‘చేతులు’ కాలాక ‘పువ్వులు’!

టాపు(లేని) స్టోరీ:

కేరికేచర్:బలరాం

వోటర్లకు చేతులు కాలాయి. ఏం పట్టుకోవాలి? తమిళ వోటర్లయితే ‘ఆకులు’ పట్టుకున్నారు.( జయలలిత పార్టీ అన్నా డిఎంకె గుర్తు రెండు ‘విడాకులు’ లెండి.) తెలుగు వోటర్లయితే .. అందునా తెలంగాణ వోటర్లయితే ‘పూలు’ పట్టుకోవచ్చు. అయితే ఏ పూలు పట్టుకోవాలన్నది సమస్య. మొన్నటి దాకా తెలంగాణ మొత్తానికి ఒకే ఒక పువ్వు వుండేది. అదే (టీఆర్‌ఎస్‌) ‘గులాబీ’ ఇప్పుడు ఇంకొక పువ్వొచ్చి పడింది. అదే (బీజేపీ) ‘కమలం’. అయితే తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించిన ‘జేయేసీ’ కోదండ రామునికి కొత్త సమస్య వచ్చింది. తెలంగాణ తల్లి దగ్గర నిలబడి దగ్గర వారం రోజులుగా ఒకే కీర్తన ఆలపిస్తున్నారు. ‘ ఏ పూలు తేవాలి నీ పూజకు?’ అని. అప్పుడెప్పుడో తెలంగాణ హిందూత్వ తటాకాల్లో ‘కమలాలు’ వున్నమాట నిజమే. కానీ, కుల,మతాలకు అతీతంగా పుట్టుకొచ్చిన తెలంగాణ ఉద్యమ ఉధ్ధృతికి అవి ఎండిపోయాయి. కానీ, గత ఉప ఎన్నికల్లో మహబూబ్‌ నగర్‌లో కాంగ్రెస్‌ ‘చేయి’జారి చెంబుడు నీళ్ళు కింద పడటం వల్ల, అందులోంచి ‘కమలం’ వికసించింది. సరిగ్గా అంతకు ముందే బీజేపీ రాష్ట్ర నేత కిషన్‌ రెడ్డి తెలంగాణ అక్కడక్కడా ‘హిందూత్వ’ జలాలను చిమ్ముకుంటూ తిరిగారు. దీంతో ‘మతకొలను’లన్నీ మునకలేసాయని ఆయన నమ్మకం. ఇప్పటి ‘పరకాల’ ఉప ఎన్నికలో, ఇంకొక ‘కమలాన్ని’ పూయించవచ్చునన్నది ఆయన గట్టి ఊహ. పాపం. వరసగా గత రెండు అసెంబ్లీలలోనూ ‘జంట కమలాలే’ ప్రాతినిథ్యం వహించేవి. ‘మూడోది’ గెలిచేసరికి రాష్ట్రం మూడే మారిపోయిందని ‘కమలనాధులు’ జాతీయ స్థాయిలో ఉత్సాహం గావున్నారు.

నిజంగానే ‘పరకాల’లో వోటర్లకు ‘చేతులు’ కాలాయి. ‘చేతి’ గుర్తు మీద గెలిచిన కొండా సురేఖ వైయస్సార్‌ కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయి, ఉప ఎన్నిక తెచ్చిపెట్టారు. ఆమెకూడా తెలంగాణ కోసమే అంకితమయ్యానంటున్నారు. కానీ, తెలంగాణ కు ‘పేటెంటు హక్కు’న్నట్టు భావించే ‘గులాబీ’ ‘తెలంగాణ నినాదం’ పుట్టకుమందే తెలంగాణ ఏర్పాటుకు తీర్మానించామన్న ‘కమలమూ’ బరిలోకి వచ్చాసాయి. కాలిన ‘చేతులు’ ఏ పువ్వును పట్టుకుంటాయన్న ఉత్కంఠతో దేశమంతా ఎదురు చూస్తుంటే, ఇంతలో మరో ఆశ్యర్యం సంభవించింది.

ఏకంగా ‘సామెత’నే మార్చుకునే పరిణామం ఇది. ‘పువ్వులు కాలాక చేతులు పట్టుకోవాలి’ అన్న సందేశాన్ని ఇస్తున్నారు. పొరుగు రాష్ట్రం(కర్ణాటక)లో మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప. ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి కావటానికి, ‘కమలాన్ని'(బిజెపిని’ వదిలేసి ‘చేతుల్ని'(కాంగ్రెస్‌) పట్టుకుంటున్నారు. కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియా గాంధీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అంతే కాదు తనకు అనుయాయులుగా వున్న డెభ్భయి మంది శాసన సభ్యుల చేతా ‘చేతులు’ పట్టిస్తున్నారని కూడా వినవస్తోంది. ఇదే జరిగితే, దక్షిణాది రాష్ట్రాల నీళ్ళల్లో ‘కమలం’ వికసించదన్న విశ్వాసం బలపడుతుంది.

రాజకీయాల్లోకి వచ్చాయి అన్నీ కాలతాయి.. కడకు పువ్వులు కూడా.

న్యూస్‌ బ్రేకులు:
‘సీమాంధ్ర’ బాబు!

తెలుగుదేశం పార్టీ 2014 లో అధికారంలోకి వస్తే తొలి తీర్మానం తెలంగాణ పైనే!

-ఎర్రబెల్లి దయాకర రావు, కన్వీనర్‌, తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం.

ఓహో! అప్పుడు చంద్రబాబు తన పేరును ‘సీమాంధ్ర’ బాబుగా పేరు మార్చుకుంటారా? ఆయన మిగిలిన భాగానే ముఖ్యమంత్రి కాగలరు కదా!

వైయస్‌ 1978లో రాజకీయాల్లోకి వచ్చారు. నా తండ్రి 1962 నుంచి రాజకీయాల్లో వున్నారు. వైయస్‌ నాయకత్వంలో కలిసి పనిచేశాను అంతే. ఆయన నాకు రాజకీయ జీవితం ఇచ్చారంటే నవ్వుతారు. గతం తెలుసుకుని మాట్లాడండి.

-కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి

బాగా గుర్తుతెచ్చుకోండి. మీరు వైయస్‌తో కలిసి పనిచేశారా? లేక ఆయన తండ్రి రాజిరెడ్డి తో కలిసి పని చేశారు. చూడబోతే, తమరు భూమికి ముందు పుట్టినట్టున్నారు!!

ట్విట్టోరియల్‌

మూడు ముక్కలాట

కులం! మతం! ప్రాంతం! ఈ మూడు మాటలూ నచ్చితే ఒట్లు.( వోట్లు కూడా) నచ్చక పోతే తిట్లు. అధికారాన్ని సుష్టుగా భోంచేసే ఏ రెండు మూడు కులాలకో ఈ మాటలు తిట్లలాగే అని పిస్తాయి. కానీ, ‘పవరే’ ఎరుగుని బడుగులకూ, మైనారిటీలకూ, వెనుకబడిన ప్రాంతీయులకూ ఇవి వొట్లు. ఈ వొట్లే చైతన్యం వల్ల దేశ వ్యాపితంగా వోట్లుగా మారాయి. దాంతో ‘దేశాధినేత'(రాష్ట్రపతి) ఎన్నిక కు ఈ మూడు మాటలూ అవసరమయ్యాయి. (మైనారిటీ) మతమయితే అన్సారీ, (అణగారిన) కులమయితే మీరా కుమారి, ప్రాంతమయితే ప్రణబ్‌ ముఖర్జీల పేర్లను కాంగ్రెస్‌ ముందు పెట్టుకు తిరుగుతోంది. ఎందుకంటే ఎస్సీ,బీసీ, మైనారిటీల ఆలంబన గావున్న పార్టీల, ప్రాంతీయ పార్టీల మద్దతు కావాలంటే ఈ మూడు ముక్కల్నీ ఉఛ్చరించక తప్పదు. ఇష్టంలేని మంత్రోఛ్ఛారణ చెయ్యటం పైనున్న వారికి కష్టంగానే వుంటుంది. కానీ తప్పదు మరి!

‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

పెద్ద బాల ‘శిక్ష’!

సుబ్రహ్మణ్యస్వామి(జాతీయాధ్యక్షుడు, జనతా పార్టీ) : అంబేద్కర్‌కు వ్యతిరేకంగా వేసినట్టుగా ఆరోపించబడుత్ను కార్టూన్‌లో, నెహ్రూ కొరడాతో కొడుతున్నది నత్తనే కానీ (దాని మీద కూర్చున్న) బాబాసాహేబ్‌ను కాదని అనుకుంటున్నాను. కార్టూనిస్టు శంకర్‌ దళిత వ్యతిరేకా? అసంభవం.

కౌంటర్‌ ట్వీట్‌: కానీ ఆ కార్టూన్‌ని పాఠ్యపుస్తకంలో పెట్టిన వాళ్ళు కేవలం దళిత వ్యతిరేకులు మాత్రమే కాదు, రాజ్యాంగ వ్యతిరేకులు కూడా. శిక్ష ఏమిటో సెలవిస్తారా?


ఈ- తవిక

ద్విపాత్రాభినయం

హిట్టయితే ‘మెగా’

ఫ్లాపయితే ‘చిరు’

ఇది సినిమా.

గెలిస్తే ‘నాజీ’

ఓడితే ‘మాజీ’

ఇది రాజకీయం

బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

మనీ-మీడియా-మాఫియా, ఈ మూడూ రాజకీయానికి మూడు ముఖాలు. కానీ, ఈ మూడింటిని కలిపేశాడు ఒకాయన. ఏమయ్యింది? ముఖం ‘మాడియా’ అయ్యింది.

కొట్టేశాన్‌( కొటేషన్‌):

పదండి ‘మందు’కు, పదండి ‘డోసు’కు పోదాం పోదాం (పోలింగ్‌) క్యూలోకి!
-సతీష్ చందర్

1 comment for “‘చేతులు’ కాలాక ‘పువ్వులు’!

  1. చాలా బాగుంది సెటైర్. నేటి ప్రాంతీయ మరియు జాతీయ రాజకీయాలను చాలా వ్యంగంగా! రాసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *