నాది ‘సేమ్‌ డైలాగ్‌’ కాదు!

Illustration: Satish Chandar

Illustration: Satish Chandar

రాహుల్‌ మోడీ!

నరేంద్ర గాంధీ!

అనుమానం లేదు. మీరు సరిగానే చదివారు. ఇద్దరూ ప్రధాన అభ్యర్థులే. కానీ రూపాలు మారలేదు. కానీ గొంతులే మారాయి.

రాహుల్‌ గాంధీకి నరేంద్ర మోడీ, నరేంద్రమోడీకి రాహుల్‌ గాంధీ వచ్చి డబ్బింగ్‌ చెప్పినట్లుంది. ఒకరి మాటలు ఒకరు మాట్లాడేస్తున్నారు. వారి సభలకు వచ్చిన వారూ, వాటిని టీవీల ముందు కూర్చుని వింటున్న వారూ, కాస్సేపు తమని తాము గిల్లి చూసుకుంటున్నారు.

కలయా?నిజమా? వైష్ణవ మాయా?

అఫ్‌ కోర్స్‌. కలయే. ఎన్ని ‘కల’యే.

కాకుంటే, ఇది మనం కంటున్న కల కాదు. వారిద్దరూ కనే కల. కానీ గిల్లులు మనకి మిగులుతున్నాయి.

మోడీ కున్న పేరేమిటి? ఆధ్యాత్మిక వాది. హిందూ పక్షపాతి. కానీ హఠాత్తుగా ఆయన హేతువాది లాగా, ముస్లిం పక్షపాతిలాగా మాట్లాడేస్తున్నారు.

మరి రాహుల్‌? యువకుడనీ, మైనారిటీలను బుజ్జగించేవాడనీ ఇప్పటి వరకూ నమ్మించారు. ఇప్పుడు హఠాత్తుగా ఆయనలోకి ఆధ్యాత్మిక వాది వచ్చేశాడు. హిందూ పక్షపాతి కూడా తన్నుకుంటూ వచ్చేశాడు.

వెయ్యిటన్నుల బంగారపు నిధి వుందని ఓ సాధువు(శోభన్‌ సర్కార్‌) కలకంటే, ఉత్తర ప్రదేశ్‌లోని ఓ పాడుబడ్డ కోట లో కేంద్ర ప్రభుత్వం తవ్వకాలు మొదలు పెట్టించింది. స్వామీజీలన్నా, సాధువులన్నా మోడీికి ఎంత గౌరవమో అందరికీ తెలిసిందే. ‘ఓ పవిత్రమూర్తి చెబుతుంటే, విశ్వసించాలి కదా?’ అని కదా మోడీ అనాల్సింది.

కానీ ఆయన అలా అనలేదు.’మనం చేసిన ఈ పిచ్చి పని చూసి ఇవాళ ప్రపంచం మొత్తం మనల్ని చూసి నవ్వుతోంది. ఎవరో కలగంటే, ప్రభుత్వం తవ్వకాలను మొదలుపెట్టేసింది’ అని విరుచుకు పడ్డారు. అయితే తర్వాత ‘తవ్వాల్సింది నల్లధనాన్ని’ అని ముక్తాయించారను కోండి. అది వేరే విషయం.

విశ్వాసాలను పక్కన పెట్టి విజ్ఞాన శాస్త్రాన్నే ప్రామాణికంగా తీసుకోవాలనే హేతువాదిలా మోడీ మాట్లాడేసరికి అందరికీ కొంచెం ఆశ్చర్యం వేసింది. ఈ మాట రాహుల్‌ గాంధీ అంటే సరిపోయేది. పాశ్చాత్య హేతువాద దృష్టి ఆయనకు వుంది కాబోలు అని అందరూ భావించేవారు.

అంతే కాదు, ఈ వ్యాఖ్య చూడండి: ‘ముజఫర్‌ నగర్‌ ఘర్షణల్లో బాధిత ముస్లిం కుటుంబాల్లోని యువకులను పాకిస్తాన్‌ నిఘా సంస్థలు ఉగ్రవాదం వైపు మళ్ళించటానికి వల వేశాయి.’

ఈ మాటలు ఎవరు అనాలి? (కార్గిల్‌ సాక్షిగా) పాకిస్తాన్‌ వ్యతిరేకతనే దేశభక్తిగా జనంలోకి ఎక్కించే బీజేపీ నేత అనాలి. ‘ఇప్పుడయితే ఈ ‘డైలాగ్‌’ నరేంద్ర మోడీకి నప్పుతుంది.

మైనారిటీలే బుజ్జగింపునే సెక్యులరిజంగా భావించే కాంగ్రెస్‌ నేతలకు ఈ మాటలు సరిపోవు కదా! కానీ, చిత్రం! ఈ మాటలన్నది కాంగ్రెస్‌ ‘యువ రాజు’ రాహుల్‌ గాంధీ.

‘నాదీ సేమ్‌ డైలాగ్‌’ అని మోడీ పొరపాటున కూడా అనలేదు. ‘రాహుల్‌ చేసిన ఈ వ్యాఖ్యల వల్ల ముస్లిం ల మనోభావాలు దెబ్బతిన్నాయి’ అన్నారు..

తాను ముఖ్యమంత్రిగా వుండగా గుజరాత్‌ లో జరిగిన గోద్రా అనంతర ఘర్షణల్లో ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయో లేదో, మోడీ ఇప్పటికీ చెప్పనే లేదు.

ఇంతకీ తీరాల్సిన సందేహం ఒక్కటే: ఒకరి డైలాగులు ఒరు ఎలా చెబుతున్నారు?

మైనారిటీలకు వ్యతిరేకం కూడ గట్టిన మెజారిటీ తమ వద్ద వుంటే చాలు, జయం తమదే అన్న రీతిలో ఇన్నాళ్ళూ, మోడీ, ఆయన పార్టీ వెళ్ళాయి.

ఏ కులానికా కులాన్నీ, ఏ వర్గానికా వర్గాన్నీ, ఏ మతానికా మతాన్నీ, ఏ ప్రాంతానికా ప్రాంతాన్నీ వేర్వేరుగా బుజ్జగించుకుంటూ పోతేనే విజయం తమ వంతవుతుందని రాహుల్‌ ఆయన కుటుంబ పక్షం అనగా కాంగ్రెస్‌ విశ్వసిస్తూ వచ్చాయి.

ఈ ఫార్ములాలకు భిన్నంగా వీరెందుకు మాట్లాడారు?

ఓ పీట ఎక్కిస్తే, ఎవరయినా నిజం చెప్పేస్తారని ఓ పాత పౌరాణిక తెలుగు చిత్రంలో చూపిస్తారు. ఆ పీట ఎక్కితే ఏ మేరకు సత్యాలు పలుకుతారో, లేదో తెలియదు కానీ, ప్రధాని కుర్చీ చూపిస్తే మాత్రం, ఎవరయినా తాము ఏది కాదో, అది చెబుతారు.

అర్జునుడు తాను జూదం అడతానని చెప్పవచ్చు; ధర్మరాజు తాను బాణాలేస్తానని అనవచ్చు.

అలాగే హిందూత్వ వాది మైనారిటీ వాదిలాగా, మైనారిటీ వాది హిందూత్వ వాదిలాగా మాట్లాడారు.

అందలాలు పెద్దవయినప్పుడు, అబధ్ధాలూ పెద్దవవుతాయి.

-సతీష్‌ చందర్‌ 

(ఆంధ్రభూమి దిన పత్రిక 27 నవంబరు 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *