ఛాయ్, ఛాయ్, మోడీ ఛాయ్!

modi chaay‘ఛాయ్‌’!

ఇది మాట కాదు, మంత్రం.

ఇంత వరకూ మనకు అల్లం ఛాయ్‌, మసాలా ఛాయ్‌, ఇరానీ ఛాయ్‌ మాత్రమే తెలుసు. ఇప్పుడు దేశంలో ఛాయ్‌లో కొత్త బాండ్రింగ్‌ వచ్చింది. అదే ‘మోడీ ఛాయ్‌’

అయితే ఈ ఛాయ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ మాత్రం మణిశంకర్‌ అయ్యరే. బహుశా, నరేంద్రమోడీకి ఇంతటి ప్రచారాన్ని స్వంత పార్టీ(బీజేపీ) నేతలే ఇంతవరకూ కల్పించి వుండరు. కానీ కాంగ్రెస్‌ వాడే అయినప్పటికీ మణి శంకర్ అయ్యర్ ఈ సాహసానికి ఒడిగట్టారు.

‘మోడీ ఛాయ్‌’ అనేది 2014 ఎన్నికలకు దాదాపు బీజేపీ నినాదం అయి కూర్చునేటట్టుంది. ఒకప్పుడు ‘మందిర్‌’ , తర్వాత ‘కార్గిల్‌’ నినాదాలు బీజేపీకి బాగా కలసి వచ్చాయి. మళ్ళీ ఇన్నాళ్ళకు ‘పొగలు’ కక్కుకుంటూ ‘ఛాయ్‌’ నినాదం వచ్చేసింది.

ఎదుటి వాడు మెడలో పాముని వేసినా, దానిని పూలమాలగా మార్చుకోగలిగిన వాడే రాజకీయ చతురుడు. నరేంద్ర మోడీ ఆ రకంగా చతురుడే అని భావించవచ్చు.

ఆ మధ్య నీలాంజన్‌ ముఖోపాధ్యాయ నరేంద్ర మోడీ పై ‘ ది ఎనాటమీ ఆఫ్‌ నరేంద్ర మోడీ: మ్యాన్‌ అండ్‌ పాలిటిక్స్‌’ అనే పుస్తకం రాశారు. అందులో మోడీ బాల్యం గురించిన కథనం వుంది. మోడీ తండ్రి ఛాయ్‌ వాలా. గుజరాత్‌ లోని వాద్‌ నగర్‌ స్టేషన్లో ఆగిన ప్రతీ రైలు దగ్గరకీ వెళ్ళి టీ అమ్మటంలో ఆరేళ్ళవయసులోనే మోడీ తండ్రికి సహకరించే వాడు.

పేదరికంలోంచి పైకి వచ్చిన నేతలు ప్రపంచమంతటా వున్నారు. ఇలాంటి నేపథ్యం వుండటం ఒక రకంగా పలువురికి స్ఫూర్తి దాయకం.

కానీ అయ్యర్‌ ఈ ‘టీ’ కథను తల్లకిందులుగా చూశాడు. ‘ఈ శతాబ్దంలోనే మోడీ ప్రధాని కాలేడు… ఒకవేళ ఆయన ఛాయ్‌ అమ్ముకోవాలనుకుంటే, ఇక్కడ జాగా చూపిస్తాం’ అన్నారు.

ఇలా అంటే ఒక్క మోడీకీ, మోడీ అనుయాయులకే కోపం వస్తుందనుకున్నారు అయ్యర్‌. నిజంగా అయ్యర్‌ ‘టీ’ మార్కును, టీమార్కులాగే ఉంచేస్తే, అలాగే జరిగేది.

కానీ అసలే మోడీ, ఆ పై ఆయన మీద ‘టీ’ ఒలికింది, దానిని రాజకీయంగా వాడకుండా ఊరుకుంటారా?

ముందు ‘టీ’ కా తాత్పర్యం చెప్పారు:

రైలు ప్రయాణికుల సమస్యలు, రైల్వే మంత్రి కన్నా, రైల్లో టీ అమ్మిన వాడికే బాగా తెలుస్తాయి అన్నారు. పేదరికాన్ని అనుభవించినవారే దేశాన్ని పాలించగలరు అని కూడా చెప్పేశారు.

ఆ తర్వాత చూడాలి. దేశంలో టీ కంపెనీలు పండగ చేసుకున్నాయి. బహుశా, ఎప్పుడూ లేని విధంగా గత వారంలోనే ‘టీపొడి’ అమ్మకాలు పెరిగి పోయి వుండాలి.

బీజేపీ వారు ఎక్కడి కక్కడ ‘మోడీ ఛాయ్‌’ దుకాణాలు తెరిచేశారు.

ఇప్పుడు ఎవరయినా రోడ్డు మీదకు వచ్చి ‘ఛాయ్‌’ తాగాలంటే, వెతకాల్సింది ‘ఛాయ్‌ దుకాణాన్ని’ కాదు. బీజేపీ కార్యాలయాన్ని. తప్పితే, బీజేపీ నిర్వహించే ‘ఉచిత తేనీటి శిబిరాన్ని’

ఎన్నడూ మద్యం సేవించని వ్యక్తిని ‘టీ’ టోటలర్‌ అంటారు( టీ- స్పెల్లింగు వేరనుకోండి). కానీ టీ కూడా తాగని వ్యక్తిని ఏమనాలి? ‘వెంకయ్య నాయుడు’ అనాలి. నిజమే. ఇంత వరకూ బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్య నాయుడు ‘టీ’ తాగలేదట. కానీ రాజకీయ అవసరం ఎంతటి పనయినా చేయిస్తుంది. మొదటి సారిగా ‘మోడీ ఛాయ్‌’ ను రుచి చూశారు. అంతే. ఇక ఎత్తిన కప్పును దించితే ఒట్టు. ‘ఛాయ్‌ తాగు, తాగించు. మాకు రాజకీయ జీవితాన్ని అందించు’ అంటూ ఉద్యమస్ఫూర్తితో దేశమంతటా తిరిగేస్తున్నారు. ‘మోడీ ఛాయ్‌’ ను పంపిణీ చేస్తున్నారు.

బహుశా అయ్యర్‌ నోరు జారినప్పుడు, ‘టీ’ శక్తిని తక్కువ అంచనా వేసివుంటారు. నరేంద్ర మోడీ చొక్కా మీద ‘టీ మరక’ వేశానన్న ఆనందంలో, మరో మరకను తుడిచేస్తున్నానని ఊహించ లేక పోయారు.

మోడీ మీద ‘మతతత్త్వ మరక’ వుండేది. ఇంకా చెప్పాలంటే, ‘ముస్లిం వ్యతిరేక’ మరక వుండేది. కానీ, ‘ఛాయ్‌’ అనేది సెక్యులరిజానికి ప్రతీక. ఛాయ్‌ అమ్మే వారిలో అన్ని మతాల వారూ వుంటారు. ముస్లింలు కూడా గణనీయంగా వుంటారు. హైదరాబాద్‌లో అయితే, ఎక్కువగా దొరికేదే ‘ఇరానీ’ ఛాయ్‌. ఇప్పుడు దేశంలో ‘ఛాయావాలా’ల వోటు బ్యాంకు ఏర్పాటయినా ఆశ్చర్యం లేదు.

వాడుకోవాలి కానీ, రాజకీయాల్లో ప్రతి తిట్టూ ఒక ఆశీర్వచనమే. తిడితే, ఉడుక్కునే వారు రాజకీయాల్లో రాణించలేరు. ప్రత్యేక రాష్ట్ర వివాదాల నేపథ్యంలో ఒక దశలో టీఆర్‌ఎస్‌ నేత కేసీఆర్‌- ‘కావాలంటే, కిరణ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌లో టిఫిన్‌ సెంటర్‌ పెట్టుకోవచ్చు’ అన్నారు. కిరణ్‌ స్థానంలో మోడీ వుంటే ఏం చేసేవారు..? ఊహించండి. టీ తాగించటానికి బదులు టిఫిన్లు తినిపించేవారు. కానీ కిరణ్‌ వ్యాఖ్యకు ప్రతి వ్యాఖ్య చేశారు కానీ, వాడుకోలేక పోయారు. బహుశా ‘మోడీ ఛాయ్‌’ ఉద్యమాన్ని చూసి ఆయన నాలుక కరుచుకుంటున్నారేమో!

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 2ఫిబ్రవరి2014 వతేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *