పదవొచ్చాక పైసలా? పైసలొచ్చాక పదవా?

photo by pareeerica

‘ప్రేమ ముందా? పెళ్ళి ముందా?’

పెద్ద చిక్కొచ్చిపడింది- సత్యవ్రత్‌ అనే ఒక ప్రేమకొడుక్కి.

బుధ్ధిగా ఎల్‌కేజీ, యుకేజీ.. ఇలా క్రమ బధ్ధంగా పెరిగాడే తప్ప, టూజీ,త్రీజీ ల్లా అక్రమబధ్ధంగా పెరగలేదు.

అలా పెరిగితే, ‘స్కాము కొడుకు’ అయ్యేవాడు కానీ, ప్రేమ కొడుకు అయ్యేవాడు కాడు.

నీతిమంతుడు ఎక్కడ పడాలో అక్కడే పడతాడు. చూసి, చూసి ప్రేమలో పడ్డాడు.

అమ్మాయి చక్కని చుక్క మాత్రమే కాదు. ఎవరికీ చిక్కని చుక్క కూడా. ఎమ్మెల్యే కుబేర స్వామిగారి ఏకైక కూతురు. వంద కోట్ల ఆస్తి ఉత్తనే వచ్చిపడుతుంది సత్యవ్రత్‌కి. పైసా లంచం తీసుకోకుండా పైకొస్తున్న పిడబ్ల్యుడి ఇంజనీరేమో, సత్యవ్రత్‌కి తన మీద తనకి హఠాత్తుగా అనుమానం వచ్చింది: పెళ్ళికి ముందే ప్రేమలో పడటం తప్పు కదా?

ఎమ్మెల్యే కుబేరస్వామి కే ఎన్నో పిడబ్ల్యుడి పనులు రావటానికి సత్యవ్రతే కారకుడు. అయినా పైసా పుచ్చుకోలేదు. ఇప్పుడు పెళ్ళికుదరితే కట్నం కూడా పుచ్చుకోనని కుబేరస్వామి ముద్దుల కూతురూ, చక్కని చుక్కా అయన లక్ష్మీదేవికి మాటకూడా ఇచ్చేశాడు.

అయితే, తమ ప్రేమ విషయం ఇంకా కుబేరస్వామికి ప్రేమకొడుకు సత్యవ్రత్‌ కానీ,ప్రేమ కూతురు లక్ష్మీదేవి కానీ చెప్పలేదు.

చెబితే ఏమవుతుందన్నది తర్వాత విషయం. ఈ లోపుగా ప్రేమకూతురు లక్ష్మీదేవి ముందు తన అనుమానాన్ని బయిట పెట్టేశాడు:

‘ప్రియా, ఇన్నాళ్ళూ నీతి తప్పలేదు. ఇప్పుడు తప్పేశానేమో- అన్న అనుమానం పెట్టుకుంది. పురాణాల్లో పురుషులే కాదు, చరిత్రలో పురుషులు కూడా పెళ్ళిచేసుకున్నాకే ప్రేమించారు. సీతను రాముడి పెళ్ళాడాకే ప్రేమించాడు. కస్తూర్బాను గాంధీ కూడా అంతే. ముందు పెళ్ళి.తర్వాతే ప్రేమ. వాళ్ళ అడుగుజాడల్లో నడవాలనుకున్న నేను… చూస్తూ, చూస్తూ తప్పు చేసేశాను. నీ అమాయకత్వాన్నీ, అతి మంచితనాన్నీ చూసి ప్రేమించేశాను.’

‘నీ తలకాయేం కాదూ. ప్రేమించి పెళ్ళి చేసుకోవటమే నీతి.’ అనే లక్ష్మీదేవి కస్సున లేచింది.

దాంతో-

చెట్టు ముందా? విత్తు ముందా?

గుడ్డు ముందా? పిల్ల ముందా?

ఇలాంటి సమస్యల జాబితాలో- ‘పెళ్ళి ముందా? ప్రేమ ముందా?’ కూడా చేరిపోయింది.

ఈ సమస్య కేవలం సత్యవ్రత్‌ది మాత్రమే కాదు. లక్ష్మీదేవిది కూడా. ‘కావాలంటే, మా బంధువుల్లో పెద్దవాళ్ళ నడుగుదాం.’ అంది. సత్యవ్రత్‌ కోరుకుంటున్నది కూడా అదే.

ముందు లక్ష్మీదేవి బాబాయి కోటేశ్వరస్వామి దగ్గరకు వెళ్ళారిద్దరూ. ఓ సాదాసీదా ఇంజనీరుతో తన అన్న ఎమ్మెల్యే కుబేరస్వామి కూతురు చెట్టాపట్టాలేసుకుని రావటం అతడికి మింగుడు పడలేదు. అతడింకా తేరుకునే లోగానే,

‘బాబాయ్‌ మీరయినా చెప్పండి. పెళ్ళి ముందా? ప్రేమ ముందా?’ అనడిగేసింది ప్రేమకూతురు లక్ష్మీదేవి.

సుదీర్ఘంగా ఆలోచించాడు. అతడి వాలకాన్ని చూసి, అతడి భార్యామణి కిసుక్కున నవ్వేసింది కూడా.

‘ఈ కేసు నా ముందు పెట్టాల్సింది కాదు. ఎందుకంటే, నాకు పెళ్ళికన్నా ముందు ప్రేమ పూర్తయి పోయింది. అంతకన్నా ముందు మీ పిన్ని నెలతప్పటం కూడా అయిపోయింది.’ అని తప్పించేసుకున్నాడు కానీ, ఇదే ఆలోచనలో బందీ అయ్యాడు.

తర్వాత ఈ కేసును లక్ష్మీదేవి తన అమ్మకు అన్నయ్య, స్వయానా మేనమామ అయిన కనకస్వామి దగ్గరకు తీసుకు వెళ్ళింది. ఒక మామూలు ఇంజనీరుతో, తన బావ, ఎమ్మెల్యే కుబేరస్వామి కూతురు రాసుకుంటూ, పూసుకుంటూ రావటం- ఏమిటా అని ఆశ్చర్య పోయాడు. ఈ లోపుగా అడగాల్సిన ప్రశ్న అడిగేసింది శ్రీలక్ష్మి- ‘ప్రేమ ముందా? పెళ్ళి ముందా?’ అని.

అతడు కూడా దీర్ఘంగా ఆలోచించి, ‘ ఈ కేసు నా ముందుకు తీసుకు రావలసింది కాదు. ఎందుకంటే, నీకు తెలుసు కదా, నేను ప్రేమించే పెళ్ళి చేసుకున్నాను. కానీ ఆమె ఏడాది తిరక్కుండా చనిపోయింది.’ అని చెబుతుండగా ఒకావిడ సిగ్గుపడుతూ వచ్చి కాఫీలు ఇచ్చి వెళ్ళిపోయింది.

‘ఈవిడుందే.. అదే మీ అత్త. ఈమెను పెళ్ళి చేసుకోలేదు. కానీ ప్రేమిస్తున్నాను.’ అని తన అభిప్రాయాన్ని పూర్తి చేశాడు.

‘అయితే ఉంచుకున్నారా మావయ్యా..!?’ అని అనేసి గిరుక్కున తిరిగేసింది ప్రేమకూతురు లక్ష్మీదేవి. ఆమెతో పాటే పెళ్ళికొడుకు సత్యవ్రత్‌ బయిటకొచ్చేశాడు. కేసు అలా పెండింగ్‌లో పడిపోయిన వారం రోజులకి, ఓ మధ్యాహ్నం పూట లక్ష్మీదేవి సత్యవ్రత్‌ ఆఫీసు ముందు కారు దిగి పరుగు, పరుగున వచ్చింది.

‘ మానాన్న నిన్ను ఈడ్చుకుని రమ్మన్నాడు… సారీ పిలుచుకుని రమ్మన్నాడు.’ అంది. కొంచెం టైం తీసుకుని, రూమ్‌కి వెళ్ళి సూటూ, బూటూ వేసుకుని ఎమ్మెల్యే కుబేరస్వామి ఇంటికి వెళ్ళాడు.

అప్పటికే ‘ ఈ కేసు నా ముందుకు తీసుకు రావలసింది కాదు’ అన్న పెద్ద మనుషులిద్దరూ, అంటే లక్ష్మీదేవి బాబాయి, మావయ్యా కుబేర స్వామికి చెరోపక్కా కూర్చున్నారు.

ప్రేమ కొడుకూ, ప్రేమ కూతురూ- ఇంకా ఇంటి మెట్లెక్కకుండానే,

‘ఇంత పెద్ద ఎమ్మెల్యేను నేనుండగా, ప్రేమముందా? పెళ్ళి ముందా?- అని నన్నడక్కుండా ఊరంతా తిరుగుతున్నావ్‌? ఏం చూసుకుని నీకీ ధైర్యం ఇంజనీరూ..?’ హుంకరించాడు ఎమ్మెల్యే కుబేర స్వామి.

సత్యవ్రత్‌ తన్నితే బూరెల బుట్టలో పడ్డ దోషిలా తలవంచుకుని ఆనందిస్తున్నాడు.

‘నా కూతురు ఏది చెబితే అదే రైటు. ప్రేమే ముందు. పెళ్ళే తర్వాత. ఇంజనీరు ఉద్యోగానికి రిజైన్‌ చేసిరా? మునిసిపల్‌ ఎన్నికల్లో చైర్మన్‌ని చేస్తా.’ అని తన తీర్పును ముగించేశాడు కుబేర స్వామి.

‘చైర్మనే..! నా దగ్గర అంత సంపాదన లేదు సార్‌.’ అని చేతులు నలుపుకున్నాడు సత్యవ్రత్‌.

‘పదవి వస్తే, పైసలు వాటంతటవే వస్తాయి!’ అని వివరణ ఇచ్చాడు ఎమ్మెల్యే కుబేర స్వామి.

ఇప్పుడు ప్రేమ కూతురు లక్ష్మీదేవికి సందేహం వచ్చింది: ‘పదవి ముందా? పైసలు ముందా?’. అడగబోతే, సత్యవ్రతే నోరు నొక్కేసి, నీతిని బతికించేశాడు.

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 12 డిసెంబరు 2011 సంచిక లో ప్రచురితం)

2 comments for “పదవొచ్చాక పైసలా? పైసలొచ్చాక పదవా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *