‘తూచ్‌..! నేనొప్పుకోను!!’

babu1‘నేను ప్రేమించేది నిన్ను…’ అనేసి, తర్వాత ‘కామా’ పెట్టి, రెండు నిమిషాలు ఆగి, ఊపిరి పీల్చుకుని ‘కాదు’ అని నచ్చిన అమ్మాయి ప్రకటిస్తే ఏమవుతుంది? ఒక్క ‘కామా’ చాలు పేషెంటును ‘కోమా’లోకి పంపించేయటానికి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఆమె ప్రియుడు ఆమె కోసం ప్రాణం విడవటానికి ఒక్క నిమిషం చాలు. కానీ, ఆమే… అనవసరంగా మాట తిప్పుకోవటానికి రెండు నిమిషాలు తీసుకుంది.

రాష్ట్రవిభజన విషయంలో పార్టీలు దాదాపు అలాగే మాట తిప్పాయి.

‘విభజనకు మేము అనుకూలం…’ అనేసి, తర్వాత ‘కామా’ పెట్టి, రెండు వారాలు ఆగి, ఊపిరి సలపక, ‘కాదు’ అని ప్రకటించాలని చూస్తున్నాయి.

ప్రేమించలేదూ అంటే ప్రియుడు హుస్సేన్‌ సాగర్‌లోకి దూకేస్తాడని ప్రియురాలు ముందు ఊహించనట్టే, తాము ‘విభజన’కు అనుకూలం-అంటే, సీమాంధ్ర నిప్పుల్లోకి దూకుతుందని పొరపాటున కూడా గ్రహించలేదు.కానీ దూకేసింది. ఇప్పుడెలా? నాలుక్కరచుకోవాలి. యూ-టర్న్‌ కొట్టాలి. ‘తూచ్‌.. నేను ఒప్పుకోను’ అని గిలాగిలా కొట్టుకోవాలి.

ప్రధాన ప్రతిపక్షం దగ్గర నుంచి అన్ని పార్టీలూ ఇదే అవస్థకు గురవుతున్నాయి. అందుకే ఇప్పుడు సీమాంధ్రలో రాజకీయేతరులు మహానేతలు అయిపోతున్నాయి. నేడు ‘సమైక్యాంధ్ర’ అనగానే వినిపించే పేరు అశోక్‌ బాబు. ఈయన ఎపీఎన్జీవో నేత. విభజన ప్రకటనకు ముందు ఆయన ప్రాచుర్యం ఉద్యోగులకే పరిమితం. కారణం పార్టీల నేతలు ‘ముఖాలు మార్చుకునే’ ‘ఇచ్చిన మాట వెనక్కుతీసుకునే’ హడావిడిలో వుండటం.

రెండు ప్రాంతాలూ నాకు ‘రెండు కళ్ళు’ అన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, చూసిచూసి ‘రాష్ట్రాన్ని విభజించుకోవచ్చ’ని రాసిచ్చేశారు. అందువల్లే ‘తెలంగాణ వచ్చిందన్న’ కీర్తి తెలంగాణలో రాలేదు. ఆ కీర్తినంతా ‘తెచ్చే’పార్టీ(టీఆర్‌ఎస్‌), ‘ఇచ్చే’పార్టీ(కాంగ్రెస్‌) పంచేసుకున్నాయి. సీమాంధ్రలో మాత్రం రాష్ట్రాన్ని ‘అడ్డంగా చీల్చమన్న’ పార్టీగా తెలుగుదేశం నిలిచిపోయింది. (సరే, ఎలాగూ ‘అడ్డంగా చీల్చేసిన’ పార్టీగా అపఖ్యాతిలో సింహభాగాన్ని కాంగ్రెసే తీసేసుకుంటుంది.) ఇప్పుడు మళ్ళీ బాబు ‘రెండు కళ్ళు’ సిధ్ధాంతం జపించినా లాభంలేదు. సమైక్యమంటేనే కానీ, బండి నడవదు. అందుకే ఈ ‘యూటర్న్‌’ను దశల వారీగా కొడుతున్నారు. ముందు సీమాంధ్రకు వేరే రాజధాని ఏర్పాటు చేసుకుందామన్నారు. తర్వాత ‘తాను నిర్మించిన హైదరాబాద్‌. తన కళ్ళ ముందే కరిగిపోతుందంటున్నారు'(మరి కులీ కుతుబ్‌ షా ఏమనుకోవాలో..?)

‘విభజన ప్రకటన’ దగ్గర వుండి చేయించిన కాంగ్రెస్‌ నేతలు మాత్రం తిన్నగా వున్నారు. ‘తెలంగాణకు అనుకూలుడు’ అన్న ముద్ర వుండటం వల్ల బొత్స సత్యనారాయణను పీసీసీనేతగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసినప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చప్పుడు చేయలేదు. తీరా ప్రకటన వచ్చిన తర్వాత, ముందు ‘సమవర్తి’ గావున్నట్టు ప్రయత్నించి విఫలమై, ‘సీమాంధ్ర ఉద్యోగులు పోవాల్సిందే’ అన్న కేసీఆర్‌ వ్యాఖ్యలనడ్డుపెట్టుకుని, సమైక్య స్వరం వినిపించి, తక్కువ నష్టంతో బయిట పడ్డారు.

ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి లెక్కే వేరు. ముందు పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి వుంటానూ అని చెప్పి, ప్రకటన తర్వాత వారం రోజులు ‘కోప గృహం'( సిఎం క్యాంపు ఆఫీసు)లోనే వుండి పోయి, తర్వాత మీడియా సమావేశం పెట్టి, హైదరాబాద్‌లో వుండే సీమాంధ్రుల భద్రత గురించి బెంగపడి, ఇప్పుడు ఏకంగా గిడుగు రామమూర్తి 150 జయంత్యుత్సవాల వేడుకల్లో, ‘తెలుగు వాళ్ళ కోసం తెగించేస్తా’నని శపథం చేస్తున్నారు.

ఇక చిరంజీవి కొత్తగా యూ-టర్న్‌ కొట్టేదేమీ లేదని, ‘యూ-టర్న్‌లో యూ-టర్న్‌’ కొట్టేశారు. ఎప్పుడో ప్రజారాజ్యం పెట్టి ఎన్నికలకు వెళ్ళినప్పుడు ‘సామాజిక తెలంగాణ’ అన్నారు. తొలిసారి చిదంబరం తెలంగాణ ప్రకటన చేసినప్పుడు, మొత్తం మాట మార్చేసి ‘జై సమైక్యాంధ్ర’ అనేశారు. ఇప్పుడు అదే మాట మీద వున్నా సీమాంధ్రలో పరువు దక్కేది. ‘విభజించండి.కానీ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయండి’ అన్నారు. చూశారా! ట్విస్టుల మీద ట్విస్టులు. సినిమా ట్విస్టులు. కానీ రాజకీయాల్లో ప్రతీ ట్విస్టుకీ ఈలలు వెయ్యరు. కానీ గోలలు చేస్తారు. ఇప్పుడు ఆయన ప్రకటన మీద రాష్ట్రంలో జరుగుతున్నది అదే.

ఇక వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ మీద అభిప్రాయమయితే చెప్పలేదు, కానీ ‘ తెలంగాణ ఇచ్చే స్థితి(అధికారం)లో మేం లేం’ అని చెప్పింది. పరకాల ఉపఎన్నికప్పుడు, ఈ పార్టీ తెలంగాణకు అనుకూలమనే దిశగానే ఆ పార్టీ తెలంగాణ నేతలు ప్రచారం చేశారు. అయితే, విభజన ప్రకటనకు ముందే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనగా రాజీనామా చేశారు. దాంతో విభజన తర్వాత జనం ‘మూడ్‌’ను చేసి మాట మార్చారన్న అపప్రదనుంచి బయిట పడింది. అందుకే సీమాంధ్రలో ‘సమైక్యవాదులు’ ఇతర పార్టీల నేతల్ని ఘెరావ్‌లు చేసినట్లు, వైయస్సార్‌ కాంగ్రెస్‌ నేతల్ని చేయటం లేదు. అదీకాక ముందు విజయమ్మ, తర్వాత జగన్‌లు దీక్షలకు కూర్చోవటంతో ‘సమైక్యాంధ్ర’ వాద ముద్ర పూర్తి గా పడింది.

ఎలా చూసినా, ప్రజల నాడిని బట్టి అన్ని పార్టీలూ ముఖాలు మార్చుకునే క్రమంలో వున్నాయని చెప్పాల్సి వస్తోంది.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 31 ఆగస్టు-6సెప్టెంబరు 2013 వ సంచికలో ప్రచురితం)

2 comments for “‘తూచ్‌..! నేనొప్పుకోను!!’

Leave a Reply to kotibabu Cancel reply