డబ్బు డబ్బుకే డబ్బిస్తుంది.
డ..డ..డ..డబ్బున్న మగాడు, డ..డ..డబ్బున్న ఆడదానికే మనసిస్తాడు.
డ…డ…డ.. డబ్బున్న కోతి, డ…డ..డ…డబ్బున్న కొండముచ్చుకే కట్నమిస్తుంది.
డ…డ…డ…డబ్బున్న పార్టీ వాళ్ళు, డ…డ…డ.. డబ్బున్న మరో పార్టీ వాళ్ళకే… డబ్బులిచ్చి మద్దతు పుచ్చుకుంటాడు.
జబ్బున్న వాడికే జబ్బులొచ్చినట్లు,
డబ్బున్న వాడికే ఎప్పుడూ డబ్బు చేస్తుంటుంది.
వెయ్యి జబ్బులొచ్చిన వాడు, వైద్యుడి కన్నా గొప్పవాడు. అందుకే, వెయ్యి జబ్బులొచ్చిన వాడు, పదివేల జబ్బులొచ్చిన వాడికి రోగం కుదర్చగలడు.
ఇప్పుడు జరగుతున్నది అదే.
ముల్లును ముల్లుతోనే తీసినట్లు, వజ్రాన్ని వజ్రంతోనే కోసినట్లు, డబ్బును డబ్బుతోనే పట్టుకుంటున్నారు.
వంద కోట్లు మింగిన వాడు, వెయ్యి కోట్లు మింగిన వాణ్ణీ, వెయ్యి కోట్లు మెక్కిన వాడు, లక్షకోట్లకు గడ్డి కరచిన వాణ్ణీ పట్టిస్తున్నారు.
దొంగే ‘దొంగ, దొంగ’ అని అరచినట్లు , డబ్బే’డబ్బు, డబ్బు’ అని అరుస్తోంది.
అర్థరూపాయి అవినీతి, రూపాయి అవినీతిని వెక్కిరిస్తోంది.
ఒక వెండినాణెమొచ్చి, ఒక బంగారు నాణాన్ని జైల్లోకి నెడుతోంది. పక్క బ్యారక్ లోంచి ప్లాటినం నాణెం పకపకా నవ్వుతోంది.
వారెవ్వా! కుబేరులు కుమ్ములాడుకుంటుంటే…అన్నీ కాసుల మోతలే.
వోటుకి నోటివ్వటమేమిటి? రెండూ ఒకటి కావా? డాలరూ డబ్బే; రూపాయీ డబ్బే. డాలరిచ్చి రూపాయిలు మార్చుకోమూ? ఇదీ అంతే. వోటే నోటు.
నోట్లిచ్చి వోట్లను చిల్లరగా కొనుక్కుని ఎన్నికయిన వాడు, తన వోటును నోట్లకు టోకుగా అమ్ముకోడా?
కొనటం అమ్మకం వున్న చోట మధ్యలో కొందరుంటారు. మర్యాదగా పిలుచుకుంటే మధ్యవర్తులవుతారు. ఎగతాళిగా పిలిస్తే దళారులవుతారు.
ఆర్థిక సంక్షోభాలొచ్చినప్పుడు, నోటు(రూపాయి) విలువ పడిపోతే పడిపోవచ్చు. కానీ రాజకీయ సంక్షోభాలొచ్చినప్పుడెల్లా, వోటు విలువ పెరుగుతూనే వుంటుంది.
కర్ణాటకలో యెడ్యూరప్పకు సంక్షోభం వచ్చినప్పుడెల్లా వోటు విలువ పెరిగిందనే చెబుతారు.
అలాగే యుపీయే-1కు ఒక సారి సంక్షోభం వచ్చింది. అప్పుడూ ఇలాగే వోటుకు రేటు పెరిగింది. సామాన్య ప్రజలకు కష్టాలు వస్తే పుస్తెలు తెగనమ్ముకున్నట్లు, వోట్లను వందకో రెండొందలకో తెగనమ్ముకుంటారు.
కానీ ప్రజాప్రతినిథులు( ఎక్కువ మంది) మంచి రేటు పలికినప్పుడే తమ నోటును అమ్ముకుంటారు. ఏయే కంపెనీల వాటాల ధరలకు ఎప్పుడెప్పుడు పెంపు వుంటుందో చెప్పటానికి విశ్లేషకులు వున్నట్లే, వోట్లధరల విశ్లేషకులూ వుంటారు. వాటాల క్రయవిక్రయాలు చేసిపెట్టే ‘స్టాక్ బ్రోకర్లు’ వున్నట్లే, వోట్లను అమ్మిపెట్టే ‘డెమాక్రసీ బ్రోకర్లు’ వుంటారు.
వీరి వోట్లకు రేట్లు పదింతలు పెరిగే అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఉన్నపార్టీలో వుండిపోవటం కూడా గొప్ప విషయమయిపోయినప్పుడూ, మూకుమ్ముడి రాజీనామాలు చేసి సర్కారుకు ముప్పుతేవటం ముఖ్యవిషయమయిపోయినప్పుడూ, ఉన్న ప్రతిపక్షాన్ని రెండు ముక్కలుగా చీల్చటం అనివార్యమయినప్పుడూ, కూలిపోతున్న ప్రభుత్వానికి చేయూత ఇవ్వాల్సి వచ్చినప్పుడూ, ఎన్నికలయ్యాక సర్కారు ఏర్పాటుకు బొటాబొటీ మెజారీటికి రెండో, మూడో వోట్లు తక్కువయినప్పుడూ… వోట్ల రేటు పోట్ల గిత్తలాగా(బుల్లిష్)గా పరుగెడుతుంది.
ఈ రకమైన క్రయవిక్రయాలు ఎన్నోదశాబ్దాలుగా జరిగిపోతూనే వున్నాయి. ఎటొచ్చీ, డబ్బే డబ్బును పట్టిస్తున్న ఈ తరుణంలో వోటు కొన్నవాడికీ, వోటు అమ్మిన వాడికీ, మధ్య వున్ను వోటు దళారీ కి మధ్య వుండే సంబంధాలు ఎలాంటివన్నదాని మీద సందేహాలు వచ్చాయి.
వోట్ల వ్యాపారం నేరమయితే, ఇందులో మొదటి, రెండవ, మూడవ నేరస్తులెవరు?
అమర్ సింగ్ మధ్యవర్తి గా నేరారోపణకు గురయి దొరికిపోయారు.
కొన్నట్లు అభియోగాలున్న(యుపియే) సర్కారు పవిత్రంగా మిగిలిపోయింది.
అమ్ముకున్నారన్న అనుమానంతో బిజెపి ఎంపీలను పట్టుకున్నారు.(కాదు మొర్రో! పట్టివ్వటానికే డబ్బు పుచ్చుకున్నామన్నది వారి వాదన)
డబ్బుకు కులమూ, మతమూ వుండొచ్చేమో కానీ, పార్టీ బేధాలుండవు. మూడు వర్గాలూ మూడు పార్టీలకు చెందిన వారు.
ఒక్క అమర్ సింగ్‌ను జైల్లో వేసేసి, అవినీతిని పునాదులతో పెకలించేసినట్లు మన అధికారులు భావిస్తున్నారు.
రైల్లో బెర్త్ అమ్ముకున్న ఒక టీటీఈ ను పట్టుకుని, రైల్వే ఉద్యోగుల్లో అవినీతిని రూపుమాపినట్లు ఫీలయితే, ఎంత ముచ్చటగా వుంటుందో, ఇదీ అంతే ముచ్చటగా వుంది.
పట్టుకోవటం మొదలు పెడితే అన్ని పార్టీల ప్రతినిథులూ దొరికి పోతారు.
డబ్బు డబ్బును పట్టిస్తున్నప్పుడు కొన్ని పార్టీలు మిగిలిపోయి, కొన్ని పార్టీలే దొరికిపోతాయి.
కానీ దరిద్రం డబ్బును పట్టించే ప్రక్రియ మొదలయినప్పుడు అన్ని పార్టీలు దొరికిపోతాయి.
అప్పుడు భారతీయ ప్రజాస్వామ్యం విలాసం కూడా మారిపోతుంది.
అప్పుడు-
పార్లమెంటు ‘తీహార్’లో వుంటుంది.
అసెంబ్లీ ‘చంచల్ గుడా’ అవుతుంది.
ఆ రోజు కోసం అందరమూ ఎదురు చూద్దాం.
(ఆంధ్రభూమి దినపత్రిక 11 సెప్టెంబరు2011 సంచికలో ప్రచురితం)
-సతీష్ చందర్
ఆ రోజు కోసం అందరమూ ఎదురు చూద్దాం.