ముద్దు పేర్లు : చేవెళ్ళ చెల్లెమ్మ, ‘ఏఫోర్’ సబితమ్మ.
విద్యార్హతలు : ఒకప్పడు మంత్రి భార్యను. తర్వాత ఏకంగా ‘రాజు’కు చెల్లెల్నయ్యాను. రెంటికీ పెద్ద అర్హతలు అవసరం లేదు. చదివింది సైన్సయినా సెంటిమెంటు కు ఎక్కువగా ప్రాధాన్యమిస్తాను.’రాజన్న’ ఏ పని తలపెట్టినా నన్నే ఎదురు రమ్మనే వాడు.(చేవెళ్ళ చెల్లెమ్మ ఎదురూ రావమ్మా- అని). అలాగని ఆయన చెప్పిన ఏపనికీ ఎదురు చెప్పలేదని కాదు.
హోదాలు : ఇంద్రారెడ్డి గారున్నప్పుడు గృహిణి హోదా. ఎప్పుడో కానీ, హోం దాటి ఎరుగను. అందుకే కాంగ్రెస్ అధిష్ఠానం నాకు ‘హోమ్’ ఇచ్చారు(ఇచ్చింది ఎవరయినా అధిష్ఠానం పేరే చెప్పాలి కదా!). రాష్ట్రంలోనే ‘హోం’ను అలంకరించిన తొలి మహిళను. నా మీద కేసు పెట్టటం, సిబిఐ చార్జ్ షీట్‌లో నాలుగో ముద్దాయిగా నే పేరు చేర్చటం అన్యాయం కాదూ..?
గుర్తింపు చిహ్నాలు : ఒకటి: పేరుకు హోం మినిస్టర్‌నే కానీ, నిర్ణయాలు ముఖ్యమంత్రి చేస్తారు, వాటిని డిజిపి అమలు చేస్తారు. నేను చూస్తుంటాను.
రెండు: అప్పుడప్పుడూ నా గుర్తింపు నాకు ఇస్తుంటారు. పోలీ అమర వీరుల దినోత్సవం రోజున వారి స్తూపం దగ్గర పుష్ప గుఛ్చం వుంచే గౌరవం నాకు దక్కుతుంటుంది.
అనుభవం : ఇంద్రారెడ్డి గారు జీవించి వుంటే, తెలంగాణ ఉద్యమానికి మా హోమే కేంద్రంగా ఉండేది. కానీ అదే తెలంగాణ ఆందోళన కారులను అదుపు చేయటానికి నేను నిర్వహిస్తున్న ‘హోం’ అప్పుడప్పుడూ కేంద్రంగా వుంటుంది. అయినా ప్రత్యేక తెలంగాణ పట్ల నాకున్న అంకిత భావాన్ని ఎవరూ శంకించ లేరు.
వేదాంతం : అందరి చార్జిషీట్లూ నా సిబ్బంది రాస్తుంటారు. కానీ మీద పెట్టిన చార్జ్ షీట్ సిబిఐ రచించింది. ఇప్పుడు చెప్పండి- ‘సిబిఐ’ ను ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అని ప్రతిపక్షాలు అరోపించటం నిజమా? అలా అయితే కాంగ్రెస్ మంత్రులమయిన ధర్మాన మీదా, నా మీదా ఎందుకు కేసులు పెడతారు?
వృత్తి : మంత్రి పదవే. కానీ ఎప్పుడు చెయ్యనిచ్చారు కనుక. గనుల మంత్రిగా వున్నా, హోం మంత్రి గా వున్నా, ఎవరో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయటమే కదా!
హాబీలు :1. బాధితుల్ని పరామర్శించటం.
2.వినతి పత్రాలు స్వీకరించటం
నచ్చని విషయం : కాంగ్రెస్ పార్టీలో మంత్రి మండలిలోవున్న వారినే బలిపెట్టేస్తుంటే, సాధారణ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ ఎలా రక్షించుకోగలుగుతుంది?
మిత్రులు : ఒక్క ముక్క చెప్పమంటారా? రాజకీయాల్లో వున్న మహిళలకు ఎవరూ మిత్రులు కారు.
శత్రువులు : ఇన్నాళ్ళూ ఓ పోలీసు మంత్రి గా సంఘవిద్రోహశక్తులనే శత్రువులనుకునే దాన్ని. కానీ అసలు శత్రవులు రాజకీయ విద్రోహ శక్తులే.
జపించే మంత్రం : ఒక్క ఐడియా కాదు, ఒక్క పదం జీవితాన్నే మార్చేస్తుంది: అదే ‘క్యాప్టివ్ మైనింగ్’. ఈ మాటే గనుల మంత్రిగా వుండగా కొంప ముంచింది.
విలాసం : అన్న ధర్మానకు వర్తించిన ధర్మమే నాకూ వర్తిస్తే విలాసం మారదు.
గురువు : పార్టీలు వేరయ్యాక గురువుని స్మరించటానికి వుండదు.
జీవిత ధ్యేయం : కథ సుఖాంతమయి ‘గో హోమ్’ అని అనిపించుకోవటమ
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక13-19 ఏప్రిల్ 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)