తెలుగు వాడి ‘పంచె’ తంత్రం!

టాపు(లేని) స్టోరీ:

telugu maha sabalu(1)సోనియా గాంధీ మాతృభాషలో మాట్లాడటం ఎవరయినా విన్నారా? అచ్చం మన తెలుగులాగానే వుంటుంది. అనుమానమా? తెలుగును ఇటలీ భాషతో పోల్చలేదూ..? (ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌- అన్నారా? లేదా?). రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఈ ముక్క తట్టినట్టు లేదు. లేకుంటే ప్రపంచ తెలుగు మహాసభలకు సోనియా గాంధీని పిలిచేవారు.

ఇంతకీ ఇటలీ భాషతో ఎందుకు పోల్చారో? ఏ పాత్రికేయుడయినా ఈ ప్రశ్నను తిరుపతిలో ఈ సభల నిర్వహిస్తున్న వారిని ఎవర్నయినా అడిగితే ఏం చెబుతారా? అడక్కుండా వుండటమే మంచిది. చెప్పలేక పోతే తిరుపతిలో ‘పరపతి’ అడ్డంగా పోవచ్చు. ఈ సభల్ని బహిష్కరించేవారికి ఏ ప్రశ్న ఎలాగూ వర్తించదు. ఒక వేళ వర్తించినా, ‘ఈ ప్రశ్న వెనుక సామ్రాజ్యవాదుల కుట్ర’ వుండి వండవచ్చు- అని అనుమానించగలరు. మరి హాజరయ్యేవాళ్ళకి తెలుగునాట పక్క ప్రాంతపు మాండలీకమే పట్టదు. ఈ గొడవలెందుకు చెప్పండి!

అందుకే చిన్న విషయానికి ఇటలీ వరకు ఎందుకు గానీ, దేశంలో నే వుండి పోదాం. ‘అజంత’ భాషగా తెలుగుకు విశిష్టత వుందని చాటి చెప్పుదాం! (తెలుగు పదాలు అచ్చులతోనే అంతమవుతాయి లెండి. కానీ పాపం! తెలుగు అజంతా గుహల్లో పుట్టిందనుకునే వారు కూడా వుండే వారు. మరయితే ‘ఎల్లోరా’ గుహల్లో ఎందుకు పుట్టలేదని ప్రశ్నించలేదనే వారూ- వున్నారు.)

మూడు రోజుల పాటు తిరుపతిలో తెలుగుతనమే కనిపిస్తుంది. భాషలోనే కాదు. వేషంలోనూ, వంటల్లోనూ, నృత్యాల్లోనూ, మర్యాదల్లోనూ- అంతటా తెలుగుతనమే.

అరికాళ్ళ వరకూ జీరాడే పంచె కట్టకుండా గడప దాటని వాడే తెలుగువాడని కవులు వర్ణించేశారు. ఇలా అన్న వెంటనే పెదవి విరిచేయటానికి పెద్దలు సిధ్ధంగా వుంటారు. పంచెలు ఇప్పుడు ఎవరు కడుతున్నారు? ఫ్యాంట్లూ, బెర్ముడాలూ, నిక్కర్లే కదా! ఏదో తప్పక పీటల మీద కూర్చోనేటప్పుడు ఫ్యాంటు మీద పంచెకట్టుకుంటున్నారు పెళ్ళికొడుకులు!! అంటూ ఎంతగానో బాధపడిపోతుంటారు తెలుగు పెద్దలు. ఇది ఇప్పటి గొడవ. ఒకప్పుడు నిజంగానే అందరూ ఈ పంచెలు చీలమండల వరకూ కట్టేశారా? కేవలం భూస్వాములూ, ‘పండితోత్తములే’ కట్టారా? మరి ఊరికి వెలుపలే వుండి ‘గోచిపాత’లతోనే తిరిగిన వారు ఎంత మంది? వారికి పంచెలు అప్పుడూ నిషిధ్ధమే కదా? ఈ పెద్దలు వీరి ‘తెలుగుతనం’ గురించి ఏనాడయినా యోచించారా? అలాగే కాయకష్టం చేసే ఇతర సామాజిక వర్గాలకూ ఏనాడయినా పంచె మోకాలు దిగిందా? మరి ఏపంచె తెలుగుతనానికి చిహ్నం? తెలుగుతనం ఒకప్పుడు నిండుగా వున్నట్టూ, ఇప్పుడు పోయినట్టూ అంత విలపించనవసరం లేదేమో!

ఇక తెలుగు కళలు. అనగానే మన కూచిపూడి నృత్యాలు గుర్తు కొస్తాయి. ఇక్కడా తెలుగు పెద్దమనుషులకు బాధ తప్పదు: ‘తెలుగు ఆడపిల్లలయి వుండి కూడా పాశ్చాత్య నృత్యాల వైపూ, బ్రేకుల వైపూ, షేకులవైపూ వెళ్ళి పోతున్నారు. మన తెలుగు సంప్రదాయాన్ని విస్మరిస్తున్నారు.’ ఛా! నిజమా? పూర్వం కనీసం సమాజంలోని పై వర్గాలలోనయినా స్త్రీల చేత కూచిపూడి చేయించారా? కాదు. కాదు. చేయనిచ్చారా? అదే అనుమతి వుంటే, పురుషులే స్త్రీ పాత్రలు ఎందుకు వేయాల్సి వచ్చింది? కూచిపూడి మన నృత్యమే- కానీ అది స్త్రీలకు నిషిధ్ధం. (కాబట్టే వేదాంతం సత్యనారాయణ శర్మల్లాంటి వారు అప్సరసల్లా మారి వేదికల మీదకు రావాల్సి వచ్చింది.) అలా నృత్యాలు చేసే ఆడవాళ్లుంటే వారిని ‘దేవాదాసి’లుగా చేసి అవమానించారు. ఏదో కె. విశ్వనాథ్‌ వంటి దర్శకులు ‘సాగర సంగమం’ వంటి చిత్రాలు తీయటం చూసి, ఆడపిల్లలకు ‘కూచిపూడి’ నేర్పించటం తెలుగు సంప్రదాయమని ఇప్పుడు గుర్తించారు. కాబట్టి ఏది తెలుగు భాష, ఏది తెలుగు వేషం, ఏది సంస్క్రతి- అన్నది మళ్ళీ పై వర్గాలే నిర్ణయించటం బాధాకరమే. కాయికష్టం చేసే తెలుగు వాడి నుంచి కాక, పనీ,పాటా లేని తెలుగు వాడి నుంచి తెలుగుతనం నేర్చుకోవాల్సి రావటం అవమాన కరం కూడా!!

 న్యూస్‌ బ్రేకులు:

ఇవి ‘చేతులు’ కావు

సహకార ఎన్నికల్లో కాంగ్రెస్‌వారు అక్రమాలకు పాల్పడుతున్నారు.

-నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత

ఒకరి ‘చేతులు’ ఒకరు తడుపుకుంటున్నారు. తప్పా? ఇదీ సహకారమే.

కేరికేచర్: బలరాం

కేరికేచర్: బలరాం

అర్థరాత్రి స్వతంత్రం వచ్చిందని, అర్థరాత్రి తిరుగుతామా?

-బొత్స సత్యనారాయణ, పి.సి.సినేత

నిజమే. అర్థరాత్రి సిట్టింగుల్లోనే మగ నాయకులు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్కడికి ఇప్పటికీ మహిళా నేతలు రాలేరు. ఇదే అర్థరాత్రి స్వాతంత్య్రం!

ట్విట్టోరియల్‌

పొంగూ, ప్రళయమూ!!

నిన్న అవినీతికి కదిలారు. నేడు అత్యాచారానికి స్పందించారు. ఢిల్లీలో ఇండియాగేట్లూ, రాజపథ్‌లూ జనచైతన్యానికి ఇటీవల సంకేతాలయి కూర్చున్నాయి. వచ్చేవారిలో ఎక్కువ మంది మధ్యతరగతీ, ఎగువ మధ్యతరగతికీ చెందిన వారే. ఫేస్‌బుక్కులూ, ట్విట్టర్లూ వంటి- నవీన సామాజిక మాధ్యమాలతో ఒకరికొకరు ఉప్పందించుకుని వచ్చిన వారే. వీరు చైతన్యం ఆందోళనల వరకే కాదు. పరిష్కారాలతో కూడా వచ్చేశారు. అవినీతికి లోక్‌ పాల్‌, అత్యాచారానికి ఉరి. కఠినమైన చట్టాలుంటే, ఈ రెండూ పోతాయన్నది వారి నిశ్చితాభిప్రాయం. చైతన్యం ఎప్పుడూ అంతే . కింద నుంచి వస్తే ప్రళయం. పైనుంచి వస్తే పొంగు. సమాజంలో అసమానతలున్నంత వరకూ అవినీతి వుంటుంది. అది వారికి అనవసరం. ఆడవాళ్ళు ఎదిగిపోతుంటే ఏడ్చిచచ్చే పురుష అహంకారం మన ఇళ్ళల్లో వున్నంత కాలం అత్యాచారాలుంటాయి. ఇది తెలిసిన రోజున తెల్లవారే సరికి చల్లారే ఆందోళనలు కాకుండా. సమూలమైన మార్పును కోరే ఉద్యమాలు వస్తాయి.

 ‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

తేలేదీ, మునిగేదీ!

పలు ట్వీట్స్‌: ఈ నెల 28న తెలంగాణ తేలిపోతుంది.

కౌంటర్‌ ట్వీట్‌: అయితే నాయకులు మునిగిపోతారు. ఆందోళనలకు పాయింటుండదు కదా!

ఈ- తవిక

జోస్యాంతం!

సూర్యుడికి

స్విచాఫ్‌ చెయ్యటమే

యుగాంతం అని

జోస్యాలు చెప్పారు.

ఇరవయ్యోకటో తేదీ

పోయి ఇరవయి రెండో తేదీ వచ్చేసింది.

అదే వెలుగు.

రెండో సూర్యుడు డ్యూటీ ఎక్కి వుంటాడు.

 బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘తెలంగాణ లో తిరుగుతున్న సీమాంధ్రనేతల మీద రాళ్ళు వేస్తున్నారు?’

‘హత విధీ! ఇప్పటికీ నాలుగురాళ్ళు వెనకేసుకునే అవకాశం సీమాంధ్ర నేతలకే ఇస్తారన్న మాట!’

కొట్టేశాన్‌( కొటేషన్‌):

చెయ్యేసి తగలెట్టు తెలుగోడా! జగమంత అపకీర్తి కలవోడా!!

-సతీష్ చందర్

(సూర్య దినపత్రిక లో26 డిశంబరు 20012 వ తేదీ సంచిక కోసం రాసింది.)

1 comment for “తెలుగు వాడి ‘పంచె’ తంత్రం!

  1. పంచెలూడ తంతానన్న వారు పంచలో చెయ్యిపెట్టి జై కొట్టారు. బ్రాందీ వ్యాపారులు గాంధి భవన్ కు అధిపతులయ్యారు.పట్ట పగలు తెలుగు చానళ్లలో సెక్స్ కట్టలు తెంచుకుని ప్రవహిస్త్గున్నది.తిరుపతిలో తెలుగు వెంకన్న చుటూ పర్దక్షిణ చేస్తున్నది బెంగాలి బాబు ప్రారంభోత్సవంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *