చీలిక మంచిదే… కోరిక తీర్చింది!


rtcమరక
మంచిదే… అన్నట్టుగా, విభజన మంచిదే అన అంటున్నారు. చిత్రం. ఈ మాటను ‘విభజన’ వాదుల కన్నా, ‘సమైక్య వాదులు’ అంటున్నారు. మరీ ముఖ్యంగా రెండు తెలుగురాష్ట్రాలలోని ఆర్టీసీ కార్మికులూ ఇదే మాట అంటున్నారు.

ఆర్టీసీ కార్మికులకు కష్టాలూ కొత్త కాదు, సమ్మెలూ కొత్త కాదు. గతంలో కూడా జీతాల పెంపు కోసం సమ్మెలు చేశారు. ఎప్పుడూ తమ డిమాండ్లు ప్రభుత్వం ముందు వుంచినా, కార్మికులే ఎక్కువగా దిగి రావాల్సి వచ్చేది. ఎంత అడిగితే అంత ఇవ్వటం- అన్నది గతంలో ఎప్పుడూ లేదు. కానీ రాష్ట్రం విడిపోయి ఏడాది కావస్తున్న సందర్భంగా రెండు రాష్ట్రాలలో వున్న ఆర్టీసీ కార్మికులూ ‘సమైక్యం’గా సమ్మె చేశారు. చర్చలలో కార్మికులు తమ బెట్టు వీడలేదు. మెట్టు దిగలేదు. కానీ రెండు రాష్ట్రాలలోని ఇద్దరు ‘చంద్రులూ'( ముఖ్యమంత్రులూ) దిగి వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు అయితే ఆంధ్రప్రదేశ్‌ వరకూ అడిగినంతా (43 శాతం) ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్‌ అయితే ఈ దిగటంలో కూడా చిన్న ట్విస్ట్‌ ఇచ్చారు. ‘మీరు అడిగినంతా ఇవ్వను. ఒక శాతం ఎక్కువ ఇస్తాను’ అని చెప్పి 44 శాతం ఇచ్చారు.

అంతే ఇరు రాష్ట్రాల ఆర్టీసీ కార్మికుల ఆనందానికీ అంతులేదు. అఫ్‌కోర్స్‌. తెలంగాణ ‘ఒక్క రవ్వ’ (ఒక్క శాతం) ఆనందం వుంటుందనుకోండి. అది వేరే విషయం. ‘మరక మంచిదే’ అన్న వాణిజ్య ప్రకటనలాగా ‘విభజన మంచిదే’ అని అనుకున్నారు. అయితే నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని లాభాల బాటలో ఎక్కించటంలో కూడా ఇద్దరు చంద్రులూ పోటీ పడితే మంచిది. ఒప్పంద కార్మికులను కూడా క్రమ బధ్ధీకరించటానికి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి.

అయితే ‘విభజన మంచిదే’ అని ఆర్టీసీ ప్రయాణికుల చేత కూడా అనిపించుకోవాలి. చార్జీలు పెంచకుండా వుండేందుకు ఏ రాష్ట్రప్రభుత్వమూ హామీ పడలేదు. స్వల్పంగా పెంచటానికి అనుమతి ఇచ్చారు. ఇక్కడే చిన్న అప శ్రుతి వుంది: ఆర్టీసీ నష్టాలకీ, కార్మికుల జీతాలకీ ముడిపెడుతున్నారు. అంటే పరోక్షంగా ఇంత వరకూ ఆర్టీసీ నష్టాలకూ, ఆర్టీసీ కార్మికులనే బాధ్యుల్ని చేస్తూ వున్నారు. గతదశాబ్దం తొలి పాదం వరకూ ఆర్టీసీ లాభాలలోనే నడిచింది. ఈ కార్మికులే, ఈ ఉద్యోగులే అప్పుడూ ఆర్టీసీలో పని చేశారు. అయినా లాభాలు ఎలా వచ్చాయి?

నష్టాలు రావటానికి వరుసగా వచ్చిన ప్రభుత్వ విధానాలే కారణమన్నది వేరే చెప్పనవసరం లేదు. వోట్లు దండుకోవటానికి ప్రభుత్వాలు ఆర్టీసీని బలి పెడుతుంటాయి. ఉచిత ప్రయాణం, తగ్గింపు రేట్లలో ప్రయాణం- అన్నది పలు వర్గాలకు వర్తింప చేస్తుంటుంది. విద్యార్థులు మొదలుకొని, జర్నలిస్టుల వరకూ ఈ ప్రయాణ వసతి వుంటుంది. అంటే ఈ పాస్‌లలో కల్పించే ‘సబ్సిడీ’ మొత్తాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్టీసీ జమ చేస్తూ వుండాలి. కానీ ప్రభుత్వం తరపునుంచి ఈ బకాయిలు పేరుకు పోతుంటాయి.

అలాగే ఎక్కువ ఆదాయం వుండే రూట్లలో ప్రయివేటు అపరేటర్లు ‘వోల్వో’ బస్సులు నడుపుతారు. పెద్దగా ‘ఆక్యుపెన్సీ లేని’ మారు మూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతారు. ఈ గ్రామవాసులకు ప్రయాణ వసతిని కలగ చేయటం ప్రజాసంక్షేమమే. కానీ ఈ సంక్షేమానికి అయ్యే ఖర్చును పాస్‌ సబ్సిడీని భరించినట్లు, సర్కారే భరించాల్సి వుంటుంది. కానీ ఈ బాధ్యతను ఆర్టీసీ మీదకు నెట్టేస్తుంది. అందుకనే కేవలం ‘టూరిస్టు పర్మిట్ల’ మీద, ప్రయివేటు కార్పోరేటు సంస్థల వారు విచ్చలవిడిగా బస్సులను నడిపేసి, లాభాలను దండుకుంటున్నారు.

పైపెచ్చు ఈ బస్సులను నడిపే ‘ట్రావెల్స్‌’ వారిలో కీలకమైన వారు కూడా ప్రజాప్రతినిథులేనాయె! విద్యను కార్పోరేట్‌ పరం చేసిన వారూ, ఇటు రవాణాను కార్పోరేట్‌ పరం చేసిన వారూ ఆంధ్రప్రదేశ్‌ పాలక పక్షంలో వున్నారు. అంతే కాదు, ఆ రాష్ట్రభవితవ్యాన్ని తీర్చి దిద్దటంలోనూ, రాజధానికి దిశా నిర్దేశం చేయటంలోనూ కీలక పాత్ర వహిస్తున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వ రంగంలోని రవాణాను బాగు పరచాలనే చిత్త శుధ్ధి ప్రభుత్వానికి ఎలా కలుగుతుంది?

అయితే తెలంగాణ కు సంబంధించి కేసీఆర్‌కు తప్పించుకోలేని బాధ్యత వుంది. తెలంగాణ రాష్ట్ర విభజన కోసం జరిగిన సకల జనుల సమ్మెలో తెలంగాణలో చిట్ట చివరి వరకూ నిలిచింది సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు. కాబట్టి వారిని అసంతృప్తికి గురిచేసే ఏ పని కేసీఆర్‌ చేసినా అది ఆయనకు నష్టం. కాబట్టి తెలంగాణకు చెందిన ఆర్టీసీ కార్మిక నేతలు తమ డిమాండ్లు నెరవేరతాయన్న విశ్వాసంతో వున్నారు. ఇది బహిరంగ రహస్యం. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కూడా వెనక్కి తగ్గలేని పరిస్థితి వుంది. ఒకపక్క నిధుల కొరతతో ఆంధ్రప్రదేశ్‌ సతమతమవుతున్నా సరే, కార్మికులకు అడిగినంత ఫిట్‌ మెంట్‌ను చంద్రబాబు ప్రకటించాల్సి వచ్చింది. కాబట్టి ఈ ఒక్క విషయంలోనైనా, ‘సమైక్య వాదులయిన’ ఆంధ్రప్రదేశ్‌ కార్మికులు ఒక్క క్షణం పాటు ‘విభజన మంచిదే’ అని అనుకునేటట్టు, చంద్రబాబే ప్రవర్తించారు.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర 15-21 మే 2015 సంచికలో ప్రచురితం)

Leave a Reply