లోన్ స్టార్ తో సినిమా తీయాలనుకున్నాడు దర్శకుడు సిహెచ్.పాఠి. ఇలా చెబితే, లోన్ స్టార్ అభిమానులకు కోపం వస్తుందని, ‘నేను లోన్ స్టార్ తో సినిమా తీయాలని పదేళ్ళనుంచి తపస్సు చేస్తుంటే, ఇప్పటికి డేట్స్ ఇచ్చారు’ అని వేరే ఏదో సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో అభిమానుల ‘ఈలల’ మధ్య (వాళ్ళు చప్పట్లు కొట్టరు.) ప్రకటించారు.
‘తీస్తా.. తీస్తా.. అని చపాఠి గోల పెడుతుంటే, సరే తీస్కో చపాఠీ- అన్నాను. మా వాడు మీకందరికి ది గ్రేట్ సిహెచ్.పాఠి కావచ్చు. నాకు మాత్రం చపాఠీ యే.’ అన్నాడు లోన్ స్టార్. అభిమానులు జోకనుకున్నారో ఏమో- మళ్ళీ ‘ఈలే’శారు.
దర్శకుడి అసలు పేరు చక్కిలిగింతల త్రిపాఠి. ఇంగ్లీషులో కుదిస్తే సిహెచ్.పాఠి, తెలుగులో ఎత్తికుదేస్తే-చ.పాఠి. లోన్ స్టార్ ను కూడా తెలుగు చేయవచ్చు- ‘రుణ తార’ అని. కానీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు, ఎవరయిన బరి తెగించిన సమీక్షకుడు ‘దారుణ’తార-అని రాస్తాడోమనని ఇలాంటి అను ‘వధ’కు పాల్పడలేదు. అసలు లోన్ స్టార్’కి అభిమానులు ఆశిస్తున్న వేరే అర్థం వుంది: ఈ విశాల సినీ ఆకాశంలో కనిపించే ఏకైక తార- అని. ఎంత ‘ఏక’ తార అయినా, ఆ తారకో పేరుండాలి కదా! ఉంది. బ్రహ్మచారి. కానీ కట్ చేస్తే( సీన్‌ను కాదు, పేరుని) చారి అయ్యాడు.
చారి-చ.పాఠి ల కాంబినేషన్ లో చిత్రమంటే, ఇండ్రస్టీవాళ్ళ అంచనాలు ఎక్కడో వుంటాయి. ( మీకు తెలుసా? ఇండ్రస్టీలో ఎప్పుడోకానీ అంచనాలుండవు, ఉండేవన్నీ అత్యంచనాలే.)
ఇప్పుడు నిజంగా సీన్ కట్ చేస్తే…
చ.పాఠి కథ తో వచ్చాడు లోన్ స్టార్ చారి దగ్గరకి.
‘ఏం చ.పాఠీ, కొట్టుకొచ్చావా? పట్టుకొచ్చావా?’ అన్నాడు ఒక సోఫాలో కూర్చుని, ఎదురు సోఫాలో కాళ్లు పెట్టి.
‘వినిపిస్తాగా..?’ పక్కనున్న సోఫాను దగ్గరగా లాక్కొని.
‘అంత శ్రమెందుకు చ.పాఠీ? కొట్టుకొస్తే ..ఇంగ్లీషు కానీ, హిందీ కానీ.. చూపించెయ్. పట్టుకొస్తే..లైన్ చెప్పేయ్. అంతే కానీ అరుగంటల హరికథా కాలక్షేపం నా వల్ల కాదు.’ అన్నాడు లోన్ స్టార్.
‘అయితే కాస్కోండి..! పైలట్టే హీరో.. ఈ సమాజంలో వాడికేదీ నచ్చదు.’
‘పైనుంటాడు కదా. కిందేదీ కనపడి చావదులే.
‘ఓహ్! పంచ్… పంచే.. పడిపోయింది సార్!’
‘పడింది పంచా..? డైలాగా?’
‘అబ్బ! సూపరు.. కేక…!’ అని భజన మొదలు పెట్టాడు చ.పాఠి.
‘పైలట్ కళ్ళకి అన్నీ నలకలే. కాజలయినా నలకే. కోవై సరళయినా నలకే. ఎందుకు నచ్చుతారు చెప్పు? అసలు పైలట్‌కు ఏమేమి నచ్చవో నేను చెబుతాను. విను. సీన్లు రాసుకొచ్చేయ్.’
‘వదలండి సార్’
ఇప్పుడు కథ మొదలయింది.
‘ఫ్లయిట్ హైజాక్ సీనుతో మొదలవుద్ది. ఎయిర్ క్రాఫ్ట్‌లో కెప్టెన్ చారి వాయిస్ ‘బాడ్ మోర్నింగ్ టు యూ ఆల్. దిస్ ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ అండర్ మై కమాండ్. కానీ. నేను హైజాకర్ల కంట్రోలులో వున్నాను. వాళ్లు గుర్తు తెలియని ప్రదేశంలో వాడకంలో లేని రన్ వేలో నా చేత ఎయిర్ క్రాఫ్ట్‌ను లాండ్ చేయిస్తున్నారు.’- అంటాడు పైలట్. ప్రయాణీకుల హాహా కారాల మధ్య మిమానం అర్థాంతరంగా లాండ్ అవుతుంది. ముఖానికి మాస్క్ వేసుకుని హైజాకర్ ప్రయాణికుల దగ్గరకు వస్తాడు. చేతిలో తుపాకి.(ఎలా తెచ్చుకున్నాడూ.. అని అడక్కూడదు.) తేరి పార చూస్తాడు…’ అని మధ్యలో ఆపుతాడు చారి.
‘పైలట్‌గా మీరు వేస్తున్నప్పుడు హైజాకర్‌గా దీటయిన విలన్ని పెట్టాలి కదా.. ఎవర్ని పెడదాం? సోనూ సూద్..?’
అనడగుతాడు డైరెక్టర్ చ.పాఠి
‘మరీ ఇంత ట్యూబ్ లైట్లా.. డైరెక్టర్లు? పైలటే హైజాకరయ్యా…!’
‘కేక.. సూపరు..! ఒపినింగ్ అదిరింది.’
‘పైలట్‌గాడికి ఎవ్వరూ నచ్చరన్నావు కదా..! ఆ నచ్చనోళ్ళే ఆ రోజు ఫ్లయిటెక్కుతారు. వాళ్ళతో ఆడుకుంటాడు చూడూ..మన హీరో.. అంటే మనమే లే..! రికార్డింగ్ డాన్స్ ఆడించేస్తాడనుకో.’ అన్నాడు చారి.
‘నాకు బొమ్మ కనపడతంది సార్!’ అంటూ తన సోఫాలోనుంచి కూలబడి కింద కూర్చున్నాడు.
‘నాకు ఆ హక్కులూ, ఈ హక్కులూ అంటూ రోడ్ల మీద కొచ్చే ఉద్యమ కారులంటే అసహ్యం. అలాంటి గెడ్డం పెంచుకున్న ఉద్యమకారుడుంటాడు. వాడి చేత ‘రింగా.. రింగా.. రింగా..రింగారే’ డాన్సుకు స్టెప్పులు వేయిస్తా.
‘మీకు మీడియా వాళ్ళన్నా పడదు కదా? వాళ్ళ చేత?’
‘వాళ్ళ మరణ వార్తల్ని వాళ్ళ చేతే చదివిస్తా.’
‘మహిళా సంఘాల నాయకులన్నా పడరు కదా?’
‘కదా..వాళ్ళ చేత సిగరెట్లు కాల్పిస్తా… మందు కొట్టిస్తా..!’
‘మరి సాటి మహిళా ప్రయాణికులకు కోపం రాదా?’
‘వస్తుంది. అదే ఇంటర్వెల్ ట్విస్ట్. ఎవరికో కాదు. ఒక హెయిర్ హోస్టెస్ వచ్చి, పైలట్‌ను కత్తితో కసక్కున పొడుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత తెలుస్తుంది. కసక్కున పొడిచింది మన కసక్కేనేని. అది ఉత్తుత్తి కసక్కని. మన డార్లింగని.హీరోకు దూరంగా వున్న వాళ్ళు నచ్చరంటే, దగ్గరగా వున్నవాళ్ళు నచ్చుతారనే కదా.అందుకే ఎయిర్ హొస్టెస్ నచ్చింది.’
‘మిగిలిన కథ?’
‘నువ్వు రాస్కో. సినిమా విడులయ్యాక కాంట్రోవర్సీ చూస్కో. సూపర్ హిట్ చేస్కో’
అలా కథలో హీరో కాళ్ళూ, వేళ్ళూ పెట్టేశాక.. సినిమా ఈ టైపులో హిట్ కాకుండా చస్తుందా?
-సతీష్ చందర్
(ఆంధ్రభూమి దినపత్రిక 21 అక్టోబరు2012 వ సంచికలో ప్రచురితం)
సూపర్ డూపర్ హిట్ ఐపోద్ది మరి..హిట్‌మాన్ కొడితే అంతేగా..బతక్క చస్తుందా!
పేలింది సారు.