కోటికి ఒకడు.. కూటికి లక్షలు!

టాపు(లేని) స్టోరీ:

ఒక్కడు.. ఒకే ఒక్కడు.. నూటికొక్కడు.. కోటికొక్కడు.

సినిమాలకే కాదు, రాజకీయాలకు కూడా మంచి టైటిల్సే. అలాఅని పోరాడే భగత్‌సింగో, అల్లూరి సీతారామ రాజో కోటి మందిలో ఒక్కడు వుంటాడని కాదు. నడుస్తున్నవి పూర్తిగా ఉద్యమ రాజకీయాలయితే, అలా అనుకో వచ్చు. కానీ కాదు. ఇవి పచ్చి అధికార రాజకీయాలు. ఇక్కడ కోటికి ఒక్కడు అంటే, కోటిలో ఒక్కరికి పీట వేసి, కోటి మందినీ సుఖపెట్టిన కీర్తిని కొట్టెయ్యటం.

ఒక ముస్లిం(అబ్దుల్‌ కలాం)ను రాష్ట్రపతిగా చేసి, మొత్తం ముస్లింలకే మేలు చేసానన్న కీర్తిని బిజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కొట్టేసింది. కానీ ఆయన రాష్ట్రపతిగా వుండగానే, గుజరాత్‌లో ముస్లింలను ఊచకోత కోశారు.

అంతకు ముందు ఒక దళితుణ్ణి (కె.ఆర్‌.నారాయణ్‌ను) ను రాష్ట్రపతి చేసి దళితులు మొత్తానికి మేలు చేసానన్న కీర్తిని కాంగ్రెస్‌ ప్రభుత్వం కొట్టేసింది. దేశం నిండా దళితులపై దాడులు జరుగుతూనే వున్నాయి.

ఇప్పుడు పదవీ విరమణచేస్తున్న రాష్ట్రపతి(ప్రతిభా పాటిల్‌) ని మహిళలను గుర్తించే పేరు మీద చేశారు. కానీ ఈమె హయాంలోనే మహిళా బిల్లు ‘త్రిశంకు స్వర్గం’ లోకి వెళ్ళిపోయింది. ఇక మహిళల మీద అత్యాచారాలు ఎక్కడా ఆగలేదు. వరకట్న హత్యలకూ, యాసిడ్‌ దాడులకూ అంతే లేదు.

సామాజికంగా అణగారిన వారికి దేశంలో అత్యున్నత పదవిచ్చేసారే.. ఇంకేకావాలి? అనిపించాలన్నది వీరి ఉద్దేశ్యం. ఒకప్పుడు ఈ పదవికి ‘రబ్బరుస్టాంపు’ అని పేరుండేది. అంటే ప్రధాన మంత్రి ఈ స్టాంపును ఎక్కడ వేసుకోవాలంటే అక్కడ వేసుకోవచ్చు.

కానీ, సంకీర్ణ రాజకీయాలొచ్చాక, మద్దతులిచ్చే మిత్రులు మధ్యలో చెయ్యివ్వటం మొదలు పెట్టాక, ‘రబ్బరు స్టాంపు’లు కూడా స్వంతంగా ఎగరటం నేర్చుకున్నాయి. అదీకాక, ఇప్పుడు రాష్ట్రపతి పదవి కాకుండా, ప్రధాని పదవే ‘రబ్బరు స్టాంపు’ అయింది. ఎందుకంటే ప్రధాని అధికారాన్ని మింగే పాలక కూటమి అధ్యక్షపదవి( ఉదా: యు.పి.ఎ చైర్‌పర్సన్‌ ) పుట్టుకొచ్చింది. అందుచేత ఎప్పుడూ అధికారాలు లేకుండా పడివుండే ప్రధాని పదవి కన్నా, అప్పుడప్పుడూ అధికారం వెలగబెట్టే రాష్ట్రపతి పదవే మేలన్న నిర్ధారణకు రాజకీయ నాయకులు వచ్చేశారు. ఇందుకు ప్రణబ్‌ ముఖర్జీయే ఉదాహరణ. తనను ప్రధాని గా చేసే అవకాశం వుందన్నప్పటి కంటె, రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఎక్కువ ఆనంద పడ్డారు.

మారిన ఈ సమీకరణలు పట్టకుండా, ఇంకా ‘ఒకే ఒక్కడి’ ఫార్ములా నడుస్తుందన్న నమ్మకంతో రాష్ట్రపతి పదవి అభ్యర్థిత్వానికి కొందరు అమాయకులు వెంట బడుతున్నారు. పాపం ఆ కోవకు చెందిన వారే పి.ఎ.సంగ్మా. రాష్ట్రపదవిని అలంకరించిన వారిలో ఎస్సీలూ, ముస్లింలూ, మహిళలూ అయ్యాక, ‘గిరిజనులకు’ అవకాశం రాక పోతుందా? అని ఇప్పటి వరకూ ఎదురు చూశారు. కానీ ఆయన సొంత పార్టీ(ఎన్‌.సి.పి) వారే ఆయనను తప్పు పడుతున్నారు. నిజమే ఆయనకు మద్దతు ఇస్తే గిరిజనుల్లో ‘ఒకేఒక్కడి’ని ఎంపిక చేసినట్లుంటుంది. అయినా సంగ్మా పిచ్చి కానీ, తనకు తానుగా అంత స్వతంత్రంగా వ్యవహరించేవారిని ఎంచుకుంటారేమిటి? వాళ్ళ మాట వినేవాళ్ళనే వెతికి పడతారు.

న్యూస్‌ బ్రేకులు:

 ‘బూతో’పదేశం!

(సెక్స్‌ ర్యాకెట్‌కు సంబంధించి) నన్ను ఫోన్లలో బెదరించిన వారిలో, ఎంపీఅనుచరులే కాదు, ఎమ్మెల్యే కూడా వున్నారు

-తారాచౌదరి, సెక్స్‌ ర్యాకెట్లో నిందితురాలు.

ఇన్నాళ్ళూ మన రాజకీయ నాయకులకు పోలింగ్‌ బూతు రాజకీయాలే తెలుసని అనుకున్నాం. కాలింగ్‌ ‘బూతు’ రాజకీయాలు కూడా తెలుసన్నమాట.

నాడు వైయస్‌ రాజశేఖర రెడ్డి చేసిన తప్పులకు, నేడు కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

-వి.హనుమంతరావు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు

ఇంకా నయం. నేడు వైయస్సార్‌ కాంగ్రెస్‌ను ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ కు క్షమాపణ చెప్పాలని అన లేదు.

ట్విట్టోరియల్‌

అవినీతి లో నీతి

నైతిక బాధ్యత! ఇది ఎన్నికలయ్యాక మాత్రమే పుట్టుకొచ్చే కొత్త మాట. మరీ ముఖ్యంగా ఓటమికి ‘నువ్వే కారణం’ అని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునే తరుణంలో పుట్టుకొచ్చే మాట. ‘స్థానిక నేతలే ఈ వోటమికి నైతిక బాధ్యత వహించాల్సి వుంటుంది. ఎందుకంటే వోటుకు వెయ్యి చొప్పున ఇమ్మని డబ్బులు పంపిస్తే, రెండొందలే పంచేశారు. మిగిలింది మింగేశారు.’ అని పాపం వోడిన అభ్యర్థి భోరున విలపిస్తాడు. పాపం! అవినీతి లో కూడా నీతిని వెతికినప్పుడు ఆ మాత్రం దు:ఖం తన్నుకొస్తుంది మరి. నిజమే. ఏటా, కల్తీ పాలతో పోయే వాళ్ళ కన్నా, కల్తీ సారాతో చచ్చే వాళ్ళే ఎక్కువ. నీతి లో అవినీతి కలిస్తే జనం తట్టుకోగలరు. కానీ అవినీతిలో అవినీతి కలిస్తేనే.. వాళ్ళకి మండుద్ది.

‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

అబ్దుల్‌ ‘సలాం’

పలు ట్వీట్స్‌ : అబ్దుల్‌ కలాం రాష్ట్రపతి పదవి పోటీ నుంచి తప్పుకోవటం బాధాకరం

కౌంటర్‌ ట్వీట్‌: తప్పుకోకుండా పోటీ చేసి ఓడిపోతే, ఆయనకెంత బాధాకరం?

ఈ- తవిక

ఉప ఎన్నికల ఫలితాలు

ఏడ్వని వారికి

ఓదార్పు.

ఏడ్చిన వారికి

కర్చీఫు.

ఏడ్పించిన వారికి

నిట్టూర్పు.

బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘ఎవడ్రా నన్ను ఓడించింది?’

‘ఆవేశపడకు. నువ్వసలు పోటీలో లేవు.’

కొట్టేశాన్‌( కొటేషన్‌):

పట్టపగలు ఒంటరిగా వోటరు ‘తూల’ కుండా వోటువేసిన నాడే నా దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టు భావిస్తాను

-సతీష్  చందర్

(సూర్య దినపత్రికలో 20 జూన్ 2012 నాడు ప్రచురితం)

 

 

 

1 comment for “కోటికి ఒకడు.. కూటికి లక్షలు!

  1. Sir A great statement. very nice sir. పట్టపగలు ఒంటరిగా వోటరు ‘తూల’ కుండా వోటువేసిన నాడే నా దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టు భావిస్తాను. Sir I am posting again in good Politicians group.

Leave a Reply