పేరు: శరద్ యాదవ్
దరఖాస్తు చేయు ఉద్యోగం: స్త్రీ పక్షపాతి.( ఎందుకంటే, నేను స్త్రీలమీద చేసిన వ్యాఖ్యల్ని అపార్థం చేసుకుంటున్నారు. దక్షిణాది స్త్రీలు నల్లగా వున్నా, అందంగా వుంటారనీ, వారి దేహాలు ఎంత అందంగా వుంటాయో వారి అంతరంగాలు కూడా అంతే అందంగా వుంటాయనీ అన్నాను… తప్పా..?)
వయసు: స్వరాజ్యానికి ఎంత వయసో, నాకు అంతే వయసు. స్వరాజ్యం అంటే స్త్రీ పేరు అని అనుకునేరు. దేశ స్వరాజ్యం గురించి మాట్లాడుతున్నాను. నేను 1947 లో పుట్టాను లెండి.
ముద్దు పేర్లు:‘సరదా’ యాదవ్ ( నేను సరదా గా మాట్లాడితే సీరియస్‌గా తీసుకుంటారు, సీరియస్ గా మాట్లాడితే సరదాగా తీసుకుంటారు. ఏం చెయ్యను చెప్పండి.) ‘దురద్’ యాదవ్( నాకు నోటి దురద కాక పోతే, నేనేల ఆ వ్యాఖ్యలు చేయవలె. చేసితి పో నలుగురూ ఏల నవ్వవలె…హిస్సీ..!)
‘విద్యార్హతలు: బి.ఇ ( అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అనుకునేరు. బ్యాచిలర్ ఆఫ్ ఎగష్ట్రా టాకింగ్) పైపెచ్చు. గోల్డ్‌మెడలిస్టును కూడా.అందుకే మహిళా పార్లమెంటు సభ్యులు నా ‘మెడలు’ వంచారు.
గుర్తింపు చిహ్నాలు:ఒకటి: జెడి(యూ) నామ మాత్రపు నేతను. అన్ని పనులూ మా నితిష్ కుమారే చక్కబెట్టుకుంటారు.
రెండు: ఎప్పుడో కానీ మాట్లాడను. మాట్లాడితే సంచలనమే.
సిధ్ధాంతం: నేను లోహియా వాదిని. ‘సామాజిక’ స్పృహ తప్ప, ఈ ‘కామా’జిక స్సృహ నాకు తెలీదు. (అయినా ‘సెక్సీస్ట్’ (లింగాధిక్య వ్యాఖ్య)లు చేశానని నన్ను కడిగి పారేస్తున్నారు.
వృత్తి: ‘బూతు’ మేనేజ్‌మెంట్. అవును. న’బూతో’ న భవిష్యత్. ‘బూతు’ లేక పోతే, మీకూ నాకే కాదు, దేశానికే భవిష్యత్తులేదు. వోటరు ‘బూతు’లోకి వెళ్ళకుండా ప్రతినిధిని ఎన్నుకోగలడా? మరి నేను ఎన్ని సార్లు లోక్‌సభకు వెళ్ళాను? ఏడు సార్లు. మరి ‘బూతు’ మేనేజ్‌మెంట్ తెలీకుండా ఎలా వుంటుంది. ప్రతీ దానికీ పెడార్థాలు తీస్తే, నాలాంటి వాడు ఇబ్బంది పెడతాడు.
హాబీలు:1. ట్రావెలింగ్. ఢిల్లీ టూ బీహార్, బీహార్ టూ ఢిల్లీ.
2. తప్పులు దిద్దుకోవటం. ( నోరు జారటం వెనక్కి తీసుకోవటం.)
అనుభవం: ఒక్కొక్క సారి ‘సారీ’ చెప్పినా తిట్టయిపోతుంది. నేను మహిళా మంత్రి స్మృతి ఇరానీని ఏమన్నాను. ‘నువ్వేమిటో నాకు తెలుసు’ అన్నాను. ఇందులో తిట్టేముందో ఇప్పటికీ నా కర్థం కావటం లేదు. ఇలా అర్థం కాక పోవటం వెనుక పురుషాధిక్యత వుందంటున్నారు. ఏమో! ఉందేమో? నాకు మాత్రం ఏం తెలుసు. ‘చదువులేని ఆమెకు విద్యా (మానవవనరుల ) మంత్రి పదవి ఎలా ఇస్తారని’ అని ఆమె గురించి అందరూ మాట్లాడినప్పుడు, ఆమెకు మద్దతు గా నిలిచిన విషయం ఆమె మరచి పోయారు. అంటే ఒక మేలు చేసి, ఒక చెడు వ్యాఖ్య చేస్తే బ్యాలెన్స్ అయిపోవాలన్నది నా ఉద్దేశ్యం కాదు.
మిత్రులు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వున్నారని తెలిసింది. వారు కూడా ఇలాగే స్త్రీల మీద కామెంట్లు విసిరి ఇరుకున పడ్డారట!
శత్రువులు: నేను పార్లమెంటులో స్త్రీల మీద కామెంట్ చేసినప్పుడు నవ్విన పురుషుల్లో చాలా మంది నన్ను తప్పు పట్టారు. ఇంతకు మించి శత్రువులుంటారా?
మిత్రశత్రువులు: మా స్వంత పార్టీలో వుంటార్లెండి.
వేదాంతం: ఇంత లేటు వయసులో ఎన్ని ఘాటు ఆరోపణలో…!
జీవిత ధ్యేయం: స్త్రీ జనోధ్ధారకుడిగా మారాలని.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 21-27మార్చి2015వ సంచికలో ప్రచురితం)