టాపు(లేని) స్టోరీ:
పట్టపగలు తారలు కనిపిస్తాయా? సినిమా తారలూ అంతే. సినిమాల్లో రాత్రయినా, పగలయినా వేషం వెయ్చొచ్చు. కానీ రాజకీయాల్లో మాత్రం పగటి వేషమే నడుస్తుంది. ‘ఈ వేషం మేం వెయ్యలేమా?’ అని నిన్న మొన్నటి వరకూ సినిమా తారలకూ పోటీ పడ్డారు. వెయ్చొచ్చు. ప్రచార రథాలెక్కి తొడలు చరచవచ్చు. మీసాలూ మెలివేయనూ వచ్చు. ఆ తర్వాత…? ఎవరి డైలాగులు వారు రాసుకోవాలి. చెప్పాలి. ‘పంచ్’లు కొట్టినా, ఫ్యాంటులు కొట్టినా ఎవరివి వాళ్ళవే. అంతే కాదు ఎవరి మేకప్పు వారే చూసుకోవాలి. నెత్తిమీద ‘బిట్ విగ్'(సగం సొంత తలా, సగం విగ్గూ వుంటుంది లెండి) జారకుండా చూసుకోవాలి. ఇన్ని తిప్పలు పడ్డా, ఒకసారి చూడ్డానికి వచ్చిన జనం మరోసారి వస్తారనటానికి వీలు లేదు. అయినా నిన్న మొన్నటి దాకా సినీతారలు రాజకీయ ప్రచారానికి నిన్న మొన్నటి దాకా వస్తూ నే వున్నారు. కానీ, ఇప్పుడు ఈ తిప్పలు ఎందుకనుకున్నారో.., మెల్లమెల్లగా తగ్గి పోయారు. చూడబోతే ఇందుకు సాక్షాత్తూ మెగా స్టార్ చిరంజీవే ‘శుభం కార్డు’ వేసినట్టున్నారు. పార్టీ పెట్టి, కాంగ్రెస్‌లో కలిపేశాక, మిగిలిన తారలు రాజకీయ ప్రవేశం చెయ్యాలంటే, వెనకా, ముందూ- ఆడుతున్నారు. పూర్వం ఆవేశపూరితమైన హీరోవేషాలు వేసిన రాజశేఖర్ సతీ సమేతంగా రాజకీయాల్లోనూ, రాజకీయ ప్రచారంలోనూ ఉత్సాహంగా పాల్గొనే వారు. (అఫ్ కోర్స్ ఆయన తెలుగే మాట్లాడినా, ఆయన భార్య జీవిత మళ్ళీ తెలుగులోనే అనువాదం చెయ్యాల్సి వచ్చేదనుకోండి.) ఇప్పుడు ఆ జంట కూడా చప్పుడు చెయ్యటం లేదు. చిరంజీవి తన సొంత పార్టీకి ప్రచారం చేసినప్పటికీ, ఇప్పటికీ ఎంత తేడా. అప్పట్లో ఆయనొక్కరే వేదిక మీద హీరో! ఇప్పుడు ముగ్గురు హీరోల్లో ఆయన ఒక్కరు. (కిరణ్‌కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణలు మిగిలిన హీరోలు) చిరంజీవి చేసిన పనే ఒక ‘లేడీ హీరో’ చేశారు. ( ఆవిడ సినిమాల్లో పోషించిన పాత్రల్ని ఆవిణ్ణెవరూ హీరోయిన్ అనటానికి సాహసించరు.) ఆమే విజయశాంతి. ఆమెకూడా ఒక పార్టీ పెట్టి, టీఆర్‌ఎస్‌లో కలిపేశారు. ఆమెది రాజకీయాల్లో ‘డైలాగుల్లేని పాత్ర’. ప్రతీ సమావేశంలోనూ ‘అగ్ర నేత’ పక్కనే కూర్చుంటారు. కానీ మాట్లాడరు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతలో జరుగుతున్న పరకాల ఉప ఎన్నికలో ప్రత్యర్థి మహిళ కాబట్టి, ఆమె ప్రచారంలో మాట్లాడే పరిమిత అవకాశం వచ్చింది. ఈ సన్ని వేశాలుచూశాక ఎవరికి మాత్రం రాజకీయ ప్రచార రంగ ప్రవేశం చెయ్యాలనిపిస్తుంది?
ఎలా చూసినా ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నిక ప్రచారంలో సినిమా గ్లామర్‌తో పనే లేకుండా పోయింది. కడకు అందాలు చిందించే హీరోయిన్లు కూడా షాపులూ, షోరూమ్ ల ‘ఒపెనింగు’లకయినా వెళ్తున్నారు కానీ, ఉప ఎన్నికల ప్రచారానికి రావటం లేదు. పాపం సినిమా రంగంతో దశాబ్దాల అనుబంధం వున్న తిక్కవరపు సుబ్బిరామి రెడ్డి తను పోటీ చేస్తున్న నెల్లూరు నియోజక వర్గంలో ప్రచారానికి తారల్ని దించే ప్రయత్నం చేశారు. హీరోయిన్లే వచ్చారు. కానీ, ఎప్పటి హీరోయిన్లూ..? ఆయన యువ నిర్మాతగా వున్నప్పటి నాయికలు. వారిని చూడ్డానికి ఇప్పుడు ఎవరు వస్తారు చెప్పండి? పైగా వయసు మీద పడటం వల్ల బీపీలూ, షుగర్లూ వచ్చి ఉత్తినే అలిసిపోతారు కూడా. అలనాటి హీరోయిన్ వాణిశ్రీ ఆ మధ్య ఇలాగే వచ్చి, ఎవర్ని వోట్లడగటానికి వచ్చారో, వారి మీదే నోరు పారేసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్‌లో రోజాలాంటి వారున్న, విజయమ్మ, షర్మిల పట్ల జనానికున్న సానుభూతి ముందు వారి ఆకర్షణ చిన్నబోతుంది. అంతెందుకు? ఆ మధ్య ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో భంగపడి వచ్చిన జయప్రదకు కూడా తెలుగు రాజకీయాల్లో సరయిన చోటు కల్పించ లేకపోయారు? ఎలా చూసినా, ఇప్పుడు తెలుగు నాట రాజకీయాలలో ‘వెండి తెర వేల్పులు’ చిన్నబోతున్నారు.
న్యూస్ బ్రేకులు:
తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు!
తన కొడుకు నిర్దోషి అయితే, అదే విషయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ బైబిల్ సాక్షిగా చెప్పాలి.
-లగడపాటి రాజగోపాల్, కాంగ్రెస్ నేత
వామ్మో! రాజకీయాల్లోకి బైబిళ్ళూ, భగవద్గీతలూ వచ్చేస్తున్నాయా? అలాగయితే విచారణలూ, దర్యాప్తులూ కోర్టుల్లో కాకుండా- చర్చిల్లోనూ,గుడుల్లోనూ చేపట్టటం మంచిది.
‘నిన్ను(జగన్ను) ప్రభుత్వం కానీ, న్యాయస్థానాలు కానీ, దర్యాప్తు సంస్థలు కానీ, మీడియా కానీ- ఎవ్వరూ అనకూడదు. నువ్వేమన్నా పైనుంచి దిగివచ్చావా?
-గులామ్ నబీ ఆజాద్ , కేంద్రమంత్రి
పైకి ఎక్కించిందే మీరు..!? ఇప్పుడు దిగి వచ్చావా? లిఫ్టులో వచ్చావా? అంటే ఎలా?
ట్విట్టోరియల్
‘కిరణా’ కొట్టు!
భారీగా పెంచిన పెట్రోలు ధరను స్వల్పంగా తగ్గించారు. ఎత్తికుదెయ్యటం- అంటే ఇదే. తగ్గింది రెండు రూపాయిలే అనకండి. ‘కిరణా’ కొట్లో( ఐ మీన్ కిరణ్ గారి కొట్లో) రెండు రూపాయలకూ, రెండు కిలోల బియ్యం వస్తాయి. ఈ ‘రెండురూపాయిలు’ మాత్రం ఎవరి వత్తిడికి తలవొగ్గి తగ్గించారన్నది సమస్య. ప్రతిపక్షాలు ‘తంతు’లా చేసిన ఆందోళనకు కేంద్ర వణికి పోయి-ఇలా చేసిందా? లేదా సామాన్యులు చేసిన ఆక్రందనకు కేంద్రం కదిలి పోయిందా? ఇవన్నీ నిజం కాకపోవచ్చు. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వత్తిడికే కేంద్రం దిగివచ్చి వుంటుంది. ఎందుకంటారా? కనీసం మోటారు బైక్ల మీద ప్రచారం చేసుకున్నా, పెట్రోలు ఖర్చు పేలిపోతుంది. ఆ ఉసురు కేంద్రానికి తగలదూ..!?
‘ట్వీట్ ‘ఫర్ టాట్
‘అలౌకిక’ పాల్!
పలు ట్వీట్స్ : అన్నాహజారే, రామ్ దేవ్ బాబా అవినీతి మీద ఐక్యంగా సమరం చేయటం ఆహ్వానించ దగ్గ పరిణామం.
కౌంటర్ ట్వీట్: అవును. ఒకరు వృధ్ధుడు, మరొకరు సన్యాసి. ఇలాంటి వాళ్ళే అవినీతి మీద పోరాడగలరు. మిగిలిన వారికి డబ్బంటే ఎంతో కొంత ఆశ వుంటుంది!?
ఈ- తవిక
‘అసత్యమేవ’జయతే!
ధర్మరాజునయినా సరే
ప్రచార రథమెక్కిస్తే,
అబధ్ధమే చెబుతాడు.
శకుని మామనయినా సరే
పదవిలోంచి దించేస్తే
నిజమే చెబుతాడు.
బ్లాగ్ (బ్లాక్) స్పాట్:
ఏసీలో వున్న వాణ్ణి ఎండలోకి తీసుకొచ్చాక, ‘ఎలాగుంది?’ అనడిగితే ‘హాయి గా వుంది’ అనే వాణ్ణి అనుమానించండి. అతడు ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న రాజకీయ నాయకుడు కావచ్చు.
కొట్టేశాన్( కొటేషన్):
నెపోలియన్ మళ్ళీ పుట్టేస్తే ఇలా అంటాడు: నూరు తుపాకులకు భయపడను కానీ ఒక ‘గొట్టాని’కి భయపడతాను.( టీవీ చానెళ్ళ వాళ్ళు పెట్టే మైకుల్ని ‘గొట్టాలు’ అంటారు లెండి.)
-సతీష్ చందర్
(సూర్య దినపత్రిక 5 జూన్2012 వ సంచికలో ప్రచురితం)
Chaala baagundhi Satishgaru. Laughed a lot after so many days.
Will continue reading your other posts too 🙂 Keep them coming