ప్రతీ పువ్వూ పుట్టగానే పరిమళించడం వంటి వెర్రివేషాలు వెయ్యదు. పుట్టు కవులు, పుట్టు కళాకారులు ఉండరు. కాకుంటే అలాంటి లక్షణమేదో చిన్నప్పటి చేష్టల్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. అది ముదిరి ఏదో ఒక రోజున కళయి బైట పడుతుంది.
దేవదాసు కనకాల ఒక నటుడు. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు ఇతనేమీ మేకప్పు, విగ్గూ వగైరాలతో పుట్టలేదు. చాలా మామూలు కుర్రవాళ్ళా పెరిగి అన్ని కుర్ర వేషాలూ వేశాడు. కాలేజీలో షేక్స్‌పియర్ నాటకం సిలబస్‌లో వస్తే, దాన్ని ధైర్యం చేసి వాళ్ళ మాష్టారు వేయించాడట. అందులో అయాచితంగా వేషం దొరికిన దేవదాసు, నాలుకను నానారకాల మడతలు పెట్టి ఇంగ్లీషు ఉచ్చారణను దంచేశాడట. చిత్రమేమిటంటే దానినేమాత్రం నటనానుభవంగా ఆయన ఆయన గుర్తుకు తెచ్చుకోడు. నిజంగా నటించింది మాత్రం ఒక బృహత్తర ప్రయోజనం కోసం.
ఎవరూ ఏమీ అనుకొకపోతే ఆ ప్రయోజనం ఏమిటో ఆయన చెప్పదలిచాడు. అది మరేమీ కాదు- ఒక అందమైన పేరు జయశ్రీ. ఆంధ్ర యూనివర్సిటీలో థియేట్రికల్ ఆర్ట్స్ విభాగంలో జయశ్రీ చదువుతుండేది. అక్కడే ఈ దేవదాసు కూడా చదివే వాడు. పేరును సార్థకం చేయాలనుకోలేదు కానీ ఆ అమ్మాయితో పాటు కలిసి నటించాలనుకున్నాడు. కె.వి.రమణారెడ్డి మరొకరితో కలిసి రాసిన నాటకం ‘రాజీవం’లో జయశ్రీకి ఆ విధంగా డైలాగుల్లో చేరవయ్యాడు. ఆమె కనపడితే చాలు ఒళ్ళు తెలియని కవిత్వం చెప్పే పాత్ర అది. ఇప్పటికీ దేవదాసు ఆ డైలాగుల్ని పూస గుచ్చినట్లు చెప్పగలరు. అందులో జయశ్రీ పోషించిన పాత్ర వేశ్య పాత్ర. నాటకం ముగిసేసరికి ఆమె కుష్టు రోగి అవుతుంది. ఇది నాటకం ఇతివృత్త ఫలితయో లేక నటనలో ఉండే అనుభూతిని చూసిన ఫలితయో కానీ అమ్మాయి మీద మోజు నాటకరంగం మీదకు మళ్ళింది. పేరుకు యూనివర్సిటీలో శిక్షణ కానీ నిజానికి అక్కడ నటన గురువు చాటు విద్యే. అప్పట్లో దేవదాసు గురువు కె.వెంకటేశ్వరరావు గారు. గురువు ఎలా చెబితే అలా చేయడంలో అందరికీ అనుకరణ అబ్బేది.
వెంకటేశ్వరరావు మాస్టారు కింది పెదవిని పైకి నెట్టి డైలాగు చెప్పేవారు. చివరకి మేం కూడా ఆ పనిని అంత పర్‌ఫెక్ట్‌గానూ చేసేవాళ్ళం.” అలా అనుకరణే నటనగా రెండేళ్ళపాటు సాగింది. విశాఖలో చదువుతున్నప్పుడే దేవదాసుకు కామెర్ల వ్యాధి సోకింది. అప్పుడు స్వగ్రామమైన యానాం వెళ్ళి నెల రోజులు విశ్రాంతి తీసుకొని- రాజమండ్రిలో తమ గురువు గారు తన సహాధ్యాయులతో నాటకం వేస్తున్నారంటే వెళ్ళాడు. వెనుక సీట్లో కూర్చుని నాటకాన్ని చాలా జాగ్రత్తగా చూసాడు. ఆ నాటకంలోని అన్ని పాత్రల్లోనూ దేవదాసుకి ఆయన గురువే కనపడ్డాడు. అందరూ ఒకే విధంగా తనను కింది పెదవులతో వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. ప్రతీ నటుడూ పాత్రలోకి తన గురువును పంపాడే తప్ప తాను వెళ్ళలేదు. అయితే గురువుగారు మాత్రం తానే స్వయంగా ఆయన పోషించిన పాత్రలోకి వెళ్ళాడు. అయితే వాళ్ళందరి లోనూ గురువు కాకుండా విలక్షణంగా పాత్రలో జీవించిన వ్యక్తి మరొకరు రంగస్థలం మీద తారసిల్లారు. అతను ఖచ్చితంగా వెంకటేశ్వరరావు గారి విద్యార్థి కాదని స్థిరపరచుకున్నాడు. అతని పేరు బాబీ. ఆంధ్రదేశంలో అరుదైన నటుడు, దర్శకుడు. ఆయన రెండు నెలల క్రితమే కన్నుమూసాడు. బాబీని కనకాల పనిగట్టుకుని పరిచయం చేసుకున్నాడు. తనని మూసలోంచి బయిటపడవేయగల వ్యక్తి ఒక్క బాబీయే అనుకున్నాడు. బాబీకి వెటకారం ఎక్కువ. ఏమాత్రం కృతకంగా నటించినా ”నటించేస్తున్నారన్న మాట” అని దెప్పి పొడిచేవాడు. దేవదాసు ప్రాణం నీరు గారిపోయేది. అలాగే అభినయంలో చిన్న మెరుపు మెరిసినా సరే ఆకాశానికి ఎత్తేసేవాడు. కళ్ళు చెమర్చేంతగా ప్రశంసించేవాడు. దేవదాసుని రంగస్థలం నుంచి బాబీ ఒక రకంగా కిడ్నాప్ చేసి నటనకు దగ్గర చేసాడు. ఎటు చూసినా పెదవి బైట పెట్టే మూస పాత్రల నుంచి దూరం చేయడం కోసం నెల రోజుల పాటు పిఠాపురంలోని తన సొంత ఇంటిలోనే వుంచుకున్నాడు. బాబీగారి సహచరి పులి¬రావకాయ పెడుతుండేవారు. ఆ కారంలోని మమకారాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా దేవదాసు కళ్ళు మిలమిలా మెరుస్తాయి.
అప్పుడు బాబీ తన చేతికి ఏ పుస్తకమొస్తే అది ఇస్తుండేవాడు. స్టాన్‌స్లవిస్కీ ‘మై లైఫ్ ఇన్ ఆర్ట్’ అలా ఇచ్చిందే. అది చదువుతున్నప్పుడు దేవదాసుకు తన ప్లాష్‌బ్యాక్‌లు గుర్తొచ్చేవి. చిన్నప్పుడు స్టాన్‌స్లవిస్కీ కూడా దుప్పట్లు తెరలుగా కట్టి తమ్ముళ్ళు, చెల్లెళ్ళతో కలిసి నాటకాలాడేవాడు. నోరు తిరగని షేక్స్‌పియర్ నాటకాల్లోని డైలాగుల్ని దేవదాసు పొలం గట్టుకు వెళ్ళి గట్టిగా అరుస్తూ ప్రాక్టీస్ చేసేవాడు. సరిగ్గా అదేవేళకు అభంశుభం తెలియని తన మిత్రుడు పిల్లా బుచ్చికృష్ణ సైకిల్ మీద వస్తుంటే ‘రాస్తారోకో’ చేసి షేక్సిపియర్‌ని చూపించేవాడు. అయితే స్టాన్‌స్లవిస్కీ, దేవదాసుల కన్నా చాలా ఆకులు ఎక్కువ చదివాడు. వేలెడంత లేనప్పుడే వేషాలు వేసాడు. సర్కస్‌కు తీసుకువెళతానన్న వాళ్ళ నాన్న పట్టపగలే నిద్రపోతుంటే చెంబులూ, తపేళాలు జారిపోతున్నట్లుగా నేల విడిచి నిద్రలేపేవాడు. అదిగో ఆ ఘటికుడే ఆటు బాబీకి, ఇటు దేవదాసుకి ఋషితో సమానం. బాబీ ప్రోత్సాహంతోనే పూనా ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కి దరఖాస్తు చేసాడు. వాళ్ళు నిజంగానే పిలిచేసారు. మద్రాస్ ఆడయార్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ఇంటర్వ్యూకి వెళ్ళాడు. లోపలకి ఎప్పుడు వెళ్దామా అని తొందరపడుతున్న దేవదాసు, ఎవరో పిలిచినట్టు భ్రమించి లోపలికి దూరాడు. ”నిన్నెవరు రమ్మన్నారు. ముందు బైటకు వెళ్ళు”- అన్నాడు ఇంగ్లీషులో . నెక్ టై కట్టుకున్న ఓ పెద్ద మనిషి పక్కనే చెయెత్తు మనిషి చిద్విలాసంగా నవ్వుతున్నాడు. ఆయన మరెవ్వరో కాదు. మన ఎస్వీ రంగారావే. దేవదాసుకి కోపం వచ్చింది. సీటు ఎలాగూ ఇవ్వరని నిర్ధారణ కొచ్చి ఏమడిగినా ఎదురు చెబుదామనుకున్నాడు. తర్వాత నిజంగానే లోపలికి రమ్మన్నారు. తెలిసిన డైలాగులు చెప్పమన్నారు. షేక్స్‌పియర్ నాటకంలోని ఆంటోని పాత్ర గుర్తొచ్చింది. ”మిత్రులారా, రోమియులారా, దేశ ప్రజలారా” అన్న డైలాగు చెప్పాడు. అదికూడా తిరస్కార స్వరంతో చెప్పాడు. దానినే నాటక పరిభాషలో ప్రతికూల వైఖరి అంటారు. ఇష్టం లేని ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల్ని అలా ఊహించుకుని చెప్పడంలో ఆ డైలాగు రక్తికట్టింది. ఇక ఎంపికలో రెండవ దశ కెెమెరా ముందు నటించడం. దేవదాసు అన్నీ బాగానే చేసాడు కానీ ఒక్క నవ్వు మాత్రం నవ్వలేకపోయాడు. దేవదాసుకి చిన్నప్పుడు ఆటల్లో ముందు పన్ను విరిగిపోయింది. నవ్వితే అదెక్కడ బైటపడుతుందోనన్న భయం దేవదాసుని వెంటాడేది. అందుకే అక్కడ కూడా నవ్వలేకపోయాడు. చివరికి అక్కడున్న పెద్ద మనిషి, ” నీ అభిమాన నటి సైరాబాను కాదు కదా!” అన్నాడు. అంతే దేవదాసు కిసుక్కుమన్నాడు. కెమేరా క్లిక్ అన్నది. పళ్ళు మూసుకుని చూస్తే పూనాలో ఉన్నాడు.
ఇక అక్కడి జీవితమే వేరు. ఆ సంస్థలో తెలుగు వాళ్ళు తక్కువ. వున్న కొద్ది మందీ సాంకేతిక విభాగాల్లో వుండేవారు. దేవదాసును వాళ్ళు అదోలా చూసేవారు. ‘వీడు కూడా నటుడవుతాడేమిటి? మన నాగేశ్వర రావు, రామారావులు చాలరా?’ అన్నట్లు వాళ్ళ హావభావాలు ధ్వనించేవి. అయితే అక్కడ ప్రొఫెసర్ రోషన్ తనూజా అనే ఆయన దేవదాసుని బాగా పట్టించుకున్నాడు. ఎప్పుడన్నా శరీర కష్టంతో నటిస్తే చాలు ”దేవదాసు నాటకాలు ఆడకయ్యా” అని మందలించేవాడు. కెమెరా ముందు నటించేటప్పుడు నటన శరీరంలోంచి కాకుండా మనసులోంచి రావాలన్నది ఆయన వాదన. ఒక రకంగా రోషన్ స్టాన్‌స్లవిస్కీకి ప్రశిష్యుడవుతాడు.. ఎందుకంటే రోషన్ గురువు ప్రముఖ చైనా దర్శకుడైనా ‘లీ’. స్టాన్‌స్లవిస్కీ దగ్గర లీ నేరుగా శిష్యరికం చేసాడు. ప్రపంచ సినిమా రంగంలోఆస్కార్ అవార్డు పొందిన నటుల్లో 300 మంది ‘లీ’ శిష్యులే. మార్లిన్ మన్రో, డస్టిన్ హాఫ్‌మన్ వంటి మహామహులు ‘లీ’ ముందు వేషాలు వేసిన వాళ్ళే. ఆ విధంగా స్టాన్ స్లవిస్కీని దేవదాసు రెండు రకాలుగా సంక్రమింపజేసుకున్నాడు. ఒకటి బాబీ ఇచ్చిన పుస్తకాల ద్వారా, రెండు రోషన్ తనూజా శిష్యరికం ద్వారా, స్టాన్‌స్లవిస్కీ రాసిన ‘యాక్టర్ ప్రిపేర్స్’ అనే పుస్తకాన్ని ఇప్పటికే పాఠ్యగ్రంథమంత జాగ్రత్తగా దేవదాసు చదువుతారు. గొప్ప నటులకుండే ఆరు లక్షణాల్లోనూ (ఏకాగ్రత, ప్రశాంతత, పరిశీలన, ఊహ, ఉద్వేగ స్ఫురణల్లోనూ), ఉద్వేగ స్ఫురణను ఔపోసన పట్టాడు. రావణాసురుడి పాత్ర వేసినా రాముడి పాత్ర వేసినా వాళ్ళ అంతిమలక్ష్యాలు స్ఫురణలో లేక పోతే పాత్రధారుడు. ఆ పాత్రలని చౌకబారుగా మార్చే అవకాశం వుంది.
అలా నటనలోని ఆత్మను పట్టుకుని చిత్రరంగలో చేరిన దేవదాసు ‘బుద్ధిమంతుడు’ సినిమాలోఅక్కినేని నాగేశ్వరరావు స్నేహితుడిగా పాత్ర పోషణ చేసాడు. అలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు . ‘నిజం’, ‘చలిచీమలు’ వంటి విభిన్న చిత్రాలకుదర్శకత్వం వహించాడు. కానీ నటనలో రాణిచంటమే కాదు, నటనను బోధించడం లక్ష్యంగా పెట్టుకుని రాజారమణ స్థాపించిన మద్రాసు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. దేవదాసు సతీమణి లక్ష్మీదేవి కూడా నటనను బోదించడమే ప్రధానవృత్తిగా స్వీకరించారు. చిరంజీవి నుంచి రజనీకాంత్ వరకూ ఆమె దగ్గర శిక్షణ పొందిన వారే. గత పదేళ్ళుగా హైదరాబాద్‌లోనే సొంతంగా శిక్షణా సంస్థ నుపెట్టుకుని నటనను బోధిస్తున్నారు. భాషను పరిచయం చెయ్యటం దగ్గర్నుంచి నృత్యం చేయడం, సన్నివేశం కల్పించకొని నటించడం, యాసలో మాట్లాడటం; ఇలా ఎన్నో రీతుల్లో శిక్షణ ఇస్తున్నారు. దేవదాసు ఒకే ఒక విషయంలో బాగా అసంతృప్తిగా వున్నారు. అన్నీ వుండి ఐదవతనం లేనట్లు నటులు వుండి కూడా నాటకాలను రచించగల రచయతలు లేరనిని ఆయన ఫిర్యాదు చేస్తున్నారు. నాటక రచనను ప్రత్యేక కళగా గుర్తించకపోవడమే ఇందుకు కారణమని ఆయన అంటారు. దేవదాసు కనకాల తలపండిన నటుడు, దర్శకుడు, బోధకుడు…అన్నిటిని మించి.. నిండు మానవుడు.
– సతీష్ చందర్
(‘వార్త‘ దినపత్రికలోని ’కళ‘ పేజీలో 1996లో ప్రచురితం)
మీ రైటింగ్ లో దేవదాస్ కనకాల గారి గురించి చదువు కోవడం చాలా బాగుంది… ఆయన కు సరైన నివాళి..
-అరుణ్ బవేరా
Manchi article sir….
Satish sir….pl write s play