‘పవర్‌’ లిఫ్టర్‌!

కేరికేచర్: బలరాం

కేరికేచర్: బలరాం

పేరు : కన్నా లక్ష్మీనారాయణ

దరఖాస్తు చేయు ఉద్యోగం: ఇంకేం ఉద్యోగం? ‘కాషాయం’ కట్టేశాను. ఐమీన్‌ భారతీయ జనతా పార్టీలో చేరిపోయాను. కాంగ్రెస్‌తో నాలుగుదశాబ్దాల అనుబంధానికి గుడ్‌బై కొట్టేశాను.

ముద్దు పేర్లు :‘పవర్‌’ లిఫ్టర్‌( విద్యార్థిగా వుండగా ‘వెయిట్‌ లిఫ్టింగ్‌’ చేసేవాణ్ణి. ఆ అనుభవంతోనే రాజకీయాల్లోకి చేరాను. పాలిటిక్స్‌ అంటే ‘పవర్‌ లిఫ్టింగే’ కదా! కాంగ్రెస్‌లో వున్నన్నాళ్ళూ ‘పదవుల్ని ఎత్తుతూనే వున్నాను’ ( నేదురుమిల్లి జనార్థన రెడ్డి, వైయస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌ కేబినెట్లలో మంత్రిగా పనిచేస్తూనే వున్నాను.) కానీ ఈ ఏడాది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జనమే కాంగ్రెస్‌ను ‘లిఫ్ట్‌’ చేసి పడేశారు. అందులో నేనూ ఒకణ్ణే. ‘వెయిట్‌ లిఫ్టింగ్‌’ చెయ్యకుండా వుండగలను కానీ, ‘పవర్‌ లిఫ్టింగ్‌’ చెయ్యకుండా వుండగలనా? అందుకే ఈ ఫిరాయింపు.

విద్యార్హతలు :బ్యాచిలర్‌ ఆఫ్‌ ‘కండువా’ చేంజింగ్‌ (బి.కె.సి). ఇలా కండువాలు మార్చటంలో ‘మాస్టర్స్‌’ వున్నారు. నేను ఇందులో ‘డిగ్రీ’ మాత్రమే చేశాను.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: నేనెక్కడ వుంటే నా సామాజిక వర్గం అక్కడ వుంటుంది. నా సామాజిక వర్గమెక్కడ వుంటే నేనక్కడ వుంటాను. ఇప్పుడు నా సామాజిక వర్గంలో ముఖ్యులు తెలుగుదేశంలో వున్నారు. అలాగని నేను తిట్టిపోసిన ఆ పార్టీలోకి నేరుగా చేరలేను కదా! వయా ‘బీజేపీ’ …కొంతలో కొంత నయం.

రెండు: నేనువున్న చోటే శాంతి భద్రతలు వుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ‘యూనిఫాం’ లేని పోలీసును నేను. నేను కోరుకుంటే శాంతి వుంటుంది. లేదంటే లేదు. ( అందుకే అసలు సబ్‌ ఇన్స్పెక్టరు అవ్వాలనుకున్నాను.)

సిధ్ధాంతం : నేను పార్టీని మారాను కానీ, సిధ్ధాంతాన్ని మారలేదే…! ఇప్పుడు ‘భారతీయ జనతా పార్టీ’ యే భారతీయ ‘కాంగ్రెస్‌’ పార్టీలా కనిపిస్తోంది. అఫ్‌ కోర్స్‌. ‘జనత’ అన్నా ప్రజలే. ‘కాంగ్రెస్‌’ అన్నా ‘ప్రజలే’. అదీ కాక ఇప్పుడు మా నరేంద్ర మోడీ గారు ప్రశంసిస్తున్న వారంతా కాంగ్రెస్‌ నేతలే… గాంధీ, పటేల్‌ వంటి నేతల్ని బీజేపీయే ఎక్కువ కీర్తిస్తోంది.

వృత్తి : ‘మొయ్యటం’ . నలభయ్యేళ్ళు కాంగ్రెస్‌ను మోసాను. ఇప్పుటికీ మొయ్యాలనే వుంది. కానీ, అసలు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కనిపిస్తే కదా! కనిపించని వస్తువుని ఎలా మోస్తాం చెప్పండి?!

హాబీలు :1. విధేయత. ( కాంగ్రెస్‌ అధికారంలో వుండగా ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఆయన కేబినెట్‌లో మన స్థానం పదిలంగా వుండేది.)

2. స్థానబలం ( నానియోజకవర్గం(గుంటూరు జిల్లా , పెదకూరపాడు)లో నా పట్టు గట్టిదే. సాక్షాత్తూ ఎన్టీఆరే ప్రత్యేక శ్రధ్ద పెట్టినా నన్ను ఓడించలేక పోయారు. కానీ ‘సమైక్య’సునామీలో అందరమూ ఎగిరిపోయాం. అది వేరేవిషయం)

అనుభవం : ‘బరువుల్ని’ ఎత్తిన వాడికి మనుషుల్ని ‘ఎత్తటం’ పెద్ద కష్టమా? కండువా మారగానే కంఠమూ దానంతట అదే. నిన్న ‘ఖద్దరు’ నేతల్ని పొగిడాను. నేడు ‘కాషాయ’ నేతల్ని పొగడుతాను. అంతే తేడా..!

మిత్రులు : బీజేపీలో చేరాను. బీజేపీకి ఎవరు మిత్రులో, నాకూ వారే మిత్రులు. అంటే రాష్ట్రంలో తెలుగుదేశం వారని వేరే చెప్పనవసరం లేదు. ( ఈ విషయం తెలీక ఒకరిద్దరు రాష్ట్రంలోని తెలుగుదేశం మంత్రులు నా మీద విరుచుకు పడుతున్నారు. బాబు గారు కట్టడి చేశారనుకోండి. అది వేరే విషయం!)

శత్రువులు : ఇంకా నాలుగున్నరేళ్ళ వరకూ, నాకు పెద్దగా శత్రువులుండరు.( మధ్యలో ఎన్నికలు లేవు కదా!)

మిత్రశత్రువులు : అందుకు వేరే చోట వెతుక్కో అక్కర్లేదు. సొంత సామాజిక వర్గంలోనే వుంటారు.

వేదాంతం : ‘ఎడమ’ ‘కుడి’ అయితే పొరపాటు లేదోయ్‌! ( ఎప్పుడు చేరింది ‘రైటిస్టు’ పార్టీయే కదా!)

జీవిత ధ్యేయం : ఎప్పుడూ పదవిలో వుండటమే జీవితాశయం( కేంద్రంలో అధికారంలో వున్న పార్టీలో చేరాను. మా పార్టీనేతలకి ఆ విషయం తెలీకుండా వుంటుందా..?)

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంద్ర వార పత్రిక 8-14 నవంబరు 2014 సంచికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *