తల వంచుకుంటే, ఒక ‘తన్ను’ ఉచితం!

photo by drinksmachine

ఉచితం!
ఈ మాటకు పర్యాయ పదం తెలిసి పోయింది: మాయ.
ఉచితం అని పెద్దక్షరాలతోనూ, షరతులు వర్తిస్తాయి అన్ని చిన్నక్షరాలతోనూ రాసినప్పుడన్నా గ్రహించాలి- అది మోసమని.
బోడిగుండు ఉచితం-
విగ్గులు కొంటే.
పెళ్ళికొడుకు ఉచితం-
అమ్మాయి జీతం అనబడే నెలసరి కట్నం తెస్తే.
కర్చీఫ్‌ ఉచితం-
ఏడుపు గొట్టుసినిమా చూసిపెడితే.
ఎలా ఎన్నెన్నో బంపర్‌ ఆఫర్లు. ఉచితం అంటే చాలు- మనవాళ్ళకి వొళ్ళు తెలియదు. డబ్బుపెట్టి కొనటమంటే మనవాళ్ళకు మహా చికాకు.దానితో పాటు ఏదోఒకటి ఉచితంగా కొట్టేశామన్న తృప్తి వుంటే మాత్రం తెగించి కొనేస్తారు.
ఔషధం ఉచితం అంటే చాలు,
రోగాన్ని కొని తెచ్చేసుకోగలరు. అంతటి సమర్థులు వీరు.
వెనకటికిలాగే ఒకాయన, తాను నడిపే పత్రిక కొన్న వారికి తలనొప్పి మందును ఉచితంగా పంచేశాడు.
మనకే అనుకున్నారా? ఒకప్పుడు మనల్ని పాలించే మహరాజులకి కూడా ఈ ఉచిత వ్యామోహం వుండేది.
కాఫీ పొడుల్నీ, సెంటు తడుల్నీ ఉచితంగా వాసన చూపించినందుకు, వారికి ఉచితంగా రాజ్యాలను రాసిచ్చేశారు.
ఏ రంగంలోనైనా మనదేశంలో ఈ ఉచితమంత్రానికి తిరుగులేదు.
మతాన్ని కొనుక్కుంటే, మోక్షాన్ని ఉచితంగా ప్రసాదించేవారు లేరూ..?
ఆ మధ్య తన్నుతో మోక్షాన్ని ప్రసాదించే తన్నుల బాబా గురించి దేశమంతా మార్మోగిపోయింది. వెయ్యిరూపాయిల పెట్టి దర్శనం టిక్కెట్టు కొనుక్కుంటే, ఒక తన్ను ఉచితంగా ఆయన తన్ని పెడతారు.
అన్నట్టు స్వరాజ్యాన్ని కూడా మనం ఉచితంగానే తెచ్చేసుకున్నామని కొందరు పెద్దలు చెబుతుంటారు. కాకుంటే దేశవిభజనను మాత్రం ‘కొని’ తెచ్చుకున్నాం లెండి!
ఈ ఉచిత స్వరాజ్యం వచ్చాక కూడా, తన్ను బాబాలాగా, మన నేతలు చాలా వరకూ ‘ఉచితం’గానే తన్ని పెట్టారు. ఆ మాట కొస్తే మొత్తం రాజకీయం ‘ఉచిత’ రీతిలో జరిగిపోతూ వుంటుంది.
ఉచితంగా లారీ ఎక్కించి, ఉచితంగా పులిహోరా పొట్లాలిప్పించి, ఉచితంగా హైదరాబాద్‌ చూపిస్తానంటే, జనం వచ్చి, ప్రదర్శననూ, బహిరంగ సభనూ ఉచితంగా జయప్రదం చేస్తున్నారా? లేదా?
ఈ ఉచితం ఇక్కడితో ఆగుతుందా?ఎన్నికల వరకూ వెళ్ళిపోదూ..?
ఉచితంగా బీరూ, బిర్యానీ ఇప్పించేస్తే, ఉచితంగా వోటు వేసి పెడుతున్నారు కదా?
రాజకీయమంటేనే ఉచితం కదా; అయినా సరే ఉచితంగా జరిగిన లావాదేవీల మీద ఇలా సిబిఐ వారి చేత విచారణ జరిపించటం ఉచితమేనంటారా?
అధికారంలో వున్నప్పుడు నేతలు ఏకంగా ధర్మదాతలయిపోతారు. ఆశ్రిత పక్షపాతంలో పురాణ పురుషుల్ని మించి పోతారు.
తమను నమ్మి వచ్చిన వారికి ఉచితంగా కాంట్రాక్టులు ఇప్పిస్తారు. వారు కూడా ఉచితంగానే తిరిగి ఏలిన వారి కంపెనీల్లో ఉచితంగా పెట్టుబడులు పెడతారు.
‘తిను, తినిపించు, లైఫ్‌ అందించు’ అనే ఈ ఉచిత నినాదంలో పాలించేసిన నేతల మీద ఇన్నేసి నిందలు పడుతుంటే ఎలా తట్టుకోగలరు?
ఉచిత రీతినీ, ఉచిత నీతినీ పాటించని నేతలంతా కాలగర్భంలో కలిసిపోయారు. చరిత్రలో నిలిచిన వారంతా ఉచిత

పాలకులే.
ఉచితంగా పక్కా ఇళ్ళు ఇచ్చినందుకు ఇందిర ‘అమ్మ’యి పోయారు.
దాదాపు ఉచితంగా(కిలో రెండు రూపాయిలకే) బియ్యం ఇచ్చినందుకు ఎన్టీఆర్‌ ‘అన్న’యి పోయారు.
ఉచితంగా కరెంటు ఇచ్చినందుకు వైయస్‌ ‘రాజన్న’యి పోయారు.
ఇప్పుడు మహిళలకు ఏకంగా ఉచితంగా (పావలా వడ్డీ కూడా తీసేసి) అప్పులిచ్చినందుకు ఆయన కూడా ఏదో ఒక ‘అన్న’ అయి తీరాలి.
చంద్రబాబు గెలిచి వుంటే, ఉచితంగా ఆ సరుకూ, ఏ సరుకూ కాకుండా, నేరుగా డబ్బునే ఉచితంగా (నగదు బదలీ పథకం కింద) ఇచ్చేవారు.
వీరందరి పాలనలోనూ ఇలా ఒక్క సరుకే ఉచితం. మిగిలిన జీవితమూ, మరణమూ ప్రియమే.
పప్పులూ, నూనెలు ప్రియమయితే జీవితమూ ప్రియం కాదా?
కరెంటు మాత్రమే ఉచితంగా ఇస్తారు. పంటలు పండక, పండినా చేతికి అందక రైతు చనిపోదామనుకుంటే మృత్యువు మాత్రం ఉచితంగా రాదు. దానిక్కూడా డబ్బు పెట్టి పురుగు మందు కొనుక్కోవాల్సిందే.
ఈ ‘ఉచిత’ రాజకీయాల మీద విసుకెత్తి ఎవరన్నా ఉద్యమాల్లో చేరిపోతే అక్కడా ఉచితం తప్పదు. అరణ్యంలో అయితే ఉచితంగా చేతికి గన్ను యిస్తారు. మైదానంలో అయితే కిరోసిన్‌ డబ్బా ఇస్తారు.
అందుకు వారు ఉచితంగా కాల్చిపెట్టాలి- వీలయితే వారి శత్రువుల్ని. లేకుంటే ఆర్టీసీ బస్సుల్ని.
అప్పుడు పోలీసులు రంగంలోకి దిగి ఉచితంగా ఎన్‌కౌంటర్‌లూ, లాఠీ చార్జీలు చేసి పెట్టి, ఉచితంగా పదోన్నతులు కొట్టేస్తారు.
మన్నించాలి. నా ఈ రచన మాత్రం ఉచితం కాదు. దీనికోసం ఈ పాటికే మీరు ఏదో విధంగా ధర చెల్లించేసి వుంటారు.
ఇది ఉచితం కాదు. షరతులు వర్తించవు. కాబట్టి నమ్మవచ్చు..

– సతీష్‌ చందర్‌
(ఆంధ్రభూమి దినపత్రిక లో 26-11-11 తేదీ నాడు ప్రచురితం.)

Leave a Reply