టేకి’టీజీ’ వెంకటేష్‌

కేరికేచర్: బలరాం

పేరు : టి.జి.వెంకటేష్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: హై.సీమ ముఖ్యమంత్రి( అంటే హైదరాబాద్‌తో కూడిన రాయలసీమ ముఖ్యమంత్రి)

ముద్దు పేర్లు :‘టేకిటీజీ’ వెంకటేష్‌(నన్ను ఎవరైనా తిడితే ‘టేకిటీజీ’ అంటాను. నేను తిట్టిన ఈ ‘ఐయ్యేఎస్‌’లు ఎందుకు తీసుకోరో?

విద్యార్హతలు : బీ ‘కామ్‌’. (అయినా ఎప్పుడూ ‘కామ్‌’ గా వుండను. ఏదో ఒక ఆందోళన చేస్తూనే వుంటాను)

హోదాలు : ఎంత వ్యాపారం చేసినా, ప్రభుత్వాధికారులు పోజుకోడుతున్నారనే కదా- ఎమ్మెల్యే అయ్యాను. తర్వాత మంత్రి అయ్యాను. మీరే చెప్పండి మంత్రెక్కువా? ఐయ్యేఎస్‌ ఎక్కువా? అయినా నామాట వినలేదు. ముందుతెలిస్తే నేను కూడా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాసి, ఐయ్యేఎస్‌ అయ్యేవాడి.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: భగవంతుడు మెదడులేని బుర్రల్ని వెంట్రుకలతో కప్పుతాడు. కానీ నాకు మొదడు వుంది!

రెండు: ‘టీజీ’ అంటేనే వివాదానికి మారోపేరు(‘టూజీ’ వివాదం కాదండోయ్‌! దానికీ మనకీ చాలా దూరం.

సిధ్ధాంతం : ‘తాగను. తాగనివ్వను’ (మందయినా, పొగయినా సరే) ఇది నా సిధ్ధాంతం.( నాసంస్థల్లో పనిచేసే వారికి తాగనందుకు నెలనెలా అలవెన్సులిస్తాను.) ‘వాగను- వాగనివ్వను’ అనే సిధ్ధాంతాన్ని కూడా పాటిద్దామనుకున్నాను కానీ, అది నాకే వ్యసనం. కాబట్టి మానుకున్నాను.

వృత్తి : తెలంగాణలో కేసీఆర్‌కూ, ఆంధ్రాలో లగడపాటికీ ఏ వృత్తో, రాయలసీమ లో నాకూ అదే వృత్తి ఇచ్చారు. కేంద్రం ‘ప్రాంతీయ’ సమస్య పై ఆపరేషన్‌ చేస్తున్నప్పుడు, జనాన్ని కదలకుండా వంచే మత్తు వైద్యుడి( ఎనస్తీషియన్‌) వృత్తి.

హబీలు :1. ప్రచార ప్రియత్వం: నా మాట్లేడేటప్పుడు ‘ఆడియో’ లేక పోవచ్చు. కనీసం ‘వీడియో’ లేక పోవచ్చు. కానీ ప్రోగ్రాం ‘మీడియా’లో రావాలి.

2. ‘రియల్‌ ఎస్టేట్‌’ ఉద్యమం: సారీ తొందర్లో అలా అనేశాను. ‘రాయల్‌ స్టేట్‌’ అనబోయి, రియల్‌ ఎస్టేట్‌ అనేశాను. హైదరాబాద్‌ మాకివ్వకుంటే, ఎంత మూల్యం చెల్లించాలో లెక్క కట్టాను. ( ఈ పని సాధారణంగా ‘రియల్‌ ఎస్టేట్‌’ వారే చేస్తుంటారు.

అనుభవం : రాజకీయాల్లో ‘డిఫెన్ష్‌’ కన్నా, ‘అఫెన్స్‌’ గొప్పది. అందుకే నేను సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఎదుటి వారిని సంజాయిషీ అడుగుతాను. (సాగు నీరు ఇవ్వనందుకు నేను రైతులకు సంజాయిషీ ఇవ్వటం కన్నా, వారి తరపున ఐయ్యేఎస్‌ వారిని కేకలేస్తే గొప్పగా వుంటుంది కదా!)

మిత్రులు : సీమ వారికి తెలంగాణ వారూ మిత్రులే, ఆంధ్రులూ మిత్రులే. కాక పోతే ఆంధ్ర వాళ్ళు నా భుజం మీద చెయ్యి వేస్తే, నేను తెలంగా వాళ్ళ భుజం మీద చెయ్యి వేస్తాను.

శత్రువులు : ఐయ్యేఎస్‌ వారు. వీరిని నమ్ముకున్న వాళ్ళు ‘నుయ్యో’ ఎస్‌ లేదా ‘గొయ్యో’ ఎస్‌! ప్రతీ ఫైలు మీదా ఏదో ఒక కొర్రీ పెట్టి ఆపేస్తుంటే, రైతులయినా, ఎవరయినా చూసుకోవాల్సింది ‘నుయ్యో’ ‘గొయ్యో’ కదా!

మిత్రశత్రువులు :ఐపిఎస్‌ వారు. అందుకే వీరిని తిట్టటం లేదు. రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టటానికి పాపం, వీరిలో చాలా మంది శక్తి వంచనలేకుండా ప్రయత్నిస్తారు.

వేదాంతం : నిజాయతీయే, అవినీతా- అన్నది కాదు ముఖ్యం, పనిచేశారా? లేదా- ఇదే ప్రధానం. (అందుకే ‘నిజాయితీ’ బోర్డు పెట్టుకుని, పని చేయకుండా కూర్చునే ఐయ్యేఎస్‌ ల మీద అంత కోపం వచ్చింది.)

జీవిత ధ్యేయం : ‘రాయల్‌’ చాలెంజ్‌. రాయల సీమ హక్కుల సాధన కోసం ఎలాంటి సవాళ్ళనయినా ఎదుర్కోవటం.

-సతీష్ చందర్

 

 

 

 

Leave a Reply