పేరు : సుబ్రహ్మణ్య స్వామి
దరఖాస్తు చేయు ఉద్యోగం: ఇన్వెస్టిగేటివ్ పాలిటిష్యన్ (పరిశోధనాత్మక రాజకీయ నాయకుడు). ( ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు వున్నట్లే, ఇన్వెస్టిగేటివ్ పాలిటిష్యన్ కూడా వుంటారని మన దేశానికి పరిచయం చేసింది నేనే. నేను తవ్వి తీసిన కేసులు ఎందరో నాయకుల పీకలకు చుట్టుకున్నాయి. జయలలిత నుంచి రాజా వరకూ ఎవ్వరినీ వదల్లేదు.నేషనల్ హెరాల్డ్ పత్రిక కు సంబంధించిన ఆస్తులను అక్రమంగా కైంకర్యం చేశారని సోనియా గాంధీ, రాహుల్ పైన కేసు పెట్టింది కూడా నేనే. )
వయసు :ఏడు పదులు దాటిన వాడిని. అయినా ఎగరటం మానలేదు. ఇప్పుడు తాజాగా రాహుల్ మీద ఎగిరాను. రాహుల్ తనకు తానుగా ‘బ్రిటిష్ పౌరుణ్ణ’ని అఫిడవిట్లో రాసిన ప్రాథమిక ఆధారాలున్నాయని చెబుతున్నాను.
ముద్దు పేర్లు :కలహ భోజనుడు.( కలహం లేకపోతే, నాకు కడుపు నిండదు. పురాణాల్లో ఈ పేరు నారదుడికి వుండేది.) ‘జగడాల’ స్వామి.
‘విద్యార్హతలు : ‘అర్థ’ (కాసుల) శాస్త్రంలో పిహెచ్‌డి. కానీ, కాసుల మీద మోజు కంటే, ‘కేసుల’ మీదే మోజు ఎక్కువ వుంటుంది.
గుర్తింపు చిహ్నాలు :ఒకటి: నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందంటారు. నా నోరే నాకు పేరు తెచ్చిపెట్టింది. నేను నోరు పారేసుకుంటే చాలు, పత్రికల్లో పతాక శీర్షికలయి పోతాయి.
రెండు: ఏ కుర్చీ వేసినా క్షణం పాటు కూర్చోలేను. ఉద్యోగాన్నయినా, పదవినయినా అలాగే మారుతుంటాను.
సిధ్ధాంతం :‘మను ధర్మాన్నీ’, ‘మార్కెట్ ధర్మాన్నీ’ కలగలిపిన సిధ్ధాంతం నాదే. అందుకే, ముందు జనతా పార్టీలో వున్నా, మెల్లగా భారతీయ జనతా పార్టీకి చేరువయ్యాను. నా అభిప్రాయాలు చూసి, నెహ్రూ , ఇందిరాగాంధీలు ఠారెత్తి పోయారు. అందువల్లే నాకు ‘ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’లో ఉద్యోగం రానివ్వలేదు.
వృత్తి : సంచలన వ్యాఖ్యలు చేయటం. ‘మేం ఒకప్పుడు హిందువులమే’ అని ఒప్పుకున్న ముస్లింలకే వోటు వేసే హక్కు ఇవ్వాలని ముందు వాదించింది నేనే. ఇలాంటి వ్యాఖ్యలు మోడీ, అమిత్ షాలు సైతం చేయలేరు. హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి వెళ్ళకుండా చట్టం చేయమన్నది కూడా నేనే. ద్రుష్టి మళ్ళించటమే మన వివాదాల అంతరార్థం. ’నేషనల్ హెరాల్ల్ కేసు ముందుకు తెచ్చి దేశం ద్రుష్టిని ’అసహనం‘ మీద నుంచి మళ్ళించాను. అఫ్ కోర్స్. నెహ్రూ స్థాపించిన ’నేషనల్ హెరాల్డ్‘ ను బతికించుకోవాలని కాంగ్రెస్ వారు వాదించ వచ్చు.
హాబీలు :1. ‘కీహోల్ జర్నలిజం’. అనగా ‘రంథ్రాన్వేషణ చెయ్యటం’. అందుకే రహస్యాల మీద వున్న శ్రధ్ధ, బహిరంగ విషయాల మీద వుండదు.
2. పార్లమెంటు సభ్యుడిగా వున్నా, సమస్యలకు పరిష్కారాలను పార్లమెంటులో కాకుండా కోర్టుల్లో వెతుక్కుంటాను.
అనుభవం : ‘గ్లోబలైజేషన్’ ను స్వాగతించటంలోనూ ‘గోబలి’ అయిజేషన్ ను వ్యతిరేకించటంలోనూ కాంగ్రెస్‌లో మన్ మోహన్ సింగ్‌కూ, బీజేపీలో నరేంద్ర మోడీకూ నేనే స్ఫూర్తి
మిత్రులు : నాతో మిత్రులుగా వుండటానికి ఇష్టపడరు. ఉన్నా వారి ప్రయివేటు విషయాలను నాతో పంచుకోరు. నోరు జారతానని భయం.
శత్రువులు : ఆర్కే నారాయణ్ ‘స్వామి అండ్ హిజ్ ఫ్రెండ్స్’ అని రాశాడు. నన్ను చూశాక రాసి వుంటే, ‘స్వామి అండ్ హిజ్ ఫోస్’ (స్వామి, అతని శత్రువులు) అని రాసేవాడు. మనకి ‘శత్రు’కోటి యెక్కువ.
మిత్రశత్రువులు :తావే లేదు. ఏ శత్రువూ నా దగ్గర మిత్ర వేషం కట్టలేడు. నేను పొగడను, నన్ను పొగడనివ్వను.
వేదాంతం : భుక్తికి ప్రపంచీకరణ, భక్తికి హైందవీకరణ.
జీవిత ధ్యేయం : నేను పెట్టే కేసులతో దేశంలో సగం మంది నేతలు ఎన్నికలలో పోటీ చెయ్యటానికి అనర్హులు కావాలి. వారిలో తప్పకుండా నెహ్రూ-గాంధీ కుటుంబ వారసులందరూ వుండాలి.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రికలో ప్రచురితం)