టాపు(లేని) స్టోరీ:
ఎంత వోటరయితే మాత్రం – మాటల్ని నమ్మేస్తాడనుకుంటున్నారా? అబ్బే. ఆ రోజులు పోయాయి. చేతలు… చేతల్నే చూస్తాడు.
అందరూ గాంధేయవాదులే. కాని వారెవ్వరు? అలాగని ‘నేను గాంధేయవాదిని. నా ఆశయాలను చూసి వోటేసెయ్’ అని అభ్యర్థి వచ్చి దండం పెడితే, వోటరు పొమ్మంటాడు. ‘నువ్వు గాంధేయ వాదిననటానికి ఆధారమేదీ?’ అంటాడు. అంతే కాదు. ‘అసలు నీ దగ్గర గాంధీ వున్నాడనటానికి ఆధారమేదీ!’ అని నిలదీస్తాడు.
అప్పుడు అభ్యర్థి జేబులోని అయిదువందల రూపాయి నోటు తీసి, వోటరు చేతిలో పెట్టి- ‘చూస్కో గాంధీ వున్నాడో? లేదో?’ అంటాడు. తళ తళ లాడే నోటును కళ్ళ దగ్గర పెట్టుకుని, బోసినవ్వుల గాంధీని చూసుకుని- ‘ఇప్పుడు నమ్ముతాను నువ్వ గాంధేయ వాదివని. నా వోటు నీకేలే ఫో!’ అంటాడు.
అవును. మరి. గాంధీ ముఖం చూసి వోటేస్తున్నారు కానీ, అభ్యర్థుల్ని చూసి వేస్తున్నారా?
వోట్లేసే రోజంటే- ‘గాంధేయ వాదులయిన’ అభ్యర్థులకీ, వారి వారినేతలకూ, వోటర్లకీ అందరికీ పరీక్షలే.
పరీక్షలు వాయిదా పడితే, ఆ సంతోషమే వేరు. చదవని వాడు, ఇంకో నెలరోజులు చదవుకుండా వుండొచ్చని ఎగిరి గెంతేస్తాడు. అలా కాకుండా, అవే పరీక్షలు ముందుకు జరిగితే, చదివిన వాడికే చుక్కలు కనపడతాయి. ఇక చదవని వాళ్ళకో..? రాత్రి సూర్యుడూ, పగలు చంద్రుడూ కనపడతాడు.
ఇప్పుడు రాష్ట్రంలోనూ, దేశంలోనూ అదే పరిస్థితి. ఎన్నికలు ‘ముందస్తు’గా జరిగిపోతాయేమోనని అందరికీ ఒక్కటే వణుకు. ‘గాంధీ’ బొమ్మల్ని కట్టలు, కట్టలుగా దాచుకున్న వాళ్ళకి కూడా ఎముకల్లో చలి పుడుతుంది. ఇంట ‘గాంధీ’వున్న కాగితమూ ఒక్కటీ లేని వారి పరిస్థితి చెప్పనవసరం లేదు.
కేవలం ‘గాంధీ’ గారే, ఎన్నికల్లో గెలిపించలేరు. ఇంకా పార్టీలకు ఇతర అర్హతలుండాలి. రాష్ట్రంలో వున్న పార్టీల్లో ఒక్కొక్కరికీ ఒక్కొక్క అర్హత లోపించింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే తీసుకోండి. ‘సానుభూతి’ పేరు మీద ఆ మధ్య సీమాంధ్రలో ‘ఉప సమరాన్ని’ గెలిచింది- రెండు ‘పురాల్లో’ మినహా.( ఒకటి: నర్సాపురం, రెండు: రామచంద్రాపురం). తెలంగాణలో ఇంకా జెండా ఎగురవేయలేదు.(పరకాల లో దగ్గర వరకూ వచ్చింది కానీ, గెలవ లేదు.) ఇక్కడ కూడా, ఎప్పుడో ఏడ్చిన వోటర్లను ‘ఓదార్చే’ సిలబస్ మిగిలిపోయింది. అప్పుడే పరీక్షలంటే, కొంత ఇబ్బందే.
కాంగ్రెస్ పార్టీకి సిలబస్సే మొదలు కాలేదు. అయినా పరీక్షలకు రెడీ అంటుంది. సీమాంధ్రలో ‘సానుభూతి’కీ, తెలంగాణలో ‘సెంటిమెంటు’కీ మాత్రమే కాకుండా, ఈమధ్య పాతబస్తీలో మైనారీటీల ‘అభద్రత’కీ తావిచ్చి- చక్కగా కూర్చుంది. ఎన్ని ఉద్వేగాలనయినా చల్లార్చే మందు: ఒక సంక్షేమ పథకం- అని నమ్ముకుని కూర్చుంది. ఉచితంగానే కాకుండా, అధికారికంగా కూడా పథకాలు ‘గాంధీ’ బొమ్మల్ని చూపించగలుగుతాయి. కాబట్టి ‘మంటలు రేపే నిప్పూ మన వద్దే వుంది. ఆర్పే నీరు మన దగ్గరే వుంది’ అన్న భరోసాతో వుంది. కానీ ఎంతయినా పరీక్షలంటే భయం, భయమే కదా!
ఇక టీఆర్‌ఎస్ అంటారా? ‘తెలంగాణ సెంటిమెంటు’ను బీజేపీ కొంత బీజేపీ పంచుకుంది. బెదరలేదు. టీజాక్ వేరుగా ఇంకొంత పంచుకుంది. చెక్కు చెదరలేదు. కానీ ‘సీమాంధ్ర పార్టీ’ (వైయస్సార్ కాంగ్రెస్) పంచుకోవటానికి సిధ్ధమయింది. పరీక్ష రాస్తున్నప్పుడు, మన జవాబుల పత్రాన్ని వెనకాల మన మిత్రుడు కాపీ కొడుతుంటే, కొంత వరకూ సహించ వచ్చు. కానీ ‘శత్రువే చూసి రాస్తుంటే’ ( తానూ ‘జైతెలంగాణ’ అంటూంటే) ప్రమాదమే కదా! ఇప్పుడు- వైయస్సార్ కాంగ్రెస్ ‘వయా పరకాల’ తెలంగాణలోకి వచ్చేస్తుంది. ముందు, ఆ పార్టీని ఎదుర్కో లేక పోతే, పేపర్లు దిద్దే వాడు ‘వైయస్సార్ కాంగ్రెస్’ను, ‘టీఆర్‌ఎస్’ అనుకరించింది అనుకోగలడు.
వరసగా రెండు సార్లు పరీక్ష తప్పిన( రెండు సార్లు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన) తెలుగుదేశం పార్టీ పరిస్థితి- ‘అన్నీ వుండి అయిదో తనం లోపించి’నట్టుగా వుంది. ఇటు తెలంగాణ లోనూ, అటు సీమాంధ్రలోనూ జరగిన ‘సప్లిమెంటరీ’ పరీక్షల్లో (ఉప ఎన్నికల్లో) అంత మంచి మార్కులు రాలేదు. పార్టీ నేత ఎంతో కష్టపడుతున్నారు. జనం వచ్చినట్టే కనిపిస్తున్నారు. అయినా ‘చూడటానికి ఎగబడుతున్నట్టు’ లేరు. కాబట్టి కావలిసింది ‘గ్లామర్’. బాలయ్యో, జూనియర్ ఎన్టీఆరో దిగి, నాలుగు రౌండ్లు వేస్తేనే కానీ, పరీక్షల్లో కూర్చొనే స్థితి లేదు. ఎంతయినా పరీక్షలు పరీక్షలే సుమా!!
న్యూస్ బ్రేకులు:
పగటి ‘చంద్రులు’!
చంద్రన్న, రాజన్న రాజ్యాలతో ప్రజలు విసిగిపోయారు. రావాల్సింది తెలంగాణ రాజ్యమే!
-కె. చంద్రశేఖ రావు, టీఆర్‌ఎస్ అధినేత
అదిమాత్రం ‘చంద్రన్న'( చంద్రశేఖరుని) రాజ్యం కాదా..?
తెలుగు దేశానికి వోటేస్తే, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాం.
–చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత
జీవితాల్లో ఎందుగ్గానీ, ముందు ఇళ్ళల్లో వెలుగులు నింపండి చాలు. పవర్‌కట్‌లతో జనం చస్తున్నారు.
ట్విట్టోరియల్
కామన్ మాన్ కృష్ణుడయ్యాడు!
హఠాత్తుగా భారతానికి కృష్ణుడు ఎంత అవసరమయి పోయాడో, భారత రాజకీయాలకు ‘కామన్ మ్యాన్’ అంత ముఖ్యుడయిపోయాడు. అతడే ‘ఆమ్ ఆద్మీ’, ‘సామాన్యుడు’. సినిమా వాళ్ళయితే చికాగ్గా ‘మాస్’ అని పిలుస్తారు.
భారత యుధ్ధానికి ‘కృష్ణుడి’ అవసరం సుయోధనుడికీ వస్తుంది, అర్జునుడికీ వస్తుంది. ‘ఆయుధము పట్టను, యుధ్ధము సేయను’ అని కృష్ణుడు తెగేసి చెప్పినా సరే- అర్జునుడు కృష్ణుణ్ణి కోరుకుంటారు. కానీ ‘ఆమ్ ఆద్మీ’ని ఇటు కాంగ్రెస్ కోరుకుంటోంది, అటు కేజ్రీవాలూ కోరుకుంటున్నారు. కాంగ్రెస్ నినాదంలోనే ‘ఆమ్ ఆద్మీ’ వుంటే, కేజ్రీవాల్ పార్టీ (ఆమ్ ఆద్మీ పార్టీ) పేరులో పెట్టేసుకున్నారు. ‘ఇదేమిటీ నేనిక్కడుంటే, అక్కడున్నానూ, ఇక్కడున్నానూ అని కొట్టుకుంటున్నారూ’ అని పండని చేలో పురుగు మందు చేత బట్టుకున్న కామన్ మ్యాన్ విస్తుబోతున్నాడు.
‘ట్వీట్ ‘ఫర్ టాట్
‘పీకల’ దాకా!
పలు ట్వీట్స్: మొత్తానికి కసబ్ తిండి ఖర్చు తప్పింది.
కౌంటర్ ట్వీట్: అంటే ,దేశంలో తిండిబోతుల్నందరీ ఉరి తీయాలా?
ఈ- తవిక
‘ముఖ’ మాటం!
మొన్న
కిరణ్, రాజనర్సింహ
ఎడమొఖం, పెడ ముఖం.
నిన్న
కేసీఆర్, కోదండం
తూర్పూ, పడమరా
నేడు
అందరివీ నవ్వు ముఖాలే!
బ్లాగ్ (బ్లాక్) స్పాట్:
‘తెలుసా? రాష్ట్రంల జిమ్ములు(వ్యాయామశాలలు) మూసేస్తున్నారట?’
‘అవును. సిక్స్‌ప్యాక్‌లకు పాదయాత్రలు చాలని తెలిసిపోయింది’
కొట్టేశాన్( కొటేషన్):
ఉరిమి ఉరిమి ‘మీడియా’ మీద పడ్డట్టూ..మధ్యలో వాళ్ళేంచేశారు..?!
-సతీష్ చందర్
(సూర్య దినపత్రిక 26నవంబరు2012 వ తేదీ సంచికలో వెలువడింది)