పగటి ‘చంద్రుడు’

(ఒక వారపత్రిక కోసం రాసిన వ్యంగ్యరచన)

కేరికేచర్: బలరాం

పేరు : నారా చంద్రబాబు నాయుడు

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘అప్రధాన’ ప్రతిపక్షనేత( పేరుకు ప్రతిపక్షనేతనే. కానీ ఎక్కడా ప్రధానమైన పోటీ ఇవ్వను.)

ముద్దు పేర్లు : పగటి ‘చంద్రు’డు.(ఉంటాను. కానీ కనపడను. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలలోనూ వున్నాను. సీమాంధ్రలో జరిగిన ఉప ఎన్నికలలోనూ వున్నాను. అంకెల్లో మిగలను. అదే ఇబ్బంది.)

విద్యార్హతలు : ‘అర్థ’శాస్త్రం. సగం శాస్త్రమే తెలుసు. (సొంతంగా పాలించటం తెలుసు. కానీ ఏ పొత్తూ లేకుండా గెలవటం తెలీదు. 1999లో బీజేపీ పొత్తుతో గెలిచాను. తర్వాత పొత్తులు పెట్టుకున్నా గెలవలేక పోయాను.)

హోదాలు : ఎన్టీఆర్‌కు అల్లుణ్ణి, బాలయ్యకు వియ్యంకుణ్ణి. ( నారా రామ్మూర్తి నాయుడికి అన్నయ్యను కూడా. అది హోదా కాదు కాబట్టి పెద్దచెప్పుకోను. అలాగని దాయను కూడా.) అత్తింటి కుటుంబంలోనే అన్ని హోదాలూ చూసుకుంటాను.

గుర్తింపు చిహ్నాలు :అధికారంలో వున్నప్పుడు హైదరాబాద్‌ ‘ఫ్లై వోవర్‌’ (గాలిలోనే అన్నీ) . లేనప్పుడు ‘రోడ్‌ షో'(నేలమీద కొచ్చేస్తాం కదా)

సిధ్ధాంతం : ‘రెండు కళ్ళ’ సిధ్ధాంతం( నాకు తెలంగాణ సీమాంధ్ర- రెండూ సమానమే.) కానీ ప్రజలే ‘మూడో కన్ను’ తెరచి నావైపు చూశారు- రెండు చోట్లా.

వృత్తి : ఒక్కటే. ‘జగన్నా’మ స్మరణ. జగన్‌ను తిట్టకుండా పచ్చిమంచి నీళ్ళుకూడా ముట్టను. అవును. ఇది కూడా భక్తే. కాకుంటే ‘వైరి భక్తి’. అందుకే 18 అసెంబ్లీ స్థానాల్లో తిడితే 15 స్థానాల్లో ప్రత్యక్షమయ్యాడు. ఒక పార్లమెంటు స్థానంలో అయితే, అడక్కుండానే దర్శనమిచ్చాడు.

హబీలు :1. దరువు ఒక చోట వేస్తుంటే చిందు ఒక చోట వెయ్యటం. ( ఉద్యమం తెలంగాణలో జరుగుతుంటే, ఆందోళనలు (మహారాష్ట్ర)లో చెయ్యటం.)

2. అవిశ్వాసం పేరు మీద విశ్వాసం ప్రకటించటం( రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టటానికే కదా- అవిశ్వాస తీర్మానం పెట్టిందీ..!)

అనుభవం : ‘సానుభూతి’ కి వోట్ల పడవన్నది నా స్వీయానుభవం. (అలిపిరిలో నక్సలైట్ల దాడి వల్ల గాయాలతో ప్రాణాపాయం నుంచి బయిటపడ్డప్పుడు- నా మీద సానుభూతి చూపారు. నాకు వోట్లు పడలేదు.). అందరి అనుభవాలూ ఒకలాగా ఉండవని ఈ ఉప ఎన్నికల్లో బోధపడింది.

మిత్రులు : బాల్య మిత్రులే అసలు మిత్రులంటారు. నేను రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్న కాంగ్రెస్‌ వారే నాకు మిత్రులుగా అనిపిస్తున్నారేమో! లేక పోతే నేను వారి సర్కారను కాపాడాల్సిన స్థితి రావటమేమిటి.

శత్రువులు : ఒకప్పటి వైయస్సార్‌ శత్రువే, నాకూ శత్రువయ్యాడు. నాలో ‘బిగ్‌ బాస్‌’ను చూసిన వాడే వైయస్‌లో ‘రాజా ఆప్‌ కరప్షన్‌’ చూశాడు. అవును మై ‘చూరా’ రెడ్డే. (అనగా నా ‘చూరు’ పట్టుకుని వేళ్ళాడిన వాడే) ఇప్పుడు ‘వై’ చూరా రెడ్డి -అయ్యాడు. అక్కడకు వెళ్ళి ఏమి ప్రచార వ్యూహం ఇచ్చాడో కానీ, ఉప ఎన్నికల్లో నన్ను పగటి ‘చంద్రు’డిగా మార్చాడు.

మిత్రశత్రువులు : ఎంతయినా నా మిత్ర శత్రువు మరణించిన వైయస్‌. రాజశేఖర రెడ్డే. అతనే జీవించి వుంటే, అతణ్ణి తిడుతూ ఎదిగి పోయే వాణ్ణి. కానీ జగన్‌ ను తిట్టటం వల్ల తరిగిపోతున్నాను. కాబట్టి వైయస్సారే నా మిత్రశత్రువు.

జీవిత ధ్యేయం : తక్షణ ధ్యేయమే జీవిత ధ్యేయం 2014 వరకూ మధ్యంతర ఎన్నికలు రాష్ట్రానికీ, కేంద్రానికి రాకుండా చూసుకోవటం.

-సతీష్ చందర్

 

 

 

 

2 comments for “పగటి ‘చంద్రుడు’

  1. తెలుగుదేశం శకం ముగిసినట్టుంది!! 2014లో తేలిపోతుంది!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *