ఓవర్‌ టూ తెలంగాణ!

వేదికలు రెండు; ప్రదర్శనలు రెండు

కానీ దర్శకులూ మారరు. ప్రేక్షకులూ మారరు.

ఒక వేదిక సీమాంధ్ర; మరొకటి తెలంగాణ.

కొంత సేపు ఈ బొమ్మా, ఇంకొంత సేపు ఆ బొమ్మా…!!

ఈ మూడేళ్ళూ ఇదే వరస.

ఈ పూటకి సీమాంధ్ర బొమ్మే నడుస్తోంది. అక్కడ జరిగిన ఉప ఎన్నికలలో (రెండు అసెంబ్లీ స్థానాలు మినహా) వైయస్సార్‌ కాంగ్రెస్‌ విజయఢంకా మోగించింది. షర్మిలమ్మ పాదయాత్రకు జనం విరగబడి వస్తున్నారు. కాంగ్రెస్‌కు సీమాంధ్రలో ఎక్కడా జాగా దొరకటం లేదు. కాకుంటే మధ్యలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో జగన్మోహన రెడ్డి యుపీయే అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీకి వోటు చేయటం ఒక ఊరట. దానికి తోడు అక్కడి రెడ్డిసామాజిక వర్గం కాంగ్రెస్‌నుంచి, వైయస్సార్‌ కాంగ్రెస్‌కు వెళ్ళిపోతుందన్న బెంగ. కానీ చిరంజీవి కారణంగా కాపు సామాజిక వర్గం తిరిగి కాంగ్రెస్‌కు వస్తుందేమోనన్న చిగురుంత ఆశ. ఎంత గింజుకున్నా 2014 ఎన్నికల నాటికి, అధిక స్థానాలను గెలుచుకోలేమన్న నిరాశ. అదే సమయంలో ఎలాగయినా సీమాంధ్రలో గట్టి పోటీ ఇవ్వాలన్న సంకల్పం. వెరసి సీమాంధ్ర మీదనే కాంగ్రెస్‌ కన్ను వుండాలి.

కానీ హఠాత్తుగా తెలంగాణ బొమ్మ తెర మీదకొచ్చింది. ముఖ్యమంత్రిని మారిస్తే, తెలంగాణ నేతే ఆ పదవిని అలంకరిస్తారనీ, తెలంగాణ అభివృధ్ధి మండలి పేరు మీద తెలంగాణ కు పెద్ద యెత్తున నిధులు కేంద్రం మంజూరు చేస్తుందనీ వార్తల్లాంటి పుకార్లు; పుకార్లు లాంటి వార్తలు. వీటి నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు అంతకు ముందు ప్రచారంలో వున్న రెండు పుకార్లను వార్తలని అధికారికంగా ధృవీకరించారు. ఒకటి: తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయటం, రెండు: తెలంగాణ జాక్‌ నేత కోదండరామ్‌కీ తనకీ మధ్య విభేదాలున్నాయని ప్రకటించటం.( అయితే అవి స్వల్పమయినవే కానీ, మీడియాయే పెంచి పెద్ద చేసిందన్న వివరణ కూడా ఆ ప్రకటనలో వుంది.) కానీ తెలంగాణ పై కాంగ్రెస్‌ తాత్సారం చేస్తుంది కాబట్టి, కాంగ్రెస్‌తో ఇక మీదట ఎలాంటి పొత్తులూ వుండబోవని చెప్పేశారు. అంటే, కేసీఆర్‌తో ‘విలీనం’ హామీ తీసుకుని కూడా, కేసీఆర్‌ తో సంబంధంలేకుండా తెలంగాణ పై కాంగ్రెస్‌ నిర్ణయాలు తీసుకుంటోందని కేసీఆర్‌కు అర్థమయ్యింది. ఇలా చెయ్యటంలో కాంగ్రెస్‌ భరోసా యేమిటి? ప్రత్యేక తెలంగాణ వాదులు రెండుగా చీలిపోయి, రెండు మార్గాలు పట్టారు. ఒకరు: అధికార(పార్లమెంటరీ) రాజకీయాల ద్వారా పరిష్కరించుకోవాలనుకునే వారు. మరొకరు: ప్రజా ఉద్యమాల ద్వారా వత్తిడి తెచ్చి పరిష్కరించుకోవాలనుకునే వారు. మొదటి మార్గం పట్టిన వారికి గతంలో ఒక్కటే విలాసం. అది టీఆర్‌ఎస్‌. నేడు ఇతర చిరునామాలు వచ్చేశాయి. ఎందుకంటే తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలలో ఒక చోట బీజేపీ గెలిచింది. మరొక చోట స్వతంత్ర అభ్యర్థి( నాగం జనార్థన రెడ్డి) గెలిచారు. ఇంకొక చోట ఏకంగా సీమాంధ్రలో సీమ నేత నేతృత్వంలో పుట్టిన పార్టీ(వైయస్సార్‌ కాంగ్రెస్‌) టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ యిచ్చి ఊపిరాడకుండా చేసింది. చంద్రబాబు తో పాటు అన్ని పార్టీల నేతలూ తెలంగాణలో స్వేచ్ఛగా తిరుగుతూ తాముకూ తెలంగాణ సాధనకు కంకణబధ్ధులమయి వున్నామని ప్రకటించుకుంటున్నారు. ఇక రెండవ మార్గాన్ని అనుసరించిన తెలంగాణ వాదులకు పటిష్టమైన ఒకే ఒక్క విలాసం దొరికింది. అదే తెలంగాణ జాక్‌. కోదండరామ్‌ నేతృత్వంలో వున్న ఈ జాక్‌కిందకు పలు ప్రజాసంఘాలు వచ్చేశాయి. ‘సాగర హారం’ నిర్వహించినప్పుడే ఈ విషయం బోధపడింది. కేసీఆరే తెలంగాణ, తెలంగాణే కేసీఆర్‌- అన్న రోజులు పోయాయని కాంగ్రెస్‌ నమ్మి వుంటుంది. అదే సమయంలో తెలంగాణ సాధన పేరు మీద నడచిన రాజకీయాలలో కేసీఆర్‌ అంత ఎత్తు ఎదిగిన నేత కూడా లేడని కాంగ్రెస్‌కు తెలుసు. అందుచే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ను విలీనం చేయాలంటే, కేసీఆర్‌ తన శక్తుల్ని కొంతమేరకయినా కోల్పోయి రావాలని కాంగ్రెస్‌ చూసింది. ఆ కోరిక కొంత మేరకు ఫలించింది. అందులో భాగంగానే తెలంగాణకు నిధులిచ్చే వ్యూహాన్ని రచించుకున్నది. తెలంగాణకు ఎక్కువ నిధులు ఇస్తున్నారన్న వంకతో సీమాంధ్రలోనూ మళ్ళీ ‘సమైకాంధ్ర’ నినాదం ఊపందుకోవాలి. ఇప్పటికే నీలం తుపానుకు ఈ ప్రాంతం కుదేలయిపోయింది. అక్కడికి కూడా నిధుల అవసరం వుంటుంది. ఇటీవల జరిగింది జాతీయ విపత్తుగా గుర్తించాలన్న డిమాండ్‌ ఇప్పటికే వచ్చింది. అలా గుర్తించి కానీ, గుర్తించకుండా కానీ, సీమాంధ్రకు కూడా నిధులు ఇవ్వటానికి కేంద్రం సిధ్ధం కావచ్చు. ఈ నిధుల వ్యయంలో ఎలాగూ అధికారంలో వున్న పార్టీ నేతల, కార్యకర్తల హవా నడుస్తుంది. ఆ మేరకు కాంగ్రెస్‌ను సీమాంధ్రలోకూడా బలోపేతం చేసుకోవాలన్నది కాంగ్రెస్‌ తాజా వ్యూహం గా కనిపిస్తుంది. దానికి తోడు మళ్ళీ ఇక్కడ తెలంగాణ. అక్కడ సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటితే, గతంలో లాగా ‘ఓదార్పు’ యాత్రను తాత్కాలికంగా నిలువరించినట్లు, ఇప్పుడు కూడా షర్మిలకు వస్తున్న ఆదరణను అడ్డుకోవచ్చని కాంగ్రెస్‌ యోచిస్తున్నట్టున్నది.

కానీ ప్రతీ సారీ ఒక పాచిక చెల్లదని వారు గ్రహిస్తున్నట్లు లేరు.

-సతీష్ చందర్

8 నవంబరు 2012

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *