‘చిల్లర’ బతుకు చేదు!

విత్తు ముందా? చెట్టు ముందా?

వేళాకోళం కాక పోతే, ఇలాంటివి కూడా ప్రశ్నలేనా?

‘వ్యసాయం ముందా? చావు ముందా?’ అన్నట్లు లేదూ..!?

కానీ ఒకప్పుడవి చిక్కు ప్రశ్నలే.

పూర్వం విత్తనాలు కూడా చెట్టుకు కాసేవి లెండి..! ఆ తర్వాత మార్కెట్లోంచి ఓ బూచాడొచ్చి- ‘అమ్మా, ఆశ! విత్తనాలు అలా బేవార్సుగా చెట్టునుంచి కొట్టేయటమే..!’ అని చెట్టుకు చిన్న ఆపరేషన్‌ చేశాడు. ఆబోతును ఎద్దుగా మార్చటానికి చేసే శస్త్ర చికిత్స లెండి. దాంతో ప్రతీ మొక్కా, ప్రతీ చెట్టూ పంటనిస్తాయి, కానీ విత్తనాలనివ్వవు. దీంతో శతాబ్దాల తరబడి వున్న చిక్కు ప్రశ్నను పరిష్కరించేశాడు. ‘దిక్కున్న కాడికి పోయి చెప్పుకోండి. విత్తే ముందు.’ అని వాడు విత్తనాలను అమ్మటం మొదలు పెట్టేశాడు.

దాంతో రైతు- ‘పెద్ద మొనగాడివి నువ్వే నేమిటి? నేనూ ఇంకో చిక్కు సమస్యను పరిష్కరిస్తాను’ అని చెప్పి, ఎత్తిన సీసా ఎత్తకుండా మందు కొట్టేశాడు. ఏ మందూ..? ‘పురుగు మందు’! చావొచ్చి పడిపోయింది.

‘ఇన్నాళ్ళూ వ్యవసాయం చేశాక, చావొస్తుందనుకున్నారు కదా! ఇప్పుడు నేను చచ్చాను. ఇంకెవడు వ్యవసాయం చేస్తాడూ..? అంచేత చావే ముందు. వ్యవసాయం తర్వాత. తిక్క వదలిందా?’ అని తుది సందేశమిచ్చి, తుది శ్వాస విడిచాడు.

ఆ తర్వాత రైతు వారసులు- వ్యవసాయం వ్యాపారమయి పోయిందనుకుని- నేరుగా వ్యాపారమే మొదలు పెట్టారు. టోకు వ్యాపారం ఎలాగూ కుదరదని, చిల్లర వ్యాపారం అందుకున్నారు. సైకిళ్ళు కొన్నారు. కొత్తిమీర, కరివేపాకూ, తోటకూర, గోంగూర, బచ్చలీ గంపల్లో పెట్టుకుని పట్టణాలు బయిల్దేరారు.

చూశారా! బుధ్ధి పోనిచ్చుకున్నారు కాదు. చైన్నైలో సినిమాలు తీసి దివాళా తీసి ప్రొడ్యూసరు సొంతవూరు వచ్చి సినిమాహాలు కట్టినట్లు- వరి పంట వేసి దెబ్బతిన్న రెతు బిడ్డలు ఆకుకూరల వ్యాపారం పెట్టారు.

కొనేదెవరూ? అపార్ట్‌మెంటుల్లో బందీలయిన గృహిణులు. బేరాలు తొందరగా తేలిపోతే బోరు కొట్టదూ? కొనేది పావలా కొత్తిమీర, ఆడేది గంటన్నర బేరం. పాతిక లక్షలు కట్నమిచ్చి మొగుణ్ణి కొనుక్కున్నప్పుడు, ఆడిన బేరం అర్థ గంటే. పాపం వాళ్ళూ లెక్కల్లో వీకే. మొగుడికి జీతం వచ్చేది అరవ్వయ్యేళ వరకే కదా! తర్వాత అతడికి ‘ఉచిత భోజన పథకం’ పెట్టాలి కదా! అలాంటి ‘జీత’ భాగస్వామికి- పాతిక లక్షలు పోయాలా- ఒక్క క్షణం ఆలోచించి వుంటే ‘గుమస్తా’ బదులు కాంట్రాక్టరు వచ్చేవాడేమో! అలా మరోసారి లెక్కల్లో దెబ్బతినకూడదనే ‘కొత్తిమీర’ను అంతగా బేరమాడతారు. టైమ్‌ తింటే తింటున్నారు, ఈ పచ్చగడ్డి.. సారీ… పచ్చకూరలు కూడా తింటున్నారు కదా- అని భరించి పొట్టపోసుకుంటూ వచ్చారు చిల్లర వ్యాపారులయిన రైతు బిడ్డలు.

ఈ లోగా వారి ‘పచ్చని’ వ్యాపారంలో- ఎవరో నిప్పులు పోసేశారు.

వ్యవసాయం వ్యాపారమయిపోయినట్టుగానే, చిల్లర వ్యాపారం గోల్‌ ‘మాల్‌’ అయిపోయిందనుకున్నారు.

వాడెవడో- ‘దుకాణం ముందా? సరుకు ముందా?’ అనే క్విజ్‌ పెట్టి, గెలుచుకున్న వాళ్ళకు ‘వంద గ్రాముల కొత్తి మీర ఫ్రీ’ అని కూపన్లు పంచాడు.

ఫలనా చదువు చదివితే మార్కెట్లో భర్తలు ఫ్రీ- అని ప్రకటన వెలువడితే ఎంత బాగుండును- అని అనుకునే అభాగ్య సతులు కూపన్లు పట్టుకుని ‘మాల్‌’కు పరుగులు తీశారు.

‘బొందితో స్వరానికి చేరుస్తున్నట్లు’గా నిలబడితే చాలు పై అంతస్తుకు తీసుకు పోతున్నాయి ఎలివేటర్లు. ‘వామ్మో! మెట్లున్నవి ఎక్కటానికి కాదన్నమాట. నిలబడటానికే. అవే ఎక్కుతాయి. ఎక్కిస్తుంటాయి. ఎక్కేవీ..ఎక్కించేవి.. పైసలన్నీ కక్కించేవీ…అవును. అవే మాల్స్‌.’ ఇలా అనుకుంటూనే వాళ్ళు వెళ్ళారు.

హాయిగొలిపే ‘కండిషన్డ్‌’ గాలీ, అందులో తేలిపోయే అత్తరూ..! అక్కడ కదా… కొత్తిమీర కొనాలి.

చక్కటి స్యూట్లలో, మొత్తని నవ్వుల్తో సేల్స్‌ బాయ్స్‌, గాళ్స్‌ పలకరింపులు.

‘మామ్‌! యు హావ్‌ క్యూపన్స్‌?’ అని మర్యాద కూపన్లు తీసుకుని-

‘మీ ఆన్సర్‌ రైట్‌! దుకాణమే ముందు.. సరుకే తర్వాత. మీరు నాలుగువంద గ్రాముల కొత్తి మీర గెలుచుకున్నారు. తీసుకోండి. కానీ పొలితిన్‌ బ్యాగ్‌లు వాడకూడదు. అలాగే చెట్లనుకూల్చి, దాని నుంచి తీసే కాగితం వాడటానికి మేం వ్యతిరేకం. ఇది జూట్‌ తో తయారు చేసిన బ్యాగ్‌. జస్ట్‌ థర్టీ రూపీస్‌ రైతుల్ని ప్రోత్సహిద్దాం.’ అని కొత్తిమీర వున్న బ్యాగ్‌ను అంద చేశాడు.

‘ఇంకా కొనండి. మేడమ్‌. ఇలాంటి ఫ్రీలు చాలా వున్నాయి.’

అక్కడ లేనివేమున్నాయి. అన్నీ వున్నాయి.

మరచిపోయినవి గుర్తు చేసే విధంగా చిల్లర సరకుల అమరిక.

‘ఇదేమిటీ?’ ఒక డబ్బా చూపిస్తూ.

‘అమెరికన్‌ స్వీట్‌ కార్న్‌ మామ్‌!’ అంది సేల్స్‌ గాళ్‌

‘మొక్క జొన్నలా?(మొక్కబుట్టలా?)

‘స్వీట్‌గా వుంటాయి. అమెరికావి కదా!’

నిజమే కదా! విదేశీ గింజలు తీపి. విదేశీ పెట్టుబడులు తీపి.

మన దేశపు చిల్లర బతుకులే చేదు!!

-సతీష్‌ చందర్‌

 

Leave a Reply