డయిల్ ‘ఎమ్’(మనీ) ఫర్ మర్డర్!?

chittoor mayor's murderపైసలే ప్రాణాలు. ఇది మార్కెట్‌ యుగ ధర్మం. అందుకే రూపాయిని డాలర్‌లోకీ, డాలర్‌ని రూపాయిలోకీ మార్చుకున్నంత సులువుగా, పైసల్ని ప్రాణాల్లోకి, ప్రాణాలను పైసల్లోకి మార్చుకోవచ్చు. ప్రాణాలిచ్చేస్తాను, పైసలిచ్చేయ్‌- అంటూ ప్రాణత్యాగం చేసే వారుంటారు. అందుకే ఎక్స్‌గ్రేషియాకోసమో, రుణ మాఫీ కోసమో మరణించే పేదలూ, రైతులూ చనిపోవటం ఇక్కడ ఆశ్చర్యం కాదు. తాను పోతే, తనతో పాటూ తాను చేసిన అప్పూ పోతుందనో, లేక ఎంతో కొంత ఆర్థిక సాయం సర్కారు తన కుటుంబానికి చేస్తుందనో ఆత్మహత్యలు చేసుకునే వారున్నారు. అలాగే ‘పది రూపాయిల నుంచి పది లక్షల వరకూ వస్తుందంటే, సులభంగా ప్రాణాలు తీసి పెట్టే హంతకులకు కూడా దేశంలో లోటు లేదు. అయితే పైసల కోసం ప్రతీ సారీ హత్య చేయటం కూడా వారికి విసుగుగా వుంటుంది. అందుకే ‘అడిగినప్పుడెల్లా పైసలివ్వాలి’ అనే ‘బ్లాక్‌ మెయిలింగ్‌’తో పబ్బం గడుపుకునే వారుంటారు. అంటే వారు ఇతరుల జీవితాలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్లుగా చేసుకొని, ఎప్పటికప్పుడు వడ్డీ అనుభవిస్తూ వుంటారు.

బంగారు బాతుచేత గుడ్లు పెట్టించుకునే వాళ్ళూ మనకు తెలుసు, కోసి ఒకేసారి తినేసే వాళ్ళూ తెలుసు. మొదటి వాడు మూర్ఖుడనీ, రెండవవాడు తెలివయిన వాడనీ, మన వాళ్ళు సూత్రీకరణలు చేస్తూ వుంటారు. కానీ మూడో రకం వాళ్ళుంటారు. వారు అతి తెలివయిన వారు. గుడ్లు పెట్టినంత కాలం పెట్టనిచ్చి, ఎప్పుడయితే పెట్టదో అప్పుడు బాతును కోసి పారేస్తారు. ఇప్పుడు ఈ హంతకులు పెరిగారు. సంపద వున్న ప్రతీ చోటా, వీరి సంఖ్య పెరుగుతుంది.

వ్యసనాలు లేని వారికి పైసల అవసరం అప్పుడప్పుడూ వస్తుంది; వ్యసనాలున్న వారికి పైసలు ఎప్పుటికప్పుడు అవసరమవుతాయి. వ్యసనమంటే, మందు కొట్టడమనో, పొగపీల్చటమనో, ఆడపిల్లల వెంట పడటమో అని కాదు, ఆ మాట కొస్తే, ఖర్చు పెట్టటమే ఇప్పుడు పెద్ద వ్యసనమయి పోయింది. బైకులూ, కార్లూ, ఫ్లాట్లూ, ఫంక్షన్లూ, పార్టీలూ, ఎప్పుడూ ఖర్చు చేస్తూనే వుండటం. ఇదే వినిమయ సంస్కృతి. ఈ వ్యసనం వచ్చాక ఎంత సంపాదనయినా చాలదు. దాంతో నేరమే వృత్తిగానూ, ప్రవృత్తిగానూ మారిపోతుంది. వీరు నిత్యమూ పరాన్న భుక్కులుగా ఎప్పుడూ ఎవరి మీదో ఆధారపడివుంటారు.

సంపద వున్న చోటనే కాదు, హోదాలూ, పదవులూ, అధికారం వున్న చోట కూడా ఇలాంటి వారు చేరుతుంటారు. ‘వినిమయం’ వ్యసనానికి బానిసయినవాడు, కష్టార్జితం వైపు చూడడు. ‘సులభార్జన’ (ఈజీ మనీ) ఎక్కడ వుందో వెతుక్కుంటాడు. తమ రక్త బంధువులనయినా సరై ఇందుకోసం ‘లక్ష్యం’ గా చేసుకోవటానికి వెనకాడరు. ఇందుకు రాజకీయాలు అతీతంకాదు.

ఇంత వరకూ రాజకీయాల్లో రకరకాల హింస గురించి విన్నాం. మరీ ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో ఈ రెండు రకాల హింసకు ఒక చరిత్ర వుంది. కృష్ణా జిల్లాలో(విజయవాడలో) మాఫియా పేరు మీద హింస జరిగితే, సీమ ప్రాంతంలో ‘ఫ్యాక్షనిజం’ మీద హింస జరిగింది. ఈ హింస రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఒక దశలో, ఈ హింసే రాజకీయమయింది. ‘మాఫియా’ రెండు కులాల మధ్య ఆధిపత్య పోరుగా మారితే, ‘ఫాక్షనిజం’ ఒకే కులంలో కుటుంబాల మధ్య ఆధిపత్య పోరుగా వుండేది.

ఇప్పుడు దృశ్యం మారింది. ఈ విషయమే చిత్తూరు నగర మేయర్‌ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్‌ల దారుణ హత్య నిరూపించింది. పట్టపగలే, ఆమె తన ఆఫీసులో వుండగా, దుండగులు వచ్చి, కత్తిపోట్లతో, కాల్పులతో గాయపరచగా, అనూరాధ అక్కడిక్కడే చనిపోగా, మోహన్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు.

ఈ హత్యకు సంబంధించిన విచారణ ముందుగా, పాత రాజకీయ కక్షల వైపూ, రాజకీయ ప్రత్యర్థుల వైపూ సాగింది. కానీ, పట్టుబడ్డ సాక్షుల కథనం ప్రకారం, మోహన్‌ మేనల్లుడు( సొంత అక్క కొడుకు) చింటూ యే ఈ హత్యలో ప్రధాన నిందితుడనే పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. కొన్ని రోజుల క్రితమే మూడు లక్షలు అడిగితే ఇవ్వలేదని కక్ష పెంచుకున్నాడన్నది పోలీసుల నిర్బంధంలో వున్న సాక్షులు చెబుతున్నారు. అయితే మూడు లక్షలకే హత్య చేసేస్తారా? కావచ్చు. కాకపోవచ్చు. అంతకు ముందువరకూ ఇలా అడిగిన వెంటనే, అలా పైసలు పొందే నేపథ్యం వున్నప్పుడు, ఇలాంటి ఒకటి రెండు ఘటనలు అతనిలో అసహనాన్ని రేపవచ్చు.

ఒకప్పుడు బీజేపీ సీనియర్‌ నేత ప్రమోద్‌ మహాజన్‌ హత్య కేసులో, ఇలాగే సొంత తమ్ముడు ప్రవీణ మహాజన్‌ నిందితుడుగా వున్నాడు. తనకు చెయ్యాల్సినంత ఆర్థిక మేలు తన అన్నయ్య చేయటంలేదన్న అక్కసుతో ఈ హత్య జరిగింది. విపణే (మార్కెట్టే) విలువల్ని నిర్ణయిస్తున్న చోట, మనిషికీ, మనిషికీ మధ్య అనుబంధం మాయయి, అవసరం చోటు చేసుకుంటుంది. కాబట్టి, పలు కుటుంబాల్లో, ఒక కుటుంబమే మంచి హోదాలోనూ, అధికారంలోనూ వుంటే, చూసి తట్టుకోలేని తనం పెరిగిపోతుంది.

కాబట్టి రాజకీయ హత్యల్లోకి మాఫియా, ఫాక్షనిజం తర్వాత ‘కన్స్యూమరిజం’ ప్రవేశించందని చెప్పాల్సి వస్తోంది. పార్టీ ఏదయినా సరే, చిత్తూరు మేయర్‌గా ఎన్నికయిన తొలి మహిళ, భర్తతో పాటు ఇలా కడతేరి పోవటం దురదృష్టకరం. ప్రజలు చైతన్యవంతమయిన తర్వాత, రాజకీయాలను నుంచి హత్యారాజకీయాలు తొలగిపోతున్నాయని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో, మరో రూపంలో ఇవి ప్రవేశించటాన్ని అన్ని పార్టీలూ, పౌరసమాజమూ నిరసించాలి; కారణాలను అన్వేషించాలి.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 28 నవంబరు-4 డిశంబరు 2015 వ సంచికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *