కొక్కొ ‘రోకో’ నారాయణ

కేరికేచర్: బలరాం

పేరు : నారాయణ

దరఖాస్తు చేయు ఉద్యోగం: ఉపగ్రహ ప్రతిపక్షనేత.( చంద్రుడే-అనగా చంద్రబాబే- విక్రయమయిన ‘భూమి’ చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తిరుగుతున్నారు. తిరిగి ఆ చంద్రుడు చుట్టూ తిరిగే ఉపగ్రహం నారాయణ)

ముద్దు పేర్లు : ‘కోడి’ నారాయణ. (ఇది నిజానికి నా ముద్దు పేరు కాదు, ‘ముద్ద’ పేరు. చికెన్‌ లేకుండా ముద్ద దిగదు. ఎవరూ కేలండర్‌ చూసుకుని భోజనం చెయ్యరు కదా! తినేశాక ఆ రోజు గాంధీ జయంతి అని తెలిస్తే నేను ఏం చేసేదీ? అక్కడికీ ప్రాయిశ్చిత్తంగా కొన్నాళ్ళు తినటం మానేశాను కూడా. కోడి నాకు ఉద్యమ స్పూర్తి కూడా. అందరూ రాస్తా రోకో లు చేస్తారు. నేను కొక్కొ ‘రోకో’ లు చేస్తాను.)

విద్యార్హతలు : మాస్టర్‌ ఆఫ్‌ యూనిటీ( వామ పక్షాల ఐక్యత విషయంలో మాస్టర్‌ చేశాను. కానీ కలయక నే సాధించ లేక పోయాను.)

హోదాలు : వంత పాడటం లో మొదటి స్థానం.( అర్థం కాలేదా? వెనకటికి బుర్రకథ అని ఒకటి వుండేది లెండి. దానికి ప్రధాన కథకుడితో పాటు. వంత పాడేందుకు ఇద్దరు వుండేవారు. మాకు ప్రధాన కథకుడు ఎప్పుడూ చంద్రబాబే. వంతల్లో ఒకరు రాజకీయం చెబితే, ఇంకొకరు హాస్యం చెబుతారు. హాస్యమే గొప్పది లెండి. అది నేను తీసుకుని రాజకీయం సిపిఎం రాఘవులికి వదిలేశాను.)

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: మాట్లాడి ఆలోచిస్తాను. ఆలోచించి మాట్లాడను.

రెండు: ఎరుపు ఎక్కడ వుంటే అక్కడ వుంటాను. (కోడి పుంజు జుట్టూ ఎర్రగానే వుంటుంది.)

సిధ్ధాంతం : శత్రు వైరుధ్ధ్యం కన్నా మిత్ర వైరుధ్ధ్యం ప్రమాద కరం. అందుకే సిపిఎం కు దూరంగా, మా దృష్టిలో బూర్జువా పార్టీ యైనా కానీ ‘తెలుగు దేశం’ పార్టీకి దగ్గరగా వుంటాను.

వృత్తి : పోరాటం. పోరాటం. పోరాటం.( ఫలితాలనూ, పరిష్కారాలనూ ఆశించం. ప్రతిసమస్యా పరిష్కారమయిపోతే, పోరాడటానికి తర్వాత సమస్యలే మిగలవు.)

హబీలు :1. ప్రతీ బహిరంగ సభలో ఎంత మంది వున్నారో చూసుకుంటాను. (శాసన సభలో కాదు. అందులో మా సంఖ్యను చూసుకుంటే దిగులుగా వుంటుంది.)

2. మిత్రులకు ప్రేమ లేఖలూ, బహిరంగ లేఖలూ రాసే అలవాటు రాఘవులకు వుంది కానీ నాకు లేదు. కానీ లేఖ అందుకుంటే మాత్రం సమాధానం ఇవ్వకుండా వుండలేం.

అనుభవం : మేమూ ‘ఎడమే'(లెఫ్టే), సీపీఎం ‘ఎడమే'(లెఫ్టే). అందుకే దగ్గర దగ్గర గా కాకుండా ‘ఎడమ ఎడమ’ గా వుంటాం.

మిత్రులు : కమ్యూనిస్టులంటేనే మిత్రులు. మిత్రపక్షాలు. (మాకు వర్గ శత్రువులుంటారు కానీ, వర్ణ శత్రువులుండరు.) కాబట్టి మేం పార్టీలకు అతీతంగా కలవగలం.

శత్రువులు :మీడియా వారే. మా కమ్యూనిస్టు పార్టీలను పనిగట్టుకుని కలపాలనుకుంటారు.

మిత్రశత్రువులు : నేనేదీ దాచను. ఇంకెవరూ. సిపిఎం వారే.

వేదాంతం : కోడి కూస్తేనే కానీ ‘అరుణోదయం’ కాదు.

జీవిత ధ్యేయం : మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చి, విశ్వసనీయమైన మిత్ర పక్షనేతగా చరిత్రలో మిగిలిపోవాలని.

-సతీష్ చందర్ 

(గేట్ ఆంధ్ర 6-13 జులై2012 సంచికలో ప్రచురితం)

 

 

 

 

2 comments for “కొక్కొ ‘రోకో’ నారాయణ

Leave a Reply