దొరికిందే చేప

నీళ్ళల్లో పాలులాగా, కొబ్బరి నీళ్ళల్లో జిన్నులాగా, తేనెలో నిమ్మరసంలాగా…ద్రవమన్నాక.. ఇంకో ద్రవంలో కలిసిపోవాలి. లేకుంటే ఉపద్రవంలోనన్నా కలిసిపోవాలి. విస్కీలో సోడా
కలిసిపోవటంలేదూ..! వెనకటికో రచయిత కాస్త ‘రస సిధ్ధి’ పొందాక, విస్కీని ద్రవంతోనూ, సోడాను ఉపద్రవంతోనూ పోల్చాడు.( బుస బుసమని పొంగటంతో ఉపద్రవమని భావించి వుంటాడు.
జీవితాన్ని ‘స్కాచి’ వడపోసిన వాడికి ఉపమానాలు కొరవా? ) ‘సారా’ంశం ఏమిటంటే ద్రవంలో ద్రవం కలిసి తీరాలి.

photo by David's digits


ఈ సిధ్ధాంతమే ద్రవ్యానికీ(డబ్బుకీ) వర్తిస్తుంది. ద్రవ్యం ద్రవ్యంలో కలిసిపోవాలి. తెల్లని పాలలో నల్లని కాఫీ డికాక్షన్‌ కలిసిపోయినట్లు, తెల్లడబ్బులో, నల్ల డబ్బు కలిసిపోతుంది.
అసలు డబ్బేలేకపోతే..? పాలే లేక పోతే… అన్నట్లు లేదూ ప్రశ్న?! బ్లాక్‌ కాఫీతో సరిపెట్టుకున్నట్టు, బ్లాక్‌ మనీతో సర్దుకుపోవాలి. ఎప్పటికీ నోరారా పాలుకలిసిన రుచికరమైన కమ్మటి కాఫీ తాగలేడు. తెల్ల డబ్బే నల్లడబ్బుని కడుపులో పెట్టుకుని దాని ‘నల్ల’తనాన్ని దాచగలుగుతుంది. కాబట్టి డబ్బున్న వాడు డబ్బుని మింగినా కనపడడు. రోజూ మెక్కే వాడు, ఎంత మెక్కినా కనపడడు. పస్తులున్న వాడు, ఒక్కొరోజు పరమాన్నం తింటే కడుపుబ్బి చస్తాడు. ఆ మాట కొస్తే తినలేనివాడికి వున్న ‘కడుపుబ్బు’ ఇంతింత కాదు.
కూలీ,నాలీ చేసుకునే కుటుంబం నుంచి కష్టపడి చదివి పైకొచ్చిన అధికారి వుంటాడు. అతడికి ఇష్టంవున్నా లేకున్నా నిజాయితీగా వుండి పోవటం దేశానికే కాదు, అతడికి కూడా
శ్రేయస్కరమే. ఎందుకంటే అతడు ఏమి తిన్నా దొరికి పోతాడు. హఠాత్తుగా అతడికి ఒక కోటి రూపాయిల లంచం ఇస్తే, ఎక్కడ దాస్తాడు. బీరకాయ పీచు సంబంధాలతో కలిపి, బంధుమిత్రులంతా కూటికి గతిలేని వాళ్ళే. ఏ గుడిసెలో పెట్టినా సొమ్ములు జిగేల్మంటాయి. అందుకని తన దగ్గరే ఉంచేసుకుంటాడు. పాలు కలవని బ్లాక్‌ కాఫీలాగా, ఇంటికొచ్చిన బ్లాక్‌ మనీ వెక్కిరిస్తూనే వుంటుంది. తన భార్యామణి వేసుకున్న నెక్లెస్‌ వైపు కూడా అందరూ అనుమానంగానే చూస్తారు. కారే కాదు, ఖాళీ బీరువా కొన్నా, ‘నల్ల’ని తనం కనిపించిపోతుంది. ఎలా చూసినా అతడు మింగిన లంచం దాచేస్తే దాగని నల్ల ‘ముత్యం’లా మెరిసిపోతుంది.
ఇలాంటి అవినీతి చేప గేలం వేయకుండానే మీడియాకు దొరికిపోతుంది. స్టింగ్‌ ఆపరేషన్‌ చేయకుండానే గిలా గిలా కొట్టుకుంటూ కెమెరా గాజుకళ్ళకు చిక్కిపోతుంది. ఏసీబీ దాడి
చెయకుండానే ‘కట్టలు’ తెంచుకుని కేసుల్లో బందీ అవుతుంది.ఐటి రెయిడ్‌ కు ముందే, పొట్టను మించిన తిండి(ఆదాయాన్ని మించిన ఆస్తులు) వున్నట్లు బయిటపెట్టుకుంటుంది. ఏ శాఖ వేటలోనయినా తొట్టతొలుత దొరికిపోయేవి… ఈ తరహా చేపలే..!
ఎప్పుడూ గంజితినే వాడికి ఎప్పుడయినా పప్పన్నం పెడితేనో, భోజనం చేసేటప్పుడు అరచేయి మొత్తానికి పనిచెప్పే అలవాటున్న గ్రామీణుడిచేతికి ఫోర్కూ, స్పూనూ ఇస్తేనో,చప్పుడు చేస్తూ గుటకలు వేస్తూ పానకం తాగేవాడికి సిప్పు చేయమని కప్పు కాఫీ ఇస్తేనో- ఎలాంటి కంగారు మిగులుతుందో, సర్కారీ శాఖల్లో కొత్తగా తినాలనుకున్న కూర్చున్న ఒట్టేసుకుని కూర్చున్న వాడికీ అంతే గాభరా దక్కుతుంది.

ఎక్కడయినా సరే ‘తినే’ వాడికీ ఒక పధ్ధతీ పాడూ వుంటుంది. లేక పోతే అమాయకంగా పుచ్చుకున్న లంచానికి కూడా సంతకం పెట్టి, స్టాంపు వేసి, రశీదు ఇచ్చేయగలడు. నేరుగా మంత్రి వర్యుల్ని కలిసేసి, తీసుకున్న నోట్ల కట్టల్ని, తీసుకున్నట్లుగా తెచ్చేసి, ‘టేబుల్‌ మీద పెట్టేసి’, ‘నన్ను ఉన్న చోట ఉంచేయండి’ అని ప్రాధేయ పడవచ్చు. దశాబ్దాలుగా, పారంపర్యంగా వస్తున్న లంచాచారాల్ని, లంచ వ్యవహారాల్ని పారంపర్యంగా తెలుసుకుంటూ వున్న వారు, ఇలా ‘సాంప్రదాయ విరుధ్ధంగా’ వ్యవహరించరు తరతరాల లంచ వారసత్వం వున్న వారు, ఇలాంటి పొరపాట్లు చెయ్యరు. ఇంట్లో కోట్లు మూలుగుతున్న అధికారి కూడా కారు కొనడు. కావాలంటే సిటీ బస్సులో నిలబడి వస్తాడు. అంతకీ లేదంటే, రెండు డజన్ల సార్లు కిక్కు కొట్టినా స్టార్టు కాని, డొక్కు స్కూటరు మీద ఆఫీసుకు వస్తాడు. ఇస్త్రీ లేని దుస్తులతోనూ, అరిగిపోయిన చెప్పులతోనూ సాక్షాత్కరిస్తాడు. ఇంతటి
నిరాడంబరతతో జీవిస్తూ, తాను ఆర్జించిన ‘నల్ల’కోట్లను, సంపన్న బంధువుల ‘తెల్ల’ కోట్లలో కలిపేస్తుంటాడు. ఇలాంటి నిరాడంబరతో వారసత్వంతో కానీ సిధ్ధించదు.ఇలాంటి వారసత్వం లేని కూలిబిడ్డ పొరపాటున అవినీతి పరుడయితే, అతడు కార్ల ప్రదర్శనా, అతడి భార్య నగల ప్రదర్శనా ప్రతీ రోజూ నిర్వహిస్తాడు. కాబట్టి దొరక్క చస్తాడా?
ఎలా చూసినా లంచాన్ని మింగి జీర్ణించుకోవాలంటే పెట్టి పుట్టి వుండాలి. గనులు వున్న వాడే ‘నాలుగు రాళ్ళు’ వెనకేసుకో గలడు. గుడిని మింగిన తండ్రి వున్న వాడే గుళ్ళోలింగాన్ని లాఘవంగా మింగ గలడు.
చిన్న చేపలకే వలలన్నీ, తిమింగలాలకి ప్రవాహాలే!

——సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 7జనవరి2012 సంచికలో ప్రచురితం)

1 comment for “దొరికిందే చేప

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *