‘గ్రేటే’ష్‌ బాబు!

caricature:balaram

caricature:balaram

పేరు : నారా లోకేష్‌ బాబు

దరఖాస్తు చేయు ఉద్యోగం: తెలంగాణ పౌరుడు (నాన్న ది రాయల సీమ, అమ్మది ఆంధ్ర, మరి నాకు తెలంగాణ కావాలి కదా! ఒకే కుటుంబ సభ్యులు పంచుకోవటానికి అని అనుకోకండి. పాలించటానికి. ఇప్పటికి మూడు తెలుగు రాష్ట్రాలయ్యాయి. సీమ కూడా విడిపోయి మూడు రాష్ట్రాలయినా, పాలించుకోవటానికి ముగ్గురం వుండాలి కదా! అందుకని ఈ అరేంజ్‌ మెంట్‌)

ముద్దు పేర్లు : ‘షోకేస్‌’ బాబు ( నారా వారి కుటుంబం గొప్పతనానికీ, నందమూరి వారి ఖ్యాతికీ ని ప్రదర్శించటానికి ఏకైక షోకేస్‌ను నేనే.) ‘హెరిటైజ్‌’ బాబు ( ‘పాలు’టిక్స్‌ లోనూ, పాలిటిక్స్‌లోనూ నాన్నకు నేనే కదా- ఏకైక వారసుణ్ణి.) ‘గ్రేటే’ష్‌ బాబు.( నాకు నేను గ్రేట్‌ అనుకుంటాననుకోకండి. ‘గ్రేట’ర్‌ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాను కదా!)

‘విద్యార్హతలు : మాస్టర్‌ ఆఫ్‌ జాగ్రఫీ. అవును. నాది భౌగోళిక జ్ఞానం. హైదరాబాద్‌లో గల్లీ గల్లీ తెలుసు. కొత్త రాజధాని ‘అమరావతి’లో ఒక్క వీధీ తెలియదు. అఫ్‌కోర్స్‌. ఆ నగరాన్ని ఇంకా నిర్మించాల్సి వుంది అనుకోండి.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: లోకం చుట్టిన వీరుణ్ణి. నేను ఏ దేశం తిరిగినా అక్కడ అందరితో చనువుగా వుంటాను. ఎవరయినా నాకు ఇట్టే సన్నిహితులయి పోతారు. ( అయితే నా పేరు మీద సోషల్‌ మీడియా నెట్‌ వర్క్‌లో సర్క్యులేట్‌ అవుతున్న ఫోటోలకూ, నాకూ ఎలాంటి సంబంధమూ లేదు.)

రెండు: పర్యావరణ వాదిని. అంతరించి పోతున్న జీవ సంపదను పోల్చుకొని, కాపాడగలను. ఉదాహరణకు ‘టైగర్లు’ అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడుకోవాలి. అయితే నేను తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ని ‘టైగర్‌’ తో పోల్చటానికి రాజకీయ కోణం నుంచే చూడాలి కానీ, పర్యావరణ కోణం నుంచి మాత్రం కాదు.

సిధ్ధాంతం : ‘గివ్‌ అండ్‌ టేక్‌’ అంటే ‘ ఇచ్చి పుచ్చుకోవటం’. అలాగని పెడార్థాలు తీస్తే నాకు సంబంధంలేదు. ‘నీకింత నాకంత’ అనే అర్థంలో అస్సలు కాదు. మీకు మేలు చేస్తాం, వోటు తీసుకుంటాం. అసలు ‘వోటు’ అడగాలో, ఎవరయినా మా ‘తెలంగాణ టైగర్‌’ రేవంత్‌ నుంచి నేర్చుకోవాలి. ( ఈ విద్యను చూడలేకే కిట్టని వాళ్ళు ఆయన్ని అన్యాయంగా ‘వోట్‌ ఫర్‌ నోట్‌’ లో ఇరికించారు.)

వృత్తి : ‘సన్‌ ఆల్వేజ్‌ షైన్స్‌'( సూర్యుడి కయినా, కొడుకు కయినా ప్రకాషించటం తప్ప వేరే పని ఏముంటుంది? అయితే ఎక్కువ ప్రకాషిస్తే ‘సన్‌’ స్ట్రోక్‌ తండ్రులకు వస్తుంది. అందుకే తగు మోస్తరు ప్రకాషిస్తుంటాను.)

హాబీలు :1. నీటి కొలనుల్లో స్నానాలు చెయ్యటం, బీచ్‌లలో సందడి చెయ్యటం- ఇలాంటివనుకుంటున్నారా? సమస్యలేదు. అవి అసలు వొంటికి పడవు. వచ్చిన జనానికి ( కొందరు ‘తెచ్చిన’ అంటారు. తప్పు.) లెక్చర్లివ్వటం.

2. యువరాజులాగా ఫర్మానాలు జారీ చెయ్యటం, మంత్రులకు సైతం సూచనలివ్వటం- ఇలాంటివనుకుంటున్నారా? కాదు. సాధారణ కార్యకర్తలా పార్టీలో పనిచేయటం.

అనుభవం : లోక జ్ఞానం తెలియని వాడు లోకేష్‌ అని కేసీఆర్‌ కుమార్తె కవిత అంటున్నారు. నేను దేశదేశాలు తిరిగాను. ఒక సాధారణ వ్యక్తిగా తిరిగినప్పుడు సంపాదించిన అనుభవాన్ని, ఒక హోదాలో తిరిగితే సాధించలేం. సాధారణ వ్యక్తిగా నేను ఎక్కడబడితే అక్కడికి వెళ్ళాను. ఎందరినో కలిశాను. నా అనుభవమే నాకు లోక జ్ఞానాన్ని ప్రసాదించింది.

మిత్రులు : నేను అందరినీ మిత్రులుగానే చూస్తాను. ఏ వ్యత్యాసాన్నీ పాటించను. అన్ని దేశాల వాళ్ళూ, అన్ని ‘వర్ణా’ల వారూ, అన్ని జెండర్ల వారూ వుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోనే, ముఖ్యమంత్రి తనయుణ్ణి కావటం వల్ల కాబోలు, మిత్రులు కూడా అనుచరులుగా ప్రవర్తిస్తుంటారు.

శత్రువులు : ఈ మధ్య పుట్టుకొస్తున్నారు. నేను రేవంత్‌ ను ‘టైగర్‌’తో పోలుస్తున్నప్పుడు, మా సంగతేమిటీ- అని తెలంగాణలో తెలుగుదేశం సీనియర్లు నన్ను ఆడిపోసుకుంటున్నారట? వారిని కూడా ఎవరితోనో పోలుస్తాను కదా! పోల్చే వరకూ ఆగాలి. ఉత్త టైగర్లేనా?  సింహాలు లేవా? వార్డు సింహమో, గ్రామ సింహమో అనే బిరుదులు ఇవ్వొచ్చు. వేచి చూడాలి.

మిత్రశత్రువులు : పార్టీలో వుండరు. వుంటే కుటుంబంలో వుండాలి.

వేదాంతం : తత్వంలా పాడతాను . కొంచెం భరించండి: ‘తెలుగు జాతి మనది. నిండుగ వెలుగు జాతి మనది. తెలంగాణ నాది, రాయలసీమ నాన్నది, సర్కారు అమ్మది..’

జీవిత ధ్యేయం : దీపం వుండగానే ‘తెలుగు’ ఇల్లు చక్కబెట్టుకోవాలని.

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్రవార పత్రిక 30 జనవరి-5 ఫిబ్రవరి 2016 సంచికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *