‘నెలవంక’ కత్తి దూసింది!

కవి వస్తాడు.

చూడాలి. ఎదురు చూడాలి.

ఎలా చూడాలి?

సూర్యుణ్ణి దర్శించినట్లు కాదు, చంద్రుణ్ణి వీక్షించినట్లు చూడాలి.

భళ్ళున తెల్లారినప్పుడు, కిటికీలో భానుణ్ణి ముఖం చిట్లించి చూస్తాం. కానీ నెలవంకను చెట్ల కొమ్మల చిగురుటాకుల సందుల్లోంచి చిరునవ్వుల్తో చూస్తాం.

మండే వాడని తెలిసి కూడా రవిని ఒక్క సారి చూసేస్తాం. మెత్తనిదని తెలిసి కూడా జాబిల్లిని వెతుక్కుంటూ, అంచెలంచెలుగా చూస్తాం.

కవిని చందమామను చూసినట్లు చూడాలి.

అజంతా శిసాగర్‌ను అలాగే చూశాడు.

అరణ్యాన్ని వీడి, అజ్ఞాతాన్ని వీడి వచ్చిన కవి అతడు. లోపలి నుంచి వెలుపలికి వచ్చాడన్నారు అంతా.

సరిగ్గా ఇదే వేళలో ఆఫ్రికాలో సూర్యుడు నల్లగా ఉదయించాడు. నెల్సన్‌ మండేలా తెల్లని జైలుగోడలనుంచి వెలుపలికి వచ్చాడు.

బెజవాడ ప్రెస్‌ క్లబ్‌లో హడావిడి. వాళ్ళంతా శివసాగర్‌లోని కె.జి.సత్యమూర్తిని చూడటానికి వచ్చారు.

అజ్ఞాతం ఒక ఆకర్షణ. కనిపించకుండా వుండటం ఒక సంచలనం. విరాట పర్వం ఒక ఉత్కంఠ.

అజంతా గుమ్మం దాటకుండా శివసాగర్‌ కోసం మాత్రమే ఎదురు చూస్తున్నాడు.

చిత్రం. ఒకరిలో ఇద్దరు. కత్తులు విసిరే వాడొకడు. పువ్వులు కోసే వాడొకడు

అజంతాకు పువ్వులు కావాలి. ‘విప్పపూల’తో వస్తాడని గుమ్మం దిగకుండా ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు కుదరలేదు.

మరుసటి రోజు సాయింత్రం సూర్యుడు జారుకునే వేళ, సాయింత్రపు ఎండ మనుషుల ముఖాలను గమ్మత్తుగా వెలిగిస్తున్న వేళ శివసాగర్‌ నాకు చిక్కాడు. చిక్కిన వాణ్ణి చిక్కినట్టే ఎత్తుకు పోయి, అజంతా ఇంటి ముందు నిలబెట్టాను.

లోపలికి అడుగు పెడుతున్న శివసాగర్‌ను వెలుపలే నిలవమన్నాడు అజంతా.

కొంచెం ఆశ్చర్యం! ఎందుకో కొంత కోపం కూడా వచ్చింది.

అజంతా కూడా వెలుపలకి వచ్చాడు.

అలా పక్కగా నీరెండలో నిలబడమన్నాడు. దూరంగా, దగ్గరగా.. దగ్గరగా, దూరంగా రకరకాలుగా చూశాడు.

‘మహాకవిని చూస్తున్నాను’ అని మురిసి పోయాడు అజంతా.

కౌగలించుకున్నాడు, కళ్ళు చెమ్మ చేసుకున్నాడు. అప్పుడు కానీ ఇంటిలోపలికి రానివ్వలేదు.

అజంతా ఎప్పుడూ చెబుతూ వుండేవారు, తాను శ్రీశ్రీకి దగ్గరగా వెళ్ళే వాణ్ణి కాదని. ఎందుకంటే, ‘వాడు సూర్యుడు. దూరం నుంచే చూడాలి. దగ్గరకు వెళ్ళితే మాడిపోతాం.’ అనే వారాయన.

ఈ మాటలు అజంతా గురించి తెలిసిన వారికి ఆశ్చర్యం కాదు.

అజంతా కవే కానీ, అందరి లాంటి కవి కాడు. అందరూ కవిత్వం రాస్తాడు. అజంతా కవిత్వాన్ని జీవిస్తాడు. తీరిక దొరికతే రాస్తాడు.

అలాంటి అజంతా శివసాగర్‌లోని పుచ్చపువ్వుల వెన్నెల్ని చూశాడు.

నెలవంక వచ్చేశాక, అంతవరకూ ఒక వెలుగు వెలిగిన సూర్యుడు వెలవెల బోతూ పడమటి గుమ్మంలోంచి వెళ్ళిపోయాడు.

అదే రాత్రి అనుకుంటాను. ఎవరిదో డాబా. కవుల సందడి. మధ్యలో ‘చితి-చింత’ వేగుంట మోహన్‌ ప్రసాద్‌ . అక్కదకీ శివసాగర్‌ వెన్నెల తెచ్చాడు.

శివసాగర్‌ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు ‘మో’ (‘మో’ అంటేనే బావుంటుంది. మోహన్‌ ప్రసాద్‌ అనేటంత పెద్ద పేరును ఆయన మోయడు)

‘ఇంత మెత్తగా…ఓహ్‌! కవిత్వం రాసే చేతులు కదా! ఈ చేతుల్తో నే మనుషుల్ని చంపేస్తారా…?’

‘మో’ ప్రశ్నకు శివసాగర్‌ నవ్వులు.. ‘హోరు హోరు హోరుగా.. హొయలు హొయలు హొయలుగా’

అవును ‘యాంగ్సీ’ నది పొంగినట్టుగానే.

ఒక చేత్తో గన్ను. తూటాల హోరు!!

మరో చేత్తో పెన్ను. పదాల హొయలు!!

మృగాలతోనే వేట. మనుషులతో పాటే.

ఒకరి లో ఇద్దరు. శివుడూ అతడే, పార్వతీ అతడే. తాండవమూ తెలుసు. లాస్యమూ తెలుసు.

శివసాగర్‌ ది వెన్నెల భాష.

వేడిని మింగుతాడు. వెలుతురును పంచుతాడు.

అందుకే ‘భూస్వాముల తలల గుత్తులను రాల్చే’ గండ్రగొడ్డళ్ళ తళ తళల ఉద్యమానికి నెలవంకనే ప్రతీక గా తీసుకున్నాడు.

శ్రీశ్రీ అలా కాదు. వెలుతురు కావాలంటే, వేడిమిని భరించాల్సిందే నంటాడు.

అందుకే అతడికి ‘కవీ, రవీ’ పర్యాయ పదాలవుతాయి.

అభ్యుదయ భానుడిగా శ్రీశ్రీ, విప్లవోద్యమ నెలబాలుడి శివసాగర్‌ గుర్తుంటాడు.

తెలుగు వాడికి-

అభ్యుదయం అంటే శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’

విప్లవం అంటే శివసాగర్‌ ‘ఉద్యమం నెలబాలుడు’

ఎవరి యుగాలు వారికున్నాయి. ఇద్దరూ తమ తమ యుగాలకు పథనిర్దేశం చేసినవారే.

యుగానికో యుధ్ధం. యుధ్ధానికో ఆయుధాగారం.

నిన్నటి ఆయుధాలు, నేటి యుధ్ధంలో పూచిక పుల్లలయిపోతుంటాయి

యుగానికో కవిత్వం. కవిత్వానికో ‘డిక్షన్‌’

నిన్నటి ప్రతీకలు, నేటి కవిత్వం ముందు చిన్న బోతూ వుంటాయి.

విప్లవం లో ఆయుధపట్టటం తర్వాత సంగతి.

విప్లవ కవిత్వానికి ఏ ప్రతీకలు, పదచిత్రాలూ అవసరమో వాటిని విప్లవం లోనే వెతికి పట్టాడు. వెన్నెల్లో అరణ్య సౌందర్యాన్ని దర్శించాడు.

ఎంత అందం!

అక్కడ పుట్టడమొక అందం.

‘గరిక పూల పాన్పు మీద అమ్మ నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు’

బతకటమొక అందం.

‘ఇప్పపూ సెట్టుకింద నరుడో భాస్కరుడా, విల్లు సారించితివా నరుడో భాస్కరుడా’

చావటమొక అందం.

‘అమరత్వర రమణీయమయ్యింది’

ఏవీ నిన్నటి ‘భూతాలు, యజ్ఞోపవీతాలు’?

ఎక్కడ ‘జగన్నాథ, జగన్నాథుని రథచక్రాలు’?

ఎవటు వెళ్ళాయి ‘హరోం హర హర.. హర.హర’ ప్రతిధ్వనులు?

అవి గిరిజన తండాల్లో సరిపడవు.

చెల్లీ చెంద్రమ్మలకు వినపడవు.

ఎండుటాకుల మీద వీరుడి పాదాల అలికిడికీ, అలికిడికీ మధ్య ఒక్కొక్క మాట వేసుకుంటూ పోయినట్లు,

కవిత్వానికి ఒక కొత్త కూర్పు అవసరమయ్యింది.

శివసాగర్‌ పోల్చుకున్నాడు.

ఒక్కొక్క పోలిక కోసం, ఒక్కొక్క వైరుద్ధ్యం కోసం ఎదురు చూశాడు.

ఎండా, వాన కలిసి రావటం కోసం ఎదురు చూడటం తెలియాలి. వాళ్ళే కవిత్వం గురించీ ఎదురు చూడగలరు?

కవిత్వం రావాలి. దానంతట అది రావాలి. వచ్చే వరకూ వేచి చూడాలి.

ఆ గుట్టు పాబ్లో నెరుడాకు తెలిసినట్లే , శివసాగర్‌కూ తెలుసు.

‘కవిత్వం నన్ను వెతుక్కుంటూ వచ్చిందంటాడు’ నెరుడా.

శివసాగర్‌ కూడా అలాగే అంటాడు.

వెంపటాపు సత్యాన్ని చంపగానే కలతపడ్డాడు శివసాగర్‌. రూపం కోసం వెతికాడు. దొరికింది. కొత్త రూపం. ప్రజల్లోనే

బాధను తాను దిగమింగి ఆశను ఇచ్చిన రూపమిది.

సూర్యుడి వేడిమిని తాను మింగేసి, వెలుతురు మాత్రమే ఇవ్వ గల నెలవంక రూపమది.

సత్యం హత్యకు దు:ఖితులయి వున్న వారిని ఓదార్చటానికి, ఓ రైతు-

‘అదే లెండి. తుపాకీ గుండు గుండెకు తగల్లేదు. తొడకు తగిలింది అన్నాడు’.

చనిపోలేదు. కోలుకుంటాడూ- అనే ఆశను ఇచ్చినట్టుగా శివసాగర్‌ భావించి, ఉద్యమం దెబ్బతిన్నా కోలుకుంటుందన్న భరసోనిస్తూ,

‘తోటారాముని తొడకు కాటా తగిలిందానీ

చిలుకా చీటీ తెచ్చెరా!

మైనా మతలబు చేసెరా!’

శివసాగర్‌ దగ్గర ఒక ఆవేశమయినా, ఆవేదనయినా అక్షరరూపం దాల్చాలంటే,

ఎదురు చూడాల్సిందే. ‘అరచేతిలో గోరింటాకు ఎరుపెక్కేటంత’ వరకూ ఎదురు చూడాల్సిందే.

ఇలా తపస్సు తపస్సు కో ఆయుధం

విప్లవ కవిత్వాయుధాగారాన్ని నింపి, తన సమకాలికులకు ఉదారంగా వీలునామా రాసిచ్చేసిన అక్షర దానకర్ణుడు శివసాగర్‌?

యుధ్ధం తర్వాత వుండేది కేవలం శాంతి మాత్రమే కాదు, ఒక స్వప్నం కూడా.

ప్రతి యుధ్దానికీ ఒక స్వప్నం వుంటుంది. అదే కవి చేసే ఊహ

స్త్రీ అంటే శరీరమేనంటూ ప్రబంధాంగనలను సృష్టించే కాలానికి చెల్లు చీటి ఇచ్చేస్తూ, ఆమె హృదయాన్ని ఆవిష్కరించటానికి యుధ్ధం చేస్తూ వున్న భావకవికీ ఒక ఊహ వుంటుంది:

‘ఆకులో ఆకునై.. పూవులో పూవునై

ఇచటనే దాగిపోనా…’

దోపిడి సమాజానికి వ్యతిరేకంగా కార్మికులు సంఘటితం అయ్యే రోజును ఆవాహన చేసే అభ్యుదయ కవికీ ఒక ఊహ వుంటుంది:

‘కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం

జాలరి పగ్గం, సాలెల మగ్గం

సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల్‌’

అదే దోపిడి కూలదూయ్యటానికి ఆయుధం పట్టేసి, బరిలోకి దిగిపోయి, బలిదానానికి సిధ్ధమయి పోయాక విప్లవ కవి శివసాగర్‌ చేసిన ఊహ మరోలా వుంటుంది.

‘ఉరి కంబం మీద నిలిచి

ఊహాగానం చేసెద

నా ఊహల ఉయ్యాల లోన

మరో జగతి ఊసులాడు’

విప్లవ భావుకతలో అత్యంత సంపన్నుడు శివసాగర్‌

ఈ భావుకతను అభ్యుదయ కవిలో చూడలేం. ఇంకా ,అభ్యుదయ కవిత్వాన్ని(జడరూపం దాల్చాక) వెక్కిరించి వచ్చి విప్లవ కవి చెరబండరాజులో ఇదే భావుకత ను చూడగలం:

‘ఉరి తాటికి పాట నేర్పి

పల్లవినై పాడిస్తా.’

శ్రీశ్రీ అభ్యుదయ కవి నుంచి విప్లవ కవిగా మారాక, ఈ ఛాయలు ‘మరో ప్రస్థానం’ లో కనిపిస్తాయి. కానీ చాలా మటుకు ‘మహాప్రస్థానం’ ఆయుధసంపత్తితోనే ఇక్కడా యుధ్ధం చేస్తారు. అందుకే ‘మహాప్రస్థానం’ అయినట్టుగా ‘మరోప్రస్థానం’ ఆయనకు ప్రాతినిథ్యం వహించే కావ్యం కాలేక పోయింది.

కానీ శివసాగర్‌ కు ‘ఉద్యమం నెలబాలుడే’ కాదు. తర్వాత వచ్చిన ‘నెలవంక’ కూడా విప్లవ ప్రాతినిథ్యం వహిస్తాయి.

అభ్యుదయ కవిత్వం దోపిడీని ఎత్తి చూపిస్తుంది.

విప్లవకవిత్వం దోపిడీని నిలదీస్తుంది.

‘బలవంతులు దుర్బల జాతిని

బానిసలు కావిస్తుంటే…’ ఇది అభ్యుదయ కవి చూసిన దోపిడీ.

‘వీపు మీద చద్దిమూట

చేతిలోన గండ్ర గొడ్డలి’

ఇది విప్లవ కవి చూపిన దోపిడీ ప్రతిఘటన.

చద్దిమూట మోసే అతి సామాన్యుడి చేతికి గండ్రగొడ్డలి ఇచ్చింది విప్లవం.

బలహీనులే విప్లవంలో బలవంతులుగా మారటం విప్లవ కవి ఆవిష్కరించిన దృశ్యం.

ఇదే దారిలో నడిచిన విప్లవ కవి వంగపండు ప్రసాద రావు కూడా

‘సికాకులంలో సిలకలున్నయట.

సిలకలు కత్తులు దులపరిస్తయట.’ అని సుకుమారమైన చిలకల్ని యుధ్ధప్రతీకలు చెయ్యటం వెనుక వున్నది ఈ విప్లవ భావుకతే

అభ్యుదయ కవితా యుగంలో శ్రామికులూ, దోపిడీ దారులే వుంటారు.

విప్లవ కవిత్వంలోకి ‘అన్న’లూ, ‘అక్క’లూ వస్తారు.

వీరికీ జనానికీ వుండే అనుబంధం. అందులో వుండాలల్సిన స్వఛ్చతనీ శివసాగర్‌ ముందుగా పోల్చుకున్నాడు, ఎవరూ నిర్వచించలేనంత గొప్పగా ముందుగా నిర్వచించాడుఫ

‘కసితో స్వార్థం శిరస్సు గండ్రగొడ్డలితో నరక గల్గిన వాడే నేటి హీరో’.

జనం, దళం- ఒకరికి ఒకరు ఏమవుతారో చెప్పటానికి ఏకంగా సముద్రాన్ని ఎరువు తెచ్చుకున్నాడు శివసాగర్‌:

‘కడలి జనం. అలలు దళం

అలలు కడలి ప్రాణ ప్రదం’

ఆయుధం ‘అక్క’ చేతికి ఇచ్చేశాక కూడా రెండో చేతిలో ఎక్కడ ‘గరిటె’ పెడతారోనని ముందుగానే ఆందోళన చెందిన క్రాంత దర్శి శివసాగర్‌. అందుకే మావో వాక్కును అక్కున చేర్చుకుని ‘అక్కల్ని’ సైతం అంతే సమానంగా నిర్వచించాడు.

‘ఆకాశంలో సగం నీవు

అనంత కోటి నక్షత్రాల్లో సగం నీవు. సగంనేను’

ఇంత జాగ్రత్త పడ్డా, అక్కల్ని తక్కువ చేశారు. లేకుంటే తర్వాత కాలంలో విమల ‘వంటిల్లు’ వచ్చేది కాదు.

యుధ్ధం తెలిసిన వాడు బహిర్యుద్ధమే కాదు. తేడా వస్తే అంతర్యుధ్ధమూ చేస్తాడు.

శివసాగర్‌ రెండూ చేశాడు.

బ్యాలెట్‌కు కులముందనే కదా, బులెట్‌ పట్టుకున్నదీ..!

కానీ బులెట్‌ గురి తప్పటం లేదు. ఎప్పుటూ అట్టడుగు వాణ్ణే గురి పెడుతోంది.

కాల్చటమే అధికారమయిన చోట కాల్పించేది అగ్రవర్ణమవుతోంది.

ఉద్యమం అన్నాక తప్పులు జరుగుతాయి. కానీ జరిగినే తప్పులే తిరిగి తిరిగి జరగవు.

అలా జరిగితే, ఎవరిదో ఒక్కరిదే బాధ్యత కాదు.

ప్రాణాలిచ్చే చోట పరాచికాలకు చోటుండదు.

వెన్ను చూపిన వారినీ, వెన్ను పొడిచిన వారినీ- ఇద్దరిలో ఎవ్వరినీ శివసాగర్‌ కవిత్వంలోనూ క్షమించలేదు.

‘శత్రు చేజిక్కితినని వెక్కిరించకు నన్ను

మిత్ర ద్రోహము చేత శత్రు చేజిక్కితిని.. ఓచందమామా!’

ఇది లోపలి మాట.

వెలుపలి ప్రపంచంలోనూ అంతే. ‘శత్రు భజన’ చేస్తున్నాడని, తాను అతిగా ఆరాధించిన శ్రీశ్రీని కూడా వదల్లేదు.

‘నెహ్రూ బతికి వుంటే నక్సలైట్‌ అయ్యే వాడంటూ’ శ్రీశ్రీ కవిత రాశాడని కోపం తెచ్చుకుని శ్రీశ్రీని కడిగి పారేశాడు శివసాగర్‌ఫ

‘నిదురించే శవాలను

వీపు తట్టి లేపకు.

దిష్టి బొమ్మ ఊహలను

నీ కవితలో మోయకు’

ఈ అంతర్యుధ్ధం మామూలే.

కానీ ఏ ‘అంచెల’ కుల వ్యవస్థను ధిక్కరిస్తూ తాను ‘విప్లవోద్యమం’లో చేరాడో

అక్కడ కూడా, అది వుందని తాను తెంపుచేసుకున్నాక రాసుకున్నట్టున్నాడు:

‘మాటల్లో మార్క్సిజం

చేతల్లో మనువాదం’

ఇక్కడే మరో యుగం వచ్చేస్తోందని గ్రహించాడు ‘నెలబాలుడు’

స్త్రీ,దళిత, మైనారిటీ,ప్రాంతీయ అస్తిత్వాల యుగాలను ఆవిష్కరిస్తున్న వేళ లోపలి నుంచి బయిటకు వచ్చాడు.

వాళ్లతో భుజం భుజం కలిపాడు.

మార్క్స్‌ చదివిన కళ్ళతోనే అంబేద్కర్‌ను చదివాడు.

ముందుకు దూసుకు పోతున్న కొంగ్రొత్త కవులతో కలం కలం కలిపి రాశాడు, గళం గళం కలిపి పాడాడు.

విప్లవ స్ఫూర్తితో ‘ద్రోణుడి బొటన వేలు’ను ‘ఏకలవ్యుడి’ తో నరికించాడు. ఈ కవిత్వానికి తనకు తానుగానే నిర్వచించుకున్నాడు:

‘ఇది కేవలం దళిత కవిత్వం కాదు. విప్లవ దళిత కవిత్వం. దళిత విప్లవ కవిత్వం.’

శివసాగర్‌ మహాకవి.

ఇలాంటి కవి యుగానికి ఒక్కడే వుంటాడు

ఆయనే అన్నాడు:

‘కాలానికి ఒక కవి కావాలి.

ఒక కవిత కావాలి.

అందుకనే కాలం డుపుతో వుండి

శ్రీశ్రీని కన్నది.’

నిజమే. కాలం-

అభ్యుదయ యుగంలో శ్రీశ్రీను కన్నది.

విప్లవ యుగంలో శివసాగర్‌ను కన్నది.

ఎప్పుడో శ్రీశ్రీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు శివసాగర్‌ వెళ్ళిపోయాడు.

ఇద్దర్నీ తలవకుండా వుంటామా?

నెల పొడిచినప్పుడెల్లా నింగి చుక్కల్ని రాలుస్తుంది.

అవి మన కన్నీటి చుక్కలే!!

– సతీష్‌ చందర్‌
(‘సూర్య’దినపత్రికలో 23 ఏప్రిల్ 2012 ప్రచురితం)

14 comments for “‘నెలవంక’ కత్తి దూసింది!

  1. సతీష్ చందర్ గారూ,
    ఆవేశంతో కనిపించినా సమతౌల్యం తప్పకుండా, ఆత్మీయంగా రాసినా అతిశయోక్తులు దొర్లకుండా, నిజాయితీగా, నిక్కచ్చిగా శివసాగర్ ని ఆవిష్కరించారు. ప్రజలపట్ల, ప్రజాసేవపట్ల నిబధ్ధతగల కవులు ఎప్పుడూ వేళ్లమీద లెక్కించవలసినవారే. అభినందనలు.

  2. ఒహ్. బ్యూటిఫుల్…
    ఒక ఇద్దరు కవుల్ని, వారి సాహిత్యాన్ని- పక్కనపక్కన పెట్టి నిలిపారు
    వారి వారి యుగాల్ని, యుగ లక్షణాల్నీ తులనాత్మకంగా వివరించారు
    ఒక కవి జనజీవనంలో కలిసిన సందర్భాన్ని కళ్ళకు కట్టారు
    ఐస్ క్రీం టాపింగ్ లా అజంతా, మోలు వచ్చి వెళ్లారు
    ఇదంతా ఒక అవిచ్చిన్నమైన కవితలా చదూకోవటం ఎంత గొప్పగా ఉందీ!
    థాంక్యూ సార్

  3. వచనం, పద్యం.. వెరసి కవిత్వం రాయడమే కాదు గొంతులో విప్లవ గరళాన్ని
బయటకు కక్కి సాగరమంత విస్తరింపజెసిన ‘శివ సాగరు’డు, అజేయుడైన ‘అజంతా’ను కలిపి, ‘శ్రీ శ్రీ’ని స్ఫురింపచేసి,కవులందరినీ తెరపైకి తెచ్చినందుకు హాట్స్ ఆఫ్. వీరితోపాటు ఎక్కడో ఉదయించిన నల్ల సూరీడును ఆవిష్కరింపచేయడం కూడా మరో చల్లని చంద్రుని(సతీష్ చందర్)కే సాధ్యమయింది.

  4. veluturrni (Surya Chanduliddaridee okesaari)kougalinchukunnattundi.
    kudos to Satish Chander.
    Laal Salaam to SHIVA SAAGAR>

  5. శివసాగర్ కు ఈ అక్షర నీరాజనం శ్రీశ్రీని పోలుస్తూ రాయడం బాగుంది. అలాగే అజంతా, ‘మో’లతో పరిచయం హత్తుకుంది…

    ఉద్యమంలో కులవాదముందని లేని దానిని అంటగట్టడం నచ్చలేదు. పోరాటంలో త్యాగంలో రిజర్వేషన్లు కావాలనుకోవడం ఒప్పదు. కావాలని ఎవరూ యుద్ధంలో మరణించరు..మరణించిన వారికి కులాన్ని అంటగట్టి లెక్క చూపడం తప్పుదోవపట్టించడం..అలాగే స్ర్తీల పట్ల వివక్ష వుందని చెప్పడం కూడా..నేడు యుద్ధానికి సై అంటూ ముందువరుసలో నిలిచి పోరాడుతున్నది ఆకాశంలో సగమే..గెరిల్లా జీవితం నల్లేరు మీద నడక కాదు..వారి త్యాగాన్ని మహోన్నత పోరాట ధీరత్వాన్ని తక్కువ చేసి చూపడానికి ఇలా శతృవు రకరకాల తప్పుడు ప్రచారాలు చేస్తునే వున్నాడు..అలాగని తప్పులే జరగకుండా ఉద్యమం సాగుతుందా అంటే అది నేలవిడిచి సాములాంటిది..ఉద్యమం ఉద్యమంలోకి వచ్చే వ్యక్తులు ఆకాశంలోంచి జారిపడరు..వున్న అవలక్షణాలను సరిదిద్దుకునే దిద్దుబాటు ఉద్యమం నిరంతరం విమర్శా ఆత్మ విమర్శల అధ్యయనంతో వారి మెడపై కత్తిలా వేలాడుతూనే వుంటుంది..తట్టుకొని ముందుకు సాగే వాడు పోరాటంలో ముందుకు పోతాడు. లేని వాడు మేకతోలు కప్పుకొని నిర్జీవ జన జీవనంలోకి పడతాడు…

  6. nenu mee student ni ani cheppukovadaaniki yeppuduu garvapdathaanu mee rachanaa saili vislesana annikalipithe “AMMA CHETHI MUDDHA”LA anipisthaadhi.

  7. sir,
    mee article asantham hrudayanni hatthukundi..
    kaneesam choopu kooda maralchukonivva ledu..
    srri, sivasagar lanu polchi choodatam goppa sahasame..

    ఇంత మెత్తగా…ఓహ్‌! కవిత్వం రాసే చేతులు కదా! ఈ చేతుల్తో నే మనుషుల్ని చంపేస్తారా…?’
    mo…prashna prashne…
    sri sri ledu
    siva sagar tana darina tanellipoyadu…
    okaru mande yendai..
    inkokaru kurise vennalai
    aakasamantha aakraminchesaru..

    mari ee telugu kavitha prapanchaniki maatram
    vaaru o teerani kaali migilchi poyaru..

    ee kaali anatham…
    idi poorthi cheyalante ..
    malli mari neala baludu puttalsinde..
    maro prasthana pathikudu raavalside…
    appati daaka..
    telugu talli..

    nela podichinappudalla
    raalutunna ningi chukallo
    yekkadaine
    ee iddaru jari boomeeda pdataremonani
    vethukkontoo.
    vekki vekki yedchu kontooo
    alaa alaa saagi povalsinde….

    నెల పొడిచినప్పుడెల్లా నింగి చుక్కల్ని రాలుస్తుంది.

    అవి మన కన్నీటి చుక్కలే!!

  8. బ్యాలెట్‌కు కులముందనే కదా, బులెట్‌ పట్టుకున్నదీ..!
    కానీ బులెట్‌ గురి తప్పటం లేదు. ఎప్పుటూ అట్టడుగు వాణ్ణే గురి పెడుతోంది.
    కాల్చటమే అధికారమయిన చోట కాల్పించేది అగ్రవర్ణమవుతోంది.

    ఈ వాక్యం కొందరికి కష్టంగా ఉండవచ్చుగాని, నిజం ఇదే కదా సార్
    అరణ్యంలోనా, జనారణ్యంలోనైనా అట్టడుగువాణ్నే అమరున్ని చేస్తున్నారు.

  9. sir meru rasina katha ( amma chanipoyina niku telvakunda ninnu rceive chesukoni, annam petti mall sagnapina pampina crisian akka katha) nannu inka ventduthundi a katha gurthochinappudala kandlalla nellu vastununnau. e vysam chaduvuthunapudu kuda alage ……… 09849722127( tnq bhai post chesinaduk

  10. శ్రీ శ్రీ ది రూప పరంగా ఓ ప్రభంజనం.అది పోరాటపు వెలుపలి కవిత. శివసాగర్ ది బడబానలం. ఓ లావా పొంగు. పోరాటపు కవిత. ఇద్దరిలోనూ దేశ కాల నిర్దిష్టత అంతర్గతం. తర్వాతి కవులలో ఈ కావ్యనిష్ఠ అరుదు. శ్రీ శ్రీ కవితలో చివరి వరకు ఆ పోరాట మమేకత చెరగలేదు. శివసాగర్ లో రహస్యోద్యమం నుంచి బయట పడిన తరువాత ఆ పటిమ వ్యక్తిగతంగాను కవిత్వంలోనూ మాసి పోయింది. ప్రభావంలో ఇద్దరి కవితారూపంలో కనిపించే తేడా ఇదే !
    – Prof P C N Teddy ( ” I ” )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *