‘ఎడమ’, ‘ఎడమ’గా…!

నారాయణ

వారు కలవరు. విడిపోరు.

ఎవరనుకున్నారు? రోజూ కొట్టుకు చచ్చే భార్యాభర్తలు కారు.

కలి ‘విడి’గా పనిచేసే కమ్యూనిస్టు పార్టీలు. దేశంలో ఎలా వున్నా, రాష్ట్రంలో మాత్రం ఇదే తంతు.

ఒకే జెండా. ఒకే ఎరుపు. ఒకే సుత్తీ, ఒకే కొడవలి. కానీ పట్టుకునే చేతులు వేరు. ఒకటి: సిపిఐ, రెండు: సిపిఎం.

వీళ్ళు చాలా చేస్తారు. రోడ్లెక్కెస్తారు. కార్లాపేస్తారు. రైళ్ళాపేస్తారు. ఎదురుగ్గా ఏమొచ్చినా ఆపేస్తారు. కడకు ఐక్యత ఎదురొచ్చినా సరే. ఆపేస్తారు.

దేనికయినా ఎదురు నిలుస్తారు. లాఠీలకు ఎదురు నిలుస్తారు. బుల్లెట్లకు ఎదురు నిలుస్తారు. కానీ బ్యాలెట్లు ఎదురొస్తేనే ఎవరి దారిన వారు పోతారు.

ఉత్తి పుణ్యానే వచ్చిపడుతున్న ఉప ఎన్నికలను చూస్తున్నారు కదా! అక్కడ మాత్రం కలిశారా? సిపిఐ పొత్తులకు సిధ్ధమయింది. సిపిఎం స్వతంత్రంగా పోటీకి తయారయింది.

సిపిఐ పొత్తు కూడా రెండు రకాలు గా వుంది. తెలంగాణాలో టీఆర్‌సితోనూ, సీమాంధ్రలో తెలగుదేశంతోనూ జతకట్టటానికి సిధ్ధమయింది.

సిపిఐ,సిపిఎం- రెండూ ‘ఎడమ’ పక్షాలే. రెండు ఎడమచేతులు- ఎదురెదురుగా వున్నప్పుడు కరచాలనానికి పనికొస్తే పనికి రావచ్చు.(కానీ కరచాలనాలు కుడిచేతుల్తోనే ఇచ్చుకుంటారు. పుర చేతుల్తోనే ఇచ్చుకుంటారు. అలా చేసినప్పుడు అది ‘పుర’ చాలనం అవుతుంది కానీ, కరచాలనం కాదు.) కానీ పక్కపక్కనే నిలబడి భుజం, భుజం కలపటానికి పనికి రావు.( ఒకరి ఎడమ భుజాన్ని, మరొకరి కుడి భుజంతో మాత్రమే కలపవచ్చు.)

అందుకే అదిక ధరలపైనా, సెజ్‌ల పేరిట భూముల ఆక్రమణలపైనా, మద్యవ్యాపారంపైనా- ఉద్యమించేటప్పుడు కరచాలనం చేసుకుంటాయి. కానీ ఎన్నికల రాజకీయాలు వచ్చే సరికి ఎవరి దారి వారు చూసుకుంటాయి.

దాంతో రాష్ట్రంలో ప్రజలకు కూడా వీరి మీద ఒక అంచనా ఏర్పడింది.

సమస్యల పరిష్కారాలకు కమ్యూనిస్టులు కానీ, రాజకీయాలకు కమ్యూనిస్టులు కారు. అందుకే, ఎర్రజెండా పట్టి ధర్నాలో పాల్గొన్న వ్యక్తి కూడా, పోలింగ్‌ రోజున కాంగ్రెస్‌కో, తెలుగుదేశంపార్టీకో వోటు వేసి వస్తాడు.

అందుకే రాష్ట్ర శాసన సభలో వీరి సంఖ్య వందల, పదుల స్థానంలో కాకుండా, ఒకట్ల స్థానం(సింగిల్‌ డిజిట్‌)లోకి వచ్చేసింది.

వీరి సంఖ్యా ‘బలాన్ని(బలహీనత)ను చూసి, ఏ సిధ్థాంతాలు పట్టని ఇతర రాజకీయ నాయకులు కూడా తరచు ఎద్దేవా చేస్తుంటారు. ‘రష్యాలో కమ్యూనిజం కూలి పోయింది కదా! ఇంకా ఎందుకు మీరు మాట్లాడతారు?’ అని వారి నోళ్లు మూయించటానికి ప్రయత్నం చేస్తుంటారు.

వెనకటికి ‘సత్యమే శివం’ అనే సినిమాలో అంటే, కమ్యూనిస్టు పాత్ర వేసిన కమల్‌హాసన్‌ అంటాడు: ‘ఒక వేళ తాజ్‌మహల్‌ కూలిపోతే, ప్రేమించుకోవటం మానేస్తామా?’ అని.

ప్రభుత్వాలు కూలినంత సులభంగా సిధ్ధాంతాలు కూలవు. ఎందుకంటే,, ఆచరణల సమాహారమే సిధ్ధాంతం.

పశ్చిమ బెంగాల్‌నే చూడండి. ముప్ఫయి నాలుగేళ్ళ కమ్యూనిస్టు పాలనకు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినాయకురాలు మమత బెనర్జీ చరమగీతం పాడారు. గెలిచి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారన్న మాటే కానీ, ఆమెకు కంటి మీద కునుకు లేదు. మనశ్శాంతి లేదు. కమ్యూనిస్టులను పూర్తిగా ఓడించానన్న తృప్తి ఆమెలో కలగ లేదు. అందుకే ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఇంకా ఎన్నికల ప్రచారంలో కమ్యూనిస్టులను ధ్శజమెత్తినట్టే, ఇప్పటికీ విరుచుకు పడుతున్నారు. ఇది చూసేవాళ్ళకు విడ్డూరంగ వుండొచ్చు. కానీ ఆమె అభద్రతా భావాన్ని అర్థం చేసుకున్న వారికి ఏమాత్రం ఆశ్చర్యంగా వుండదు.

తృణమూల్‌ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని మాత్రమే కూల్చారు. కానీ కమ్యూనిస్టు సిధ్ధాంతాన్ని కూల్చలేదు. అది అక్కడ ప్రజల నరనరాల్లోకి మూడు తరాలుగా ఎక్కేసిందన్నది ఆమె నమ్మకం.

అందుకే ఆమె-

పాఠ్యపుస్తకాలనుంచి సోవియెట్‌ విప్లవ విశేషాలను తొలగింప చేశారు.

‘కమ్యూనిస్టు’ ముద్ర వున్న కార్టూనిస్టు పీక మీద కత్తి పెట్టారు.

ఆమెను విమర్శించిన ప్రొఫెసర్‌ భరతం పట్టారు.

అక్కడతో ఆగినా బాగుండేది.

బెంగాలీలు చేసుకున్న పెళ్ళిళ్ళ మీద ఆంక్షలు పెట్టారు. ఎలాంటి పెళ్ళిళ్ళయినా చేసుకోవచ్చు. ప్రేమ పెళ్ళిళ్ళు, స్వగోత్రీకుల మధ్య పెళ్ళిళ్ళూ, కులాంతర, మతాంతర, ఖండాంతర వివాహాలు చేసుకోవచ్చు. కానీ ఒక తృణమూల్‌ కాంగ్రస్‌ కు చెందిన వారు, అక్కడ కమ్యూనిస్టులతో వియ్యమంద రాదు. ఇదీ మమత తన కేబినెట్‌లోని ఒక మంత్రి వర్యులతో ప్రకటింప చేశారు. అలా చేసుకుంటే పుట్టిన పిల్లలు ‘ఎర్ర’ తెగులుతో పుడతారని ఆమె అనుమానం కాబోలు.

ఇంకా ఇలాంటి స్కీములు ఆమె మనసులో ఏమున్నాయో!

రేపు ఒక వేళ పుట్టిన ఏ బెంగాలీ బిడ్డకూ ‘బసు’ అని పేరు పెట్టకుండా శాసనం కూడా చేస్తారు. (ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసిన బెంగాల్‌ నేత జ్యోతి బసు కదా!)

సిధ్ధాంత రాజకీయాలకు ఆ శక్తి వుంటుంది. అది ‘కుడా’, ‘ఎడమా’ అన్నది తర్వాత విషయం.

కానీ దేశంలో ఎక్కడి కమ్యూనిస్టులయినా తమ శక్తి తాము తెలుసుకుంటారేమో కానీ, మన రాష్ట్రంలో కమ్యూనిస్టులు మాత్రం ఎప్పటికీ తెలుసుకోక పోవచ్చు.

-సతీష్‌ చందర్‌
(ఆంధ్రభూమి దినపత్రికలో 22ఏప్రిల్2012 తేదీ సంచికలో ప్రచురితం)

3 comments for “‘ఎడమ’, ‘ఎడమ’గా…!

  1. 
కమ్యూనిస్టులకు అందుకే తోక పార్టీలని పేరు. వారు ఒకరికి తోక కావలసిందే తప్ప వారికి తోకగా ఎవరూ ఉండరు. కమ్యూనిజం ఉందికాని కమ్యూనిస్టులు లేరు. అందరూ కమ్యూనలిస్టులే కాని వారి కమ్యూనిటీ మాత్రం వేరు. చారిత్రాత్మక తప్పిదాలు వారి జన్మ హక్కు. స్థలాల్లో, పొలాల్లో జెండాలు పాతించడం తప్ప వారికి అజెండా లేదు. కుడి ఎడమలు ఎప్పుడూ కలవవు రైలు పట్టాల్లా.. లీడర్ల అవసరం కోసం ఎవరితోనైనా కలుస్తారు, కేడర్ మాత్రం కొట్టుకుంటారు. రాష్ట్రంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్, టి డి పి, టి ఆర్ ఎస్, లొక్ సత్త, వై ఎస్ ఆర్ సి పి.. ఒకళ్ళంటూ కాదు.. రెండు సీట్లకోసం సుత్తులతో కొట్టుకుంటారు, కొడవళ్ళతొ నరుక్కుంటారు. పార్టీని ఎంతటి పతన దిశలోకి తీసుకు వెళతారు. అందుకే మూడేళ్ళ కిందటనే వాళ్ళను నేను “కన్ఫ్యూజనిస్టులు” అని అన్నాను.

Leave a Reply