‘దేశ భక్తి’ ముసుగులో ‘ద్వేష’ భక్తి!

kuchibhotlaబ్యాలెట్‌ భాష ద్వేషం అయినప్పుడు, బులెట్‌ భాష ద్వేషం కాకుండా పోతుందా? ‘అమెరికాయే ముందు’ అనీ ‘అమెరికన్లే ముందు’ అని ప్రమాణ స్వీకారం నాడే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భీషణ ప్రతిజ్ఞ చేశారు. కొందరికిది ‘దేశభక్తి’లాగా కనిపించ వచ్చు. కానీ ఇది ‘ద్వేష భక్తి’ అని రాను రాను తెలుస్తూ వచ్చింది. అమెరికాయే వలసలు వచ్చిన వారి దేశం. ఎవరు ముందూ, ఎవరూ వెనుక అన్నదొక్కటే తేడా తప్ప అందరూ పరదేశీయులే. తర్వాత తర్వాత స్వదేశీయులయ్యారు. అయినప్పటికీ, యూరప్‌ మూలాలున్న శ్వేత జాతీయులదే అమెరికా అన్న ‘జాత్యహంకారం’ పెరుగుతూ వచ్చింది. అబ్రహాం లింకన్‌ దగ్గర నుంచి ఎప్పటి కప్పుడు ఈ ‘అహంకారాన్ని’ అంచెలంచెలుగా తీసి వేస్తూ వచ్చారు. కడకు నల్ల జాతీయుడే (బరాక్‌ ఒబామాయే) వరుసగా రెండు పదవీకాలాల పాటు అమెరికా ప్రథమ పౌరుడిగా రాజ్యమేలాడు. పైకి చూస్తే లేనట్లుగానే వున్నా, ‘జాత్యహంకారం’ పక్క దారులు వెతుక్కున్నది. ఇతర దేశీయులొచ్చి అమెరికన్ల ఉద్యోగవకాశాలను కొల్లగొడుతున్నారన్న నెపాన్ని ఈ అహంకారం వెతుక్కున్నది. ఇది తొలుత ఆఫ్రో అమెరికన్ల(బ్లాక్స్‌)లో బలంగా వుండేది. దాంతో ఇండియన్ల పట్ల వారు మెల్ల మెల్లగా ద్వేషభావాన్ని పెంచుకున్నారు. అంటే బ్లాక్స్‌ చేసే ఉద్యోగాలనే భారతీయులు అపహరిస్తున్నారనే ప్రచారం తొలి దశలో జరిగింది. కానీ, అమెరికన్‌ శ్వేతజాతీయులకు ఈ అసహనం బదలీ అయ్యింది. అంతవరకూ ఐటీ, ఇతరరంగాలలో దిగువ, మధ్య స్థాయి ఉద్యోగాలనే అందుకున్న భారతీయులు( సత్య నాదెళ్ళ, సుందర్‌ పిచాయ్‌ వంటివారు.) ఏకంగా ఐటీ జెయింట్లకు సీయీవోలుగా ఎదిగి పోయారు. ఈ ద్వేషాన్నే ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్‌ అభ్యర్థిగా దిగిన ట్రంప్‌ తన ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. శ్వేత జాతీయుల్లో వుండే ప్రజాస్వామ్య వాదులకు ఇది మింగుడు పడక పోయినా, జాత్యహంకారులకు రక్తం ఉప్పొంగింది.

ట్రంప్ ఆడుకునే అభ‌ద్ర‌త‌లు రెండు

ట్రంప్‌ రెండు రకాల అభద్రతలను తన అమ్మకపు సరకుగా వాడుకున్నారు. ఒకటి: అమెరికన్ల ఉద్యోగ భద్రత; రెండు: అమెరికన్ల ప్రాణ భద్రత.ఉద్యోగ భద్రత విషయంలో ఇటు ఇండియన్లనూ, అటు మెక్సికన్లనూ లక్ష్యంగా చేశారు. వీరే లేకుంటే అమెరికన్లకు ఉపాధి, వ్యాపారవకాశాలు మరింతగా దక్కేవన్న అపోహను బాగా పెంచారు. కానీ వీరే లేకపోతే, అమెరికాలో ఐటీతో పాటు పలు పరిశ్రమలు కుప్ప కూలిపోతాయన్న వాస్తవాన్ని మరుగు పరిచారు. అలాగే, ఇస్లామిక్‌ టెర్రరిజాన్ని బూచిగా చూపించారు. టెర్రరిస్టుల మీద వుండే ద్వేషాన్ని, ప్రపంచంలోని ముస్లిం సోదరుల మీదా, ముస్లిం దేశాల మీదా పెంచారు. ప్రచారంలో ఈ మాటలు ట్రంప్‌ చెబుతూంటే, వోట్లకోసం ఉద్వేగాలను పెంచుకుంటున్నాడు కానీ, అధ్యక్షుడయ్యాక ఇవన్నీ చేస్తారా- అని సరిపెట్టుకున్నారు. కానీ, ట్రంప్‌ ఏది చెప్పారో, అదే చేసేశారు. అది కూడా ఆఘ మేఘాల మీద. ముందు ప్రాణ భద్రతను తడిమారు. ఏడు ముస్లిం దేశాలనుంచి పౌరులను కట్టడి చేస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీచేశారు. వెనువెంటనే, ఉద్యోగ భద్రత కార్డు తీశారు. హెచ్‌ వన్‌ బీ వీసాల మీద వేటు వేశారు. ఇది నేరుగా భారతీయులకే తగిలింది. అలాగే కొన్ని రోజుల క్రితమే చట్టవిరుధ్ధ ఇమ్మిగ్రేషన్‌ కింద మూడు లక్షల భారతీయులను వెనక్కి పంపటానికి రంగం సిధ్ధం చేశారు.

ఇప్పుడిక అమెరికాలో జాత్యహంకారుల ద్వేషం వెర్రితలలు వెయ్యటం మొదలయ్యింది. భారతీయ ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన స్థితి అమెరికాలో పలుచోట్ల ఏర్పడింది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ కూచిభొట్ల(32) ను ఒక శ్వేతజాతీయుడు కాల్చిచంపటాన్ని, ఒకానొక నేరంగానో హత్యగానో భావించలేం. అలా తెంపుచేసుకుని ఊరుకుంటే, రేపు మరింత మంది భారతీయ ఉద్యోగుల్నీ, మేధావుల్నీ బలిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడెల్లా, మరో శీఘ్ర నిర్ధారణలకు కూడా పాశ్చాత్య మీడియా వస్తుంటుంది. అదే ‘గన్‌ కల్చర్‌’. అమెరికాలో తుపాకుల్నీ చటుక్కున పేల్చేయటం సంస్కృతిగా మారిందని విశ్లేషణలు చేస్తూ వుంటారు. కానీ ఈ ఘటన అలా లేదు. ‘ మా దేశాన్ని వదలి పొండి’ స్పష్టంగా హెచ్చరించి మరీ కాల్చాడు దుండగుడు. పక్కనున్న మరో తెలుగు యువకుడి మీదా కూడా కాల్పులు జరిపాడు కానీ, ప్రాణాలతో బయిటపడ్డాడు.

రెండు అమెరికాలు

అమెరికాను ప్రజాస్వామ్యానికీ, బహుళ సంస్కృతులకు పుట్టినిల్లుగా భావించేవారు. కానీ, ఆపునాదులు ఇప్పుడు కదలిపోతున్నాయి. అయితే ఈ ‘ద్వేష భావ’ం అమెరికన్లందరిలోనూ వుందనుకోవటం పొరపాటు. అందుకే ఇదే ఘటన ఉదాహరణ. దుండగుడు(పురిన్‌టన్‌) నుంచి శ్రీనివాస్‌ను కాపాడటానికి విఫల యత్నం చేసిన గ్రిల్లట్‌ కూడా అమెరికనే. ఈ ఘటనలో ఆయన కూడా గాయపడ్డారు.

ఈ ఘటనలో మరో విచిత్రం కూడా జరిగిపోయింది. దొరికిపోయిన దుండగుడు పోలీసు విచారణలో ‘వారు మధ్య ప్రాచ్య(గల్ఫ్‌) దేశాల వారనుకుని’ కాల్చానన్నాడు. అంటే భారతీయుడయితేనేమి; మధ్య ప్రాచ్చదేశీయుడయతేనేమి.. ఎవరయినా అమెరికన్లకు నష్టం చేసేవారే కదా- అన్న ద్వేషభావజాలం ఎలా చాపకింద నీరులా ప్రవహిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే నెలలో వరంగల్‌ జిల్లాకు చెందిన మామిడాల వంశీ రెడ్డి అనే విద్యార్ధి కూడా ఇలాగే కాల్పులకు గురయ్యాడు. ట్రంప్‌ కారణంగా అమెరికన్లు కూడా రెండుగా చీలిపోయారు. ప్రజాస్వామిక అమెరికన్లు, జాత్యహంకార అమెరికన్లు. ఇప్పటికిప్పుడు, భారతీయులకో, మెక్సికన్లకో, గల్ఫ్‌ దేశీయాలకో మాత్రమే నష్టదాయకంగా అనిపించవచ్చు; కానీ అంతిమంగా అమెరికాకే నష్టాన్ని తెచ్చే పరిస్థితి రావచ్చు. ఇప్పటికే అమెరికన్లు ఈ జాత్యహంకారం మీద పిడికిళ్ళు ఎత్తుతూ రోడ్ల మీదకు వస్తున్నారు. స్వేఛ్చకోసం పరితపించిన గడ్డ మీద ఈ వివక్ష ఎల్ల కాలం చెల్లదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *