దరఖాస్తు చేయు ఉద్యోగం : ‘డాను’ కిరణ్( అవును. డాన్‌ను కావాలనుకున్నాను.)
ముద్దు పేర్లు : ‘గన్ను’ పోటు దారు.(నమ్మిన వ్యక్తిని వెనకనుంచి పొడిచినప్పుడు, రాజకీయాల్లో అయితే వెన్నుపోటు అంటారు.
మా మాఫియా షలో ‘గన్ను’ పోటు అంటారు. కానీ రాజకీయంగా ‘మామ’ను పొడిచిన అల్లుళ్ళు కూడా నన్ను ఆడిపోసుకుంటున్నారు.
అదే నాకు బాధగా వుంది.)
విద్యార్హతలు : పాలి ‘టెక్నిక్’ ( చదువు తున్నప్పుడు దాని అసలు అర్థం తెలీలేదు. బయిటకొచ్చాక తెలిసింది- పాలిటిక్స్ ను నేరానికి
వాడుకునే టెక్నిక్కే, పాలి ‘టెక్నిక్’ అని.)
హోదాలు : కేరాఫ్ సూరి- ఇంతకు మించి హోదా ఏమిటి?
గుర్తింపు చిహ్నాలు : ఎందుకు చెప్పండి శ్రమ. గుర్తింపు చిహ్నాలు కాదు. నన్ను పట్టుకోవటానికి నా పోలికలతో రకరకాల బొమ్మలు వేయించి
పోలీసులు ప్రకటనలు ఇచ్చారు. ఎవరన్నా గుర్తు పట్టగలిగారా? ఏడాది వరకూ ఎవరూ పోల్చుకోలేదు. ఇంకా ఎందుకు చెప్పండి-
గుర్తింపు చిహ్నాలు?
సిధ్ధాంతం : గన్నును గన్నుతోనే తీయాలి.
వృత్తి : విరాళాలు సేకరించటం. మీరు చేస్తే ‘చందాల’ంటారు. మేము చేస్తే ‘దందాల’ంటారు.
హబీలు :1. కోర్టులు సకాలంలో చేయలేని పనులను చేపట్టడం.( మీ స్థలం ఎవడో కబ్జా చేస్తాడు. అది మీకు కావాలి.
మీరు కోర్టుల చుట్టూ పాతికేళ్ళు తిరగాలి. అందుకు స్థలం విలువలో సగం ఖర్చయిపోతుంది. అదేదో ముందే మాకిచ్చేస్తే, క్షణాల్లో తేల్చేస్తాం.)
2. రకరకాల తుపాకులు సేకరించటం.( తుపాకి వుంటే చాలు. పేల్చటంలో పెద్ద శిక్షణ అవసరంలేదు.
ఎలాగూ మనం కాల్చేది బాగా దగ్గర వాళ్ళను. అది కూడా బాగా దగ్గర నుంచి. అందుకు గురి పెట్టటం, తప్పటం- అంటూ వుండదు.)
అనుభవం : తమంతట తాము దొరికిపోయేవాళ్ళనే, పోలీసులు పట్టుకోగలరు.
మిత్రులు : రాజకీయాల్లో అయితే శాశ్వత మిత్రులూ, శాశ్వత మిత్రులూ వుండరు. కానీ ఫ్యాక్షనిజంలోనూ, మాఫియాలోనూ చిన్న తేడా
వుంది. మిత్రులు కానీ, శత్రువులు కానీ శాశ్వతంగా ప్రాణాలతో వుండరు.
శత్రువులు : ‘నీ కోసం ప్రాణమిస్తాను’ అని నాచుట్టూ తిరిగే వాడే నాకు శత్రువు. ఎందుకంటే అంతిమంగా అతడే నా ప్రాణం తీస్తాడు.
(నేను అదే దారిలో వెళ్ళాను లెండి)
మిత్రశత్రువులు : ఇంకెవరూ..? పోలీసులే.
జీవిత ధ్యేయం : ‘గన్ను పోటు’ ఎలాగూ నేర్చుకున్నాను. ‘వెన్ను పోటు’ కూడా నేర్చుకుని రాజకీయాల్లో డాన్ కావాలన్నది
నా కోరిక.
-సతీష్ చందర్