పేరు : ఆనం రామ్నారాయణ రెెడ్డి.
ముద్దు పేర్లు : ‘డ్రామ్’ నారాయణ రెడ్డి (ఒకప్పుడు జగన్కు దగ్గర, ఇప్పుడు దూరం. దీనిని డ్రామా అంటారు తప్పు కాదూ! ‘కన్యాశుల్కం’ లో గిరీశం ఏమన్నాడూ.. ‘ఒపీనియన్స్ చేంజ్ చేస్తే కానీ పాలిటిష్యన్ కాలేడు’ అన్నాడు) . రామ్ ‘నోరా’యణ రెడ్డి.(అందరికీ నోరుంది. కానీ పనిచెప్పరు. నేను చెప్పాను. జగన్ ను ఉరితీసినా తప్పులేదన్నాను. అయితే ఆయన పార్టీ వారికి కూడా నోర్లుంటాయని మరచిపోయాను. వారు నన్ను ఉరితీయాలంటున్నారు. ఊరికే అంటాం కానీ… అన్నీ జరిగిపోతాయా…ఏమిటి?)
విద్యార్హతలు : ‘లా’ ఒక్కింతయు కలదు. లా చదువుకున్నాను. కానీ ‘ఏ నేరానికి ఏశిక్ష విధించవచ్చో’ మరచిపోయాను.
హోదాలు : ‘అర్థ’ మంత్రిని. అంటే సగం మంత్రినని కాదు సుమా. ఆర్థిక మంత్రిని. ‘కోత’లు బాగా తెలుసు. డబ్బుల్లోనూ కోతలే. మాటల్లోనూ కోతలే.
గుర్తింపు చిహ్నాలు : ఒకటి: పేరు కన్నా ఇంటి పేరు(ఆనం) కే ఎక్కువ గుర్తింపు. ఇల్లు మారదు. ఇంటి మీద జెండాలే మారుతుంటాయి. ఒకప్పుడు ‘పసుపు’ జెండా. ఇప్పుడు మూడు రంగుల జెండా. జెండాలు మారినంత మాత్రాన రాజకీయ కుటుంబాల ఎజెండాలు మారవు.
రెండు: అప్పుడప్పుడూ నా సోదరుడు( ఆనం వివేకానంద రెడ్డి) వల్ల కూడా నాకు ఎక్కువ గుర్తింపు వస్తుంటుంది. ఎవర్నీ నవ్వించ కుండా వదలడు.(నవ్వుల పాలు కూడా అవుతుంటాడు. కానీ లైట్ గా తీసుకుంటాడు.)
అనుభవం : నోట్లో నాలుక లేని వాళ్ళనీ, చేతికి సంతకం రాని వారినీ ఈ వ్యవస్థ ఎక్కువ బాధపడెతుంది. ఎవరో అక్షరాస్యతకు నోచుకోని గ్రామీణ పేదల గురించి మాట్లాడుతున్నాననుకున్నారా? కాదు. ఒకప్పుడు రాజశేఖరరెడ్డి గారి క్యాబినెట్లో మంత్రుల గురించి. ఏమి మాట్లాడ మంటే అది మాట్లాడారు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ వేలి ముద్రవేశారు. ( వింటున్నారు కదా. అవును. మీ చెవుల్లో పువ్వులు కూడా కనిపిస్తున్నాయి.)
వేదాంతం : తిట్టే కొద్దీ సానుభూతి పెరుగుతందని తిట్టకుంటా వుంటామా? ఇప్పుడు జగన్ మీద నేను చేసిన వ్యాఖ్యల వల్ల జగన్ మీద సానుభూతిపెరగొచ్చు. వాళ్ళ పార్టీకి ఎక్కువ వోట్లు రావచ్చు. అయితే రానివ్వండి. మనకేమిటి?
వృత్తి : శత్రు శిక్షణ, మిత్ర రక్షణ( మొదటి దానికి భారత ‘శిక్షా’ స్మృతివుంది. రెండవ దానికి భారత ‘రక్షా’ స్మృతి వుంది. మొదటిది రాసి వుంటుంది. రెండవది రాసివుండదు. మొదటి దానిని పోలీసులూ, సిబిఐ పాటిస్తుంటుంది. రెండవదానిని రాజకీయ పార్టీలు పాటిస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే మా మీద చెయ్యెత్తిన వారికి శిక్షా స్మృతి. ‘చేతులు’ కలిపిన వారికి (మంత్రులుగా వున్న వారే కదా, ఎవరయినా సరే.) భారత ‘రక్షా’ స్మృతి.
హాబీలు :1. నా సోదరుడు ‘కళ్ళజోళ్ళు’ మారుస్తాడు. నేను ‘అభిప్రాయాలు’ మారుస్తాను.
2. జైళ్ళ చుట్టూ తిరగటం. అపార్థం చేసుకోకండి. నేను జైళ్ళలోకి వెళ్తానని కాదు. జైళ్ళలో వుండే వారి దినచర్యను తెలుసుకోవటం నాకు దినచర్య. అందుకే వారి గురించి మాట్లాడుతుంటాను.
నచ్చని విషయం : నేను నోరు విప్పేవరకూ మంత్రుల్లో ఎవరూ మాట్లాడలేదు. (అంటే జగన్కు నేనొక్కణ్నే శత్రువు కావాలా?)
మిత్రులు : ఆనం వారికి ‘సోదరులు’ చాలు. మిత్రులతో పనిలేదు.
శత్రువులు : సందర్భాన్ని బట్టి మారుతుంటారు. ఇప్పటికయితే జగన్.
జపించే మంత్రం : ‘జగన్నా’మ స్మరణ.
విలాసం : మా అందరి విలాసం ఒక్కటే, 10, జనపథ్ రోడ్డు.
గురువు : చంద్రబాబు నాయుడు. ఆశ్చర్య పోకండి. ఆయన కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తే, నేను తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కు వెళ్ళాను.
జీవిత ధ్యేయం : ఆనం వారి ఆనవాళ్ళు ముఖ్యమంత్రి పీఠం మీద వదలొద్దూ…!
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంద్ర వారపత్రిక 19-26 ఏప్రిల్ 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)