదం ఆయనకు కొత్త కాదు. 2009 ఎన్నికలలో కూడా వాడారు. అన్నీ ఉచితంగా ఇస్తానన్న బాబుకు వోటర్లు కూడా ఎదో ఒకటి ఫ్రీగా ఇవ్వాలి కదా- అని అనుకున్నారేమో! ఇచ్చేసారు. ఓటమిని ఉచితంగా ఇచ్చేశారు.

ఈ 18 అసెంబ్లీ స్థానాలనూ, ఒక్క పార్లమెంటు ఖాళీ చేసింది- అనధికారికంగా జగన్‌ పార్టీ(వైయస్సార్‌ కాంగ్రెస్‌ లో వున్న) కి చెందిన వారు. కాబట్టి, వీటిలోంచి ‘సింహ’ భాగాన్ని తీసుకోవటం, ఇటు బాబుకీ( తెలుగుదేశం పార్టీకీ), అటు కాంగ్రెస్‌ పార్టీకీ వీలు కాని పని. మూడొచ్చినా, నాలుగొచ్చినా – రెండు పార్టీలూ మహాభాగ్యం తలవాలి.

ఆ మూడు నాలుగు సీట్ల కోసం చంద్రబాబు, వరుసగా ఇన్ని ఆస్త్రాలు వాడాలా?

బాంబు వన్‌!

‘అవినీతి. భూముల్లో, గనుల్లో, పనుల్లో అవినీతి. వై.యస్‌ పాలనే అవినీతి. ఈ అవినీతికి లబ్ధి దారుడు జగన్‌’ ఇలా మొదటి బాంబు వేశారు.

‘తినని వారెవ్వరు? అందరూ తింటారు. వైయస్సార్‌ తిన్నాడో లేదో మాకు తెలీదు. మాకు మాత్రం పెట్టాడు’ ఇది అవినీతి పై జనం స్పందన.

అలాగని ప్రజలు వైయస్‌ కీ, ఆయన తనయుడు జగన్‌కీ క్లీన్‌ చిట్‌ ఇస్తున్నట్టు కాదు. కానీ ‘వైయస్‌ పై సానుభూతికి అవినీతి ఆరోపణలు అడ్డు కావు’ అని స్పష్టంగా చెబుతున్నారు. ఇంకే ముంది? అవినీతి అస్త్రం తుస్సు.

బాంబు టూ!

‘మీకు తెలుసా? రాజశేఖర రెడ్డి నాస్తికుడు. భగవంతుణ్ణి నమ్మడు. జగనూ అంతే. తాను ఆస్తికుడు కావటమే కాకుండా, ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అధ్యక్షుడిగా రుణాకర రెడ్డి మరో నాస్తికుణ్ణి పెట్టారు. పాపం ఊరికే పోతుందా?’

ఇది బాబు రెండో బాంబు.

నిజానికి వైయస్‌ నాస్తికుడు కారు. ఆయన క్రైస్తవుడు. ఆయన తనయుడు క్రైస్తవుడు.

ఆయన అల్లుడు (బ్రదర్‌ అనిల్‌) క్రైస్తవ మత ప్రచారకుడు. ఏదీ ఎప్పుడూ దాచుకోలేదు.

ఈ బాంబుకి అసలు లక్ష్యం వేరు. తిరుపతి స్థానంలో ఎక్కడ వైయస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుస్తాడేమోనని అభద్రత. దీనినుంచి బయిట పడటానికి. నరేంద్ర మోడీ మార్కు ‘మెజారిటీ హిందూత్వ వాదాన్ని’ ముసుగు వేసి వాడారు? అలా ముసుగు వేయకుండా వుంటే, ” క్రైస్తవుడయిన జగన్‌మోహన రెడ్డి పార్టీకి వోటు వేయకండి’ అని చెప్పాల్సి వచ్చేది. అదే జరిగితే బాబు ‘సెక్యులర్‌’ ముద్ర చెరిగి పోదూ?

ఒక వేళ నిజంగానే జగన్‌ నాస్తికుడయితే, వచ్చే నష్టమేమిటి? పొరుగు రాష్ట్రమయిన తమిళనాడులో పలు మార్లు ముఖ్యమంత్రిగా చేసిన కరుణానిధి నాస్తికుడు కారా? ఆయన్ని ప్రజలు ‘నాస్తికత్వం’ కారణంగా ఎప్పుడయినా తిరస్కరించారా?

అదికాక క్రైస్తవుడయిన వ్యక్తిని నాస్తికుడంటే, క్రైస్తవమతాన్ని నాస్తికత్వం కింద జమకట్టటమే కదా? అందుకు రాష్ట్రంలోని, దేశంలోని, ప్రపంచంలోని క్రైస్తవులు వ్యతిరేకత చెప్పరా? చెప్పారు. చెబుతున్నారు కూడా.

అందుకే, రెండోదయిన ‘మతాస్త్రం’ కూడా బెడిసి కొట్టింది.

బాంబు త్రీ!

ముచ్చటగా మూడోది.

‘వైయస్సో ఫ్యాక్షనిస్టు, ఆయన తండ్రి ఫ్యాక్షనిస్టు, కొడుకు ఫ్యాక్షనిస్టు’

కనీసం ఈ బాంబయినా పేలుతుంది కదా- అని బాబు ఆశించారు. వేళకు దిగిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో ముద్దాయి భాను వల్ల ఈ ఆశ చిగురించింది. ఇదే సందర్భంలో పరిటాల రవి పై సూట్‌ కేసు బాంబుతో హత్యాయత్నాని కి పాల్పడ్డ అభియోగం పై మంగలి కృష్ణ కు కూడా శిక్ష పడింది.

దాంతో పరిటాల రవి హత్య కేసు నుంచి అప్పట్లో జగన్‌ను తప్పించారనీ, ఇందుకు కేసును తిరగదోడాలనీ బాబు డిమాండ్ల మీద, డిమాండ్లు చేస్తున్నారు.

ఫాక్షనిజంలో కాంగ్రెస్‌కు ఎంత పాత్ర వుందో, తెలుగుదేశానికీ అంత పాత్రవుంది.

రెండు పార్టీల్లో నూ ఫ్యాక్షనిస్టులు తలదాచుకున్నారు.

అలాగే విజయవాడ మాఫియా రాజకీయాల్లో రెండు పార్టీలకు చెందినవారూ వున్నారు.

ఇవన్నీ బహిరంగ రహస్యాలు.

ఈ రెండు పక్షాల్లో ఏ పక్షం వారికి ‘అహింసా వాది’ అని స్టిక్కర్‌ అతికించినా జనం పగలబడి నవ్వుతారు. నవ్వేశారు కూడా.

దాంతో మూడు బాంబు వేసీ వేయంగానే తుస్సుమంది.

ఒక బూచి ప్రాంతం! మరో బూచి కులం!

నిజంగానే చంద్రబాబు షష్టి పూర్తి చేసికుని కూడా, ముఫ్పలయిలలో వున్న యువకుడిలాగా ఎండనకా, కొండనకా తిరుగుతున్నారు. ఇది తనకు ఆఖరి అవకాశమేమో నన్న బెరుకుతో పర్యటిస్తున్నారు.

ఇంత శ్రమ దేనికి? ఇప్పటికిప్పుడు వచ్చిపడే మూడో, నాలుగో స్థానాలు కోసమా? కాదు.

ఆయన అసలు ఆందోళన వేరు.

ఇది అర్థం కావాలంటే, రాజకీయాల్లో గత మూడేళ్ళ బాబు ప్రాగ్రెస్‌ రిపోర్ట్‌ చూడాలి.

2009 ఎన్నికలలో ఆయన పార్టీ తెలుగుదేశం రెండవ సారి ఓడిపోయింది. కానీ బలహీన పడలేదు.

నువ్వా నేనా అన్నట్లు గానే వుంది. కాంగ్రెస్‌పార్టీకీ, తెలుగుదేశం పార్టీ వచ్చిన వోట్ల శాతంలో వ్యత్యాసాన్ని చూస్తే అది రెండు శాతం మించిలేదు.

అప్పటికి కూడా రాష్ట్రంలో ఇద్దరే పెద్ద నేతలు. కాంగ్రెస్‌ నుంచి వై.యస్‌ రాజశేఖద రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు.

హెలికాప్టర్‌ ప్రమాదం వల్ల రాజశేఖరరెడ్డి కీర్తిశేషులయ్యారు. అప్పుడెవ్వరయినా ఏమనుకుంటారు? రాష్ట్రంలో మిగిలిన ఏకైక పెద్ద నేత చంద్రబాబు అనే భావిస్తారు.

కానీ తర్వాత పరిణామాలు అలా జరగలేదు. చంద్రబాబు రోజు రోజుకూ చిన్న బోతూ వచ్చారు.

అగ్రనేతల స్థానాల్లో ఒక చోట(సీమాంధ్రలో) జగన్‌, మరొక చోట(తెలంగాణ)లో కేసీఆర్‌ వచ్చేశారు.

ఇక చిరంజీవి సంగతి సరేసరి. రాజకీయాల్లోకి వచ్చాక కూడా తారగానే వుండిపోయారు కానీ, అగ్రనేత కాలేక పోయారు. ఫలితంగా పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి, తాను కూడా కాంగ్రెస్‌లోని ‘నలుగురు’లో ఒకరయి పోయారు.

చిన్న బోయిన చంద్రబాబుకు దాదాపు రెండేళ్ళ పాటు ‘తెలంగాణ’లో పాదం మోపటమే కష్టమయ్యింది. సీమాంధ్రలో ‘సమైక్యాంధ్ర’ వినిపించాల్సి వస్తుందని గాబరా పడ్డారు. దాంతో రాష్ట్ర విభజన వివాదంతో సంబంధంలేని వాడి ఉంటూ వచ్చారు. పోనీ అలా వుండిపోయినా బాగుండేది. కానీ రెండూ ప్రాంతాలు తనకు రెండు కళ్ళని చెప్పి అభాసు పాలయ్యారు.

మొన్నటి తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలలో కొన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి.

సమైక్యాంద్ర ఉద్యమానికి విరామం ఇవ్వగానే, జగన్‌ ‘ఓదార్పు యాత్రలు’ తిరిగి పుంజుకొన్నాయి. సీమాంధ్రలో జగన్‌ సభలకు ఇప్పటికీ పెద్ద యెత్తున తరలి వస్తున్నారు.

ఈ మార్పులు కేవలం ప్రాంతాల వారిగా జరిగి వున్నా బాబులో కొంత ఆశ మిగిలి వుండేది.

ఇవి కుల సమీకరణల మార్పుకు దోహద పడ్డాయి.

ఎస్సీలు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వైపూ, సీమాంధ్రలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపూ వెళ్ళారు.

కాపుల్లో ఎక్కువ మంది చిరంజీవి, బొత్సల కారణంగా కాంగ్రెస్‌ వైపు కొంత మొగ్గు చూపారు.

మిగిలిన బీసీలు సీమాంధ్రలో ఎక్కువగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపుతున్నారు.

రెడ్లు సీమాంధ్రలో దాదాపు వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపు వచ్చేశారు. తెలంగాణలో ఇంకా కాంగ్రెస్‌ వైపే వున్నారు..

వెలమలు(తెలంగాణలోనే అధికం) దాదాపు టీఆర్‌ఎస్‌లోకి వచ్చేసినట్లే,( వెలమల ఆధిపత్యాన్ని చూపించి, రెడ్లను కాంగ్రెస్‌ వైపు మళ్ళించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేసీఆర్‌ తో విభేదాలున్న జెఎసి ఛైర్మన్‌ కోందండరామ్‌(రెడ్డి)కి తెలంగాణలో రెడ్డు పరోక్ష మద్దతు కు యత్నిస్తున్నారు. అంతిమంగా ఈ సమీకరణ ఈ ప్రాంతంలో తెలంగాణ కు లాభించ వచ్చు.)

తెలుగుదేశం పార్టీకి మిగిలినది ఇక కమ్మ సామాజిక వర్గం. బీసీలలో కొంత భాగం.

ఇదే స్థితి 2014 వరకూ కొనసాగితే..!?

ఈ ఊహే చంద్రబాబుకీ, తెలుగుదేశం పార్టీలో వున్న వారికీ కష్టంగా వుండవచ్చు.

కానీ, బాబుకి ఈ వాస్తవం తెలుసు.

కాబట్టే ఆయన సర్వ శక్తులూ వొడ్డుతున్నారు.

ఇప్పుడు జరగబోతున్న ఉప ఎన్నికలలో కేవలం ఒక్క స్థానం మాత్రమే తెలంగాణలో ఉంది. మిగిలిన వన్నీ సీమాంధ్రో వుండడటం వల్ల జగన్‌ మీద అస్త్రం మీద అస్త్రం మీద ప్రయోగించి, అలసి పోయి తిరిగి ‘ఆల్‌ ఫ్రీ’ దగ్గర సెటిలయ్యారు.

తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు నిజంగా కాలసింది- జనాకర్షక నినాదమో, పథకమో కాదు. జనాకర్షక నేత. ఆ మార్పుకు చంద్రబాబు సిధ్ధమేనా!?

-సర్‌
(ఒక రాజకీయ వారపత్రిక కోసం 1మే2012 నాడు రాసిన వ్యాసం. ప్రచురితమయింది కూడా)

1 comment for “‘ఉప’ సమరంలో చంద్ర బాంబులు!

Leave a Reply to Naidubabureddy Cancel reply