గవర్నమెంట్‌ స్కూలా! మార్కెట్‌ రికగ్నిషన్‌ వుందా?!

ready-for-anthem‘మావాణ్ని ఏ కార్పోరేట్‌స్కూల్లో వేస్తే మంచిదంటావ్‌?’

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, సాటి ఉపాధ్యాయుడి సలహా కోరతాడు.

‘మా ఆవిడకు రెండు రోజులనుంచి జ్వరం, ఏ మల్టీ స్పెషాలిటీస్‌ హాస్పటల్‌లో చేర్పిస్తే మంచిదంటావ్‌?’

ప్రభుతాసుపత్రిలో డాక్టరు, తోటి డాక్టరుని ఆరా తీస్తాడు.

‘మా అల్లుడు కట్నం కోసం మా అమ్మాయిని వేధిస్తున్నాడు. ఏ గూండాతోనైనా బెదిరించాలి. ఎవరికి చెబుతాం?’

ఓ పోలీసు కానిస్టేబుల్‌, మరో కానిస్టేబుల్‌ అభిప్రాయం అడుగుతాడు.

ప్రభుత్వరంగానికే ప్రయివేటు రంగంతో పనిపడింది.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ప్రభుత్వ సంస్థలకే ప్రయివేటు రంగాల గుర్తింపు అవసరమయ్యింది. పదవతరగతి ఫలితాలొచ్చినప్పుడు, ప్రయివేటు విద్యాసంస్థలు తమ విద్యార్థుల మార్కులనో, గ్రేడింగులనో( ర్యాంకులను నిలుపు చేస్తే) పెద్ద యెత్తున రొమ్ము విరుచుకుని ప్రకటనలు ఇచ్చుకుంటుంటే , ప్రభుత్వ పాఠశాలలు కూడా అడపదడపా, అప్పుడప్పుడూ వార్తల్లోకి వస్తుంటాయి.ఫలానా ప్రభుత్వ పాఠశాలలో చదివి కూడా, ప్రయివేటు సంస్థలో చదివే విద్యార్థులతో పోటీ పడిచి నిలిచిన ఓ విద్యార్థి విజయగాథ- అంటూ మీడియాలో కథనాలు వస్తుంటాయి.

అంటే ప్రయివేటు పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు వున్నాయని చెప్పుకోవటం గొప్పయ్యింది.

అంటే ఎవరి గుర్తింపు ఎవరికి అవసరం అవుతుంది? సర్కారు బడులకే ప్రయివేటు రంగం గుర్తింపు అవసరమవుతుంది. ఫలానా స్కూలుకి ‘ప్రభుత్వ గుర్తింపు’ వుందని చెప్పటానికి బదులుగా, ఫలనా ప్రభుత్వ పాఠశాలకు ‘కార్పోరేట్‌ గుర్తింపు’ వుంది అని చెప్పుకోవాలసిన అవసరం ఇప్పటికే ఏర్పడుతోంది.

ఇప్పటికే ప్రయివేటు యూనివర్శిటీలు వచ్చేసాయి. రేపు ప్రభుత్వ కళాశాలలు కూడా నిలదొక్కుకోవాలంటే, వాటిని ఫలానా ప్రయివేటు యూనివర్శిటీకి అనుబంధంగా వున్నాయని చెప్పుకోవాల్సిన స్థితి ఏర్పడింది.

ఐఐటీలు,ఐఐఎంలూ వంటి కొన్ని ప్రతిష్టాత్మకమైన సంస్థలను మినహాయిస్తే, దేశంలో ఇప్పటికే ప్రయివేటు విద్యాసంస్థలకున్న గుర్తింపు ప్రభుత్వ సంస్థలకు లేదు.

ఏదో అడగాలి కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాసంస్థలకు ‘ప్రభుత్వ గుర్తింపు’ వుందా- అని అడుగుతున్నారు కానీ, వారు నిజంగా అడగాల్సిన ప్రశ్న వేరు: ‘మార్కెట్‌ గుర్తింపు ఉందా?’ ఇప్పుడు నిజంగా ఉపాధి కల్పించేది ప్రభుత్వం కాదు. మార్కెట్టే,

ఉద్యోగం ఇచ్చే వాడి గుర్తింపే దేనికయినా ప్రమాణికం.

విద్య అంటే బతుకు తెరువు. విద్యంటే బతుకు సారం.

పిట్టలు ఎగిరనట్టూ, చేపలు ఈదినట్టూ, మనిషి చదవాలి. అలాగని పిట్టలకు ‘ఫ్లయింగు కోర్సు’, చేపలకు ‘స్విమ్మింగ్‌ కోర్సూ’ పెట్టి ఫీజులు వసూలు చేయలేం. కానీ మనిషికి ‘నాలుగు మెతుకులు దొరికే పని’ నేర్పటం మీద లక్షలకోట్ల వాణిజ్యం నడచిపోతోంది.

ఒకప్పుడు విద్య ఉచితంగా నే దొరికేది. గురువు ఆశ్రయం పొంది, ఆయనకు సపర్యలు చేస్తే, ఆయనే ఉచితంగా చదువు చెప్పేవాడు. అయితే ఈ చదువు అందరూ చదవకూడదని, అధిక శాతం పౌరుల్ని నిరక్షరాస్యులుగా ఉంచేశారు.

పాత సమాజం పోయి కొత్త సమాజం వచ్చింది. ఎవరయినా చదువు-కొనవచ్చు. అవకాశం అందరికీ వున్నట్లుంది కానీ, అందుకునే శక్తి కొందరికే వుంటుంది.

అందరికీ, ఉచితంగా అన్ని చదువులూ ఇచ్చే సమాజం ఇంకా ఏర్పడలేదు. అంతవరకూ విద్య కేవలం సేవే , వ్యాపారం కాదూ- అని చెప్పలేం.

కాన్వెంటు చదువులొచ్చాకే, ఈ దుస్థితి వచ్చిందని అప్పుడప్పుడూ విసిగిపోయిన పాత తరం వాళ్ళు తిట్టుకుంటూ వుంటారు. నిజమే. కాన్వెంటు స్కూళ్ళు దాదాపు పూర్తి వాణిజ్య సంస్థల్లాగే నడుస్తున్నాయి.

నిజానికి కాన్వెంటు అంటే అసలు అర్థం వేరు. ‘కాన్వెంటు’ అంటే ‘సన్యాసినుల (నన్స్‌ వుండే) మఠం’ అని అర్థం. వీరు నిరుపేదల పిల్లల్ని చేరదీసి ఉచితంగా చదువు చెపుతూ వుండేవారు. ‘మీ పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడు?’ అని అంటే, ‘కాన్వెంటుకు వెళ్ళాడు’ అని పేదల వాడల్లో తృప్తిగా చెప్పుకునే వారు.

ఇప్పుడూ తృప్తిగా కాదు, ‘గర్వం’ గా చెప్పుకుంటున్నారు: ‘లక్ష రూపాయిలు డొనేషన్‌ కట్టాను, నెలనెలా మూడువేలు కడుతున్నాను.’ అని గొప్ప చెప్పుకుంటున్నారు ఆ పేదలే. అప్పులు చేసి, ఉన్నవి తాకట్టు పెట్టి మరీ చదివించేస్తున్నారు.

మార్కెట్టుకు లాభ,నష్టాలతో పని కానీ, మంచీ, చెడులతో పని లేదు.

ఈ మార్కెట్టు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల, కళాశాలలపై చిన్నచూపు చూస్తోంది. అందుకే ప్రభుత్వం విద్యకు గుర్తింపు నిచ్చే స్థితి నుంచి, మార్కెట్టు నుంచి గుర్తింపు పొందే స్థితి దిగిపోయింది.

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 23 జూన్ 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply