రాజకీయంగా దేశం ఎలా వుంది? ఏదో గాలివాన వచ్చి కొట్టేసినట్టుంది. మహా వృక్షాలు కూలిపోయాయి. చిన్న చిన్న మొక్కలు తలలెత్తి నిలుచున్నాయి. జాతీయ పక్షాలు జాలిగొలిపే పార్టీలుగా కూలబడిపోతుంటే, ప్రాంతీయ పక్షాలు పెత్తనం చేసే పార్టీలుగా స్థిరపడిపోతున్నాయి.
ఇదే పరిస్థితి కొనసాగితే, 2014లో పరిస్థితి ‘జంబలకిడి పంబ’ కాస్తా, ‘పంబలకిడి జంబ’ అయ్యే లా వుంది. (పురుషులపై స్త్రీలు ఆధిపత్యం చెలాయించటం ‘జంబలకిడి పంబ’ అయితే, పెద్దలపై పిల్లలు ఆధిపత్యం చేయటం ‘పంబలకిడి జంబ’ అని ఒక సినిమాలో సూత్రీకరిస్తారు.)
ఎలాగూ మళ్ళీ సంకీర్ణం తప్పదు. అది పెద్ద విశేషమేమీ కాదు. కాకుంటే, ఈ సంకీర్ణంలో ఎవరికి ఎవరు మద్దతు ఇస్తారన్నది ప్రశ్న. ఇంతవరకు ఒక జాతీయ పార్టీకి, పలు ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇవ్వటం మామూలే. ఇది మొన్నటి ఎన్డీయే కావచ్చు. లేక నేటి యూపీయే కావచ్చు. యూపీయే కయితే పురుషుల ఆధిపత్యానికి చెల్లుచీటీ ఇచ్చి స్త్రీయే (సోనియాయే) చైర్‌పర్సన్‌గా కూర్చున్నారు. అది ‘జంబలకిడి పంబే’.
కానీ ఈ సారి భిన్నంగా వుండేలా వుంది. ‘పంబలిడి జంబ’ అయ్యేలా వుంది. అంటే , పిల్లలే ఉపాధ్యాయులై కుర్చీల్లో కూర్చుంటే, వారి ముందు పెద్దలు విద్యార్థులా చేతులు కట్టుకుని నిలబడతారు. ప్రాంతీయ పార్టీల కూటమి సర్కారు ఏర్పాటు చేస్తే, జాతీయ పార్టీలు మద్దతు ఇచ్చే దిశగా రాజకీయాలు వెళ్ళి పోతున్నాయి.
ఇందుకు రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియనే తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలో తేల్చుకోలేదు. ఈ లోపుగా సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ అభ్యర్థి తప్పకుండా ‘రాజకీయ నేతే’ అయివుండాలి అన్నారు. అంటే, ఉభయ సభలూ కొలువు తీరిన పార్లమెంటు కంటే, కాన్వెంటు పిల్లలు కూర్చున్న క్లాస్ రూమ్ గొప్పది భావించే ‘అబ్దుల్ కలామ్’ లు మళ్ళీ వద్దని ఒక సందేశం. అయితే కాంగ్రెస్ ఎలాగూ కలామ్ వంక చూడదు. ఎందుకంటే ఆయన ఎన్డీయే హయాంలో ఎన్నికయిన రాష్ట్రపతి. మరెందుకు ఇలా అన్నారు?
ఒక దశలో మన్‌మోహన్ సింగ్ ను రాష్ట్రపతిని చేసి ప్రణబ్ ముఖర్జీని ప్రధానిగా చెయ్యాలనుకున్నట్లు వదంతులు వచ్చాయి. మన్‌మోహన్ సింగ్ రెండు దఫాలు ప్రధానిగా చేసినా, ఆయనను ‘రాజకీయ నాయకుడి’ గా దేశ ప్రజలు చూడరు. అందుకు రెండు కారణాలు. ఒకటి: ఆయన స్వతహాగా జనాన్ని సమ్మోహితుల్ని చేసి గద్దె నెక్కిన వాడు కాడు. రెండు: యూపీయే అధికారంలోకి వచ్చాక ప్రధాని కుర్చీ కన్నా , ఎత్తయిన కుర్చీని సృష్టించారు. అందులో యుపీయే చైర్‌పర్సన్ గా సోనియా కూర్చున్నారు. దాంతో ప్రధాని రాజకీయ బాధ్యతలన్నీ ఆమే నిర్వర్తించే వారు. అందుకే మన్‌మోహన్ దేశ రాజకీయాల్లో ‘రాజకీయేతరుడి’ గా మిగిలిపోయారు. అంతిమంగా రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీనే రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ ముందుకు పెట్టింది.
అవసరానికి మించి ఉత్సాహం చూపటం వల్ల, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ అభాసు పాలయ్యారు కానీ, లేకుంటే ఆమె, ములాయంతో కలిసి రాష్ట్రపతి ఎన్నికనే హైజాక్ చేద్దామనుకున్నారు.
అలాగే ములాయం, బీఎస్పీ అధినాయకురాలు మాయావతీ బద్ధ శత్రువులయనప్పటికీ ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వటంలో ఒక్కటయ్యారు.
ఇక ఎన్డీయే అభ్యర్థి విషయంలో అయితే, దానికి వెలుపల వున్న ప్రాంతీయ పార్టీలు బీజేపీకి ప్రతిపాదించే అవకాశమే ఇవ్వలేదు. తమంతట తామే అభ్యర్థిని ముందుకు తెచ్చేశారు. తనని తానే అభ్యర్థిగా ప్రకటించుకున్న సంగ్మాను తొలుత మద్దతు ఇచ్చి, ఆయనను ఎన్డీయే అభ్యర్థిగా మార్చేసిన వారు ప్రాంతీయ పార్టీ నేతలే.( ఎఐఎడిఎంకె అధినాయకురాలు జయలలిత, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్‌లే.) ఆ తర్వాత బీజేపీకి సంగ్మాను ఎన్డీయే అభ్యర్థిగా ప్రకటించటం తప్పలేదు.
అలాగని ఎన్డీయే లో కీలకంగా వున్న జనతా దళ్(యూ) నేత నితిష్ కుమార్, శివసేన అధినేత బాల్ థాకరే బీజేపీ అభ్యర్థి ఎవరని ఆరా తీయకుండా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు పలికేశారు.
పార్లమెంటు సభ్యులయినా, శాసన సభ్యులయినా వ్యక్తులుగా పార్టీలు ఫిరాయిస్తే ‘అనర్హత’ వేటు పడే అవకాశం వుంది కానీ పార్టీలకు పార్టీలే ‘కూటమిలను’ ఫిరాయిస్తే మాత్రం పూర్తి అర్హతే.
యూపీయేలో పెద్దన్న కాంగ్రెస్‌నూ, ఎన్డీయేలో పెద్ద దిక్కు బీజేపీనీ ఇలా చిన్న చిన్న పార్టీలు శాసించేశాయి. ఓడలూ బళ్లూ, బళ్ళు ఓడలూ అయిపోయాయి.
ఇంకా వైయస్సార్ కాంగ్రెస్ లాంటి కొత్తగా ఆవిర్భవించిన రాజకీయ పార్టీలు కూడా, ఈ విషయంలో తమ దగ్గరకి కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీలను రప్పించుకున్నాయి.
దానికి తోడు కాంగ్రెస్, బీజేపీలు అధికారంలో వున్న చోట, అనిశ్చితి, అభద్రతా చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణలకు ఎంతో దూరం వెళ్ళనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ వోటర్లు కరవయితే,, కర్ణాటకలోని బీజేపీకి సభ్యులు కరువయ్యే పరిస్థితి వచ్చింది.
అందుచేత 2014 తర్వాత నిజంగానే ‘పిల్ల’ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి ముందుకు వస్తే, చిన్నబోయిన పెద్ద పార్టీలు మద్దతు ఇవ్వటానికి సిధ్ధమవుతాయి.
ఇలా రాష్ట్రాలకు కీలకపాత్ర లభించే ఫెడరల్ ప్రజాస్వామ్యం చూడాలంటే, కేంద్రంలో ఇలాంటి ‘పంబలకిడి జంబ’ అనివార్యమవుతుంది.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర రాజకీయ వార పత్రిక 6-13 జులై 212 సంచికలో ప్రచురితం)