కిరణ్ ను గిల్లితే, బాబు గొల్లుమన్నారు

kiran1పెళ్ళీ, ప్రజాస్వామ్యమూ రెండూ ఒక్కటే. రెండూ రెండు తంతులు. తంతులో తంతులాగా, పెళ్ళితంతులో కాశీ తంతు ఒకటి వుంటుంది. శుభమా- అని పెళ్ళి జరుగుతుంటే, పెళ్ళి కొడుకు తాటాకు గొడుగు ఒకటి పట్టుకుని , చెక్క చెప్పులు వేసుకుని కాశీకి పోతానంటాడు. అప్పుడు అతని బావమరది (అనగా పెళ్ళికూతురు తమ్ముడు) వచ్చి పెళ్ళికొడుకు గెడ్డం కింద బెల్లం ముక్క పెట్టి, ‘బావగారూ, కాశీకి వెళ్ళకండి, మా అక్కను ఏలుకోండి. ప్లీజ్‌’ అంటాడు. అప్పుడు ఆ పెళ్ళికొడుకు కాస్త బెట్టు చేసి, వెనక్కి వచ్చేసి, పెళ్ళికూతురు చెయ్యి పట్టేసుకుంటాడు. ఈ తంతు అందరికీ ఆనందాన్నిస్తుంది. కొత్త మగడు వెళ్ళి పోతున్నాడే- అన్న చింత కొంచెం కూడా పెళ్ళికూతురుకి వుండదు.పై పెచ్చు కిసుక్కుమని నవ్వుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో కూడా ఈ తంతు అందరికీ అలవాటయిపోయింది. ‘సర్కారుని దించేస్తానూ’ అని అలిగి అవిశ్వాసం ప్రకటించిన వైరి పక్షం నేతను చూసి, అందరూ నవ్వుతారు. పెళ్ళికొడుకు కాశీ వెళ్ళడన్న భరోసా ముందే ఎలా లుగుతుందో, సర్కారు కూలదన్న ధీమా ముందే అందరికీ ఏర్పడి పోతుంది. ఇప్పుడున్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి సర్కారు మీద అవిశ్వాసం పెట్టటం ఇది రెండవ సారి. మొదటి సారి(2011లో) తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పెట్టారు. కూడికలూ, తీసివేతలూ బాగా వేసుకుని, ఎట్టి పరిస్థితుల్లో సర్కారు కూలదని తాను నిర్థారించుకుని, అన్ని పక్షాలకూ అదే భరోసా ఏర్పడేంత వరకూ ఎదురు చూసి, అప్పుడు ‘అవిశ్వాసం’ తంతు నడిపారు. అయితే ఇప్పుడు (మార్చి 2013) చంద్రబాబు తలచుకుంటే నిజంగానే కూలి పోతుంది. అప్పట్లో లాగా ,ఇప్పుడు మజ్లిస్‌ మద్దతు కూడా లేదు. కానీ ఆయన ‘కాశీ వెళ్తానని’ (అవిశ్వాసం) పెడతానని పొరపాటున కూడా అనరు ఎందుకంటే మిగతా రెండు వైరి పక్షాలూ( వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి) అవిశ్వాసానికి సిధ్ధంగా వున్నాయి. మూడూ కలిస్తే, మూడు నిమిషాల్లో సర్కారును దించెయ్య వచ్చు. ఈరెండు వైరి పక్షాలూ,ఎవరికి వారు అవిశ్వాసం నోటీసులు ఇచ్చేశాయి. కానీ తెలుగుదేశం ఈ అవిశ్వాస తీర్మానానికి దూరంగా వుండాలని నిర్ణయించుకుంది. అందుకని సర్కారు కూలదని ‘అవిశ్వాస తీర్మానాని’కి ముందే తేలిపోయింది. ఎందుకంటే ప్రతిపక్షాల మధ్య ‘అనైక్యత’ అంత గొప్పగానూ, పటిష్టంగానూ వుంది.babu

అసెంబ్లీలో కానీ, పార్లమెంటులో కానీ ఈ అవిశ్వాస తీర్మానాన్ని సాధారణంగా మూడు సందర్భాలలో పెడతారు:

ఒకటి: పాలకపక్షం సంఖ్యాపరంగా బలహీనపడి కూలిపోయే అవకాశం వుండి, ఆ స్థానంలోకి ప్రతిపక్షం వెళ్ళి కూర్చునే అవకాశం వుంటే అవిశ్వాసం పెట్టవచ్చు.

రెండు: రాష్ట్రంలో/దేశంలో ప్రజాజీవనం అస్తవ్యస్తమయి పోయి, ప్రభుత్వానికి పాలించే హక్కులేదనీ, ప్రతిపక్షాలూ భావించినప్పుడు, ప్రభుత్వం (సంఖ్యాపరంగా) బలంగా వుందని తెలిసి కూడా అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెడతారు. ఈ సందర్భంగా ప్రజల అవసరాలు తీర్చలేని ప్రభుత్వాన్ని చర్చ రూపేణా కడిగి పారేసి, ప్రజల్లో ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత కలుగచేయాలన్నది వారి అంతర్యంగా వుంటుంది.

మూడు: ఏదో ఒక ఉద్వేగం కారణంగా ప్రతిపక్షంలో వున్న పార్టీకి ప్రజల్లో సానుభూతి విపరీతంగా వస్తుంది. అప్పడు మధ్మంతర ఎన్నికలు కనుక వస్తే, గెలిచే అవకాశం కూడా ఆ పార్టీకి వుంటుంది. అప్పుడు అధికార పక్షంలోవున్న సభ్యులను తమ పార్టీవైపు మళ్ళించుకుని అవిశ్వాసం తీర్మానం పెట్టి దించేయాలని ఆ పార్టీ చూస్తుంది కాబట్టి, అలాంటి అవకాశం ఎప్పుడు వచ్చినా ఆ పార్టీ వదలుకోదు.

అయితే చిత్రంగా ఇప్పుడు నాలుగో సందర్భం వచ్చిపడింది. పాలక పక్షాన్ని కాకుండా, ప్రధాన ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని ఇతర రెండు ప్రతిపక్షాలూ (వైసీపీ, టీఆర్‌ఎస్‌లు) అవిశ్వాసం తీర్మానానికి ముందుకొచ్చాయి. కేవలం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తూర్పార బెట్టటానికే రెండు వేల కిలోమీటర్లు కాలినడకన తిరిగానని చెప్పుకుంటున్న చంద్రబాబును ఇరకాటంలో పెట్టటానికే ఈ రెండు పార్టీలూ, ఎవరి వంతు కృషి అవిచేశాయి. అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వకుండానే ఈ విషయంలో అవి విజయవంతమయ్యాయి. ‘తోక పార్టీలు( ఆ రెండు పార్టీలను అలా పిలిచి తెలుగుదేశం పార్టీ నేతలు సంతృప్తి పడుతుంటారు) తీర్మానం పెడితే మేం మద్దతు ఇవ్వాలా?’ అని చంద్రబాబు ముందే తప్పుకున్నారు. కాబట్టి ఇప్పటి అవిశ్వాసాన్ని ‘ప్రధాన ప్రతిపక్షం మీద ఇతర ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాసం’ గా పరిగణించాల్సి వుంటుంది.

ఈ రెండు ప్రతిపక్షాలకూ మధ్యంతర ఎన్నికలు వస్తే సీట్లను అమాంతం పెంచుకోగలుగుతాయి. అందుకు ఇటు సీమాంధ్రలోనూ, అటు తెలంగాణ ప్రాంతంలోనూ వచ్చిన ఉప ఎన్నికలే సంకేతం. అయితే ఎలాగూ ఏడాదిలోగా గడువు పూర్తయి సహజంగానే ఎన్నికలు వస్తాయి కాబట్టి, ఇంతవరకూ తమ పట్ల వున్న సానుభూతిని ఆ రెండు పార్టీలు అప్పటి వరకూ కాపాడుకోవటానికి పెద్ద ఇబ్బంది పడక పోవచ్చు. అందుచేత ఇప్పటి అసమ్మతి తీర్మానం ప్రధానోద్దేశ్యం- ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టటమే. అలాగని ఈ రెండు పక్షాల మధ్య సయోధ్య వుందని కాదు. రెండు పార్టీల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అయినా తప్పదు. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఒకటి, రెండు స్థానాల్లో నిలిచాయి. కేవలం డబ్బుతోనే గెలిచాయన్నది వై.సి.పి, టీ.ఆర్‌.ఎస్‌ల అభియోగం. నిజంగా సొంత బలంతో గెలిచివుంటే, మధ్యంతరానికి రావచ్చు కదా- ఇటు కాంగ్రెస్‌నూ, అటు తెలుగుదేశాన్నీ కవ్వించటం కూడా ఈ అవిశ్వాస ప్రకటనల్లో భాగం కావచ్చు. ఏమయితేనేం? ఎక్కువ నగుబాటు తెలుగుదేశానికే మిగిలింది.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 15-22 మార్చి13 వ తేదీ సంచికలో ప్రచురితం)

2 comments for “కిరణ్ ను గిల్లితే, బాబు గొల్లుమన్నారు

  1. బాగుంది సర్. ఈ పెళ్ళికొడుక్కి సుబ్బరంగా కాశీకొక సెకండ్ క్లాసు రైలు టిక్కెట్టు కొని చేతిలో పెడితే సరి 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *