జూనియర్‌ ఆట అదుర్స్‌!

కోపం జూనియర్‌ ఎన్టీఆర్‌ మీద.

కేకలు కొడాలి నాని మీద.

తెలుగుదేశం పార్టీ నాయకుల తాజా వైఖరి ఇది. అధినేత చంద్రబాబు నాయుడు ఆంతర్యం కూడా ఇదే.

జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే చంద్రబాబుకు ప్రియమా? భయమా?

తొలుత ప్రియంగా అనే అనిపించింది. కారణం ఒక్కటే. జూనియర్‌ గ్లామరున్న ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుడు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ వారసత్వ రాజకీయాలకున్న డిమాండ్‌ అంతా,ఇంతా కాదు. ఈ విషయం అందరి కన్నా చంద్ర బాబుకు బాగా తెలుసు. చిత్రమేమిటంటే, తాను ఆ వారసత్వంలో తాను కూడా వాటాకి వస్తారు. తాను ఎన్టీఆర్‌ అల్లుడుగానే రాష్ట్ర ప్రజలకు పరిచయం కావాలనుకున్నారు. అలాగే అయ్యారు. ఆయన నారా ఖర్జూర నాయుడు కొడుగ్గా ఎంతమందికి తెలుసు. అంతే కాదు. చటుక్కున తమ కుటుంబసభ్యుల గురించి చెప్పాల్సి వస్తే, వెంటనే బావ బాలయ్య పేరు చెబుతాడు కానీ, సోదరుడు నారా రామమూర్తి నాయుడు పేరు ముందు చెప్పరు. అందుకే ఎన్టీఆర్‌ పుత్రులన్నా, పౌత్రులన్నా ముచ్చట పడతారు. ఆ కారణంగానే హరి కృష్ణ అన్నా ప్రియమే, ఆయన తనయుడు జూనియర్‌ అన్నా ప్రియమే.

మరి భయం దేనికి? తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆయనకు ఆయన మామ ఎన్టీఆర్‌నుంచి ‘వారసత్వం’ గా సంక్రమించలేదు. అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకోని, ఆయనను పార్టీకి దూరం చేయటం ద్వారా ముఖ్యమంత్రి పదవితో పాటు, అధ్యక్ష పదవినీ (అంటే ప్రభుత్వాన్నీ,పార్టీనీ) ఆయననుంచి పొందారు. చంద్రబాబు చేసిన ఈ పనిని అప్పట్లో(1995లో) రెండు వర్గాల మీడియా రెండు రకాలుగా అభివర్ణించింది. బాబును మెచ్చే మీడియా ‘తిరుగుబాటు’ అన్నది. మెచ్చని మీడియా ‘వెన్నుపోటు’ అన్నది. ఇలా ‘బలవంతపు వారసత్వాన్ని’ పొందాలనుకున్నప్పటినుంచీ, ఎన్టీఆర్‌ సంతానం పట్ల కాస్త భయం వుండి పోయింది. సాటి అల్లుడు( తోడు అల్లుడు) దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఆదినుంచీ ఎడమగానే వుంచుతూ వచ్చారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా ‘అల్లుళ్ళ పాలనే’ ప్రధానంగా నడిచేది. ఇద్దరు అల్లుళ్ళూ పార్టీలో రెండు గ్రూపులు నడిపే వారు. కానీ బాబు తనకున్న చాకచక్యంతో ఎక్కువ సార్లు తన గ్రూపు మాటనే నెగ్గించుకునే వారు.

కానీ సరిగ్గా ఎన్టీఆర్‌ను ఏకాకిని చేద్దామనుకున్నప్పుడు జాగ్రత్త పడిపోయారు. పార్టీలో ఒక గ్రూపుకు నేతగా వున్న దగ్గుబాటినీ, ఎన్టీఆర్‌ సంతానంలో చురుకుగా వుండే హరికృష్ణనూ దగ్గరకు తీసుకున్నారు. కానీ ఒక్కసారి అయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక, వీరిద్దరి నీడల్ని చూసి కూడా భయ పడ్డారు. అంతే, వారంతట వారు పార్టీని వీడే వాతావరణాన్ని కల్పించారు. దగ్గుబాటి తిరిగి ఎన్టీఆర్‌ గూటికి వచ్చారు. ఎన్టీఆర్‌ మరణానంతరం, హరికృష్ణ ‘అన్న తెలుగుదేశం’ పార్టీని స్థాపించారు. (సరే, హరికృష్ణ మళ్ళీ చంద్రబాబు దగ్గరకే చేరారనుకోండి)

బాబు అధికారంలో వున్న తొమ్మిదేళ్లూ పార్టీమీద తిరుగులేని ఆదిపత్యాన్ని సంపాదించేశారు. కానీ ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల మన్ననల మీద పెద్ద దృష్టి పెట్టలేదు. కానీ ఒక్క సారి ప్రతి పక్షంలోకి వచ్చాక, ఎన్టీఆర్‌ కొడుకులూ, మనుమలూ అవసరమయ్యారు. ఎన్టీఆర్‌ ‘వారసుడి’గా తనను ఎప్పటికీ జనం చూడలేరన్న వాస్తవాన్ని గ్రహించారు.

దాంతో ఆయన దృష్టి ముందు బాలయ్య మీదా, తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ మీదా పడింది.

అయితే బాలయ్య ను పార్టీ వేదికల మీదకు పిలిచినప్పుడెల్లా బాలయ్యను ముఖ్యమంత్రిగా చూడాలన్న బాలయ అభిమానుల ఆకాంక్ష నినాద రూపంలో మిన్నంటుతూ వుండేది.

ఒక సారి వేదిక వెనుక బ్యానర్‌ మీద బాబు చిత్రం మాత్రమే వుంచి బాలయ్య చిత్రం లేక పోవటం పట్ల ఆయన అభిమానులు విరుచుకు పడ్డారు.

అదీ కాక ఎన్టీఆర్‌ ఏదో ఒక సందర్భంలో ‘బాలయ్యే నా వారసుడు’ అన్న మాటలు కూడా బహుశా చంద్రబాబును వెంటాడుతూ వుండేవి.

దాంతో బాలయ్య అంటే ఎంత ప్రియమో, అంత భయమూ వుండేది.

 

‘మూడు ముళ్ళే’ ముకు తాళ్ళు!

సరిగ్గా ఇదే సమయంలో పోలికలలో అచ్చుగుద్దినట్టు వుండే జూనియర్‌ ఎన్టీఆర్‌ అగ్రహీరోల సరసన చేరారు. ఎలాగయిన జూనియర్‌ ను మచ్చిక చేసుకోవాలనుకున్నారు.

కేవలం నటనలో మాత్రమే సీనియర్‌ ఎన్టీఆర్‌ను స్ఫురణకు తేవటం మాత్రమే కాదు, ఎన్నికల ప్రచార శైలిలోకూడా జూనియర్‌ తాతయ్యను గుర్తు చేశారు కూడా. 2009 ఎన్నికలలో జూనియర్‌ ప్రచారం జనాన్ని బాగా ఆకట్టుకుంది. (అయితే అది వోట్ల రూపంలో పూర్తిగా మారలేదు. అది వేరే విషయం. జూనియర్‌ ఎన్టీఆర్‌ కుండే అభిమానుల వయసునూ, వారిలో ఎక్కువ మంది లేని వోటు హక్కును కూడా గణనలోకి తీసుకోవాలి.) అయితే అనుకోకుండా జూనియర్‌ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురి కావటంతో అర్థాంతరంగా ఆయన ప్రచారం ఆగిపోయింది. అప్పటి నుంచీ జూనియర్‌ పట్ల తెలుగుదేశం శ్రేణుల్లో గురి ఏర్పడింది.

దాంతో నేడు ప్రజల సమ్మతి మేరకు ఎన్టీఆర్‌ కుటుంబ వారసులుగా ముగ్గురు నిలిచారు. ఒకరు: హరికృష్ణ, రెండు: బాలయ్య. మూడు: జూనియర్‌ ఎన్టీఆర్‌.

‘ఈ ముగ్గురునీ ఉపయోగించుకోవాలి. అదే సమయంలో ఎన్టీఆర్‌ రాజకీయ వారసత్వం వారి వైపు పూర్తిగా వెళ్ళ కూడదు.’- ఇదే చంద్రబాబు వ్యూహం మారింది.

వారితో కుటుంబ బాంధవ్యాన్ని మరింత పెనవేసుకున్నారు.

బాలయ్య కుమార్తె బ్రాహ్మణితో తన కొడుకు లోకేష్‌కు వివాహం జరిగిపోయింది.

తర్వాత తనకు దగ్గర బంధువయిన నార్ని లక్ష్మీ పణతితో ముడి పెట్టటంలో కీలక పాత్ర వహించారు.

ఈ బంధం వల్ల ‘బాబు మాటే బాలయ్య’ మాటగా అయ్యింది కానీ, ‘బాబు మాటే జూనియర్‌ మాట’ గా మారలేదు. జూనియర్‌ ఎన్టీఆర్‌ స్వతంత్ర వైఖరి మరింత పెరిగింది.

 

ఇక జూనియర్‌కు కళ్ళెం వేయటానికి బాబు దగ్గర మిగిలివున్నది ఒకే ఒక అస్త్రం: ‘విభజించి పాలించటం’

వ్యక్తిగత కారణాల వల్ల, జూనియర్‌ ఎన్టీఆర్‌కూ, ఆయన తండ్రి హరికృష్ణకూ ఆది నుంచీ కొంత అంతరం నడుస్తూనే వుంది.

అలాగే సినీ పరిశ్రమలో పోటీ వల్ల, వారిద్దరూ వరసకు ‘బాబాయ్‌- అబ్బాయ్‌’లు అయినా, ఇద్దరి అభిమానులూ వైరి వర్గాల్లా మారిపోయారు. జూనియర్‌ చిత్రం విడుదలయినప్పుడు ఆ సినిమా చూడవద్దంటూ కొందరు ఇచ్చిన ఎస్సెమ్మెస్‌లు వారి మధ్యా అంతరాన్ని మరింత పెంచాయి.

ఈ విభేదాల్లో ఎన్టీఆర్‌ను ఒంటరిని చేశారు. అప్పుడయినా జూనియర్‌ను తన దారికి తెచ్చుకోవచ్చన్నది చంద్రబాబు వ్యూహం.

 

వయసులోనే జూనియర్‌! ఆటలో సీనియరే!

కానీ జూనియర్‌ ఎన్టీఆర్‌, బాబు ఊహించినంత చిన్నవాడిలా లేరు.

తనకు తాను 28 ఏళ్ళ కుర్రవాణ్ణనీ, తనకిప్పుడే రాజకీయాలెందుకనీ ఆయన చెప్పుకుంటున్నా, ఆయన వ్యూహ రచన అలా కనిపించటం లేదు.

పార్టీ శ్రేణుల్లోనే కాదు, పార్టీ నేతల్లోనూ, శాసన సభ్యుల్లోనూ తనకంటూ ఒక వర్గాన్ని జూనియర్‌ చాప కింద నీరులాగా పటిష్ట పరచుకుంటున్నారు.

చిత్రంగా వారిలో ఒకరి తర్వాత ఒకరు తమ ధిక్కార స్వరాల్ని ప్రకటిస్తున్నారు.

అయితే ఇలా చంద్రబాబు గీసిన ‘లక్ష్మణ రేఖల్ని’ దాటుతున్న వారంతా, జూనియర్‌ ఎన్టీఆర్‌ విధేయులు కారు. కానీ, అలా ధిక్కరిస్తున్న వారిలో జూనియర్‌ ఎన్టీఆర్‌కు సన్నిహితులు కూడా వుంటున్నారు. ఇది మాత్రం జూనియర్‌ కూడా కాదనలేని సత్యం.

ఇలా చేసిన వారిలో గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నాని రెండవ వ్యక్తి .

మొదటి నేత తెలుగు దేశం పార్టీ విజయవాడ నగర నేత వల్లభనేని వంశీ.

ఇద్దరికీ తేడా ఒక్కటే.

నాని నేరుగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డిని జైలులో కలిశారు.

వంశీ మాత్రం జగన్‌ను ప్రచారంలో వుండగా వెళ్ళి ‘కౌగలించుకున్నారు’

ఇద్దరూ కలిసింది జగన్‌నే.

కానీ తెరపైకి మాత్రం జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరు వెలుపలికి వచ్చింది. కారణం వీరిద్దరూ జూనియర్‌కు అత్యంత సన్నిహితులు.

అయితే అప్పట్లో వంశీ తెలుగుదేశం అధిష్టానం హుకుంను గౌరవించి తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. కానీ నాని మాత్రం చంద్రబాబుతో ‘అమీ-తుమీ’ అంటున్నారు. నానీ, వంశీలు కూడా ఒకరికొకరు సన్నిహితులే. కాబట్టే, నాని మీద ధ్వజమెత్తటానికి కృష్ణా జిల్లా తెలుగుదేశం నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంశీ కనబడలేదు.

 

వీరిద్దరి కదలికలూ జూనియర్‌ చెప్పితే చేసినవని చెప్పలేం.

రోడ్డు మీద వెళ్తున్న జగన్‌ను కౌగలించుకోమనీ, జెలులో వున్న జగన్‌ను పరామర్శించి రమ్మనీ చెప్పాల్సిన అవసరం ఎన్టీఆర్‌కు ఉండక పోవచ్చు.

కానీ, వీరి కదలికల విషయంలో జూనియర్‌కు ముందస్తు సమాచారం లేనే లేదా? 2009 ఎన్నికల్లో గుడివాడ సీటును కొట్లాడి మరీ ఇప్పించిన జూనియర్‌ కు నాని మాట మాత్రమయినా చెప్పి వుండరా? తెలిసి కూడా మిన్న కున్నారా?

ఇవన్నీ చూస్తుంటే, తాను రాజకీయాలకు ‘దూరం, దూరం’ అంటునే ఎన్టీఆర్‌ తన వ్యూహాన్ని తాను రచిస్తున్నట్లుగా అనిపిస్తోంది.

 

‘కుర్ర తాతే’ రేపటి నేత?

జూనియర్‌ ఎన్టీఆర్‌ దృష్టిలో తెలుగుదేశం పార్టీ ప్రజలది అవునో కాదో తెలియదు కానీ, అది ‘బాబు’ సొత్తూ, ‘బాలయ్య’ ఆస్తీ కాదు, హరికృష్ణ ప్రితార్జితమూ కాదు. అది ఇప్పటికీ, ఎప్పటికీ తాత ఎన్టీఆర్‌ది. అందుకే తెలుగుదేశం పార్టీని తాను ప్రస్తావించినప్పుడెల్లా, తాతయ్య పేరునే పదే పదే జపిస్తారు. పార్టీ శ్రేణులకు ఇదే సందేశాన్ని పంపుతుంటారు. నాయకత్వం మార్పు అనేది ‘నలుగురు కూర్చుని నిర్ణయించేది’ కాదని జూనియర్‌ తానిచ్చిన వివరణలోనే చెప్పారు. అది పార్టీ శ్రేణులంతా నిర్ణయించాలన్నది ఆయన ఆంతర్యం. అంటే అలా మార్చే రోజు వస్తుందన్నీ, అప్పుడు ఆ తాతకు మనవడిగా వారసత్వం తనకే దక్కుతుందన్న సుధీర్ఘ వ్యూహంతో జూనియర్‌ అడుగులు వేస్తున్నారు.

అయితే ఈ స్థితి దానంతట అది వచ్చేటంత వరకూ వేచి చూడటానికి ప్రతి వ్యూహాలు రచించాల్సిన అవసరం లేదు.

తెలుగుదేశం పార్టీ వరుస వైఫల్యాలతో కునారిల్లి పోతుందని జూనియర్‌కీ తెలుసు. ఇందుకు వేరే వేరే కారణాలు చంద్రబాబూ, ఆయన అనుచరగణమూ చెప్పవచ్చు. కానీ ఇందుకు చంద్రబాబే కారణమని- నిరూపించాలన్నది జూనియర్‌ అంతర్గత వ్యూహం కావచ్చు.

అంతే కాదు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన స్వంత సామాజిక వర్గ విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నారని ధ్రువపరచాలన్నది కూడా ఆయన ఆంతర్యం కావచ్చు.

ఒక్కటి మాత్రం స్పష్టం అవుతోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ దైనందిన వ్యవహారలకు దూరంగా వున్నట్టు కనిపిస్తున్నా, తన వర్గీయుల ద్వారా పావుల్ని చకచకా కదువుతున్నారు. ఆయన ప్రదర్శిస్తున్న ఈ పరిణతిని చూస్తుంటే, ఆయన వెంట గట్టి సలహాదారులే వున్నట్లు అర్థమవుతోంది.

వంశీ, నాని- వంటి వారు జగన్మోహన రెడ్డిని కలవటమూ, ఆ పార్టీ వైపు మొగ్గుచూపటమూ- ఇవన్నీ ఉన్న రాజకీయ సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటానికేనన్నది ముందు ముందు అర్థమవుతుంది.

సరే, ఎంత మంది శాసన సభ్యులు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అన్ని ఉప ఎన్నికలు వస్తాయి. తిరిగి ఆ ఉప ఎన్నికలు 2014 వరకూ వైయస్‌ పట్ల వున్న సానుభూతిని తాజాగా వుంచటానికి ఉపయోగపడతాయి కాబట్టి, జగన్‌ వచ్చేవారిని ఆనందంగా ఆహ్వానిస్తారు. అంతే తప్ప, నాని మొత్తం వ్యహారం తెలుగుదేశం పార్టీకి సంబంధించిందే.

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 13-20జులై 2012 సంచికలో ప్రచురితం)

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *