నా పేరు : ఇమ్రాన్ ఖాన్
దరఖాస్తు చేయు ఉద్యోగం:కెప్టెన్. పాకిస్తాన్ పొలిటికల్ క్రికెట్ టీమ్.(ప్రధాన మంత్రి అంటే అదే కదా! గతంలో ఇండియాతో క్రికెట్ ఆడాను. ఇప్పుడు రాజకీయం ఆడతాను.)
వయసు : ఆరు పదులు దాటి ఆరేళ్ళు అయినా ఇంక నవయవ్వనుణ్ణే. (అయినా క్రికెటర్ వయసు తీసిన ‘పరుగుల’తోనూ, రాజకీయ నాయకుడి వయసు ‘గెలుపుల’తోనూ కొలవాలి. మనకి రాజకీయాల్లో విజయాలు తక్కువే కాబట్టి ఇంకా చిన్న వాణ్ణే.)
ముద్దు పేర్లు : ‘నిఖా’ ఖాన్ ( పెళ్ళిళ్ళు కాస్త జోరుగానే చేసుకున్నాను లెండి.) ‘డిక్టేటర్’ ఖాన్ ( ఇది నాకు సల్మాన్ రష్డీ పెట్టిన ముద్దు పేరు. ఆయన రాతల్ని నేను సమర్థించలేదని నన్ను ‘డిక్టేటర్ ఇన్ వెయిటింగ్’ అని ఒకప్పుడు అన్నారు. ఇంకా ఎదురు చూడటమేమిటి? వచ్చేశాను కదా!)
విద్యార్హతలు : అవునవును. తీరిక వేళల్లో కొంత చదివాను. ఎక్కడా.. లైఫ్ అంతా ‘ఆటే’ కదా! పైపెచ్చు లండన్ నైట్ లైఫ్ కూడా ఎంతో కొంత ఇష్టం. అయినా పాకిస్తాన్లో నియంతలుకున్న డిమాండ్ ప్రజాస్వామిక వాదులకుండదు. అందుకే నేనే మొదట్లో ముషార్రఫ్ ను సమర్థించాను. తర్వాత ఆయనే నన్ను హౌస్ అరెస్టు చేశాడనుకోండి. అది వేరే విషయం.
గుర్తింపు చిహ్నాలు :ఒకటి: మరీ పురుషాహంకారిని కాదు కానీ, తొలి బిడ్డ కొడుకయి వుంటే బాగుంటుందనుకున్నాను. అందుకే కదా.. నా తొలి సహచరితో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.
రెండు: వివాదం. అవును. వివాదం లేకుండా వ్యక్తిగత జీవితమూ లేదు. రాజకీయ జీవితంలేదు. ఇప్పుడు పాకిస్తాన్ లో నా పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాప్ (పి.టి.ఐ) గెలిచినా ‘రిగ్గింగ్’ అంటున్నారు.
సిధ్ధాంతం : పెళ్లి ‘ట్వంటీ ట్వంటీ’ మ్యాచ్ లాంటిది. పాలిటిక్స్ ‘టెస్ట్ మ్యాచ్’ లాంటిది. ఇలా పెళ్ళీ, అలా విడాకులూ- ఫటాఫట్ ఫలితాలు వచ్చేస్తాయి. కానీ రాజకీయాల్లో చూడండి. ఎప్పుడో 1996లో పార్టీ స్థాపించాను. 22 యేళ్ళ తర్వాత గెలిచాను.
వృత్తి : కౌంటింగ్. అప్పుడు ‘రన్స్’ ‘వికెట్స్. ఇప్పుడు ‘గెలుపు’ , ‘ఓటములు’.
హాబీలు :1. మరీ అంత గొప్ప హాబీలేమీ లేవు. ఫ్రీ టైం దొరికితే పెళ్ళి చేసుకుంటాను. బిజీగా వుంటే విడాకులకు పోతుంటాను. 2.అమ్మ పేరు మీద దాన ధర్మాలు చేస్తుంటాను. ఆమె పేరు మీద కేన్సర్ ఆసుపత్రి కూడా పెట్టించాను కదా!
అనుభవం : సైనిక తిరుగుబాటుల్నీ, ఎన్నికల్నీ నా దేశంలో సమానంగా చూసినవాణ్ణి.
మిత్రులు : ఉండేవారే. కానీ తీరికెక్కడిదీ…!
శత్రువులు : శత్రువులు లేని నేతను రాజకీయాల్లో గుర్తించరు. మరీ ముఖ్యంగా పాకిస్తానీ రాజకీయాల్లో.
మిత్రశత్రువులు : ఇంతవరకూ లేరు. ఇప్పుడు తప్పేటట్లు లేదు. మొత్తం 272 సీట్లలో నాకు 122 వరకూ వచ్చాయంటున్నారు. ఇతరుల మద్దతు కూడా ఆశించాలి కదా!
వేదాంతం : పాకిస్తాన్ని తిట్టి ఇండియాలో ఎలా వోట్లు వేయించుకుంటారో, నేను ఇండియాను విమర్శించి పాకిస్తానీ వోట్లు వేయిచుకున్నాను. కానీ ఏం లాభం? ఇదిగో గెలిచానంటే. అదిగో ‘కూ’ అంటారు మా దేశంలో.( కూ- అంటే సైనిక తిరుగుబాటు.)
జీవిత ధ్యేయం : పూర్తి పదవీ కాలం పాలించాలని. అలే చేస్తే డబుల్ సెంచరీ కొట్టినట్లే.
– సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రికలో ప్రచురితం)