‘క్వీని’యా!

soniaపేరు : సోనియా గాంధీ

ముద్దు పేర్లు : ‘సోనియ’ంత, ‘క్వీని’యా,

విద్యార్హతలు : ఇటలీలో చదివిందేమయినా, ఇండియాలోనే రాజనీతి చదివాను. ‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంలో పడితే చాలు, రాజనీతి దానంతటదే వస్తుంది. రాకపోయినా వచ్చిందని జనం అనుకుంటారు. అయితే నాతో పాటు మేనకా గాంధీ కూడా ఈ కుటుంబంలోనే పడ్డారు. కానీ ఆమెకు రాజనీతి తెలుసని జనం భావించలేదు. జనం మెచ్చే ముందు అత్తిల్లు మెచ్చాలి కదా! ఇందిరమ్మ నన్ను మెచ్చారు. వారసత్వం దానంతటదే వచ్చింది.

హోదాలు : బ్రిటన్‌ వెళ్ళి ఎలిజబెత్‌ హోదా ఏమిటని ఆమెను అడగగలరా? ఎంత ప్రజాస్వామ్యదేశమయినా ఒక రాజవంశముండాలి. (‘దేవుడంటూ ఒకడుండాలి. లేక పోతే వెంటనే సృష్టించాలి’ అన్నది సామెత). దేశానికి స్వరాజ్యమొచ్చాక రాచరికమంటూ ఒకటి లేకుండా పోయింది. దాంతో తొలి ప్రధాని నెహ్రూ కుటుంబాన్నే రాజకుటుంబంగా భావిస్తూవచ్చారు.

గుర్తింపు చిహ్నాలు : ఒకటి: ప్రపంచం తలకిందులయినా నేను పెదవి విప్పను. నేను కనుసైగ చేస్తే శాసనం.

రెండు: పుత్ర వాత్సల్యం. అందరి కొడుకుల్లాంటివాడు కాదు, నాకొడుకు. అందరి పిల్లలూ స్వీట్లడుగుతాడు. నా కొడుకు ‘సీట్ల’డగిగాడు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 30(పార్లమెంటు) సీట్లు రప్పిస్తానన్నాను. రాష్ట్రాన్ని రెండు చేస్తే తప్ప అన్ని తేలేం- అన్నారు. ‘సరే’నన్నాను.

అనుభవం : ఉద్యమం ఎలా వస్తుందో నాకు తెలుసు. చంటిపిల్లాడికి నోట్లో చాక్లెట్‌ పెట్టినట్టే పెట్టి వెనక్కి తీసుకుంటే వచ్చేది ఉద్యమమే. 2009లో డిశంబరు 6న తెలంగాణ ఇస్తానని 23న ఇవ్వననేసాం. తెలంగాణ ఉద్యమం ఉధృతమయింది. రాష్ట్రాన్ని సమైక్యం వుంచుతామన్న భ్రమ కలిపించి, ఇప్పుడు వేరు చేస్తామన్నాం. సమైక్యాంధ్రోద్యమం వచ్చింది.

వేదాంతం :త్యాగమంటే ఉన్నది వదలుకోవటమే అనుకుంటారు. తప్పు. ఉన్నది వదలుకుని అంత కన్నా ఉన్నతమైనది పొందటం. నేను ప్రధాని పదవిని వదలుకుని, అంత కన్నా పెద్దపదవి ‘యూపీయే చైర్‌ పర్సన్‌’ పదవిని పొందాను. హోదాలోనూ, అధికారంలోనూ ఇంతకు మించి పదవి లేదు.

వృత్తి : దర్శనాలు ఇవ్వటం, భక్తులు విన్నపాలు వినటం.

హాబీలు :1.‘రోబో’కు సంకేతాలు పంపటం. (‘మీకు తెలుసా? మన ప్రధాని ‘రోబో’కన్నా చురుకయిన వారు. ‘రోబో’ కన్నా విధేయులు.)

2. విపక్షనేతలపై వచ్చిన కేసులు పరిశీలించటం.( అయితే మా ప్రభుత్వంలో ‘సిబిఐ’ సర్వస్వతంత్రమయిన వ్యవస్థ. దాని పనితీరు విషయంలో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోను. అందుకే ఆ సంస్థను ‘కాంగ్రెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌’ అని ముద్ర వేయగలరు కానీ, ‘సోనియా బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌’ అని అనలేరు కదా!

నచ్చని విషయం : నా పార్టీలో నేనే ముఠాలను సృష్టిస్తున్నానటం. కాంగ్రెస్‌లో వున్న ‘అంతర్గత ప్రజాస్వామ్యాన్ని’, ‘కుమ్ములాటలని’ ఆడిపోసుకుంటారు. నేను ‘అంతర్గత ప్రజాస్వామ్యాన్ని’ ప్రోత్సహిస్తాను కనుకనే, పార్టీలో అన్ని వర్గాల మధ్యా పోటీ వుండేటట్టు చూస్తాను. అందుకనే రాష్ట్రంలో ఇటు తెలంగాణ ఉద్యమానికీ, అటు సమైక్యాంధ్ర ఉద్యమానికీ సారథులుగా వున్నారు.

మిత్రులు :భక్తులుంటారు, అనుయాయులుంటారు. అనుచరులుంటారు. మిత్రులు-అంటే సమస్థాయి ఇవ్వవలసి వస్తుంది.

శత్రువులు : వారిని కూడా కాంగ్రెస్సే తయారు చేసుకుంటుంది. కాంగ్రెస్‌నుంచి చీలి శత్రువలయిన వారు, అంతిమంగా మిత్రులవుతారు. అందుకని శత్రుస్థాయిని ఇతరులకు కల్పించం.( తృణమూల్‌ కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌లు అలాంటి వారే. రేపు ఈ కోవలోకి ‘వైయస్సార్‌ కాంగ్రెస్‌’ కూడా రావాలని కోరుకుంటున్నాం. శత్రువుకు కూడా కాంగ్రెస్‌ ‘డిఎన్‌ఎ’ వుండాలన్నది రూలు. దిగ్విజయ్‌ చెప్పారు. వినలేదా?

జపించే మంత్రం : రాహుల్‌ దే భవితవ్వ్యం. రాహుల్‌ దే భారతం

విలాసం : జనపథమే(టెన్‌, జనపథ్‌)

గురువు : అత్తే నాకు గురువూ, దైవం.

జీవిత ధ్యేయం : రాణి ధ్యేయమే నా ధ్యేయం. రాజమాతగా చరిత్రలో మిగలాలని.

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 10-16 ఆగస్టు సంచికలో ప్రచురితం)

Leave a Reply