కరుణ చరితే తమిళ భవిత !

కొందరికి జీవిత చరిత్ర అంటూ వేరే ఏదీ వుండదు. ఎందుకంటే వారికి జీవితమే చరిత్ర కాబట్టి.

కరుణానిధి ఆకోవలోకి వస్తారు. ఆధునిక తమిళనాడు చరిత్రకూ ఆయన జీవిత చరిత్రకూ తేడా ఏమీ లేదు. ఏడున్నరదశాబ్దాల తమిళుల చరిత్రను ఎలా తిప్పి, ఎలా రాసినా అది ఆయన చరిత్రే అవుతుంది. అవును తాను రాసిందే చరిత్ర, తాను నడిచిందే చరిత్ర. ఎం.జీ.ఆర్‌ గొప్ప నేతే. కానీ కరుణ లేకుంటే లేడు. మరి జయలలిత? ఎంజీఆర్‌ తర్వాతే జానకీ రామచంద్రన్‌ అయినా, జయలలిత అయినా. కరుణకు ముందు పరచుకున్నది ఆయన మార్గదర్శి అన్నా దొరై; అంతకు ముందు గురువు పెరియార్‌ రామ స్వామి. ఇక కరుణా నిధికి చెందకుండా తమిళనాడు చరిత్ర ఎక్కడ వుంది?

ఎవరికి వారు తమ షరతుల మేరకు తాము జీవించటమే గొప్ప. అలాంటిది తన దారిలో తాను మాత్రమే కాకుండా తన జనాన్నీ. తన సమూహాన్నీ, తన ప్రాంతాన్నీ జీవింప చెయ్యటం చిన్న విషయం కాదు. బ్రాహ్మణవాదమన్నా, హిందీ వాడకమన్నా, ఉత్తరాది పెత్తనమన్నా, ఆర్య సంస్కృతి అన్నా కరుణానిధికి ఒళ్ళు మంట. ఇందుకు విరుగుడే ..,ఆత్మగౌరవమూ, తమిళ వాడకమూ, దక్షిణ భారతం ఉనికీ, ద్రావిడ సంస్కృతీనూ.

కరుణానిధి సినిమా రచయిత. 75 సినిమాలకు పైగా కథ,మాటలూ రాశారు. కలం పట్టిన తొలిరోజుల్లోనే తన భావజాలానికి భిన్నంగా ఒక్క సంభాషణా రాయలేదు. తిండిలేక పోయినా ఫర్వాలేదనుకున్నారు కానీ, నమ్మిన సిధ్ధాంతానికి భిన్నంగా వెళ్ళకూడదనుకున్నారు. ఆయన సంభాషణలకు థియేటర్లలో ఈలలు మోతెక్కిపోయేవంటారు. తనకు తొంభయ్యేళ్ళు నిండిన సందర్భంలో ఆయనే తన సినీ జీవితం గురించి రాసుకుంటూ ఈ విషయాలు చెప్పారు. భూస్వామిని ఎదురించే కూలీల నేత పాత్రలో ఎంజీఆర్‌ నటిస్తున్నారు. ఆయనకూ భూస్వామికీ మధ్యన జరిగిన సంభాషణను కరుణానిధే గుర్తుతెచ్చుకున్నారు.

‘ఏం? ప్రతీదానికి నీ ముఖంలో ఆశ్చర్యార్థకం (!) కనిపిస్తోంది?’ అంటాడు భూస్వామి.

‘ఈ ఆశ్చర్యార్థకమే(!)కాస్త వంగిందనుకో ప్రశ్నార్థకం(?) అవుతుంది. దానికీ ‘కొడవలి’కీ పెద్ద తేడా వుండదు.గుర్తుపెట్టుకో.’

ఈ సంభాషణ చాలు, ఆయనకు కార్మిక పక్షమన్నా, వామపక్ష భావజాలమన్నా ఎంత ఇష్టమో చెప్పటానికి . ఇప్పుడు ఆయనకు రాజకీయ వారసుడిగా ముందుకొచ్చిన ఆయన తనయుడు స్టాలిన్‌ పుట్టినపుడు, తన మార్గదర్శి ‘అన్నా దొరై’ పేరు స్ఫురణకు వచ్చే విధంగా, ‘అయ్యా దొరై’ ని పెడదామనుకున్నారట. కానీ ఈలోగా సోవియట్‌ యూనియన్‌ నేత జోసెఫ్‌ స్టాలిన్‌ చనిపోవటంతో, స్టాలిన్‌ అని పేరు పెట్టుకున్నారు.

ఇక ఆయన హేతువాద నిబధ్దత కూడా తెలిసిందే. ఆయన భగవంతుణ్ణి నమ్మడు. అది ఆయన మార్గదర్శి అన్నా దొరై నుంచే కాదు, అంతకుముందు ‘ఆత్మగౌరవ’ పోరాటాన్ని నినదించిన పెరియార్‌ రామస్వామి నుంచీ స్వీకరించిన హేతువాద వారసత్వం. అందుకనే ‘రామ సేతు’ మీద ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. సముద్రంలో కని పించే ఇసుక మేటను ‘రాముడి నిర్మించిన వారధి’ అని అంటున్నప్పుడు, ‘రాముణ్ణి వాల్మీకి సృష్టించిన ఒక పాత్రగానే స్వీకరిస్తాను’ అని అన్నారు. అంతే కాకుండా ‘నేను కూడా నా రచనల్లో చాలా పాత్రల్ని సృష్టించాను. వాటిని ఆరాధిస్తారా?’ అని కూడా ఎదురు ప్రశ్న వేశారు.

అలాగే సత్యసాయిబాబా తమిళనాడుకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు కు సంబంధించి నేరుగా కరుణానిధి ఇంటికే వెళ్ళిపోయారు. రాష్ట్రపతి పదవిలో వున్న వారు సైతం బాబా పాదాల చెంత కూర్చోవటానికి తహతహలాడిపోయిన ఉదంతాలు వున్నాయి. అప్పటికీ బాబా వీల్‌ చైర్‌లో మాత్రమే రాగలుగుతున్నారు. కానీ కరుణ నడవగలుగుతున్నారు. ఆయన్ని లోపలికి పిలిచాక సమస్థాయిలోనే కూర్చుని సంభాషించారు. (అయితే కరుణ సతీమణి మాత్రం బాబాకు సాష్టాంగపడ్డారు. కరుణ ఎవరినయినా ప్రభావితం చేస్తారే తప్ప, తన భావజాలాన్ని ఎవరి మీదా రుద్దరు.) అలా బాబాల్నే తన చుట్టూ తిప్పుకున్నారు కానీ, కరుణ ఎన్నడూ ఏ బాబా వైపూ చూడ లేదు.

తాను నమ్మిన ద్రావిడ సిధ్ధాంతంతోనే కడవరకూ కొనసాగారు. ద్రవిడ మున్నేట్ర కజగమ్‌ (డి.ఎం.కె) నుంచి వేరు పడి ఎంజీఆర్‌ పార్టీ పెట్టినా, డిఎంకె జెండాను ఎగుర వేస్తూనే వున్నారు. దాదాపు అరవైయేళ్ళ పాటు తమినాడు శాసన సభ(హౌస్‌)లో నిరంతరాయంగా సభ్యత్వాన్ని కొనసాగారు. అంటే ఆయనకి అదే ‘హౌస్‌’ అయి పోయంది. అయిదు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ఆర్థిక విధానాల్లో కార్మిక పక్షపాతం, సాంఘిక విధానాల్లో అణగారిన వర్గాల పట్ల ప్రేమ వుండేది. పార్టీ నిర్మాణంలో, క్రమ శిక్షణలో ఆయనకు ఆయనే సాటి. పొరపాటు చేశారంటే సొంత తనయుల్ని కూడా వదల్లేదు. ఆ విధంగానే తన తనయులు ముత్తు, అళగిరిల మీద వేటు వేశారు. స్టాలిన్‌ సామర్థ్యాన్నీ, క్రమశిక్షణకీ ముచ్చటపడి, ఆయనకే వారసత్వాన్ని కట్ట బెట్టారు. స్టాలిన్‌కే ఇప్పుడు 65 యేళ్ళు. కరుణానిధి తుది శ్వాస విడిచిన తర్వాత, స్టాలిన్‌ కవిత రాశాడు. అది అందరినీ కంట తడి పెట్టించింది: ‘ఇన్నాళ్లూ మీలో నా నాయకుడిగానే చూశాను. ఇప్పుడు మిమ్మల్ని ‘నాన్నా’ అని పిలవ వచ్చా!’

కరుణకు జీవతమంతా యుధ్ధం. చిత్రమేమిటే మరణించి కూడా యుద్ధం చేశాడు. అన్నాదొరై, ఎంజీఆర్‌ల సమాధి వున్న మెరినా బీచ్‌లోనే, కరుణ భౌతిక కాయానికి అంత్య క్రియలు చేయాలనుకుంటే, ఇప్పటి ఎఐడిఎంకె ప్రభుత్వం ‘నో’ అన్నది. వెంటనే కోర్టుకు వెళ్ళితే, అర్థరాత్రి కోర్టులో వాదనలు తర్వాత, ‘మెరినా బీచ్‌’లోనే చెయ్యవచ్చని కరుణకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కాబట్టి కరుణ చివరి అధ్యాయం మృత్యువు కాదు…గెలుపు.

-సతీష్ చందర్

10-8-18

(గ్రేట్ ఆంధ్రలో ప్రచురితం)

5 comments for “కరుణ చరితే తమిళ భవిత !

  1. అసమాన మూలాల సంఘముండేదాక
    రాజు కింకరుడగును కింకరుడు రాజగును
    రాజు..పేదలు లేని రాజ్యాన్ని కోరేటి
    సత్యమెరగరండి శ్రమజీవులార!
    …..దివికుమార్‌

  2. కరుణానిధి రచనల్లో భాగంగా మాటలు(సంభాషణలు),కవతల,కథలు ఏవైనా సరే
    తెలుగులో పంపగలరు

  3. కరుణకు జీవతమంతా యుధ్ధం. చిత్రమేమిటే మరణించి కూడా యుద్ధం చేశాడు. అన్నాదొరై, ఎంజీఆర్‌ల సమాధి వున్న మెరినా బీచ్‌లోనే, కరుణ భౌతిక కాయానికి అంత్య క్రియలు చేయాలనుకుంటే, ఇప్పటి ఎఐడిఎంకె ప్రభుత్వం ‘నో’ అన్నది. వెంటనే కోర్టుకు వెళ్ళితే, అర్థరాత్రి కోర్టులో వాదనలు తర్వాత, ‘మెరినా బీచ్‌’లోనే చెయ్యవచ్చని కరుణకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కాబట్టి కరుణ చివరి అధ్యాయం మృత్యువు కాదు…గెలుపు.

  4. కరుణ భావ జాలాన్ని ఆంధ్రులు స్వీకరించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *