ఏడ్చినట్టుంది రాజకీయం!

naidu protestసినిమాలే కాదు, రాజకీయాలు కూడా సెంటిమెంటు మీద ఆడేస్తాయి. తెలుగుప్రేక్షకుడి దృష్టిలో సెంటిమెంటు అంటే మరేమీ కాదు, ఏడుపు. అవును ఉత్త ఏడుపే.

ఎంత చెట్టుకు అంత గాలి లాగా, ఎంత డబ్బుకు అంత ఏడుపు. అదే హైదరాబాద్‌. ముఫ్పయి రూపాయిల పెట్టి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ లో వున్న సినిమాలోనూ ఏడ్వవచ్చు. నూటయాభయి రూపాయిలు పెట్టి మల్లీప్లెక్స్‌ థియేటర్‌లోనూ ఏడ్వవచ్చు. కాళ్ళు ముడుచుకుని. ముందుకుర్చీల్లో కూర్చున్న తలల మధ్యనుంచి చూస్తూ ఏడ్వవచ్చు. వెల్లికిలా చేరపడి, కాళ్ళుతన్ని పెట్టి ‘రిక్లయినర్‌’ ఏడ్పూ ఏడ్వవచ్చు.

సినిమాలో సెంటిమెంటు పండాలే కానీ, బకెట్ల కొద్దీ ఏడ్వ వచ్చు. రాష్ట్రమంతటా ‘జల’ యజ్ఞం చేయవచ్చు. కానీ చూసే సినిమాలో సెంటిమెంటు అంటూ ఒకటి ఏడ్వాలి.

తల్లి సెంటిమెంటా? చెల్లి సెంటిమెంటా? భార్య సెంటిమెంటా?

ఇలా సినిమావాళ్ళు ప్రేక్షకుడి చేత ఏడ్పించటానికి నానా ఏడ్పులూ ఏడుస్తారు.

పాలిటిష్యన్లూ అంతే.

అయిదేళ్ళు పదవితో ఊరేగాల్సిన ఎమ్మెల్యే, ఆర్నెల్ల ముందే పుటుక్కుమంటాడు.

ఇక ఎమ్మెల్యే భార్య (వితంతువు అనాలేమో కదా!) బాధ వర్ణనాతీతం. దగ్గరగా భర్తశవం. దూరంగా పార్టీ టికెట్టు. ఏడ్వాలా? నవ్వాలా? నవ్వేడ్వాలి.

‘అదే ముఖం. అదే ఏడుపు గొట్టు ముఖం. చాలు తల్లీ. చాలు. మనం గెలిచేస్తాం.’ అంటాడు ముఖ్య అనుచరుడు

‘నా ముఖం చూసి వోట్లేస్తారా? నేనెప్పుడూ గడపదాటి ఎరుగనే! నా ముఖం ఎవరు గుర్తు పడతారు?’ అని పొంగుకొస్తున్న ఆనందాన్ని అణచేసుకుని, దు:ఖాన్ని నటిస్తుంది.

చప్పట్లు కొట్టేస్తాడు ముఖ్య అనుచరుడు.

‘హౌస్‌’ దాటి ఎరుగని ఇల్లాలు, అతి పెద్ద ‘హౌస్‌'(అసెంబ్లీ)లోకి ప్రవేశిస్తోంది. చూశారా? ఇదే సెంటిమెంటు.

ప్రచారంలో వేదికెక్కి ఆమె ఉపన్యాసాలు దంచనవసరం లేదు. బలవంతగా కన్నీళ్ళు కూడా కార్చనవసరం లేదు. దండం పెట్టి, కొంగు నోటికి అడ్డుగా పెట్టుకుంటే చాలు. ఎఫెక్టు వచ్చేస్తుంది. సెంటిమెంటు పండిపోతుంది. జనం లారీలెక్కి, మేడలెక్కి, మిద్దె లెక్కి ఆమె రోడ్‌షోను చూసి ఏడ్చేస్తారు. జనం ఏడ్చారంటే చాలు, గెలిచేసినట్లే.

అందుకే, నేతలు పదవిలో వున్న అయిదేళ్ళూ ఒక లాగా ఏడిపిస్తే, ఐదేళ్ళకోసారి ఎన్నికలప్పుడు మరోలా ఏడిపిస్తారు.

ఒక్క అభ్యర్థి గెలుపునకే ‘ఏడుపు’ ఇంత ముఖ్యమయి పోతే, ఏకంగా ఒక పార్టీ గెలుపు ఎంత ఏడుపు అవసరమవుతుంది?

ఎవరో ఒక పెద్ద నేత చనిపోతేనే ఏడుపు రాదు. జనానికున్న వెయ్యినొక్క కష్టాల్లో, ఒక్క తీవ్రాతి తీవ్ర కష్టాన్ని వెలుపలికి తీయాలి. దానిని పార్టీ నేత తన సొంత కష్టంగా చేసుకోవాలి. అప్పుడు సెంటిమెంటు ఎలా పండాలో, అలా పండుతుంది.

ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చాక మధ్యలో ఒక సారి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఎవరు ఏ సీట్లో కూర్చున్నా, పేదవాడికి మిగిలేది అదే గుడిసె కదా! అయినా సరే, సెంటిమెంటుకు ఏది పనికొస్తుందా- అని ఆయన ( లేక ఆయన తరపున వ్యూహకర్తలు) వెతికారు. పేదావాడి ఏడుపు కన్నా, పేదరాలి ఏడుపును తీసుకుంటే బాగుంటుంది- అనుకున్నారు. ‘తెచ్చినా సంపాదనంతా తాగుడికి తగలేసి మగడు వుంటే ఎంత? పోతే ఎంత?’ అన్నారు కొందరు కూలి తల్లులు. ఎన్టీఆర్‌కు ఇది ‘పంచ్‌ డైలాగ్‌’లాగా అనిపించి, పంచెం బిగకట్టాడు. ‘కూలి తల్లుల కళ్ళనీళ్ళును నేను తుడుస్తాను. నేను ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకం మద్య నిషేధం మీదే చేస్తాను.’ అన్నాడు. ‘అన్న’మాటలు జనం గుండెల్ని తాకాయి. చూశారా అప్పటికది సెంటిమెంటు.

మళ్ళీ తర్వాత, పదేళ్ళకు- మళ్ళీ జనానికి వున్న అతిముఖ్యకష్టం ఏమిటన్నది, తొమ్మిదిన్నరేళ్ళు ప్రతిపక్షంలో వుండిపోయిన కాంగ్రెస్‌ ఆరా తీసింది.

రైతు ఏడిస్తే, రాష్ట్రం ఏడుస్తుంది. కానీ రైతు ఏడ్వటం మామూలే. అలాగే రైతు చావటమూ మామూలే. కానీ ఏకంగా తూటాలకు ఎదురు వెళ్ళి చావటం మామూలు కాదు. ఎందుకంత తెగింపు? విద్యుత్‌ చార్జీలు కట్టలేక. ‘ఆ ఒక్కటీ ఫ్రీ గా ఇచ్చేస్తాను’ అని వై యస్సార్‌ రాష్ట్రం అంతటా నడిచేశారు.

ఆయన్ని చూసి జనం వెక్కి వెక్కి ఏడ్చేసారు. అంతే సెంటిమెంటు పనిచేసింది గెలిచేశారు.

ఇప్పుడు మళ్ళీ దశాబ్దం గడుస్తోంది. ఈ సారి ప్రతిపక్షం బహువచనం అయిపోయింది. మూడు ముఖాలు వచ్చేశాయి. మూడు ముఖాలకు ఒకే ‘దు:ఖం’ నప్పదు. రెండు ముఖాలకు రెండు సెంటిమెంట్లు దొరికేశాయి. టీఆర్‌ఎస్‌కు ‘ప్రత్యేక రాష్ట్రం రాలేదన్న’ దు:ఖం. వైయస్సార్‌ కాంగ్రెస్‌ కు ‘వైయస్సార్‌ లేరన్న దు:ఖం’. ఎటొచ్చీ ఎడతెగని ‘దు:ఖాన్వేషణ’ లో వున్నది తెలుగుదేశమే.

రెండువేల కిలోమీటర్లు నడిచారు. అన్నీ దు:ఖాలే..! ఏ దు:ఖం తీవ్రమయినది? ఇంకా తేల లేదు. అందాకా పాత దు:ఖాన్నే వెలుపలికి తీశారు. అసెంబ్లీని ముట్టడించారు. చూశారా? ‘ఏడుపు’ ఎంత ఖరీదయినదో..!!

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 24-3-13 వ తేదీ సంచికలో ప్రచురితం)

1 comment for “ఏడ్చినట్టుంది రాజకీయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *